అసాధ్యం సుసాధ్యం

కొన్ని వందల ఏళ్ళ క్రిందట ఇటలీ దేశంలోని ఒక పట్టణం లో ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. అతని దురదృష్టం కొద్దీ ఒక వడ్డీ వ్యాపారికి పెద్ద మొత్తంలో సొమ్ము బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలై వాడైనా మంచి జిత్తుల మారి. అతనికి తనకి బాకీ ఉన్న వ్యాపారి కూతుర్ని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతని కూతుర్ని తనకిచ్చి వివాహం జరిపిస్తే అప్పు మొత్తాన్నీ మాఫీ చేస్తానని ప్రతిపాదన చేశాడు. ఆ వ్యాపారి, అతని కూతురికీ ఈ ప్రతిపాదన వినగానే చాలా భయం వేసింది.

ఆ వడ్డీ వ్యాపారి పందెం ఇలా ఉంది. అతను ఒక ఖాళీ సంచీ లో ఒకే పరిమాణం, ఆకృతిలో ఉండే ఒక తెల్ల రాయి,  ఒక నల్ల రాయి వేస్తాడు. ఆ అమ్మాయి ఆ రెండు రాళ్ళలో ఒకటి బయటికి తీయాలి. ఒక వేళ ఆమె నలుపు రాయి బయటికి తీస్తే అతన్ని పెళ్ళి చేసుకోవాలి. ఆమె తండ్రి అప్పు చెల్లించనవసరం లేదు. ఒక వేళ ఆమె తెల్ల రాయి బయటికి తీస్తే ఆమె అతన్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదు కానీ తండ్రి బాకీ పడ్డ సొమ్ము చెల్లించనక్కర్లేదు. కానీ ఆమె రాయి తీయనంటే మాత్రం ఆమె తండ్రి జైలు పాలు కావాల్సి ఉంటుంది.

వాళ్ళు ముగ్గురూ వ్యాపారి ఇంట్లో  ఉన్నారు. వాళ్ళు నిల్చున్న దారిలో రకరకాల రాళ్ళున్నాయి. వాళ్ళలా మాట్లాడూతూ వెళుతుండగా ఆ వ్యాపారి రాళ్ళు తీసుకోవడానికి కిందికి వంగాడు. అలా తీస్తుండగా అతను రెండూ నల్ల రాళ్లనే తీసుకుని సంచిలో వేయడం ఆ అమ్మాయి గమనించింది. తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక రాయిని బయటికి తీయాల్సిందిగా కోరాడు.

ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న అవకాశాలు ఇవి.

  1. ఒక వేళ ఆ అమ్మాయి రాయి తీయనని నిరాకరిస్తే తండ్రి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది.
  2. ఆ అమ్మాయి  రెండు రాళ్ళనీ బయటికి తీసి అందరికీ చూపించి అతన్ని మోసగాడని నిరూపించడం.
  3. ఏదో ఒక రాయిని (నలుపు) బయటికి తీసి అతన్ని పెళ్ళి చేసుకుని తండ్రిని అప్పుల్లోంచి కాపాడటం.

కానీ ఆ అమ్మాయి ఇవేమీ చెయ్యలేదు. నెమ్మదిగా సంచీలో చెయ్యి పెట్టి ఒక రాయిని బయటికి తీసింది. దానివైపు చూడకుండానే కావాలనే కిందకి జారవిడిచింది. ఆ రాయి వాళ్ళ నడుస్తున్న దారిలో ఉన్న రాళ్ళలో కలిసిపోయింది.

“అయ్యయ్యో.. రాయి కింద పడిపోయింది” అంది ఆమె బాధ నటిస్తూ.

“కానీ నేనేం రంగు రాయి తీశానో తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఇప్పుడీ సంచీ లో ఉన్న రాయిని తీసి చూస్తే అదే రంగులో ఉంటుందో అందుకు వ్యతిరేకంగా ఉన్న రాయి నేను తీసినట్లు లెక్క” అంది ఏ మాత్రం తొణక్కుండా…

సంచీలో ఇక మిగిలింది కూడా నల్ల రాయే కాబట్టి, ఆమె తీసింది ఖచ్చితంగా తెల్లరాయేనని ఒప్పుకుని తీరాలి. ఆ వడ్డీ వ్యాపారి తను మోసం చేశానని ఒప్పుకునే ధైర్యం లేదు. విధిలేక అతను తన బాకీ మొత్తం రద్దు చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

అతను తనను పెళ్ళి చేసుకోకుండా చూడటం, తండ్రి అప్పును మాఫీ చేయడం ఒకేసారి చేయడం దాదాపుగా అసాధ్యం. చూశారా తెలివితేటలతో ఆ అమ్మాయి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందో…

