తెలుగు భాషా ప్రేమికులకు ఆహ్వానం

మీరు కంప్యూటర్లో తెలుగు చూడగలరా?

కంప్యూటర్ లో తెలుగు లో టైప్ చెయ్యగలరా?

మీ ఆన్‌లైన్ కార్యక్రమాలైన ఈ మెయిల్, చాటింగ్, సోషియల్ నెట్‌వర్క్స్, బ్లాగుల్లో తెలుగు వాడకం బాగా తెలుసా?

మొదటి సారి కంప్యూటర్లో తెలుగును చూసినప్పుడు మీరు ఎలాంటి ఆనందం అనుభవించారో అదే అనుభూతిని మరింత మందికి పంచండి!

ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా లో భారీ పుస్తక ప్రదర్శన జరగనుంది. గత రెండేళ్ళుగా ఈ-తెలుగు సంస్థ అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడికి ఆసక్తితో వచ్చే సందర్శకులకు కరపత్రాలు, ప్రదర్శనల ద్వారా కంప్యూటర్లలో తెలుగు వాడకం గురించి, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో లభ్యమౌతున్న తెలుగు వెబ్‌సైట్లు, తెలుగు భాషకు సంబంధించిన వివిధ ఉపకరణాల గురించి అవగాహన కలిగిస్తున్నది.

ఈ స్టాల్ లో సేవలు అందించేందుకు, సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు గురించి పరిచయం చేయడానికి  స్వచ్చంద సేవకులకు ఆహ్వానం పలుకుతున్నాము. ఈ ప్రదర్శన జరిగే పది రోజుల్లో ఎప్పుడైనా, ఎంత సమయమైనా స్టాల్ దగ్గరికి వచ్చి మీ సేవలందించవచ్చు. మీరు చేయవలసిందల్లా అక్కడికి వచ్చిన వారికి ఒక కరపత్రాన్ని అందజేసి కంప్యూటర్లలో సులభంగా తెలుగు చూడవచ్చు, రాయవచ్చు అని తెలియజెప్పడం మాత్రమే!

తెలుగుబాట పట్టండి

తెలుగు బాట చిహ్నం
తెలుగు బాట చిహ్నం

ఈనెల 29 ఆదివారం గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా కంప్యూటర్లలో, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తున్న e-తెలుగు సంస్థ ఆధ్వర్యంలో తెలుగు బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భాషాభిమానులు మీ బంధు మిత్రులకు ఈ కార్యక్రమం గురించి తెలియజేసి,  విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన.

మే 2010, e-తెలుగు సమావేశం విశేషాలు

సమావేశానికి హాజరైన వారు

 1. వీవెన్ – వీవెనుడి టెక్కునిక్కులు
 2. సుజాత – మనసులో మాట
 3. సతీష్ యనమండ్ర – సనాతన భారతి
 4. అరిపిరాల సత్యప్రసాద్ – జోకాభిరామాయణం
 5. రవిచంద్ర – అంతర్వాహిని
 6. ప్రవీణ్ – సాహిత్య అవలోకనం
 7. కృపాల్ కశ్యప్ – కబుర్లు
 8. శ్రీనివాస రాజు – శ్రీనివాసీయం
 9. శ్రీనివాస కుమార్ – జీవితంలో కొత్తకోణం
 10. ఎమ్మెస్ నాయుడు – ఎమ్మెస్ నాయుడు
 11. శ్రీహర్ష – కిన్నెరసాని

ఇంకా ఔత్సాహికులు సాయిరాం (జ్యోతిష శాస్త్రజ్ఞులు), శ్రీకాంత్ పాల్గొన్నారు.

చర్చకు వచ్చిన అంశాలు:

 • ముందుగా అరిపిరాల గారు, బ్లాగర్ల సమావేశం, e-తెలుగు సమావేశం మద్య నిర్దిష్టమైన విభజన రేఖ ఉండాలని సూచించారు. e-తెలుగు తరపున కథల పోటీ, అంతర్జాల అవధానం లాంటివి నిర్వహిస్తే సంస్థకు మరింత ప్రచారం చేకూరగలదని అభిప్రాయపడ్డారు.
 • e-తెలుగు తరపున చేపట్టబోయే రచయితల వర్క్‌షాప్ ఈ నెల 30 వతేదీన నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుతం ఇందులో వీవెన్, కశ్యప్, సుజాత, అరిపిరాల సత్యప్రసాద్, రవిచంద్ర, తదితరులు సభ్యులుగా ఉన్నారు.

