చెవుడు

ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.

“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.

“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.

ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.

మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.

అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.

ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…

ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, చికెన్ చేశాననీ!!!” అనింది.


🙂  కొత్త సంవత్సరంలో ఇలా నవ్వుతూనే ఉండండి… 🙂

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

రవిచంద్ర

మన రాజకీయ నాయకులు

మన రాజకీయ నాయకుడొకాయన ఓ సారి అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు అతన్ని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. మన నాయకుడు ఆయనకున్న విశాలమైన భవనాలు, ఇంటి ముందు కావాల్సినంత ఖాళీ స్థలం, ఖరీదైనా ఫర్నీచర్ అన్నీ చూసి ముచ్చట పడి…

“మీ కొచ్చే కొద్దిపాటి జీతాలతో ఇంత ఇంటిని, వస్తువులను ఎలా సంపాదించగలిగారు” అని అడిగాడు.

దానికి ఆ సెనేటర్ నెమ్మదిగా నవ్వి అతన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు.

“అదిగో ఆ నది కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“దాని మీద వంతెన కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“10%” అన్నాడు.

మన నాయకుడు అర్థమైందన్నట్లుగా నెమ్మదిగా తల పంకించాడు.

తర్వాత కొద్ది రోజులకు సదరు అమెరికన్ సెనేటర్ భారత్ కు వేంచేశాడు. అతన్ని మన నాయకుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు.

సెనేటర్ కి మన నాయకుడు ఇల్లు చూడగానే మతిపోయినంత పనైంది. రాజభవనాన్ని తలదన్నే ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామాగ్రి, నౌకర్లు, కార్లు…

ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.

“మీకొచ్చే రూపాయల్లో జీతంతో ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించాడా సెనేటర్.

మన నాయకుడు అతన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి

“అక్కడ నది కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“దాని మీద వంతెన కనిపిస్తోందా?”

“అదేంటి అక్కెడ వంతెనే లేదు కదా!!!”

“100%” అన్నాడు నెమ్మదిగా…

ఇప్పుడు దిమ్మతిరగడం సెనేటర్ వంతైంది….

మూలం:santabanta.com

నువ్వే తీసుకో…

స్వీడన్ జోకు:

కిక్ఓ పట్నం నుంచి ఒకతను వేటాడదామని అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఓ కుందేలు పారిపోతూ కనిపించింది. గురిపెట్టి కాల్చాడు అంతే… అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది.

పక్కనే ఉన్న ఆ పొలం యజమాని

“నా పొలంలో పడింది కాబట్టి అది నాదే” అన్నాడు.

“కాదు నేను కాల్చాను కాబట్టి నాదే” అన్నాడు.

అలా కొద్ది సేపు ఇద్దరూ వాదులాడుకున్నాక పొలం యజమానికి ఓ ఆలోచన వచ్చి పట్నం అతనితో ఇలా అన్నాడు.

“ముందుగా నేను నిన్ను డొక్కలో ఒక్కసారి తంతాను. తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దర్లో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్ళకి చెందుతున్నమాట.”

ఈ పందేనికి అతను ఒప్పుకున్నారు.

ముందుగా రైతు అతన్ని ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక పట్నం అతను విల విల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం తర్వాత ఎలాగోలా తేరుకుని

“ఇప్పుడు నా వంతు అన్నాడు” బాధను బలవంతంగా ఆపుకుంటూ.

రైతు నెమ్మదిగా “ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు? ఆ కుందేలేదో నువ్వే తీసుకో” అన్నాడు.

ఆదాయం బాగుంది…..

ఒకాయన తన మిత్రుడితో పందెం కాశాడు. ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ దగ్గర అడుక్కుంటే రెండు వేల రూపాయలిస్తానని.

పందేనికి ఒప్పుకున్న మిత్రుడు ఒప్పందం ప్రకారం భిక్షగాడిలా వేషం వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుక్కున్నాడు.

పందెం ఓడిపోయిన మిత్రుడు అలాగే రెండు వేల రూపాయలిచ్చేశాడు.

మరుసటి రోజు చార్మినార్ పక్కనే వెళుతుండగా అతనికి తన మిత్రుడు మళ్ళీ భిక్షగాడి రూపంలో అడుక్కుంటూ ఉండటం కనిపించింది.

నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి ” ఒరే! నీ కిదేం పొయ్యే కాలం. నిన్నైతే నాతో పందెం వేసుకున్నావ్. ఈ రోజు కూడా ఎందుకు అడుక్కుంటున్నావ్?” అని అడిగాడు.

