నిన్న సౌమ్య గారు గూగుల్ బజ్ లో పంపించిన ఆశాజనమైన నూతన సంస్థల జాబితాను చదువుతున్నాను. సాధారణంగా ఇవి ఏ ఐఐటీ/ఐఐఎం గ్రాడ్యుయేట్ల ద్వారానో స్థాపించబడి ఉంటాయి. వీళ్ళకు ఎప్పుడూ నగర జీవులు లేదా పట్టణాల మీదనే గురి, గ్రామీణ ప్రాంతాల గురించి పట్టించుకోరనే అభిప్రాయం ఉండేది నాకు. కానీ ఈ జాబితాలో ఉన్న ROPE (రూరల్ ఆపర్చ్యునిటీస్ ప్రొడక్షన్ ఎంటర్ప్రైజ్) అనే సంస్థ గురించి చదివినపుడు మాత్రం చాలా ఆనందమేసింది.
తమిళనాడులో ప్రారంభమైన ఈ సంస్థ గ్రామీణ ముడిసరుకుల నుంచి,గ్రామీణ ప్రజల చేతివృత్తుల నైపుణ్యాలను ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేస్తారు. అంటే హస్తకళా నైపుణ్యంతో తయారు చేసే గృహాలంకరణ వస్తువులు, తివాసీలు, సంచీలు, చేనేత వస్త్రాలు మొదలైన వస్తువులు ఉత్పత్తి చేస్తారట. ఇలా తయారైన ఉత్పత్తులు వాల్మార్ట్ లాంటి అంతర్జాతీయ స్టోర్ లకు కూడా సరఫరా చేస్తున్నారట.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రియులంతా సహజమైన ఉత్పత్తులు కోరుతుండటంతో ఈ వస్తువులకు డిమాండ్ బాగానే ఉంటుందట. 2007 లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 500 మంది గ్రామీణ కళాకారులకి ఉపాధి కల్పించిందట. ఇంకా రాబోయే ఐదేళ్లలో 2000 మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.
ఇంకా అమెరికా నుంచి తిరిగొచ్చి బీహార్ లోని ఓ మారుమూల ప్రాంతంలో వరి పొట్టు నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ఓ కంపెనీ స్థాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలుగు నింపిన గ్యానేష్ పాండే, రిక్షా వాళ్ళ జీవితాలను బాగు పరచడానికి వారి రిక్షాల మీద ప్రకటనల ద్వారా ఆదాయాన్ని చేకూర్చిపెట్టే ఇంకో బిజినెస్ గ్రాడ్యుయేట్ ఇలాంటి వారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది.
భారతదేశం సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి కంపెనీలు కావాలి.
good information
Excellent!!! ROPE vari idea gurinchi nenu chinnapatinunchi alochinchedanni… ISB interview ki presentation toh saha vellanu kooda… but evaro okaru deenni amalu parachatam enthoooooooo anandam ga vundi… nenu emi cheyaleka poyane ani koncham badha ga vundi 🙂