చెవుడు

ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.

“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.

“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.

ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.

మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.

అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.

ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…

ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, చికెన్ చేశాననీ!!!” అనింది.


🙂  కొత్త సంవత్సరంలో ఇలా నవ్వుతూనే ఉండండి… 🙂

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

రవిచంద్ర

హైసరబన్నాలు

చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథ

ఓ పల్లెటూరి అబ్బాయి ఓ సారి భార్యను ఇంటి దగ్గరే వదిలేసి అత్తగారింటికి వెళ్ళాడు.

చాలాకాలం తర్వాత ఇంటికి వచ్చిన అల్లుడికి ఏమైనా చేసి పెడదామని అత్తగారు కుడుములు చేసింది. అంతకు ముందు అతను ఎప్పుడూ తినలేదేమో అవి ఆ అల్లుడికి తెగ నచ్చేశాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను కూడా అవి చేసి పెట్టమని అడుగుదామనుకున్నాడు.

“అత్తా! ఇవి భలే ఉన్నాయి. నేను ఇంటికి పోయిన తర్వాత మీ కూతుర్ని అడిగి ఇలాంటివే చేయించుకుంటాను. వీటినేవంటారు?” అనడిగాడు.

“వీటిని కుడుములంటారు నాయనా” అని చెప్పిందా అత్త.

అతనికి కొంచెం మతిమరుపు. ఆ పేరు ఎక్కడ మరిచిపోతామో అని.. దారంతా ‘కుడుములు కుడుములు..’ అని తలుచుకుంటూ పోతున్నాడు.

మధ్యలో ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది. దాన్ని ఊపు మీద దూకడానికి “హైసర బన్నా” అన్నాడు.

అంతే మరుక్షణం కుడుములు అనే పదం మరిచిపోయి ‘హైసరబన్నా, హైసరబన్నా‘ అనుకుంటూ ఇంటికి చేరాడు.

ఇంటికి రాగానే భార్యను పిలిచి,

“నేను మీ ఇంటికి వెళ్ళినపుడు మీ అమ్మ హైసరబన్నాలు చేసిపెట్టింది ఎంత రుచిగా ఉన్నాయో! నువ్వు నాకు ఇప్పుడు అవి చేసిపెట్టాలి” అన్నాడు.

హైసరబన్నాలా? అయేంటో నాకు తెలీదయ్యో..” అంది భార్య.

“మీ అమ్మ చేసిపెట్టింది కదే! నీకు తెలీదా? ఏమో నాకు ఇప్పుడు హైసరబన్నాలు చేసిపెట్టాల్సిందే” అంటూ పట్టుబట్టాడు.

“అవేంటో నాకు తెలీదు” మొర్రో అంటున్నా వినలేదు.

మాట వినకపోయే సరికి చిర్రెత్తుకొచ్చి దుడ్డుకర్ర తీసుకుని ఆమె మీదకు రాబోయాడు.

చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళంతా గుమిగూడి అతన్ని పట్టుకొని “ఓరి సచ్చినోడా! ఆ కర్రతో కొడితే అది ఉండాల్నా పోవాల్నా.. ఒళ్ళంతా కుడుముల్లాగా వాచిపోతాదిరా” అన్ని అమ్మలక్కలంతా చీవాట్లు పెట్టడం మొదలెట్టారు.

అప్పుడు వెలిగింది మనవాడికి…. ” ఆ…. అయే నేం జేసి పెట్టమంది… కుడుములు కుడుములు” అన్నాడు.

“ఈ మాట ముందుగానే సెప్పుంటే నేనెందుకు చేసిపెట్టను ఓ యక్కల్లో…” అని భోరుమందా భార్య.


దుర్వార్త ఎలా చెప్పాలంటే…

కార్లోస్ ఇంట్లో ఓరోజు ఉదయాన్నే ఫోన్ మోగింది.

“హలో సార్! నేను ఆర్నాల్డ్ ను. మీ ఫాం హౌస్ చూసుకునే పనోణ్ణి”

“ఆ ఆర్నాల్డ్ చెప్పు. ఏమైనా కావాలా?”

