పైరసీ పై చర్చ – నా వ్యాఖ్య

ఏవీయస్ గారి బ్లాగులో  పైరసీపై మంచి పాయింట్లు లేవనెత్తారు. అక్కడ చర్చను చూసిన తర్వాత నా అభిప్రాయాలు కూడా రాయాలనిపించింది. ఇదే వ్యాఖ్య అక్కడ కూడా పోస్ట్ చేశాను.

పైరసీని కళాకారులు,కళను అభిమానించే వారు ఎవరైనా ప్రోత్సహించడం మంచిది కాదు.కళనే నమ్ముకుని బతుకున్నవారికి అది ఆత్మహత్యా సదృశం కూడా. ఇక్కడ ఏవీయస్ గారు అదే విజ్ఞప్తి చేశారు. మంచిది.

కాకపోతే ఆ టపాలో గోడల మీద వాల్ పోస్టర్లు అంటిస్తున్న వాళ్ళ గురించి, సైకిల్ స్టాండ్లను నమ్ముకుని బతికే వాళ్ళ గురించి, పల్లీలు-సోడాలు అమ్ముకునే వాళ్ళ గురించి ప్రస్తావించారు. వాళ్ళను గురించి నాకు తోచిన విషయాలు కొన్ని…

ఒక వేళ అందరూ పైరసీ సీడీలు చూడ్డం మానేసి, థియేటర్లకు వెళ్ళే సినిమాలు చూస్తున్నారనీ తద్వారా సినీపరిశ్రమ మంచి లాభదాయకంగా నడుస్తున్నదనీ అనుకుందాం. అప్పుడు పైన చెప్పిన వాళ్ళకి ఒరిగేదేమైనా ఉందా?
వాల్ పోస్టర్లు అంటించే వారికి జీతం పెంచుతారా?
సినిమాను నమ్ముకున్న అనేక మంది కళాకారులకు నిర్మాతల, హీరోల లాభంలో వాటా పంచుతారా?
వాళ్ళ సమస్యలు వాళ్ళవే. వాళ్ళ బతుకులు వాళ్ళవే. పేద బతుకులు పేదవే.

సూటిగా చెప్పాలంటే ముందుగా కథానాయకులకు, నటులకు, దర్శకులకు చెల్లించే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తగ్గించి ఆ మిగులు సినిమాకు పనిచేసే ప్రతి చిన్న పనివాడికి ఇస్తే వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపిన వారవుతారు. పైరసీ కన్నా ముందుగా పరిష్కరించాల్సినదీ ఈ సమస్యను. దానికన్నా సులభంగా పరిష్కరింపబడేది కూడా ఇదే అని నా అభిప్రాయం.

ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పైజమాస్

సినిమా పోస్టరు
సినిమా పోస్టరు

ఇటీవల కాలంలో నేను చూసిన సినిమాల్లో బాగా నచ్చిన వాటిలో ఇది ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులపై నాజీ ఆకృత్యాలను చూపించే ఎన్నో సినిమాలు వచ్చాయి. నేను ఇలాంటి సినిమాలు టీవీలో వచ్చినప్పుడల్లా వాటిల్లోని హింస భరించలేక వెంటనే చానెల్ మార్చేసేవాణ్ణి. కానీ ఈ సినిమా కొద్దిగా చూడగానే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి చూడటం ప్రారంభించిన తర్వాత సినిమా ఆద్యంతం చూపు మరల్చనివ్వలేదు. అంత బాగా తీశారీ సినిమాని. సంభాషణలు కూడా చాలా సరళంగా ఉండటంతో కథంతా సులభంగా అర్థం అయింది. సినిమా అంతా బ్రూనో అనే ఎనిమిదేళ్ళ పిల్లవాడి చుట్టూ తిరుగుతుంటుంది.