ఇద్దరు స్ఫూర్తి ప్రధాతలు

ఇటీవల ఆన్‌లైన్ లో కొన్ని కథనాలు చదువుతుంటే నాకు ఆసక్తి కలిగించిన ఇద్దరు స్పూర్తి ప్రధాతల గురించి రాద్దామనే ఈ టపా…

ఒకరేమో దుగ్గిరాల పూర్ణచంద్రారావు అలియాస్ చందూ. కేవలం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సంవత్సరానికి లక్ష డాలర్లు దాకా సంపాదించవచ్చని ఇతన్ని చూసిన తర్వాతే తెలిసింది. ఏదైనా దిగితే కానీ లోతు తెలియదంటారు. ఇంతకు ముందు ఎక్సెల్ ను చూసి “ఆ ఏముంది ఇందులో?  టేబుల్స్ గట్రా చేస్తారు. అంతే కదా!” అనుకునే వాణ్ణి. కానీ ఇతన్ని గురించి చదివాక ఎక్సెల్ తో ఇంత సంపాదించచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇతను ఎక్సెల్ లోతుపాతుల్ని చవిచూసి తన బ్లాగు ద్వారా చిట్కాలను ప్రపంచానికి అందజేస్తుంటాడు. అంతే కాకుండా తను నేర్చుకున్న చిట్కాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకం కూడా రాశాడు. ఎక్సెల్ కు సంబంధించి కొన్ని సాఫ్ట్‌వేర్లు తయారు చేసి కూడా అమ్ముతూ ఉంటాడు. ఒక విషయం గురించి బాగా పరిశోధన చేస్తే అందులోనే బోలెడన్ని అవకాశాలు సృష్టించుకోవచ్చని ఇతన్ని చూసి బాగా అర్థమయ్యింది నాకు. ఆంధ్రా యూనివర్సిటీ లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఎమ్ ఇండోర్ నుంచి ఎంబీయే పూర్తి చేసిన ఇతను కొంతకాలం పాటు టీసీయెస్ లో కూడా పనిచేశాడు. తరువాత పూర్తి సమయాన్ని ఈ వ్యాపకం పై వెచ్చించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి తమ స్వంత ఊరైన విశాఖపట్టణం నుంచే తన కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటాడు, భార్యతో సహా!. ఇంతకన్నా కావాల్సిందేముంది చెప్పండీ? ( అరుణపప్పు గారి బ్లాగు నుంచి…)

ఇక రెండో అబ్బాయి బీహారు కు చెందిన కౌశలేంద్ర. కూరగాయలకు బీహార్ ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది అతని లక్ష్యం. ఎంబీయే విద్యకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐఐఎం అహ్మదాబాదు లో 2007 సంవత్సరానికి ప్రథమ స్థానంలో నిలిచినవాడు. తన సహోధ్యాయిల్లాగా కోట్లు సంపాదించే కార్పొరేట్ ఉద్యోగాన్ని కోరుకోలేదు. బీహార్ అభ్యున్నతికి పాటుపడాలనుకున్నాడు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన కౌశలేంద్ర ఎంబీయే పూర్తి చేసిన వెంటనే క్షేత్ర పరిశోధన కోసం విస్తృతంగా పర్యటించాడు. ఎందరో రైతుల్ని కలిసి వ్యవసాయంలో మెలకువల్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకున్నాడు. తరువాత కౌసల్య ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఏసీ బండ్ల ద్వారా కూరగాయలు అమ్మే విధానం. ఈ విధానం ద్వారా కూరగాయలు ఎక్కువకాలంపాటు పాడవకుండా ఉండి నష్టాన్ని నిలువరిస్తాయి. ప్రస్తుతం ప్రీపెయిడ్ కార్డుల ద్వారా కూరగాయల్ని కొనే వ్యవస్థను అభివృద్ధి పరిచే పనిలో ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నంలో అతను ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాడట. ఉదాహరణకు బ్యాంకులో జమ చేసిన చెక్కు మూడు నెలలకు కూడా జమ కాకపోవడం, ఏసీ బండ్ల కోసం ఋణాలు మంజూరు చేసినా డబ్బు సరిగా విడుదల చేయకపోవడం మొదలైనవి. విద్యావంతుడైన తన పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అని వాపోతున్నాడు. గంగానదీ పరీవాహక ప్రాంతంలోని సారవంతమైన నేలలో పండే కూరగాయల్ని సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటే రాష్ట్రం మరింత వృద్ధి సాధించగలదన్నది అతని నమ్మకం. పండించిన రైతుకే నేరుగా లాభం చెందాలన్న ఉద్దేశ్యంతో అతను నేరుగా ఉత్పత్తిదారులతోనే లావాదేవీలు నడుపుతూ ఉంటాడు. తన వ్యవస్థను విస్తరించడానికి వ్యవసాయ శిక్షణా సంస్థ సహకారం కూడా తీసుకుని ముందుకు సాగిపోతున్నాడు. తొందర్లోనే అతని లక్ష్యాన్ని సాధించాలని మనందరం ఆశీర్వదిద్దాం. (సిలికాన్‌ఇండియా.కామ్ సౌజన్యంతో)

స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం


అతను ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. విధి అతని మీద పగబట్టింది. అయినా అతను క్రుంగిపోలేదు. పట్టుదలతో చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు. నిజ్జంగా అతను స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం.


