God lived with them – పుస్తక పరిచయం

శ్రీరామకృష్ణ పరమహంస యొక్క సన్యాసాశ్రమ శిష్యుల జీవితాల గురించి స్వామి చేతనానంద రాసిన పుస్తకం ఇది. ఒక మిత్రుని ద్వారా నా దగ్గరకు వచ్చింది. శ్రీరామకృష్ణులతో స్వామీ వివేకానంద తో సహా మరో పదిహేను మంది ప్రత్యక్ష శిష్యుల అనుభవాల సారమే ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవక ముందు నాకు కేవలం వివేకానంద గురించి మాత్రమే తెలుసు. కానీ మిగతా పదిహేను మంది కూడా ఏమాత్రం తీసిపోని వారు. వీరిలో బాగా చదువుకున్న వారి దగ్గర్నుంచి కేవలం అక్షర జ్ఞానం లేని వాళ్ళు, సంసారం నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు.

నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు బాగా చదివే వాడిని. కానీ కొంచెం పరిపక్వత వచ్చాక అవి రుచించడం మానేశాయి. ఎందుకంటే వాటిలో ఉండే విషయాలు చాలావరకు ఉపదేశ ధోరణి లో ఉండటమే. ఇవి చదివినంత సేపు బాగానే ఉన్నా ఆచరణలో పెట్టాలంటే కష్టంగా ఉండేది. అప్పుడే శ్రీకాళహస్తి శాఖా గ్రంథాలయంలో కొంతమంది ప్రముఖుల జీవితాల్ని చదవడం ద్వారా కొంత స్ఫూర్తి పొందాను. మనసు కొంచెం ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గాక ఈ పుస్తకం చదవడం ప్రారంభించాను. ఎందుకంటే ఈ పుస్తకంలో రాసిందంతా శ్రీరామకృష్ణుల శిష్యులు తమ జీవితంలో ఆచరించి చూపించిన విలువలే. నిజజీవిత సంఘటనలు చదివితే అరే వాళ్ళు అలా ఆచరించి చూపించినపుడు మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు? అని స్ఫూర్తి నిస్తుంది కదా!

ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో విచిత్రమైన గాథ. అందరూ విరుల తావికి ఆకర్షించబడిన తుమ్మెదల్లాగా భగవత్ జ్ఞానం కోసం శ్రీరామకృష్ణుని చేరిన వారే. వీళ్ళ గురించి చదివే దాకా సన్యాసం అంటే సమాజంతో సంబంధం లేకుండా తమ లోకంలో తాము బతకడమన్న అభిప్రాయం ఉండేది నాకు. కానీ వీరు మాత్రం సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా గురువు యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి, వైదిక ధర్మ ప్రాశస్త్యాన్ని వివరించడానికి దేశ విదేశాలు పర్యటించారు. కేవలం గురువాజ్ఞ కోసం నానా కష్టాలు పడ్డారు. పేదరికాన్ని చూసి చలించిపోయారు. మానవ సేవను తమ జీవితాల్లో ప్రధాన భాగం చేసుకున్నారు.

రామకృష్ణులకు ప్రియమైన శిష్యులంతా కారణ జన్ములే. వీళ్ళందరూ పూర్వ జన్మలో ఎవరో రామకృష్ణులు ఏదో ఒక సందర్భంలో తెలియజేశారు. శిష్యులను ఎవరి తత్వానికి తగ్గట్టు వారికి శిక్షణ ఇచ్చేవాడు. మంచి చదువరులైతే జ్ఞానమార్గం, అంతగా చదువులేని వారికి భక్తిమార్గం ద్వారా ఉపదేశం చేశాడు. అలాగే సన్యాసాశ్రమ శిష్యులకు బోధించేటపుడు గృహస్థులకు దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు.

