నా తీర్మానాలేంటి?

నాకు సాధారణంగా కొత్త సంవత్సరం తీర్మానాలు అంటే పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే తీర్మానాలు సంవత్సరంలో ఏ రోజులోనైనా నిరాటంకంగా చేసుకోవచ్చని నా గాఢమైన అభిప్రాయం. కానీ సమయం అనుకూలించడం వల్ల ఈ సారి మాత్రం ఒక్క విషయంలో తీర్మానం చేసుకోవాలనిపించింది.  అది ఇన్ స్క్రిప్టు నేర్చుకోవడం విషయంలో. ఇప్పటికే మొదలుపెట్టేశా కూడా. ఇకనుంచి కేవలం ఇన్ స్క్రిప్టు ను ఉపయోగించి మాత్రమే టైపు చెయ్యాలని నిర్ణయించుకున్నా.  మొదలు పెట్టిన నాలుగు రోజుల్లోనే ఒక మాదిరిగా టైప్ చెయ్యగలుగుతున్నాను. ఇంకా అలవాటైతే వేగంగా టైప్ చెయ్యగలనన్న నమ్మకం కలుగుతోంది.

ముందుగా ఈ విషయంలో నన్ను ప్రోత్సహించింది వీవెన్ గారు, తరువాత రాకేశ్వర్రావు గారు. ఇద్దరికీ ధన్యవాదాలు.

ఇన్ స్క్రిప్టు అంటే తెలియని వాళ్ళు వెంకటరమణ గారు రాసిన ఈ టపా చదవండి. ఇంకా ఏదైనా సందేహాలుంటే telugublog@googlegroups.com కి మెయిల్ పంపించండి.

నేను వాడే యూనీ కోడ్ తెలుగు ఫాంట్లు

యూనీకోడ్ తెలుగు ఫాంట్లు
యూనీకోడ్ తెలుగు ఫాంట్లు

ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూనీకోడ్ తెలుగు ఫాంట్లు. చివరన ఉన్నది మైక్రోసాఫ్ట్ వారు విండోస్ 7 తో బాటు విడుదల చేసిన వాణీ అనే ఫాంటు. ఇందులో నాకిష్టమైనవి వరుసగా లోహిత్, పోతన, వాణి, గౌతమి…

ఇవి కాకుండా మీకు తెలిసిన ఏవైనా యూనీకోడ్ తెలుగు ఫాంట్లు ఉంటే తెలియబరచండి.

వోల్‌ఫ్రమ్ ఆల్ఫా

కొన్ని నెలల క్రిందట ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ వోల్‌ఫ్రమ్ మామాలు సర్చ్ ఇంజన్ ల కన్నా విభిన్నమైన సెర్చింజన్ తయారు చేశాడు. సందర్శకులు ఏదైనా సమాచారం కోసం దీనిలో వెతికినపుడు ఆ సమాచారాన్ని కలిగి ఉన్నట్లుగా భావిస్తున్న కొన్ని పేజీల జాబితాను ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇన్‌పుట్ ను విశ్లేషించి పట్టిక రూపంలో సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం వెబ్‌సైట్ నిర్వాహకులు కూర్చుకున్న ప్రత్యేకమైన డేటాబేస్ ను వాడతారు. ఈ డేటాబేస్ లో ముందుగా ఫార్మాట్ చేసుకున్న సమాచారం ఉంటుంది. దీన్ని ఆయా సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు తయారు చేస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే గణిత, రసాయన, భైతికసమీకరణాలను సాధిస్తుంది. ఉదాహరణకు Integrate(x^2+x) అనే ఇన్‌పుట్ ఇచ్చామనుకుందాం. దాని అవుట్‌పుట్ ఇలా ఉంటుంది.

wolframalpha output
అవుట్‌పుట్

ఉదాహరణకు మీరు ఏదైనా నగరం గురించి వెతికారనుకుందాం. ఆ నగరం గురించి అతి ముఖ్యమైన సమాచారాన్ని మొత్తం ఒక పట్టిక రూపంలో చూపిస్తుంది. అయితే ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవస్థ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటు లోకి రావడానికి కొన్నేళ్ళు పడుతుంది. అలా వచ్చిన తర్వాత మనం ఒక ప్రశ్న దానికి ఇన్‌పుట్ గా ఇచ్చినా అర్థం చేసుకుని దానికి సమాధానం ఇచ్చే స్థాయికి ఇది చేరుతుంది.

విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది . గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు వైద్య, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, జీవ శాస్త్రం, ఒకటేమిటి చాలా శాస్త్రాల పరిజ్ఞానం ఇమిడి ఉంది.

వచ్చేస్తోంది గూగుల్ తరంగం…

గూగుల్ వేవ్ లోగో
గూగుల్ వేవ్ లోగో

ఈ టపాలో గూగుల్ సరికొత్త ఉత్పాదన తరంగం (వేవ్) గురించి తెలుసుకుందాం.
ఈమెయిల్, చాటింగ్, సోషియల్ నెట్‌వర్కింగ్, వికీలు, బ్లాగింగ్, చర్చా వేదికలు, ఇలా ఎన్నో కలిపితే గూగుల్ తరంగం.
ఈ ఫీచర్లన్నింటినీ కలిపి ఒక అప్లికేషన్ గా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నిజంగా అద్భుతం. గూగుల్ మ్యాప్స్ ను రూపొందించిన ఇద్దరు ఆస్ట్రేలియా అన్నదమ్ములే దీనినీ రూపొందించడం విశేషం.
దీని సందర్శన సదస్సు ప్రారంభంలో రూపకర్త అయిన ఇంజనీర్ ఒక మాట అన్నాడు.
“ఇప్పుడు మీరు చూడబోయే అప్లికేషన్ అసలు బ్రౌజర్ లో నడిచే వెబ్ అప్లికేషనేనా? అని ఆశ్చర్యపోతారు” అని
ఆ వీడియో చూసిన తర్వాత అతను చెప్పింది అక్షరాలా నిజమనిపించింది. దాన్లో వాడిన రియల్ టైమ్ కమ్యూనికేషన్ నిజంగా మతిపోగొట్టేటట్లుగా ఉంది. మనం ఒకవైపు అక్షరాలు టైపు చేస్తుంటే మరో వైపు ఒక్కో అక్షరం అప్పటికప్పుడే కనిపించేటంత వేగమన్నమాట. అవసరమైతే ఈ సౌకర్యాన్ని డిసేబుల్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కలిగించారు.
ఇందులో ప్రత్యేకత లేంటో చూద్దాం.
వెబ్ ఇంటర్ ఫేస్ ను గూగుల్ వెబ్ టూల్ కిట్ (జావా ఆధారితమైనది) ను వాడి తయారు చేశారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వాడుకరులు ఈ-మెయిల్ సందేశాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటున్నపుడు అవి ఇద్దరి మెయిల్ బాక్స్ ల్లోనూ కొలువై ఉంటాయి. గూగుల్ వేవ్ లో అలా కాకుండా ప్రతి సందేశం సెంట్రల్ సర్వర్ లో ఒకే చోట భద్రపరచబడుతుంది. దాన్ని పంచుకోవాలనువాళ్ళు ఎవరైనా దానిలో పాల్గొనవచ్చు. అయితే ఇలాంటి కమ్యూనికేషన్ కోసం గూగుల్ ఇంజనీర్లు గూగుల్ వేవ్ ఫెడరేషన్ ప్రోటోకాల్ అనే కొత్త ప్రోటోకాల్ నే తయారు చేశారు.