మ్యాక్ బుక్ లో తెలుగు టైపు చేయడం

వీవెన్ గారు ఐఫోనులో తెలుగు టైపుటెట్లు? అనే టపా రాసి దానికి పోటీగా నన్ను మ్యాకులో తెలుగులో టైపు చేయడం గురించి రాయమన్నారు. గత ఒకటిన్నరేళ్ళుగా ఆఫీసు వాళ్ళిచ్చిన మ్యాక్ బుక్ వాడుతున్నాను. అందులో ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు ఉంది. దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో చూద్దాం.

 • ముందుగా తెర అడుగున ఉన్న System Preferences మీద నొక్కండి.

screenshot-2017-02-01-10-17-12

 • Keyboard ఐకాన్ నొక్కండి.

screenshot-2017-02-01-10-17-56

 • Input Sources అనే ట్యాబ్ కి వెళ్ళి, తెలుగు కీబోర్డు చేర్చడానికి ఎడమవైపు జాబితా కింద ఉన్న + బటన్ నొక్కండి. దాని పక్కనే ఉన్న Show Input menu in menu bar అనే చెక్ బాక్సును చెక్ చేసి ఉంచండి.

screenshot-2017-02-01-10-18-37

 • తెలుగు కోసం వెతికి Telugu – QWERTY ఎంచుకుని Add బటన్ నొక్కండి.

screenshot-2017-02-01-10-36-49

 • తెలుగులో టైపు చేయాలనుకుంటే మెను బార్ లో ఉన్న తెలుగు కీబోర్డును ఎంచుకుని తెలుగులో టైపు చేయడం ప్రారంభించండి. ఇంగ్లీషు కీబోర్డు కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు.

screenshot-2017-02-01-10-19-00

పైన నేను పేర్కొన్న విధానం ఇన్ స్క్రిప్టు లో టైపు చేయడానికి. మొదట్లో ట్రాన్స్‌లిటరేషన్ కు అలవాటు పడ్డ నాకు మొదట్లో ఇది కొత్తగా అనిపించింది. కానీ అలవాటు పడే కొద్దీ తక్కువ కీ స్ట్రోకులతో టైపు చెయ్యవచ్చని తెలిసింది. అంతే కాకుండా ఈ కీబోర్డుకు అలవాటు పడితే మీరు సిస్టమ్ మార్చినా కూడా ప్రత్యేకంగా ఏ సాఫ్టువేరు ఇన్‌స్టాల్ చేయనక్కర లేదు. ఉన్న కీబోర్డును ఎనేబుల్ చేసుకుంటే చాలు.

సాంకేతిక పుస్తకాల సమీక్షలు… తెలుగులో

పుస్తకం.నెట్ వారు ఈ నెల ఫోకస్ లో భాగంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచే పుస్తకాల సమీక్షలకు చోటివ్వడం ముదావహం. అందులో మొదటి వ్యాసం నాది కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చరిత్రను కీలకమైన మలుపు తిప్పిన సీ భాష కు సంబంధించిన పుస్తకాన్ని పరిచయం చేశాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. అలాగే మీకు నచ్చిన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాల గురించి కూడా రాయండి.

వికీపీడియా రూపం మారుతోంది

వాడుకరి సౌలభ్యాన్ని, ఉపయోగ శీలతనూ పెంచడానికి వికీపీడియా తన రూపు రేఖల్ని కొద్దిగా మార్చబోతుంది. గత సంవత్సరం ఆగస్టు 6 వ తేదీన వికీమీడియా వారు ఈ కొత్త రూపం బీటా ప్రకటన చేసినప్పుడు దాన్ని ప్రయత్నించిన వారికి కొత్త వికీపీడియా ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం రెండు తెరపట్టులను క్రింద చూపిస్తున్నాను. పెద్దవిగా చూడటానికి వాటిపై నొక్కండి.

వికీ ప్రస్తుత రూపం
వికీ ప్రస్తుత రూపం

వికీ భవిష్యత్ రూపం
వికీ భవిష్యత్ రూపం


ఏప్రిల్ 5 మొదలుకొని ఈ రూపు రేఖలు వికీమీడియా ప్రాజెక్టులకి ఒక్కొక్క దానికీ వర్తింప జేస్తూ వస్తారు. అన్నింటికన్నా ముందుగా వికీమీడియా కామన్స్, తరువాత ఆంగ్ల వికీపీడియా, ఇతర భాషల వికీపీడియాలు, సోదర ప్రాజెక్టులు ఒక్కొక్కటీ వరుసగా తమ రూపు రేఖలు మార్చుకుంటాయి.