బ్రూనో తండ్రి రాల్ఫ్ నాజీ సైన్యంలో పని చేస్తూ ఉంటాడు. బెర్లిన్ లో ఉండగా అతనికి  కమాండెంట్ గా పదోన్నతి లభించడంతో ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉండే నాజీ కాన్సెంట్రేషన్ క్యాంప్ కు మారాల్సి వస్తుంది. ఉన్నట్టుండి మిత్రులందర్నీ వదిలేసి వచ్చేయడంతో బ్రూనోకు కొత్త ప్రదేశంలో ఏమీ తోచదు. ఒంటరిగా ఇంటి చుట్టూ ఉన్న సెలయేళ్ళు, కొత్త ప్రాంతాలు అన్వేషిస్తూ కాలం గడుపుతుంటాడు. అలా చూస్తూ ఉండగా వారి ఇంటి వెనుక ఉన్న పెరట్లో చాలా దూరంగా ఉన్న కంచె ఒకటి కనిపిస్తుంది. అక్కడ సైనికులెవరూ కాపలా ఉండరు. అక్కడ అతనికి దాదాపు తన వయసులో ఉన్న ష్మూయెల్ అనే అబ్బాయి పరిచయమౌతాడు.

అప్పట్నుంచీ బ్రూనో తరచు అక్కడికి వచ్చి కంచె ఇవతల్నుంచే అతన్ని కలుసుకుంటూ ఉంటాడు. వచ్చేటపుడు ష్మూయెల్ కోసం ఇంటి నుంచి తినుబండారాలు తీసుకొని వస్తుంటాడు. అతనితో కలిసి ఆటలాడుతూ ఉంటాడు. మొదట్లో ఆ కంచె కావల ఉన్న స్థలం వ్యవసాయ క్షేత్రమేమోనని భావిస్తాడు బ్రూనో. కానీ  ష్మూయెల్ వాళ్ళు యూదులు కాబట్టి తననూ,  తన కుటుంబాన్ని అక్కడ బంధించారనీ, తమ చేత బలవంతంగా ఆ చారల పైజమా దుస్తులను ధరింపజేశారనీ తెలియజేస్తాడు. ఇంతకు ముందు దాకా ఇలాంటి నాజీల గురించి ఏమీ తెలియని బ్రూనో ఆశ్చర్యపోతాడు.

బ్రూనో, అతని అక్క గ్రెటెల్ కు చదువు చెప్పడం కోసం హెర్ లిస్ట్ అనే ఉపాధ్యాయుణ్ణి నియమిస్తారు. అతను చరిత్ర పేరుతో నాజీ జాతీయ వాదాన్ని నూరి పోస్తుంటాడు. అతను యూదుల గురించి చెప్పే నిజాలకూ బయట కనిపించే పరిస్థితులకు పొంతన కుదరక పోవడంతో అది బ్రూనోకు నచ్చదు. వాళ్ళ స్వంత ఇంట్లోనే యూదు సేవకుడిపై జరిగే దౌర్జన్యాలను కళ్లారా చూస్తాడు. ఆ సేవకుడు చనిపోవడంతో ష్మూయెల్ ను వాళ్ళ ఇంటిలో పనికి నియమిస్తారు. ఆకలితో మాడిపోతూ అక్కడ గ్లాసులు కడుగుతున్న అతణ్ణి చూసి బ్రూనో కరిగిపోయి బ్రెడ్ ముక్కలు ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి తండ్రి కింద పనిచేసే క్రూరుడైన సైనికుడు కోట్లర్ దాన్ని చూసి ఆగ్రహించి అతణ్ణి బ్రెడ్ దొంగిలిస్తున్నావా? అని అడుగుతాడు. దానికి ష్మూయెల్ బ్రూనో తనకు స్నేహితుడనీ ఆ కేక్ అతనే ఇచ్చాడని నిజం చెబుతాడు. అది నిజమా? కాదా? అని కోట్లర్ బ్రూనోను ప్రశ్నిస్తాడు. బ్రూనో అతనికి భయపడి అతనెవరో తనకు తెలియదని అబద్ధ మాడతాడు.

తర్వాత బ్రూనోకు కొద్ది రోజుల పాటు ష్మూయెల్  క్రమం తప్పకుండా కలుసుకునే  కంచె దగ్గర కనిపించడు. కొద్ది రోజులకు ష్మూయెల్ ముఖమ్మీద బలమైన దెబ్బలతో కంచె పక్కనే తలవంచుకుని కూర్చుని కనిపిస్తాడు. అతణ్ణి చూడగానే బ్రూనోకు ప్రాణం లేచి వస్తుంది. తాను తప్పు చేశాననీ, ఆ రోజు అతనికి భయపడి అబద్ధం చెప్పాననీ తనను క్షమించమని ష్మూయెల్ ను కోరతాడు. అందుకు అతను కూడా తిరిగి స్నేహ హస్తం అందిస్తాడు.

