కథా సరిత్సాగరం

కథా సరిత్సాగరం

కథలు… ముఖ్యంగా ప్రాచీన జానపద కథలంటే ఇష్టపడేవారికి ఓ శుభవార్త! భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి.

నవరసభరితమైన ఈ కథల్ని సరళ తెలుగు భాషలో నవ్య తెలుగు వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. ఆ పత్రికలో రచయిత(త్రి) అనీలజ అని పేర్కొన్నారు. వారి అసలు పేరు ఎవరికైనా తెలిసుంటే చెప్పండి.

1920 ప్రాంతాల్లో సీ హెచ్ టౌనీ, ఎన్.ఎం పెంజర్ అనే ఇరువురు ఆంగ్ల రచయితలు కలిసి సోమదేవుడు రాసిన సంస్కృత రచనలను పది భాగాల్లో ఆంగ్లం లోకి అనువాదం చేశారు. ఆ పుస్తకాల పీడీఎఫ్ లు ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఉచితంగా లభ్యమౌతున్నాయి. ఈ పది పుస్తకాల లంకెల కోసం ఈ ఆంగ్ల వికీ పేజీ లోని References విభాగంలో చూడండి.

మరి ఇంకెందుకాలస్యం?…. జానపద కథా జగత్తులో విహరించండి!!

ప్రకటనలు

కృతజ్ఞత నిండిన మది గీతాలాపన చేస్తే

అతను ఓ అనాథ. ఓ బడి పక్కన అడుక్కుంటూ ఉంటాడు. ఊరూ తెలీదు, పేరూ తెలీదు. ఒంటి మీద మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు, కలుపు మొక్కల్లా ఎదిగిపోయిన జుట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే చూస్తునే అడుగు దూరం నుంచే తప్పుకుని వెళ్లే రూపం.

అలాంటప్పుడే ఓ పాప అతన్ని చూసి జాలిపడింది. అతన్ని తమ ఇంటికి తీసుకెళ్ళేదాకా ఒప్పుకోలేదు. ప్రాణంగా ప్రేమించే కూతురు అడిగిన కోరిక కాదనలేకపోయాడా తండ్రి. అలాగే అతన్ని ఇంటికి తీసుకెళ్ళి తమ ఇంట్లో పెట్టుకున్నారు.

కృతజ్ఞతతో నిండిపోయిన అతని మనసు పాడుకున్న పాటే ఇది. ఆకాశమంత సినిమా లోది. వేటూరి పద విన్యాసాలకో మచ్చుతునక. విద్యాసాగర్ మస్తిష్కంలో పురుడు పోసుకున్న భావగీతిక.

ఒకానొక ఊరిలో.. ఒకే ఒక అయ్య…

ఒకే ఒక అయ్యకు తోడు ఒకే ఒక అమ్మ…

ఒకే ఒక అమ్మ బిడ్డ ఒకే ఒక అమ్ము…

అది చూపుతోనే మాటలాడే కరుణ ఉన్న కన్ను..

చ: బంధాలే లేక కొందరు పిచ్చి వాళ్ళు అవుతారు. బంధాలే ఉండి అయ్య పిచ్చి ఎక్కిపోతాడు…

కాలేస్తే కందునని దోసిట్లో పెంచారు

ఎండకన్ను సోకకుండా గుండెల్లో దాచారు

పసిపాపే పసిపాపే ఉసురూ.. ప్రాణానికే ప్రాణాలనే ఇస్తారూ ఎదురూ…

చ: పురుగునే చూస్తే కొందరు పరుగు అందుకుంటారు

భూకంపమే వస్తున్నా అక్క పూమాలనే అల్లునుగా

పుట్టినది ఒక బిడ్డ… పుణ్యానికి ఒక బిడ్డ

ఇరుపాపల అల్లరికి మా అక్కే జోలాలిగా

ఈ అక్క మా ఇంటికి మిన్నా

మాయక్క మనసు ముందు హిమాలయం చిన్నా…

చ: పుడుతూనే తల్లులు కొందరు పుణ్యం కొని తెస్తారు..

మా పుణ్యం కొద్దీ మాకే వరాలనే ఇస్తారు..

వరమై మా యమ్మ మా కోసం రావమ్మా

చీమ జోలికెళ్ళదురా సింగంరా ఈ యమ్మ

మరలా ఓ జన్మంటే అడిగేస్తా ఓ వరమే

ఈ మాలక్ష్మికో ఆ మాతల్లికో పసిపాపనవుతా…

ఇండి పాప్ సంగీతంలో నిష్ణాతుడైన కైలాష్ ఖేర్ గొంతులో భావాలు బాగానే పలికినా అక్కడక్కడా వినిపించే ఉచ్ఛారణా దోషాలు తీయటి పాయసంలో మెంతిగింజల్లా తగులుతాయి. కానీ వింటుంటే తప్పక స్పందింపజేసే పాట.