ఎవరతను? ఏమా కథ? వివరాల్లోకి వెళితే…

నాగ నరేష్
నాగ నరేష్

నాగ నరేష్ అనే అబ్బాయి ఇటీవలే ఐఐటీ మద్రాస్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి గూగుల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఈ రోజుల్లో వేలమంది ఐఐటీల్లో చదివి బయటికొచ్చి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా!. అందులో గొప్పతనం ఏముంది? అనుకుంటున్నారా?

నరేష్ కో ప్రత్యేకత ఉంది. అతను పైన చెప్పిన వేలమందిలో ఒక్కడు కాడు. అతని తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అతనికి రెండు కాళ్ళు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీయే గతి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. గొప్ప ఆశావాది. ” భగవంతుడు నాకోసం అన్నీ ముందుగా ఏర్పాటు చేసేస్తుంటాడు. అందుకనే నేను చాలా అదృష్టవంతుణ్ణని భావిస్తాను. ” అంటుంటాడు. అసలు నరేష్ ఎలా అదృష్టవంతుడెలా అయ్యాడో అతని మాటల్లోనే…

***

బాల్యం ఓ కుగ్రామంలో

నా మొదటి ఏడేళ్ళు గోదావరి ఒడ్డున ఉన్న తీపర్రు అనే కుగ్రామంలో గడిచాయి. మా నాన్న పేరు ప్రసాద్. లారీ నడిపేవాడు. అమ్మ కుమారి గృహిణి. వాళ్ళిద్దరూ నిరక్షరాస్యులే అయినా నన్ను, మా అక్కను బాగా చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించేవారు.

ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే నేను ఒకటి రెండు తరగతులు చదివేటపుడు మా నాన్న నాకు సహాయం చేయడం. నాన్న పాఠ్య పుస్తకంలో ప్రశ్నలు అడుగుతుంటే నేను సమాధానాలు చెప్పేవాడిని. అప్పుడు మా నాన్నకు చదవడం, రాయడం తెలీదని నాకు తెలియదు, కానీ నన్ను సంతోష పెట్టడం కోసం అలా చేసేవాడు. నా జ్ఞాపకాల్లోంచి చెరిగిపోని మరో సంఘటన మా ఊళ్ళో వరదలు. అప్పుడు మా మామ నన్ను ఓ గేదె పై కూర్చోబెట్టి తీసుకెళ్ళడం, బాగా ముళ్ళున్న చెట్టు నుంచి ఏవో పండ్లు తీసుకొచ్చి నాకివ్వడం నా కింకా బాగా గుర్తు.

నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడ్ని. ఎప్పుడూ అటూ ఇటూ పరిగెడుతూ, సావాస గాళ్ళతో ఆడుకుంటూ భలే సరదాగా ఉండేవాడిని. అలా అరుస్తూ మధ్యాహ్నం పూట నిద్ర చెడగొట్టినందుకు పెద్దవాళ్ళ దగ్గర అప్పుడప్పుడూ తిట్లు కూడా తింటుండేవాణ్ణి. ఎప్పుడైతే వాళ్ళు నా మీద అరుస్తారో వెంటనే పొలాలవైపు పరిగెత్తేవాణ్ణి.

మాస్టారు తరగతిలో అప్పజెప్పిన పనిని అందరికన్నా నేనే ముందు పూర్తి చేసేసి ఉపాధ్యాయుల ఒళ్ళో నిద్రపోయేవాణ్ణి!

జనవరి 11, 1993, విధి వెక్కిరించిన రోజు

జనవరి 11, 1993 మాకు సంక్రాంతి సెలవులు. మా అమ్మ నన్ను, అక్కను పక్క ఊళ్ళో జరుగుతున్న ఓ కార్యం కోసం తీసుకుని వెళుతోంది. అక్కడి నుంచి మా అమ్మమ్మతో కలిసి ఊరికి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ మా అమ్మమ్మ అక్కడికి రాలేదు. ఆ రోజు బస్సులు లేకపోవడంతో తిరుగు ప్రయాణంలో మేం మా నాన్న లారీ లో ఎక్కాం. అప్పటికే లారీలో చాలా మంది ఉండటంతో మా నాన్న నన్ను డ్రైవర్ సీటు పక్కనే తలుపు కి దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు.

అది నా తప్పే; నేను తలుపుని ఏదో కలిబెట్టాను. అది ఊడిపోయి అక్కడి నుంచి కిందపడ్డాను. కిందపడి దొల్లడం వల్ల లారీలో వేసుకువస్తున్న ఇనుప కమ్మీలు వెనుకల బాగం తగిలి నా కాళ్ళు బాగా చీరుకుపోయాయి.

ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఓ పెద్ద ప్రైవేటు ఆసుపత్రి కూడా ఉంది. కానీ యాక్సిడెంటు కేసు కావడంతో నన్ను అక్కడ చేర్చుకోలేదు. అటుగా వెళ్తున్న ఓ పోలీసు కాన్‌స్టేబుల్ మా పరిస్థితి చూసి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళాడు.

అక్కడ నా చిన్న ప్రేగు మెలితిరిగిందని తెలియడంతో మొదటగా ఓ శస్త్రచికిత్స చేశారు. నా కాళ్ళకు కూడా కట్లు కట్టారు. అక్కడే ఓ వారం రోజులు ఉన్నాను. కొన్నాళ్ళకి నా గాయాలు సెప్టిక్ అయి మోకాళ్ళ దాకా పాకినట్లు గుర్తించారు. నన్ను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళమని మా నాన్నకు తెలియజేశారు. అక్కడ వైద్యులు గాయాన్ని అంత కాలం నిర్లక్ష్యం చేసి సెప్టిక్ అయ్యేదాకా ఆలస్యం చేసినందుకు బాగా కోప్పడ్డారు. కానీ ఇలాంటి విషయాలు పెద్దగా తెలియని వాళ్ళేం చేస్తారు?

కొద్ది రోజులకు నా రెండు కాళ్ళు నడుం దాకా తొలగించారు. నా కింకా బాగా గుర్తుంది, స్పృహ లోకి వచ్చింతర్వాత మా అమ్మను అడిగాను ” నా కాళ్ళేవి?” అని. ఆమె కన్నీరు మున్నీరైంది. అలా నేను మూడునెలలు ఆసుపత్రిలోనే ఉన్నాను.

కాళ్ళులేని జీవితం

నాకు కాళ్ళు పోయింతర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయిందని నేననుకోను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు నన్ను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. అందరూ నా మీద చూపే శృద్ధకు లోలోపలే ఆనందిస్తున్నానే గానీ నన్ను గురించి నేను బాధపడటం లేదు. నేను తినడానికి పళ్ళు, బిస్కట్లు బాగా దొరుకుతున్నాయని సంతోషంగా అనిపించేది.

ఆత్మన్యూనతా?… అంటే  ఏమిటి?

నేను మా ఊరు వెళ్ళగానే మా ఇంటికి చూడ్డానికి వచ్చేవాళ్ళు వెల్లువలా వచ్చిపడ్డారు. వాళ్ళలో చాలామంది కాళ్ళు లేకుండా నేనెలా ఉంటానో చూడ్డానికి వచ్చిన వాళ్ళే. కానీ నాకేం బాధ లేదు. చాలా మంది, ముఖ్యంగా నా స్నేహితులంతా నన్ను చూడ్డానికి వస్తున్నారని సంతోషంగా ఉండేది.

నా స్నేహితులంతా ఏ ఆట ఆడుకున్నా అందులో నేనుండేటట్టుగా చూసేవారు. ఎక్కడికైనా మోసుకుపోయేవారు.

నేను భగవంతుణ్ణి నమ్ముతాను. అలాగే విధి అంటే కూడా నమ్మకమే. భగవంతుడు నాకోసం అన్నీ ముందుగానే ఏర్పాటు చేస్తాడనుకుంటా. ఆ యాక్సిడెంటు జరక్కుంటే మేం మా గ్రామాన్ని వదిలి తణుకు పట్టణానికి వెళ్ళుండే వాళ్ళమే కాదు. అక్కడ నేనో మిషనరీ స్కూల్లో చేరాను. మా నాన్న ఆ స్కూలు పక్కనే ఓ ఇల్లు కూడా కట్టాడు. నా పదో తరగతి దాకా అక్కడే చదివాను.

నేను తీపర్రు లో ఉండిపోయుంటే పదో తరగతికి మించి చదువుండే వాణ్ణి కాదేమో! అందరి లాగానే పదో తరగతి పూర్తి చేసి వ్యవసాయంలో స్థిరపడిపోయి ఉండేవాణ్నేమో! దైవం వేరొకటి తలచిందేమో నాకోసం.

మా అక్క

బడి మళ్ళీ తెరుస్తారనగా మా అమ్మ, నాన్న తీపర్రు నుంచి తణుకు కి వచ్చేశారు. మమ్మల్నిద్దర్నీ ఓ మిషనరీ స్కూల్లో చేర్పించారు. నా కన్నా మా అక్క రెండేళ్ళు పెద్దదైనా నాకు సహాయంగా ఉండి బాగా చూసుకుంటుందని నా క్లాసులోనే చేర్పించారు. మా అక్క ఏ మాత్రం సంకోచించలేదు, ఫిర్యాదు చేయలేదు.