ఒక రోజు కోట్లర్ ఇంట్లో అప్పుడప్పుడూ వచ్చే దుర్వాసనను గురించి ఏదో మాట్లాతుండగా బ్రూనో తల్లి ఎల్సాకు  అసలు నిజం తెలుస్తుంది. తన భర్త నేతృత్వం వహిస్తున్నది లేబర్ క్యాంప్ కు కాదనీ, యూదులను క్రమంగా నాశనం చేయడానికి చేసే నరమేధానికనీ! అప్పట్నుంచీ భార్యా భర్తల మధ్య దాన్ని గురించే గొడవలు చెలరేగుతుంటాయి. కొన్ని రోజులకు ఇద్దరూ కలిసి తమ ఇద్దరు పిల్లలను అక్కడ ఉంచడం మంచిది కాదనీ, హేడెల్ బర్గ్ లో ఉంటున్న వాళ్ళ అత్తయ్య ఇంటికి తరలించాలని భావిస్తారు.

కానీ వాళ్ళు బయలు దేరడానికి ఒక రోజు ముందుగా ష్మూయెల్ తన తండ్రి కనబడ్డం లేదని బ్రూనోకు తెలియజేస్తాడు. తాను అక్కడ సాహసం చేయడానికి అదే ఆఖరి అవకాశంగా భావించిన బ్రూనో తర్వాతి ఉదయమే కంచె కింద ఒక గొయ్యి తవ్వి అవతలి వైపుకు చేరుకుంటాడు. అక్కడే ష్మూయెల్ తెచ్చిన ఖైదీ బట్టలను వేసుకుని అక్కడి నుంచి ఖైదీల క్యాంపు వేపు బయల్దేరతారు.

ఆ క్యాంపును చేరుకోగానే అక్కడ జరిగే ఘోరాలను, అమానుష కాండనీ కళ్లారా తిలకిస్తాడు బ్రూనో. కొన్నాళ్ళ క్రితం తన తండ్రి,  పై అధికారులకు చూపించిన  ఓ వీడియోలో ఈ ఖైదీలు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లుగా చూపించింది నిజం కాదని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి ష్మూయెల్ తండ్రి కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఆ వెతుకులాటలో ఇరువురూ గ్యాస్ చాంబర్ వైపు వెళుతున్న ఖైదీల మధ్యలో ఇరుక్కుపోతారు. మరో పక్క అతని తల్లి, అక్క అతని కోసం వెతుకుతూ వస్తుంటారు.  ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె భర్తకు తెలియజేస్తుంది. అతను సైనికుల సహాయంతో వెతుకుతూ ఉంటాడు.

ఖైదీల మధ్యలో చిక్కుపడి గ్యాస్ చాంబర్స్ కు చేరుకున్న బ్రూనో, ష్మూయెల్ కు షవర్ కోసం బట్టలు తీయవలసిందిగా ఆదేశాలు అందుతాయి. అందరూ షవర్ కోసమే అని అనుకుంటారు. కానీ నాజీ సైనికులు ఆ చాంబర్ ను మూసి వేసి విష వాయువును ఉత్పత్తి చేసేందుకు పౌడర్ ను పోసి ద్వారం మూసేస్తారు. రాల్ఫ్ పరిగెత్తుతూ అక్కడికి వచ్చేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది.

సామాజిక ‘వేదం’

నేను ఇటీవల చూసిన మంచి సినిమా, నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా వేదం. నిజానికి  నేను పదిరోజుల క్రితమే చూసినా రాయడానికి ఇన్ని రోజులకు కుదిరింది. ఈ సినిమా గురించి నాకు తోచిన నాలుగు మాటలు…

Spoiler Alert: ఒక వేళ మీరు ముందుగా కథ తెలుసుకోకుండా సినిమా చూడదలుచుకుంటే కింది భాగం చదవద్దు.