వేటూరి అవార్డు పాటలు ఒకే చోట వినండి.

వేటూరి పరమపదించిన సందర్భంగా అవార్డులకే వన్నె తెచ్చిన ఆయన పాటలు ఒక చోట చేరుద్దామని ఈ చిన్న ప్రయత్నం వినండి. ఆయనకు మొత్తం ఎనిమిది నంది అవార్డులు, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు జాతీయ అవార్డు వచ్చాయి. ఈ 9 పాటల్ని పక్కన ఉన్న బాక్స్.నెట్ విడ్జెట్ లో వినవచ్చు. పాటను వినడానికి ఈ లింకు మీద నొక్కండి.

  1. మానసవీణ మధుగీతం – పంతులమ్మ
  2. శంకరా నాద శరీరా పరా – శంకరాభరణం
  3. బృందావని ఉంది – కాంచనగంగ
  4. ఈ దుర్యోధన దుశ్శాసన – ప్రతిఘటన
  5. పావురానికి పంజరానికి – చంటి
  6. ఆకాశాన సూర్యుడుండడు – సుందరకాండ
  7. ఓడను జరిపే ముచ్చట కనరే – రాజేశ్వరి కల్యాణం
  8. ఉప్పొంగెలే గోదావరి – గోదావరి

గర్భాలయం … హంపి నేపథ్యం లో నవల

హంపి
హంపి

హంపి యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత అంతర్జాలంలో హంపి గురించి ఏమైనా విశేషాలు ఉన్నాయేమోనని వెతుకుతుంటే గర్భాలయం అనే నవల రాసిన నండూరి శ్రీనివాస్ గారి బ్లాగు కనిపించింది. ఇది ఆయన మొదటి నవల. అయినా ఎక్కడా ఆ చాయలే కనిపించలేదు నాకు. ఇంతకు ముందు టపాలో హంపిలో విరూపాక్షాలయంలో తప్ప ఇంకెక్కడా పూజలు జరగడం లేదని ఊహించాను. ఈ నవల చదివాక రూఢి చేసుకున్నాను. అదే కాదు మిగతా దేవాలయాల్లో విగ్రహాలు లేవన్న విషయం కూడా స్పష్టం అయింది.

ఈ నవల స్వాతి మాసపత్రిక లో ప్రచురితమైంది. ఆయన Scribd లో అప్‌లోడ్ చేసి అక్కడికి లింకిచ్చారు. నవల చదవడం ప్రారంభించగానే  “ఈ నవల అసలు ఒక్కసారి చదివి హంపి యాత్రకు వెళ్ళుంటే బాగుండేదే” అనిపించింది. హంపి లోని ప్రదేశాలు అంత క్లియర్ గా వివరిస్తాడు అందులో.

ఇక కథ విషయానికొస్తే రాజు అనే యువకుడు అనాథగా పెరిగి చిల్లర మల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఒక ప్రొఫెసర్ సాయంతో బయటపడతాడు. ఆయన సాయంతోనే గైడ్ చేయడం నేర్చుకుని జీవనం గడుపుతుంటాడు రాజు. ఒక రోజు ఓ కుటుంబానికి  హంపిలో విశేషాలు వివరిస్తుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాడి తాలూకు ఎవరు  వెతికినా కనిపించకపోవడంతో తన ప్రియురాలైన మల్లి సాయంతో తనే చూసుకుంటూ ఉంటాడు రాజు.

రాజు తాను గైడింగ్ కి వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లవాణ్ణి వెంట తీసుకు వెళుతుంటాడు. వాడు ఏదైనా విశేషమైన ప్రదేశానికి తీసుకెళ్ళినప్పుడల్లా ఆశ్చర్యకరంగా ముద్దు ముద్దుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. రాజు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఉండగా ఆ పిల్లవాడి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. రాజు ప్రాణాలకు తెగించి వాణ్ణి కాపాడుతాడు.

ఇక మిగిలిన కథ అసలు ఆ పిల్లవాడు అంత చిన్న వయసులోనే అంత పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నాడు?  అతని తల్లిదండ్రులెవరు? అతన్ని చంపడానికి చూస్తున్నదెవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారనే సస్పెన్స్ తో సాగిపోతుంది.

చారిత్రక ప్రదేశాల నేపథ్యం, సైకో అనాలిసిస్, సస్పెన్స్  అంటే ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన నవల ఇది. ఇక్కడ చదవండి.