నిజమైన స్నేహితులు

మొదటి ప్రపంచ యుద్ధ సమయం!

సైన్యంలో ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. యుద్ధం జరుగుతుండగా తూటా తగిలి వాళ్ళలో ఒకరు నేలకొరిగిపోయాడు. తన స్నేహితుణ్ణి ఆ స్థితిలో చూసేసరికి మరో సైనికుడికి గుండెను పిండేసే బాధ. అతను ఓ కందకంలో దాక్కున్నాడు. తలపై నుంచి దూసుకుపోతున్న తూటాలు. ఎటు చూసినా తుపాకీ చప్పుళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుడు తన లెఫ్టినెంట్ ని ఈ విధంగా అడిగాడు.

“సర్, నేను అక్కడికెళ్ళి మా మిత్రుణ్ణి తీసుకు వస్తాను.”

“వెళ్ళిరా. కాకపోతే నువ్వక్కడికి వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మీ స్నేహితుడు ఇప్పటికే చనిపోయి ఉండవచ్చు. లేదా నీ ప్రాణాలే పోవచ్చు” అన్నాడా లెఫ్ట్‌నెంట్.

అతని సలహాను లక్ష్యపెట్టకుండా సైనికుడు ముందుకెళ్ళి పోయాడు. ఎలాగోలా మిత్రుని చేరుకోగలిగాడు. అతన్ని తన భుజం మీదకు ఎత్తుకుని వాళ్ళు దాక్కున్న కందకం వైపుకి తీసుకొచ్చాడు. ఇద్దరూ వచ్చి అక్కడ పడిపోగానే ఆ ఆఫీసరు దెబ్బతిని పడి ఉన్న సైనికుణ్ణి పరీక్షించాడు. అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతన్ని మోసుకు వచ్చిన మిత్రుడి వైపు జాలిగా చూశాడు.

“నేను ముందే చెప్పాను దీని వల్ల ఏమీ ప్రయోజనం లేదని. ఇప్పుడు చూడు నీ స్నేహితుడేమో చనిపోయాడు. నీకు తగిలిన గాయాలూ అలాంటివే” అన్నాడు.

“కానీ నాకు తృప్తిగా ఉంది సర్. అసలు మీ దృష్టిలో ప్రయోజనం అంటే అర్థం ఏమిటి?”

“మరి నీ స్నేహితుడు చనిపోయాడుగా”

“నేనక్కడికి వెళ్ళేటప్పటికి బతికే ఉన్నాడు సర్. వాడు నోరు తెరిచి నువ్వు వస్తావని నాకు తెలుసు రా! అన్న ఒక్క మాట చాలు నాకు.” అదే నా దృష్టిలో గొప్ప ప్రయోజనం!!

5 thoughts on “నిజమైన స్నేహితులు

 1. రవిగారు… అద్భుతమైన టపా…!!!
  “నిజమైన స్నేహితుడు” కన్నా… “నిజమైన స్నేహితులు” అందమైన శీర్షిక అవుతుందేమోకదండీ….!!!

 2. అవును..
  అప్పుడు ఆమె వయసు పదహారేళ్ళు..
  అమ్మకు అనారోగ్యం..ఎప్పుడూ ఆసుపత్రే..
  ఆమెకు మనశ్శాంతతే లేదు..
  కొన్నాళ్ళూ మృత్యువుతో పోరాడి అమ్మ చనిపోయింది..
  ఆమెకో స్నేహితురాలుండేది..
  తను ఆమెపై యెంత ప్రేమ చూపించేదంటే..అచ్చం అమ్మలా..
  ఆమె పూజలు బాగా చేసేది.ఆ దేవుడే ఆస్నేహితురాలిని ఆమే కోసం పంపాడేమో.పొద్దున్నుంచీ కూడా వుండేది. బాధలు సంతోషాలూ పంచుకొనేది.
  టేనేజ్ అవడం వల్ల ఎప్పుడూ అబ్బాయిలు చుట్టూ తిరిగే వాళ్ళు. ఇదో తలనొప్పి.ఎక్కడికి వెళ్ళినా బాడీగార్డుల్లా ఇంట్లో అమ్మ లేదనే బాధ.బయట అబ్బాయిల వేధింపులు..
  వదిన దగ్గర ఒక సతాయింపు..అన్నిటా ఆమెకు తోడునీడగా వుంది.ఆమె పెళ్ళి వరకూ..
  ఏదైనా కోపం వచ్చి మాట్లాడకపోతే..వాళ్ళ తమ్ముడితో పేజీలకిపేజీలు లెటర్స్ రాసి వాళ్ళ తమ్ముడితో పంపేది..నేనేం తప్పు చేసాను నాతో ఎందుకు మాట్లాడవు..ఆరోజు మీరు మీ ఇల్లు నాపై వదిలి వెళ్ళారు నేను ఎంతో బాధ్యతగా చూసుకున్నాను కదా..అంటూ ఏవేవో..
  ఇంకా కోపం కరగక పోతే ఎదురుగా వచ్చి నిలుచుని కళ్ళనీళ్ళతో ఏడుస్తూ..నిలబడేది..ఎక్కడికి పోతే అక్కడికి వచ్చినిలుచునేది ఎదురుగా..
  చివరికి కోపం తీరగానే సంతోషపడేది..
  ఆ అమ్మయి పెళ్ళి సమయంలో కాబోయే భర్తకు తాను ఉత్తరం రాసింది..నా స్నేహితురాలు అమాయకురాలు పాలేవిటో నీళ్ళేవిటో తెలియని పిల్ల జాగ్రత్తగా చూసుకొండి అంటూ..
  వాళ్ళ అమ్మే ఆ స్నేహితురాలిలో దూరిందేమో..
  చివరికి మీరు చెబితే నమ్మరు..ఎన్నో సంవత్సరాల తరువాత స్నేహితురాలిని కలుసుకోవాలని వచ్చిన ఆమెకు తీవ్రమైన నిరాశ ఎదురైంది.
  ఆ స్నేహితురాలు పూర్తిగా మారిపోయింది..ఆనాటి ప్రేమలు అభిమానాలు మరచిపోయింది..
  యాంత్రికంగా మారిపోయింది..
  ఆమెకు స్నేహితురాలి ప్రేమ ఒక ఒయాసిస్సులా అయిపోయింది..
  అరోజుల్లో యేదో అలా వున్నాము ..అంటుంది..

వ్యాఖ్యలను మూసివేసారు.