ఆమె నా కోసం ఏం చేయడానికైనా వెనుకాడేది కాదు. మా స్నేహితులంతా అంటుండే వారు అలాంటి అక్క ఉండటం నా అదృష్టమని. తోబుట్టువుల్ని పట్టించుకోని చాలా మంది ఉన్న ఈ లోకం లో అది అక్షరాలా నిజం.

కొన్ని సంవత్సరాలు మా అక్కే నన్ను మోసుకొని స్కూలుకి తీసుకెళ్ళేది. తర్వాత నా స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. నాకు మూడు చక్రాల బండి వచ్చాక మా అక్కే వెనకుండి తోసుకుంటూ తిరిగేది.

అందరూ నన్ను వాళ్ళతో సమానంగా చూడటం వల్లనేమో నేను కూడా అందరిలాంటి వాడినే అనుకునే వాణ్ణి. ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో కుంగిపోలేదు. అందరిలానే సంతోషంగా ఉంటూ మొదటి స్థానం కోసం అందరితో పోటీ పడేవాణ్ణి. అలాగే అందరు కూడా నన్ను గట్టి పోటీగా స్వీకరించేవాళ్ళు.

స్పూర్తి

స్కూల్లో ఉండగా నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకరు మా గణితం మాస్టారు ప్రమోద్ లాల్. ఆయన ప్రాంతీయంగా జరిగే ప్రతిభా పరీక్షల్లో (టాలెంట్ టెస్ట్) ల్లో నన్ను పాల్గొనమనేవాడు. ఇంకొకరు నాకు సీనియర్ అయిన చౌదరి. అతను గౌతమ్ జూనియర్ కళాశాలలో చేరి ఐఐటీ కి సన్నద్ధం అవుతున్నాడని తెలిసి నేను కూడా అలాగే చేరాలని కలలు కన్నాను. పదో తరగతి లో 600 కి 542 మార్కులు సంపాదించి మా పాఠశాలలో ప్రథముడిగా నిలిచాను.

బాగా మార్కులు సంపాదించినందువల్ల , గౌతమ్ జూనియర్ కళాశాల యాజమాన్యం నా కోసం ఫీజు మినహాయింపునిచ్చింది. ఇందుకు మా ప్రమోద్ సార్ కూడా సహాయం చేశారు. లేకపోతే సంవత్సరానికి యాభై వేల రూపాయలు మా తల్లిదండ్రులకి అసాధ్యమైన పని అయ్యేది.

రెసిడెన్షియల్ స్కూల్లో

రెసిడెన్షియల్ స్కూల్లో కి మారడం నాకు కొంచెం కొత్తగానే అనిపించింది. ఎందుకంటే అప్పటి దాకా  స్కూలు, ఇల్లు తప్ప  ఎక్కడికి వెళ్ళింది లేదు. అక్కడ నాకు సహాయం చేయడానికి అక్క, అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. బయటి సమాజంతో ఇంటరాక్ట్ అవడం అదే ప్రథమం. కొత్త జీవితానికి  అలవాటు పడటానికి ఓ సంవత్సరం పట్టింది.

అక్కడ నాకు స్పూర్తి కె.కె.యస్ భాస్కర్ (ఈ కె.కె.యస్ భాస్కర్ అనే అబ్బాయి గురించి కూడా నేను పేపర్లో చదివాను. దాదాపు మా వయసు వాడే. ఇతన్నే ర్యాంకుల భాస్కర్ అనేవాళ్ళు. ఎందుకంటే ఈ అబ్బాయి ఎంసెట్లో మొదటి ర్యాంకు. ఏఐట్రిపుల్ ఈ లో మొదటి ర్యాంకు. ఐఐటీ లో కూడా మొదటి పది లోపలే ర్యాంకు. వాళ్ళది కూడా పేద బెస్తవారి కుటుంబమే. అప్పట్లో నేను అతని ప్రతిభ చూసి అబ్బురపడ్డాను.) అనే వ్యక్తి. అతను మమ్మల్ని ఉత్తేజపరచడానికి మా కళాశాలకు వచ్చేవాడు. గౌతమ్ జూనియర్ కాలేజీ గురించి, ఐఐటీ గురించి మా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు కానీ నేనేది చేసినా అందులో తప్పక ప్రోత్సాహం అందించేవారు. ఒకవేళ విజయం సాధిస్తే నన్ను ఆకాశానికెత్తేసేవారు. ఒక వేళ వైఫల్యం ఎదురైతే అందువల్ల కలిగే లాభాల గురించి చెప్పేవారు. ఏ విధంగా నైనా నేను సంతోషంగా ఉండాలనేదే వారి అభిమతం. అలాంటి అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు.

ఐఐటీ మద్రాస్ లో

ఐఐటీ ప్రవేశ పరీక్షలో నా ర్యాంకు పెద్దగా లేకపోయినా (992) వికలాంగుల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాను. ఐఐటీ మద్రాసు లో కంప్యూటర్ సైన్సులో చేరాను.