ఈ సినిమా నిజానికి ఒక కథ మీద ఆధారపడి తీసింది కాదు. ఐదు కథలు సమాంతరంగా నడుస్తూ ఒక చోట కలుస్తాయి. నాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను  తనదైన శైలిలో తెరకెక్కించాడు క్రిష్.  సినిమాలో నాకు అక్కడక్కడా కొన్ని  సన్నివేశాలున్నాయి అద్భుతంగా అనిపించాయి. ఉదాహరణకు కిడ్నీ అమ్మేసి  సంపాదించుకున్న డబ్బుల్ని రాములు దగ్గర్నుంచి అల్లు అర్జున్ లాక్కునే సీన్, వెంటనే వచ్చే సీన్ లో హీరోయిన్ ‘న్యూ ఇయర్ పార్టీకి పాసెస్ తీసుకున్నావా?’ అని అడిగితే చేతులో డబ్బులుంచుకుని ‘నా దగ్గర డబ్బుల్లేవనడం’ అనే సన్నివేశం నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశాలు.

వేశ్య పాత్రలో నటించిన అనుష్క నటన కూడా నాకు  బాగా నచ్చింది. ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో వేశ్య పాత్రలను ఆటవస్తువులుగా చూపిస్తే ఇందులో క్రిష్ వాళ్ళను ఓ సమాజంలో భాగంగా చూపిస్తూ వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం.

కానీ సినిమా సుఖాంతం కాకపోతే తెలుగు ప్రేక్షకులు సరిగా ఆదరించరని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకుల ధోరణిని మార్చే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.నాకు ముగింపు ఏ మాత్రం అసంతృప్తిని కలిగించలేదు. నాకే కాదు థియేటర్లోని మిగతా ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయినట్లు అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ చివర్లో చనిపోతూ సినిమాలో తన ఊతపదమైన ‘దీనమ్మ జీవితం’ అనగానే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున నవ్వులు విరబూశాయి. దీంతో దర్శకుడి కృషి ఫలించినట్లే అని చెప్పవచ్చు.

ఒకేసారి అన్ని కథలు కలగాపులగంగా నడుస్తుంటే సగటు ప్రేక్షకుడికి కొంచెం కన్ఫ్యూషన్ కలిగించక మానదు. కానీ ఈ రకం సినిమాలు ప్రయోగాత్మకంగా భావించాలి. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. మిమ్మల్నీ నిరాశపరచదని భావిస్తున్నాను.

డార్లింగ్ చూసొచ్చా..

కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఏ సినిమా చూద్దామా అని ఆలోచిస్తుంటే మా రూమ్మేటు డార్లింగ్ కి వెళదాం అన్నాడు. కరుణాకరన్ సినిమాలు కనీస గ్యారంటీ ఉంటాయి కదా అని సరిపెట్టుకున్నా. తీరా సినిమా కెళ్ళాక నన్ను ఏ మాత్రం సంతృప్తి పరచలేదు.

జయాపజయాలతో సంబంధం లేకున్నా ప్రభాస్ ఇప్పటి దాకా నటనలో నన్నెప్పుడూ నిరాశపరచలేదు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఆకట్టుకోలేదు. కథలో అక్కడక్కడా కనిపించే చిన్న చిన్న ఆసక్తికరమైన మలుపులు తప్ప కథనంలో ఎక్కడా నవ్యత లేదు.

సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ముక్కు మొహం తెలియని సంగీత దర్శకుడు. బయటకు వచ్చాక ఒక్క ట్యూన్ గుర్తుకు తెచ్చుకుందామన్నా గుర్తు రావడం లేదు. అలాగే అనంత శ్రీరామ్ పల్లవులు కూడా పెద్దగా ఆకట్టుకొనేలా లేవు. నటన చాలాచోట్ల కృతకంగా అనిపించింది. డ్యాన్స్ పెద్దగా లేదు.

అంతకంటే మించి ఈ సినిమా చూసింతర్వాత అసలు ప్రేమ అన్న పదం మీదే విసుగు పుట్టింది(ఇది కేవలం సినిమాల్లో ప్రేమ గురించి మితిమీరిన వాడకం పట్ల అని గమనించగలరు). అసలు ప్రేమ అనే పదం ఊసే లేకుండా ఒక సినిమా వస్తే చూడాలని ఉంది.