రామకృష్ణులు మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఓ సారి స్వామీ వివేకానంద ఆయనకు దగ్గర్లోనే కూర్చున్నాడు. రామకృష్ణులు గొంతు క్యాన్సర్ వల్ల విపరీతమైన బాధతో ఉన్నారు. వివేకానంద మనసులోనే ఇలా అనుకున్నాడు. “మీరే భగవంతుని ఇప్పుడైనా ప్రకటించగలిగితేనే నేను మీరు నిజంగా ఆ పరమాత్మయే అని నమ్ముతాను.” వెంటనే శ్రీ రామకృష్ణులు వివేకానంద వైపు చూసి

“ఎవరైతే రాముడిగా, కృష్ణుడిగా వచ్చాడో వారిద్దరే ఇప్పుడు శ్రీరామకృష్ణుడిగా ఈ శరీరంలో ఉన్నాడు” అని ప్రకటించాడు. వెంటనే వివేకానందకున్న భ్రమలన్నీ కరిగిపోయాయి.

అలాగే నరేంద్రుడి (వివేకానంద) జననం ముందు కూడా రామకృష్ణులకు లీలామాత్రంగా ఓ దృశ్యం గోచరించింది. ఒక రోజు రామకృష్ణులు సమాధి స్థితిలో ఉండగా ఆయన మనసు ఓ వెలుగు రేఖల వైపు ప్రసరిస్తూ వెళుతోంది. ఆయనకిరువైపులా అనేక దేవతా మూర్తులు గోచరిస్తున్నాయి. అలా సాగుతూ దేవతా మూర్తులనూ, అన్నీ అంతరాలన్నీ దాటుకుంటూ ఓ శూన్యమైన స్థితికి చేరింది. వెంటనే ఆయనకు సప్తర్షులు కనిపించారు. ఈ రుషులు తమ తపశ్శక్తితో కేవలం మానవులనే కాక దేవుళ్ళను కూడా అధిగమించినట్లు ఆయనకు అనిపించింది. అలా చూస్తుండగా కొన్ని వెలుగు రేఖలు కలిసి ఒక దివ్యమైన స్వరూపం కలిగిన బాలుడిగా రూపుదిద్దుకొన్నాయి. ఆ బాలుడు నెమ్మదిగా వచ్చి సప్తర్షులలో ఒకరి దగ్గరకు వచ్చి  మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా పిలుస్తూ సమాధి స్థితి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ అధ్బుతమైన స్పర్శ తగలగానే ఆ రుషి నెమ్మదిగా కళ్ళు తెరిచి అర్ధ నిమీలిత నేత్రాలతో ఆ బాలునివైపు చూశాడు. ఆ బాలుడు పరమానందభరితుడై ఆ రుషితో ఇలా అన్నాడు “నేను కిందకు వెళుతున్నాను. మీరు కూడా నాతో పాటు రావాలి.” ఆ రుషి మౌనంగా ఉండి పోయాడు. కానీ ఆయన చిరునవ్వే అంగీకారంగా తోచింది.  నరేంద్రుడు తన దగ్గరకు రాగానే రామకృష్ణులకు ఆ ఋషే గుర్తుకు వచ్చాడు.

తరువాత ఆ దివ్యశిశువు తనేనని కూడా ప్రకటించాడు.