ముఖ్యమైన మార్పులు:

 1. ఎడిటింగ్ టూల్‌బార్. ఇది చూడడానికి సింపుల్ గా కనిపించినా దీని ద్వారా టేబుల్స్, లింకులు మొదలైన వాటిని ఒక్క నొక్కుతో చేర్చేయవచ్చు.
 2. ప్రస్తుతం ఎడమవైపు కనిపించే శోధన పెట్టె ఇప్పుడు పై భాగంలో కనిపిస్తుంది.

మీరు ఇప్పుడే ఈ రూపం చూడాలంటే వికీపీడియాలోకి ప్రవేశించి (లాగిన్ తప్పని సరి) బీటాను ప్రయత్నించండి అనే లంకె మీద నొక్కితే మీకు కొత్త రూపం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రూపం చాలా రోజుల నుంచి అమల్లో ఉండటం, వాడుకరులు దానికి బాగా అలవాటు పడి ఉండటం వల్ల సమూలమైన మార్పులేమీ చేపట్టలేదని నా అభిప్రాయం.

ఆంగ్ల తెలుగు నిఘంటువు అప్లికేషన్

నిఘంటువు తెరపట్టు
నిఘంటువు తెరపట్టు


ఆన్‌లైన్ లో నిఘంటువులు నాకు తెలిసి మూడు అందుబాటులో ఉన్నాయి. విక్షనరీ, అక్షరమాల, గూగుల్

వీటిని ఉపయోగించుకోవాలంటే జాలానికి అనుసంధానమై ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైనా ఉపయోగించుకునేలాగా నేనొక అప్లికేషన్ తయారు చేశాను. ఒక సారి ఇన్‌స్టాల్ చేసుకుంటే బ్రౌణ్య పదకోశం మీ చేతిలో ఉన్నట్లే.

దీని ప్రత్యేకతలు

 • ఏదైనా పదం ఈ పదకోశంలో లేకపోతే మీరు నిఘంటువుకు చేర్చవచ్చు.
 • ఏదైనా పదానికి అర్థం అసంపూర్తిగా ఉన్నట్లయితే మీరు దాన్ని దిద్దుబాటు చేసి భద్రపరుచుకోవచ్చు.

దీన్ని స్థాపించుకోవాలంటే మీ కంప్యూటర్ లో అడోబీ AIR ఉండాలి. దాన్ని ఇక్కడ నుండి ఉచితంగా దింపుకోవచ్చు.

దాన్ని

nighantuvu2
nighantuvu2

స్థాపించుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ను ఇక్కడ నుండి దింపుకొని (.air file) స్థాపించుకోండి. స్థాపించడం పూర్తయింతర్వాత మీ డెస్క్‌టాప్ పైన ఒక ప్రతీకం (ఐకాన్) కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయగానే అప్లికేషన్ పనిచేయడం ప్రారంభిస్తుంది(బొమ్మలో చూపబడినట్లుగా). వెతకదలుచుకున్న పదాన్ని సర్చ్ బాక్స్ లో టైపు చేసి ఎంటర్ నొక్కండి.

ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆంగ్లం నుంచి తెలుగు పదాలకు మాత్రమే అర్థాలు చూపిస్తుంది. తర్వాత తెలుగు నుంచి ఆంగ్ల పదాలు వచ్చేటట్లుగా కూడా తయారు చేస్తాను.

కొత్త పదం ఎలా చేర్చాలో, నిఘంటువులో ఇది వరకే ఉన్న పదం అర్థాన్ని ఎలా మార్చాలో బొమ్మల్లో చూపించాను

ఇది మొదటి వర్షనే కాబట్టి ఏదైనా సమస్యలు వస్తే నాకు తెలియబరచండి. తర్వాతి వర్షన్ లో సవరించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఏ సాంకేతిక సమస్య ఎదురైనా నాకు తెలియబరచండి.

ఎవరికైనా దింపుకోవడంలో సమస్య ఎదురైతే raviechandra@gmail.com కి ఈ మెయిల్ పంపించండి నేను మీకు అటాచ్‌మెంట్ పంపిస్తాను.

సాంకేతిక ఇంటర్వ్యూలపై నా వ్యాసం ఈనాడులో..