“ష్…గట్టిగా అరవకు. ఇన్‌కమ్ బాగుంది గురూ.. అందుకనే కంటిన్యూ అయిపోతున్నా…”

మూడు వరాలు

ఒకామె అడవిలో వెళుతూ ఉంది. నడుస్తుండగా దారి పక్కగా ఒక కప్ప ముళ్ళ కంపల్లో చిక్కుకుని కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేసరికి అది మాట్లాడటం ప్రారంభించింది. “నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే  నీకు మూడు వరాలిస్తాను” అన్నది.  ఆమె అలాగే విడిపించింది.
తర్వాత  “విడిపించినందుకు థాంక్స్. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను. ఈ మూడు కోరికలకు ఒక షరతు ఉంది”  అన్నది కప్ప.
“ఏంటో చెప్పు” అన్నదామె.
“నువ్వు ఏది కోరుకుంటే దానికి పది రెట్లు నీ భర్తకు దక్కుతుంది” అన్నది కప్ప.
“ఓకే నో ప్రాబ్లం”
“నా మొదటి కోరిక: ప్రపంచంలోకెల్లా అత్యంత అందగత్తెను కావాలి నేను”
“బాగా ఆలోచించుకో. నీ భర్త నీ కంటే పది రెట్లు అందగాడవుతాడు మరి”
“అయినా పర్లేదు ప్రపంచం లోకెల్లా నేనే అందగత్తెను కాబట్టి అతనికి నా మీద నుండి దృష్టి ఎక్కడికీ పోదు”. అంతే ఆమె అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది.
“నా రెండో కోరిక: ప్రపంచంలో అత్యంత ధనవంతురాల్ని అవ్వాలి”
“మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ భర్త నీ కంటే పదిరెట్లు ధనవంతుడవుతాడు.”
“పర్లేదు నా దగ్గరుంటే ఆయ దగ్గర ఉన్నట్లు. ఆయన దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే కదా”.
“తథాస్తు”
ఆమె అత్యంత ధనవంతురాలైంది.
” నా మూడో కోరిక: నాకు కొంచెం గుండె నొప్పి రావాలి” 🙂 🙂

ఖరీదైన వైద్యుడు

ఒకతనికి ఒంట్లో నలతగా ఉండటంతో స్నేహితుణ్ణి ఎవరైనా మంచి డాక్టర్ గురించి చెప్పమన్నాడు.

అతను ఒక డాక్టర్ పేరు చెప్పి, ” కానీ అతను చాలా ఖరీదైన వైద్యుడు. మొదటి సారి వెళ్ళే వారికి 500 రూపాయలు, తరువాత నుంచి ప్రతి సారీ 100 రూపాయలు తీసుకుంటాడు” అన్నాడు.

మనవాడు ఫీజు తగ్గుతుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ” నేను ఇది వరకే వచ్చానండీ కానీ నయం కాలేదు…”

డాక్టర్: “ముందు రాసిన మందులే ఇంకొద్ది రోజులపాటు కొనసాగించండి….అలాగే నా ఫీజు వంద రూపాయలు కౌంటర్ లో కట్టి వెళ్ళండి.” 🙂 🙂

ఆల్కహాలు ప్రభావం :)

ఐదో తరగతి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు రసాయన శాస్త్రం బోధిస్తున్నాడు. ఆల్కహాలు దుష్పరిణామాల గురించి సోదాహరణంగా వివరించాలని వాళ్ళకి ఒక ప్రయోగం ద్వారా బోధించాలనుకున్నాడు. ఒక గ్లాసులో విస్కీ, ఒక గ్లాసులో మంచి నీళ్ళు తీసుకున్నాడు. రెండు పురుగులను చెరొక గ్లాసులో జారవిడిచాడు.

“ఇప్పుడు రెండు గ్లాసులోని పురుగుల్ని జాగ్రత్తగా గమనించండి.” పిల్లలకు చెప్పాడు.

విస్కీ గ్లాసులో వేసిన పురుగు కాసేపు అటూ ఇటూ కొట్టుకుని చనిపోయి గ్లాసు అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది. మరో వైపు నీళ్ళలో విడిచిన పురుగు మామూలుగానే ఉంది.

“ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలిసిందేమిటి?” విద్యార్థుల్ని అడిగాడు

ఒక కొంటె విద్యార్థి లేచి “కడుపులో పురుగులు పోవాలంటే విస్కీ తాగాలి సర్ “ 🙂