మరో శిష్యుడు రాఖల్ (బ్రహ్మానంద) రాక మునుపు ఆయనకు కాళికా దేవి స్వప్నంలో సాక్షాత్కరించి ఆయన ఒళ్ళో ఒక బిడ్డనుంచి “ఇదిగో మీ అబ్బాయి” అన్నది. ఆయన ఆశ్చర్యపడి “ఏవంటున్నావ్ తల్లీ! నాక్కూడా సంతానమా?” అని అడిగాడు.  ఆమె చిరునవ్వు నవ్వుతూ “దైవిక సంతానమేలే!” అన్నది. అంతతో ఆయన సంతృప్తి పడ్డాడు.  రాఖల్ ఆయన దగ్గరకు రాగానే అతన్ని కాళికా దేవి వరప్రసాదంగా గుర్తించాడు.  రాఖల్ గురించే ఇంకో సారి మరో దృశ్యం సాక్షాత్కరించింది. ఇద్దరు బాలురు గంగానదిపై వికసించిన ఓ పెద్ద కమలంపై నాట్యమాడుతున్నారు. ఒకరేమో శ్రీకృష్ణ పరమాత్మ. మరొకరు కాళికాదేవి తన ఒడిలో ఉంచిన పసిపాపడిగా గుర్తించాడు. రాఖల్ జన్మ వృత్తాంతాన్ని గురించి ఇతర శిష్యులకు చెబుతూ శ్రీరామకృష్ణులు “రాఖల్ కు తన నిజ స్వరూపం తెలిసిన మరుక్షణం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబోడు. అంతలోపు అతను నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అతనికి తెలియకుండా గోప్యంగా ఉంచండి.” అని చెప్పాడు.

సన్యాసులైనా వారి జీవితం కూడా సుఖదుఃఖాలకు కోప తాపాలకూ అతీతమేమీ కాదు. అయితే వారు అలాంటి వాటిని ఎలా పరిష్కరించుకున్నారో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి కోపం వచ్చిన కేవలం కొద్ది సేపు మాత్రమే. తర్వాత ఎంతో ప్రేమగా కలిసిపోయేవారు.  తమ వ్యక్తిత్వాన్ని మలచడానికి, సాధన సక్రమమైన మార్గంలో పెట్టడానికి గురువు తమ పట్ల కఠినంగా ప్రవర్తించినా ప్రేమగా అర్థం చేసుకున్నారు.

గురువు గారు పరమపదించిన తర్వాత కనీసం తినడానికి తిండి లేకపోయినా సన్యాసం నుంచి పారిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తమ గురువు మీద అచంచలమైన విశ్వాసంతో కేవలం ఒక్కపూట భోజనం తిని, లేదా రోజుల తరబడి పూర్తి ఉపవాసాలున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత రామకృష్ణులు తన గృహస్థాశ్రమ శిష్యుడైన సురేంద్ర నాథ్ మిత్రాకు కలలో కనిపించి తన శిష్యుల పరిస్థితి గురించి చెప్పి వారికి ఏదో దారి చూపించమన్నాడు. ఆయన కొంత నెల నెలా కొంత ధన సహాయం చేయడంతో ఒక పాడుబడ్డ బంగళాను అద్దెకు తీసుకుని అందులో తమ సాధనను కొనసాగించారు.


రామకృష్ణులు తన శిష్యుల్ని పరీక్షించినట్టే శిష్యులు కూడా తమ గురువును అంతకంటే ఎక్కువగానే పరీక్షించారు. ఒక్కోసారి కావాలనే భిక్షకు వెళ్ళకుండా “మా గురువు సదా మా అండగా ఉండేది నిజమే అయితే ఆయనే మాకు భోజనం సమకూర్చుగాక!” అనుకుంటూ కూర్చుంటే ఏదో విధంగా వారికి తినడానికి ఏదో ఆహారం దొరికేది. కాలినడకన దేశమంతా యాత్రలు చేస్తూ అడవుల్లో, పర్వతాల్లో దారి తప్పిపోయినప్పుడల్లా గురువు మీద భారం వేసి నడుస్తూ వెళుతుంటే ఏదో జనావాసాలను చేరుకునే వారు. ఇలా జరిగినప్పుడల్లా వారికి గురువుపై విశ్వాసం రెట్టింపయ్యేది.

గురుసేవలో వారు ఎంత తరించిపోయారంటే ఆయన పరమపదించిన తర్వాత కూడా బతికున్నప్పుడు ఎలాగైతే సేవలు చేసేవారో అలాగే సేవలు చేసేవారు. ఆయనకిష్టమైన ఆహారపదార్థాల్ని వండిపెట్టేవారు. ఆయన పడుకున్న పడకను శుభ్రంగా ఉంచేవారు. విసనకర్రతో విసురుతూ నిద్రపుచ్చేవారు. ఇలా రామకృష్ణుల సేవలో తరించిపోయిన  శశి కి వివేకానంద తర్వాత రామకృష్ణానంద అని నామకరణం చేశాడు.