ప్రోగ్రామింగ్ లో డేటా స్ట్రక్చర్లు, అల్గారిథమ్స్ అన్నింటికన్నా ప్రధానమైన అంశాలు. అల్గారిథం అంటే ఒక సమస్యను సాధించడానికి పాటించే సోపానాల క్రమం. దీనికి ప్రోగ్రామింగ్ భాషతో సంబంధం లేదు. ఒక అల్గారిథం రూపకల్పన చేస్తే దాన్ని ఏ భాషలోనైనా ఇంప్లిమెంట్ చెయ్యవచ్చు. అల్గారిథం రూపకల్పన చేసే పద్దతులు విభజించు-పాలించు (డివైడ్ అండ్ కంకర్), గ్రీడీ మెథడ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, బ్యాక్‌ట్రాకింగ్ మొదలైనవి. ఒక్కో పద్దతి ఒక మూస లాంటిది. కంప్యూటర్ సైన్సులో సాధారణంగా ఎదురయ్యే సమస్యలను వీటిలో ఏదో ఒక పద్దతినుపయోగించి అల్గారిథం ను రూపకల్పన చేస్తుండటం పరిపాటి. ప్రతి పద్ధతి లోనూ కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. వాటిని గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి. ప్రోగ్రాంలో విశ్లేషించాల్సిన సమాచారాన్ని పలురకాలుగా నిర్వహించుకోవచ్చు. ఇలా అవసరం కోసం ఒకచోట కూర్చిన సమాచారాన్ని డేటాస్ట్రక్చర్ అనవచ్చు. ప్రోగ్రాం అవసరాలను బట్టి రకరకాల డేటాస్ట్రక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు అంశాల మీద స్పష్టమైన అవగాహన వస్తే మీరు ఇంటర్వ్యూను సగభాగం జయించినట్లే.

దృష్టి పెట్టవలసిన అంశాలు:

 • C భాషలో  ఆరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఆపరేటర్ ప్రెసిడెన్స్, ఫంక్షన్స్ -కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, డైనమిక్ మెమరీ అల్లొకేషన్, బిట్ మ్యానిప్యులేషన్ ప్రోగ్రామ్స్ మొదలైన అంశాలన్నింటిపై స్పష్టమైన అవగాహన ముఖ్యం. చాలా ఇంటర్వ్యూల్లో స్ట్రింగ్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ అంశాలు యశ్వంత్ కనిత్కర్ రాసిన Let us ‘C’, Test your C skills (BPB Publications) పుస్తకాల్లో సులభశైలిలో వివరించబడి ఉన్నాయి.
 • ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ భాషలదే రాజ్యం. C++, జావా, C# ఇవన్నీ బిజినెస్ అప్లికేషన్లలో విడదీయరాని భాగాలు. కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ భావనలైన డేటే ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలీమార్ఫిజమ్, మరియు వీటిని ఉదహరించడానికి అవసరమైన ప్రోగ్రాముల మీద దృష్టి సారించడం అవసరం.
 • కంప్యూటర్ ఆర్కిటెక్చర్ : ప్రాసెసర్, వాటి ఆదేశాలు (ఇన్‌స్ట్రక్షన్స్), మెమొరీ వ్యవస్థ, నెట్‌వర్కింగ్ లాంటి హార్డ్‌వేర్ లాంటి అంశాలు.
 • నిర్వహణా వ్యవస్థ(ఆపరేటింగ్ సిస్టమ్): మెమరీ మేనేజ్‌మెంట్, షెడ్యూలింగ్ అల్గారిథమ్స్, కంకరెన్సీ, డెడ్ లాక్స్, ఫైల్ సిస్టమ్ నిర్వహణ ఈ సబ్జెక్టులో శ్రద్ధ చూపాల్సిన అంశాలు.
 • డేటా స్ట్రక్చర్స్ : స్టాక్స్, క్యూస్ – వాటి నిర్వచనాలు, వాటిమీద నిర్వహించగలిగే ఆపరేషన్స్, వీటిని అరేస్‌తో, లింక్‌డ్ లిస్ట్స్‌తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? లింక్‌డ్ లిస్ట్స్ (సింగిల్ లింక్‌డ్ లిస్ట్, డబుల్ లింక్‌డ్ లిస్ట్), ప్రయారిటీ క్యూస్, బైనరీ ట్రీస్- ఇన్‌సర్షన్, డెలిషన్, ట్రావెర్సల్స్- ట్రీస్, గ్రాఫ్స్, వాటికి సంభందించిన వివిధ ప్రోగ్రాములు.
 • అల్గారిథమ్స్: సార్టింగ్, సర్చింగ్ అల్గారిథమ్స్ ప్రాథమికాంశాలు. చూడ్డానికి చాలా సంక్లిష్టంగా కనిపించే కొన్ని కంప్యూటర్ ప్రోగ్రాంలు రికర్షన్ అనే పద్ధతి ద్వారా చాలా సులువుగా సాధించవచ్చు. ఈ పద్ధతిలో ఒక సమస్యను దానినే పోలిన చిన్న సమస్యగా సూత్రీకరిస్తారు. చిన్న సమస్యను సాధిస్తే పెద్ద సమస్య దానంతట అదే పరిష్కారమవుతుంది. ఇవి రాయడానికి సులభంగానే ఉంటాయి కానీ విశ్లేషించడం కష్టం. కాబట్టి ఈ రికర్షన్ అల్గారిథమ్స్ పై ప్రత్యేక శృద్ధ చూపించాలి.
 • డేటాబేస్ : ప్రస్తుతం కంపెనీల్లో వాడే పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ లన్నీ డేటాబేస్‌ల ఆధారంగా నడుస్తున్నాయి కాబట్టి వీటి గురించిన ప్రాధమికాంశాల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి. డేటాబేస్ డిజైన్ కు సంబంధించిన నార్మల్ ఫామ్స్, డేటాబేస్ నుంచి సమాచారాన్ని సేకరించడానికి వాడే ప్రామాణిక భాష సీక్వెల్ (SQL) మొదలైనవి ముఖ్యమైన అంశాలు.
 • వెబ్ మరియు ఇంటర్నెట్: వెబ్ ఆధారిత అప్లికేషన్లు ఎక్కువ సంఖ్యలో చలామణీ అవుతున్నాయి కాబట్టి వీటి గురించి కనీసం ప్రాథమిక అవగాహన అయినా ఉండి తీరాలి.
 • సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అంశాలు: సాఫ్ట్‌వేర్ అభివృద్ధి జీవిత చక్రం (Software Development Life Cycle), టెస్టింగ్, మరియు నిర్వహణ మొదలైన అంశాల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి.