ఇక్కడ నా రోల్ మోడల్ కార్తీక్ అనే మా స్కూల్ సీనియర్. ఐఐటీ మద్రాస్ లో ఉన్నప్పుడు అతనే నాకు స్పూర్తి. నేను అక్కడికి వెళ్ళక ముందే అతను నా కోసం అటాచ్డ్ బాత్‌రూమ్ కలిగిన గది కోసం అడిగిపెట్టాడు. అలా నేనక్కడికి వెళ్ళేసరికే ఆ గది నాకు కేటాయించబడింది. అతను నాకు దిశా నిర్దేశం చేయడమే కాక ఎంతో సహాయం చేశాడు.

ఆ నాలుగు సంవత్సరాల్లో నేను ఓ వ్యక్తిగా, విద్యార్థిగా చాలా ఎదిగాను. అక్కడ చదవడం ఓ మరిచిపోలేని అనుభవం. నేను కలిసి చదువుకున్న వాళ్ళు మంచి ప్రతిభావంతులు. వాళ్ళతో కలిసి చదవడం నేను గర్వంగా చెప్పుకుంటాను. అస్సలు మా ల్యాబ్ లో పనిచేసే వాళ్ళతో మాట్లాడటం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను.

ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళకంటే మంచి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు

మా ప్రొఫెసర్ పాండురంగన్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆయన నన్ను మరో నలుగురితో కలిసి ఇంటర్న్‌షిప్ కోసమై బోస్టన్ నగరానికి పంపించారు. అది చాలా గొప్ప అనుభవం నాకు.

గూగుల్ లో కొలువు

మా తల్లిదండ్రులకు ఇంక అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో నేను పీహెచ్‌డీ లో చేరదలుచుకోలేదు. మొదట్లో మోర్గాన్ స్టాన్లీ అనే కంపెనీ నన్ను సెలెక్ట్ చేసుకున్నా నేను కంప్యూటర్ సైన్స్, అల్గారిథమ్స్, గేమ్ థియరీ మీద ఆసక్తితో గూగుల్ లో చేరడానికే ప్రాధాన్యత నిచ్చాను.

నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేనెందుకు అలా అంటున్నానో మీకు తెలుసా?

నేను అడక్కుండానే ముక్కు మొహం తెలియని ఎంతో మంది నాకు సాయం చేశారు. ఓ సారి బీటెక్ రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ కోసం రైల్లో ప్రయాణిస్తున్నాను. నాకు సుందర్ అనే ఆయన పరిచయయ్యాడు. అప్పటి నుంచీ నా హాస్టల్ ఫీజు ఆయనే భరిస్తూ వచ్చాడు.

ఇక్కడ నేను జైపూర్ కాలు గురించి కూడా చెప్పాలి. నేను మూడో తరగతిలో ఉండగా జైపూర్ కాలు అమర్చారు. కానీ రెండేళ్ళ తర్వాత వాటిని వాడటం ఆపేశాను. నాకు పూర్తిగా కాళ్ళు తీసేయడం వల్ల వాటిని నా శరీరానికి కట్టుకోవడం ఇబ్బందిగా ఉండేది. పైగా ఆ కాళ్ళతో నడవడం చాలా నెమ్మదిగా ఉండేది. కూర్చోవడం కూడా సమస్య గానే ఉండేది. మూడు చక్రాల బండిలో వేగంగా వెళ్ళగలిగేవాడిని. దాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే నాకేదైనా వేగంగా చేయడం ఇష్టం.

ఆ ఆసుపత్రి గురించి ఇంకో గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళు జైపూర్ కాలు అమర్చగానే వాళ్ళ బాధ్యత తీరిపోయిందనుకోరు. వాళ్ళకి జీవనాధారం కల్పించడం కోసం కూడా కృషి చేస్తారు. ఇంకా నాకేం సాయం కావాలో అడిగారు. అప్పట్లో నేను ఐఐటీ లో చేరగలిగితే నాకు ఆర్థిక సహాయం చేయండని చెప్పాను.కాబట్టి నేను ఐఐటీ మద్రాసు లో చేరినప్పటి నుంచి నా ఫీజు సంగతి వాళ్ళే చూసుకునే వారు. మా తల్లిదండ్రులకు కూడా నా చదువు భారం కాలేదు. దాంతో మా అక్కను సులభంగా నర్సింగ్ చదివించగలిగారు.

ఐఐటీ లో నాకో సర్‌ప్రైజ్

నా మొదటి సంవత్సరం తర్వాత ఇంటికెళ్ళి తిరిగొచ్చే లోపు ఐఐటీ లో నాకు తెలియకుండా రెండు సంఘటనలు జరిగాయి.