ఇలా ఈ పుస్తకంలో ఎన్నో సంఘటనలు నన్ను కదిలించాయి, ప్రభావితం చేశాయి. ఒక పుస్తకం చదివాక అందులో విషయాలు మనకు ఎంతకాలం వరకు మళ్ళీ గుర్తుకు వస్తాయో, ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందో దాన్ని బట్టి పుస్తకం గొప్పతనాన్ని అంచనా వెయ్యొచ్చు. అలా ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పుస్తకం!

భగవంతుని ముందు మనమెంత?

స్వామీ వివేకానంద తన దేశ పర్యటనలో భాగంగా తన బృందంతో కలిసి శ్రీనగర్ సందర్శించారు. ఆయన మనసు ఉన్నట్టుండి కాళికా మాత వైపు మళ్ళింది. అప్పటికప్పుడే అమ్మవారి మీద ఓ పద్యం రాశాడు. తరువాత దగ్గర్లోనే ఉన్న క్షీరభవాని ఆలయానికి వెళ్ళాలనుకున్నాడు. ఈ ఆలయం ముస్లింల దాడిలో చాలా వరకు పాడైపోయింది. అక్కడికి వెళ్ళి ఆ ఆలయం శిథిలాల్ని చూస్తూ చాలా బాధపడి తనలో తానే ఇలా అనుకున్నాడు.

“ఇంత ఘోరం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు కనీసం ప్రతిఘటించకుండా ఎలా ఉండగలిగారు? నేనే గనుక ఇక్కడ ఉండి ఉంటే ఇలాంటి ఘోరాన్ని ఖచ్చితంగా జరగనిచ్చుండే వాడిని కాదు. నా ప్రాణాలర్పించైనా సరే ఆ ముష్కర మూకలను అడ్డుకుని ఉండేవాడిని”

వెంటనే ఆయనకు అమ్మవారి అశరీర వాణి ఇలా వినిపించింది.

“ఎవరో అజ్ఞానులు, నామీద నమ్మకం లేని వాళ్ళు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అయితే ఏమైంది? నీకు అంత ఖేదం ఎందుకు?”

“నువ్వు నన్ను రక్షిస్తున్నావా? లేక నేను నిన్ను రక్షిస్తున్నానా? పిచ్చివాడా! నేను కోరుకుంటే అద్భుతమైన ఆలయాలు లెక్కలేనన్ని నిర్మించుకోగలను. నేను తలచుకుంటే ఇప్పటికిప్పుడే ఇక్కడ ఏడంతస్తుల స్వర్ణ దేవాలయాన్ని నెలకొల్పగలను.”

ఆయన అక్కడ నుంచి తిరిగి రాగానే తన శిష్యులతో ఇలా అన్నాడు. ” ఆ క్షణంలో నా దేశభక్తి అంతా ఎటుపోయిందో తెలియదు. అసలు సర్వం మరిచిపోయాను. ఆమె ముందు నేనెంత? కేవలం ఒక పసి బాలుడను. అంతే!”

ఇది స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటన. ఇది చదువుతుంటే ఈ మధ్య చిన్నజీయర్ స్వామి తిరుమల ఆలయాన్ని క్లబ్బుతో పోల్చి చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి. ఆధ్యాత్మిక సాధన చేస్తున్న ఆయనలాంటి గురువులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా అనిపించింది అప్పట్లో. దానికి ఇక్కడ సమాధానం దొరికింది.