తెలుగుపేరు గల మొట్ట మొదటి వెబ్‌సైటు

ఇప్పుడు URL కూడా తెలుగులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా మొట్టమొదటిసారిగా గాంధీ.com (మీరు విహరిణిలో ఇలా తెలుగు స్క్రిప్ట్‌లోనే టైప్ చెయ్యాలి) అనే వెబ్‌సైటు ఇటీవలే ప్రారంభించారు. కాకపోతే ఇది టైప్ చేసిన తర్వాత మరో URL కు దారి మారి చూపిస్తోంది. మీరూ పరీక్షించండి.

బ్లాగుల్లో చిత్రమాలికలను చేర్చడం ఎలా?

ఈ టపాలో బ్లాగుల్లో చిత్రమాలికలను చేర్చడమెలా అని తెలుసుకుందాం.అంతర్జాలంలో మీ ఫోటోలను అప్లోడ్ చేస్తే వాటిని స్లైడ్ షోలు గా మార్చే ఉచిత వెబ్ సైట్లు చాలా అందుబాటు లో ఉన్నాయి. ఒక వేళ మీరు బ్లాగర్ ద్వారా బ్లాగు చేర్చి ఉంటే  పికాసా వెబ్ ఉత్తమమైంది. నేను ఈ టపాలో వివరించిన పద్దతి వర్డ్ ప్రెస్ బ్లాగులో పని చెయ్యదు. దానికి కొన్ని సాంకేతిక పరమైన పరిమితులున్నాయి. వాటిని వివరిస్తూ ఇంకో టపా రాస్తాను చూడండి.

embedslideshow
embedslideshow

ఇందు కోసం మీరు చేయవలసింది పికాసాలో ఒకవేళ మీకు ఖాతా లేకుంటే http://picasaweb.google.com/ కు వెళ్ళి మీ జీమెయిల్ సహాయంతో అక్కడ ఒక ఖాతా సృష్టించుకోండి. అక్కడ మీ ఫోటోలను ఆల్బమ్ ల రూపంలో భద్రపరుచుకోవచ్చు. మీరు సృష్టించిన ప్రతి ఆల్బమ్ కు ఒక కోడ్ ఇస్తుంది.

అప్లోడ్ పూర్తయిన తరువాత క్రింద బొమ్మల సహాయంతో వివరించిన సోపానాలు పాటించండి. పక్క బొమ్మలో కనిపిస్తున్న విండో పికాసా వెబ్ కుడి భాగాన కనిపిస్తుంది. అక్కడ Embed Slideshow అనే లింకు మీద నొక్కారంటే క్రింద చూపిన విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండో నుంచి రౌండప్ చేసిన భాగాన్ని కాపీ చేసుకుని మీ టపాలో పెట్టుకోవడమే.

Picasaslideshow
Picasaslideshow