మా విభాగంలో నా కోసం ఓ లిఫ్ట్, ఒక అంతస్థు నుంచి మరో అంతస్థు కు ఎక్కడానికి మెట్లు కాకుండా ఏటవాలుగా ఉందే ర్యాంప్స్ ఏర్పాటు చేశామని ఒక ఉత్తరం వచ్చింది. అంతే కాదు కొంచెం ముందుగా వచ్చి అవి నాకు సౌకర్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని కూడా తెలియజేశారు.

ఇక రెండో సౌకర్యం ఏమిటంటే మా డీన్ ప్రొఫెసర్ ఇడిచాండీ, విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ ప్రసాద్ విద్యుచ్చక్తితో నడిచే చక్రాల కుర్చీలు అమ్మే చోటుని కనిపెట్టారు. దాని ఖరీదు యాభై ఐదు వేలు. వాళ్ళు దాన్ని కొనకుండా మొత్తం డబ్బు నా చేతికే ఇచ్చి కొనుక్కోమన్నారు. ఎందుకంటే అలా తీసుకుంటే అది సంస్థకు కాకుండా నాకే చెందుతుందని.

నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను, స్వేచ్చగా, స్వతంత్రంగా ఫీలయ్యాను. అందుకనే నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పాను. దేవుడు నా కోసం అన్నీ అమర్చి పెట్టాడు. ప్రతి అడుగులో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు…

ఆంగ్ల మూలం: రెడిఫ్.కాం

అంధుడు

“ఒక అంధుడైన అబ్బాయి గుడి మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఓ గుడ్డ పరిచి ఉంది. అతని పక్కనే ఉన్న పలకపై ఈ విధంగా రాసి ఉంది.
 
“నేను గుడ్డివాణ్ణి. దయచేసి నాకు ధర్మం చేయండి”. ఆ గుడ్డ మీద కేవలం కొన్ని నాణేలు మాత్రమే ఉన్నాయి.
 
అటుగా వెళ్తున్న ఒకాయన ఇది గమనించాడు. తన జేబులోంచి రెండు రూపాయలు తీసి ఆ గుడ్డ మీద వేశాడు. అంతటితో ఆగకుండా నెమ్మదిగా ఆ బోర్డు దగ్గరికెళ్ళి దాన్ని తిప్పి ఏదో రాసి అందరూ చూసేటట్లుగా అలా వేళ్ళాడదీసి వెళ్ళిపోయాడు. 
 
తొందర్లోనే ఆ గుడ్డమీద చిల్లర రాలడం మొదలు పెట్టింది. అలా సాయంత్రమైంది. 


ఆ బోర్డు రాసిపోయిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వచ్చాడు.

అతని అడుగుల సవ్వడిని బట్టి ఆ అబ్బాయి అతన్ని గుర్తు పట్టాడు. అతనికి నమస్కారం చేసి
 
“ఉదయాన్నే నా పలక మీద ఏదో రాసింది మీరే కదూ. ఏం రాశారు?”
 
“నేనేమీ కొత్తగా రాయలేదు, ఉన్నదే రాశాను. కానీ కొంచెం వైవిధ్యంగా రాశానంతే” అన్నాడు.
 
అతనేం రాశాడంటే
  

“ఈ ప్రపంచం చాలా అందమైంది. కానీ నేను దాన్ని చూడలేను”.
 
నిజానికి రెండు వాక్యాలూ ఆ అబ్బాయి అంథుడనే తెలియజేస్తాయి. కానీ రెండో వాక్యం మాత్రం అదనంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అదేంటంటే చూపున్నందుకు మీరు అదృష్టవంతులు అని. అందుకే ఆ అబ్బాయికి ఎక్కువ డబ్బులు రాలాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా!

22 ఏళ్లకే ఐఐటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్

తులసి
తులసి

తథాగత్ అవతార్ తులసి… చాలా కాలం క్రితం మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. పన్నెండేళ్ళకే ఎమ్మెస్సీ పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. 2003 లో టైమ్ మ్యాగజీన్ అతనికి ఆసియాలోని గిఫ్టెడ్ యంగ్‌స్టర్స్ లో ఒకడిగా స్థానం కల్పించింది. సైన్స్ మేగజీన్ సూపర్‌టీన్ గా కీర్తించింది. ఇంకా ది టైమ్స్, దేశీవాళీ పత్రికలైన ఔట్‌లుక్, ది వీక్ మొదలైన అన్ని ప్రముఖ పత్రికలూ ఇతన్ని గురించి ప్రస్తావించాయి.

ఇప్పుడు అతని వయసు 22 ఏళ్ళు. కొద్ది రోజుల్లో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరబోతున్నాడు. బీహార్ రాజధాని పాట్నాలో జన్మించిన ఈ బాలమేధావి తొమ్మిదేళ్ళకే ఉన్నత పాఠశాల చదువునూ, పదేళ్ళకే బీయస్సీ డిగ్రీని, పన్నెండేళ్ళకే ఎమ్మెస్సీని పూర్తి చేసేశాడు.