వానర రాజు

ఒకానొక కాలంలో హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు ఎనభై వేల సంఖ్యగల ఒక వానరజాతి నివసించేది. వాటన్నింటికీ బలశాలి, బుద్ధిశాలియైన ఒక వానరం రాజుగా ఉండేది. అవి నివసించే లోయ పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉండేది. అన్ని కాలాల్లో వాటి దాహార్తిని తీరుస్తూ, ఎండాకాలంలో చల్లదనాన్నిస్తూ జనావాసాల వైపుకు సాగిపోయేది. నది ఒడ్డునే మధురమైన ఫలాల్నిచ్చే ఒక చెట్టు ఉండేది. వసంత ఋతువు వచ్చిందంటే దాని పరిమళం ఆ లోయంతా వ్యాపించేది. ఎండాకాలం ఆ చెట్టు యొక్క దట్టమైన నీడ వానరాలన్నింటికీ ఎంతో ఆదరువు. శరదృతువు వచ్చిందంటే దాని ఘనమైన, తీయనైన పండ్లు వాటి ఆకలిని తీర్చేవి. అలా అవి ఆ చెట్టు నీడన సుఖంగా జీవనం సాగిస్తుండేవి.

కానీ వానరరాజు మాత్రం ఆ పండ్లను గురించి వేరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడమని వాటికి చెప్పేవాడు. అలా జరిగితే మానవులంతా వచ్చి వాటిని తరిమేస్తారని వానర రాజు భయం. కాబట్టి ఆ కోతులంతా తమ ప్రభువు చెప్పినట్లు ఆ పండ్లను మానవుల చేతిలో పడకుండా కాపలా కాస్తుండేవి. చెట్టు బాగా ఏపుగా ఎదిగేసరికి బాగా పెరిగిన కొమ్మలు నదీ ప్రవాహం మీదకు వాలి ఉండేవి. రాజాజ్ఞ మేరకు ఆ కోతులు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఆ కొమ్మల్లో పూత పూయగానే వాటిని తినేసేవి. మళ్ళీ తాము ఏమైనా పూత వదిలేసి ఉంటామేమోనని వేసవిలో కూడా పండ్లు ఉన్నాయేమో మరొక్కమారు పరికించేవి. ఆ విధంగా ఏ ఒక్కపండూ నీళ్ళలో పడి జనావాసాల వైపు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడేవి.


ఒకసారి కోతులు ఒక రెమ్మలో పూతను పొరబాటున వదిలేశాయి. వేసవిలో ఆ పండు కనపడకుండా ఆకులు కమ్మేశాయి. ఆ పండు బాగా పండి నదిలో పడిపోయింది. అలా కొట్టుకొని పోయి దూరంగా ఉన్న రాజు బ్రహ్మదత్తుని స్నాన ఘట్టం దగ్గర జాలర్లకు వలలో చిక్కింది. వాళ్ళు దాని పరిమాణాన్ని,పరిమళాన్ని చూసి అబ్బురపడి రాజుగారికి బహుమానంగా ఇస్తే మంచి ప్రతిఫలం దక్కుతుందన్న ఆశతో అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పండు రాజుకే గాక సభికులందరికీ ప్రీతిపాత్రమైంది. వారందరికీ ఇంకా తినాలనిపించింది. బ్రహ్మదత్తుడు వెంటనే ఆ పండు ఎక్కడ నుంచి వచ్చిందో వెంటనే కనుక్కోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.

ఆ పండు నదిలో దొరికింది కాబట్టి సైన్యాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళి వెతకమన్నాడు రాజు. కొన్ని రోజులకు వాళ్ళకి ఆ చెట్టు కనిపించింది. వాళ్ళు తిరిగి వచ్చి ఆ చెట్టు ఇంకా పండ్లతోనే నిండి ఉన్నదనీ, కానీ ఒక కోతిమూక వాటిని తింటూ ఉండటం చూశామని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అంతమంచి పండ్లు కోతుల పరం కావడమా? అని ఆలోచించి ఆ కోతులన్నింటినీ చంపివేస్తే తరువాత సంవత్సరం నుంచీ ఆ పండ్లన్నీ తమకే చెందుతాయని భావించాడు. కోతులు పారిపోకుండా ఒక భటుణ్ణి ఆ చెట్టుకు కాపలా పెట్టాడు.