“అది చెప్పాలనే చేశాను సార్. మీ చిలక చచ్చిపోయిందండీ”

“ఏంటీ! నా చిలుక చచ్చిపోయిందా. అదే పందెంలో గెలిచిన చిలక?”

“ఆ అవును! అదే సార్.”

“ఓహ్!! ఎంత పని జరిగింది. దాన్ని తేవడానికి చాలా ఖర్చయింది. సరేలే, ఎలా చనిపోయింది?”

“కుళ్ళిపోయిన మాంసం తిని చనిపోయింది సార్”

“కుళ్ళిపోయిన మాంసమా? ఏ వెధవ పెట్టాడు?”

“అబ్బే ఎవరూ పెట్టలేదు సార్. దానంతట అదే చనిపోయిన గుర్రం మాంసం తినేసింది సార్.”

“చనిపోయిన గుర్రమా? అదెక్కడ?”

“అదే మన దగ్గరున్న మేలైన జాతి గుర్రాలున్నాయి కదా సర్. అవి నీళ్ళు మోసే బండి లాగి లాగి అలిసిపోయి చనిపోయాయి సార్ “

“నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ గుర్రాలు నీళ్ళ బండ్లు లాగడమేంటి? అసలు అన్ని నీళ్ళెందుకు అవసరమయ్యాయి?”

“మరేమో….అదీ.. మంటలార్పడానికి సార్.”

“మంటలా? మంటలేంటి?”

“అదే సర్ మీ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఒక కొవ్వొత్తి కిందపడి కర్టెన్ అంటుకుంది. ఆ మంటలు చిన్నగా ఇల్లంతా కమ్మేశాయి.”

“ఓరి బాబూ!! ఇంట్లో కరెంటు ఉంది కదా!!!  కొవ్వొత్తి ఎందుకు పెట్టారు?!!!!”

“మరేమో ఒక మనిషి చనిపోయిన ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి అంటారు కదా సార్. అందుకనీ…”

“చనిపోయారా? ఎవరు?”

“మీ అమ్మగారు సార్. ఓ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక మీ ఇంట్లోకి రాబోతున్నారు. ఎవరో దొంగేమో అనుకుని కాల్చేశాను సార్ “

“!@#$%#@$%‌&**@@$%”

ఆధారం:సిలికాన్ఇండియా.కామ్

మన రాజకీయ నాయకులు

మన రాజకీయ నాయకుడొకాయన ఓ సారి అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు అతన్ని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. మన నాయకుడు ఆయనకున్న విశాలమైన భవనాలు, ఇంటి ముందు కావాల్సినంత ఖాళీ స్థలం, ఖరీదైనా ఫర్నీచర్ అన్నీ చూసి ముచ్చట పడి…

“మీ కొచ్చే కొద్దిపాటి జీతాలతో ఇంత ఇంటిని, వస్తువులను ఎలా సంపాదించగలిగారు” అని అడిగాడు.

దానికి ఆ సెనేటర్ నెమ్మదిగా నవ్వి అతన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు.

“అదిగో ఆ నది కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“దాని మీద వంతెన కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“10%” అన్నాడు.

మన నాయకుడు అర్థమైందన్నట్లుగా నెమ్మదిగా తల పంకించాడు.

తర్వాత కొద్ది రోజులకు సదరు అమెరికన్ సెనేటర్ భారత్ కు వేంచేశాడు. అతన్ని మన నాయకుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు.

సెనేటర్ కి మన నాయకుడు ఇల్లు చూడగానే మతిపోయినంత పనైంది. రాజభవనాన్ని తలదన్నే ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామాగ్రి, నౌకర్లు, కార్లు…

ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.

“మీకొచ్చే రూపాయల్లో జీతంతో ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించాడా సెనేటర్.

మన నాయకుడు అతన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి

“అక్కడ నది కనిపిస్తోందా?”

“కనిపిస్తోంది”

“దాని మీద వంతెన కనిపిస్తోందా?”

“అదేంటి అక్కెడ వంతెనే లేదు కదా!!!”

“100%” అన్నాడు నెమ్మదిగా…

ఇప్పుడు దిమ్మతిరగడం సెనేటర్ వంతైంది….

మూలం:santabanta.com