తరువాత 21 ఏళ్ళకు బెంగుళూరు లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ లో పీహెచ్‌డీ పట్టా సంపాదించాడు. పీహెచ్‌డీ పూర్తయిన తరువాత ఐఐటీ ముంబై తో పాటు కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన వాటర్లూ విశ్వవిద్యాలయం, భోపాల్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అవకాశం లభించినా అతను ఐఐటీ ముంబై నే ఎంచుకున్నాడు.

భవిష్యత్తులో డాక్టర్ తులసి మరిన్ని పరిశోధనలు చేసి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.

కన్ఫ్యూషియస్ సందేశం

క్రీ.పూ 6 వ శతాబ్దంలో చైనాలో జీవించిన ప్రఖ్యాత తత్వజ్ఞుడు కన్ఫ్యూషియస్ మరణ శయ్య మీదున్నాడు. ఆయన చుట్టూ ఆప్తులు, అనుయాయులు గుమికూడారు. అంతా విషాదంలో మునిగి ఉన్నారు. అప్పుడు కన్ఫ్యూషియస్ అతి హీనస్వరంతో

“నా నోట్లో ఏముందో చూసి చెప్పగలరా?” అన్నాడు.

అప్పటికే వయోవృద్ధుడైన ఆయన ఆ తాత్వికుని పళ్ళు ఊడిపోయాయి. కాబట్టి వాళ్ళు,

“అయ్యా మీ నోట్లో నాలుక మాత్రం ఉందండీ ” అని జవాబిచ్చారు.

ఆయన కాసేపాగి “మీ నోట్లో ఏమున్నాయి?” అని అడిగాడు.

“మా నోట్లో పళ్ళు, నాలుకా రెండూ ఉన్నాయండీ” అన్నారు వాళ్ళు తటపటాయించకుండా.

“చూశారా మనిషి పుట్టినపుడు నోట్లో నాలుక మాత్రమే ఉంటుంది. కాలక్రమంలో పళ్ళు మొలుస్తాయి. కానీ అవి నాలుక కన్నా బలంగా, దృఢంగా ఉంటాయి. క్రమంగా మనిషి వృద్ధుడయ్యేసరికి బలమైన పళ్ళు క్రమేణా రాలిపోతాయి. కోమలమైన, సున్నితమైన నాలుక మాత్రమే మరణం వరకు ఉంటుంది.”

ఆయన కాసేపు ఊపిరి తీసుకోవడం ఆగి

“మీ అందరికి ఇదే నా చివరి సందేశం. సున్నితమైనది, సరళమైనది చిరకాలం నిలుస్తుంది. కనుక సదా సరళ ప్రవర్తనులై మెలగండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా, సరళంగా మాట్లాడటం అలవర్చుకోండి” అని చెప్పి కన్ను మూశాడు.

*శ్రీరామకృష్ణ ప్రభ సౌజన్యంతో…

నాడు బాలకార్మికుడు – నేడు వైద్యవిద్యలో అగ్రగణ్యుడు

తండ్రితో శివప్రసాద్
తండ్రితో శివప్రసాద్

పదమూడు సంవత్సరాల క్రితం(1997 లో) కర్నూలుకు చెందిన ఈశ్వరప్ప అనే ఒక మామూలు సెక్యూరిటీ గార్డు కుమారుడు  శివప్రసాద్  తల్లిదండ్రులు తనను చదివించే స్థోమత లేకపోవడంతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఒక జౌళి మిల్లులో పని చేసేవాడు.

ఒక రోజు ఆ ఫ్యాక్టరీని పరిశీలించడానికి వచ్చిన శివకుమార్ రెడ్డి అనే అధికారి రోజుకు 26 రూపాయలు సంపాదించడం కోసం ఆ అబ్బాయి చదువుకు పుల్‌స్టాప్ పెట్టి అక్కడ గోతాలు(గోనెసంచులు) కుట్టే పనిలో చేరాడని తెలిసి చలించిపోయాడు.

వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ అబ్బాయి చదువుకు అవసరమయ్యే ఖర్చును తను భరిస్తానని చెప్పి ఒప్పించాడు. శివప్రసాద్ ఆ అధికారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 2002 లో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 600 కి గాను 512 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ ఒక ప్రభుత్వ కళాశాలలో చేరి 1000 కి 841 మార్కులు సాధించాడు. కానీ ఎంసెట్ లో ర్యాంకు సరిగా రాకపోవడంతో 2004 లో ఉచిత సీటు దొరకలేదు. ఒక సంవత్సరం పాటు కష్టపడి మరుసటి సంవత్సరం నంద్యాల లోని శాంతీరామ్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు సాధించాడు.

ఇటీవలే ప్రకటించిన ఫలితాల్లో 73.4 శాతం మార్కులతో కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు.

మూలం:

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్

ది హిందూ ఆర్టికల్