కొన్ని కోతులు కొమ్మల చాటు నుంచి ఈ తతంగాన్నంతా తిలకిస్తున్నాయి. అవి ఎంతో బాధతో వచ్చి వానర రాజు దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. “మనం ఈ ఆపద నుంచి బయటపడేలా లేము. వేరే చెట్టు మీదకు వెళ్ళాలంటే చాలా దూరం. మనమంతా చనిపోతామేమో!” అన్నాయి.

వానర రాజు కొద్ది సేపు తమ పరిస్థితి గురించి ఆలోచించి ఒక పథకం వేసింది. “నేను బాగా బలిష్టంగా ఉన్నాను కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను.” అన్నది.

మరుసటి రోజు ఉదయాన్నే వానర రాజు ఒక్క ఉదుటున నదికి ఇవతల ఉన్న పండ్ల చెట్టు నుంచి నదికి అవతల ఉన్న మరో వృక్షం మీదికి దూకింది. ఆ వృక్షం యొక్క బలమైన, పొడుగ్గా ఉన్న ఊడని పట్టుకుని ఒక కొన బలమైన కొమ్మకు ముడివేసింది. మరో కొన తన కాలికి ముడివేసుకొన్నది. తిరిగి పండ్ల చెట్టు మీదకు లంఘించి ఓ కొమ్మని పట్టుకొంది. కానీ రెండు చెట్ల మధ్య కట్టడానికి ఆ ఊడ పొడవు సరిపోలేదు. ఇప్పుడు తన జాతిని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అలాగే కొమ్మని పట్టుకొని మిగతా వానరాలన్నింటినీ తన మీద నుంచి దాటి మరో చెట్టు మీదకి దూకి వాటి ప్రాణాలు రక్షించుకోమని కోరింది. కొన్ని గంటల పాటు ఆ ఎనభైవేల కోతులన్నీ ఆ రాజు మీదుగా దూకి నదికి అవతలివైపుకు చేరుకున్నాయి. చివరి కోతి దాటుకుని వెళ్ళేంత వరకూ తన శక్తినంతా కూడదీసుకుని పట్టుకుని ఉన్న రాజు చివరికి బాధతో మూలుగుతూ కిందపడిపోయింది. బ్రహ్మదత్తుడు ఈ శబ్దాన్నంతటినీ విని మేల్కొని ఉన్నాడు. తన ప్రజల కోసం ఆ వానర రాజు పడ్డ తాపత్రయమంతా కళ్ళారా చూశాడు. అది కింద పడిపోగానే సేవకుల్ని నీళ్ళు, నూనె తెచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించాడు.

“నువ్వు మీ ప్రజలను రక్షించడం కోసం చేసిన త్యాగం అమోఘమైనది.” బ్రహ్మదత్తుడు వానరరాజును ప్రశంసించాడు.

“వాళ్ళు నాయందు నమ్మకముంచారు. కాబట్టి నేను వారిని కాపాడి తీరాలి. వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక నిశ్చింతగా చనిపోవచ్చు. కానీ రాజా! ప్రేమ మాత్రమే నిన్ను గొప్ప రాజును చేస్తుంది. అధికారం మాత్రం కాదు.” అని చెప్పి అది కన్ను మూసింది.

వానర రాజు చనిపోతూ చెప్పిన ఆ మాటలు బ్రహ్మదత్తుడు ఎన్నడూ మరిచిపోలేదు. తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాడు. దానికోసం ఓ గుడి కూడా కట్టించాడు. అప్పటి నుంచి తన ప్రజలను కూడా అదే విధంగా పరిపాలిస్తూ గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు.

కాలుతున్న గుడిసె దేనికి సంకేతమో?

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ భగవంతుని రాకకో సంకేతం కావచ్చు.