 • ప్రస్తుతం అంతర్జాల మాద్యమంలో ఉన్న కొంత సాహిత్యం పత్రికల్లో వచ్చే సాహిత్యం కన్నా మంచి నాణ్యత కలిగి ఉండటం గమనించే ఉంటారు. వీటిని ముద్రణలోకి తీసుకెళ్ళేందుకు e-తెలుగు ఏమైనా చేయగలదా? అనే విషయం కూడా చర్చకు వచ్చింది.

ఈ నెల బ్లాగర్ల సమావేశం

హాజరైన వారు: సీబీ రావు గారు, నేను, చక్రవర్తి గారు, అరిపిరాల సత్యప్రసాద్ గారు.

ఒకరోజు సెలవు పెడితే నాలుగు రోజులు స్వస్థలంలో గడిపిరావచ్చనుకున్నారేమో చాలా మంది సమావేశానికి హాజరు కాలేదు. (బాబూ, మీరామాట చెప్పుంటే నేను కూడా ఎంచక్కా ఊరికి చెక్కేసుండే వాణ్ణి కదా! 🙂 )

హాజరైంది నలుగురమే.. కానీ మంచి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సత్యప్రసాద్ గారు ఇ-తెలుగు సభ్యులుగా చేరారు. ఇ-తెలుగు ద్వారా ఏమేం చేయవచ్చో కొన్ని సూచనలు కూడా చేశారు.

మైక్రోఫైనాన్స్ లో పనిచేస్తున్న అరిపిరాల గారు దాని గురించి మాకు చక్కటి విషయాలు తెలియజేశారు. ఇంకా కథా సాహిత్యం గురించి, కథలెలా రాయాలి ఇత్యాది విషయాల గురించి మాట్లాడుకున్నాం.

భారవితో భాసించిన e-తెలుగు సమావేశం

ఈ ఆదివారం జరిగిన e-తెలుగు సమావేశానికి విచ్చేసిన ప్రముఖ సినీ రచయిత జె.కె. భారవి తన అంతరంగాన్ని మాతో పంచుకున్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ చర్చలో సినిమా రంగంపై తనకున్న అభిప్రాయాల్ని నిష్కర్షగా, నిర్మొహమాటంగా వెల్లడించారు. సమాజంపై సినిమాల ప్రభావం గురించీ, సార్వజనీనమైన సినిమా కళ ద్వారా ప్రజలను మంచి మార్గంవైపు మళ్ళించాల్సింది పోయి, అర్థం పర్థం లేని చెత్తను ఉత్పత్తిని చేస్తున్నామంటూ వాపోయారు.తమ కుటుంబం ఏడు కార్లతో విలసిల్లిన స్థితి నుంచి, ఈ సమావేశానికి షేర్ ఆటో లో వచ్చేంత స్థితికి రావడానికి గల కారణాలు,  కన్నడంలో ఆయన సినీ ప్రస్థానాన్ని గురించి సంక్షిప్తంగా వివరించారు.ఒక్క మాటలో చెప్పాలంటే ప్రసార మాధ్యమాల ద్వారా మనకు తెలియనని కొత్త భారవిని మాకు పరిచయం చేశారు.

కేవలం భక్తి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు పరిచయమైన భారవి తన రచనలకున్న వైవిధ్యాన్ని కొన్ని కథలు, సంఘటనల ద్వారా పరిచయం చేశారు. సామాజిక స్పృహతో ఆయన చేసిన ఎన్నో సినిమాలు  సెన్సార్ కత్తెరకు బలయ్యాయనీ, తన భావప్రకటనా స్వేచ్ఛను హరించివేశారనీ, ఇవన్నీ ప్రచారంలోకి తీసుకురావడానికి బ్లాగులు అత్యుత్తమ సాధనంగా అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్ళు కేవలం రచయితగానే ఉండి తన సామాజిక భాద్యతను నిర్వహించాలనుకున్నాననీ, ఇప్పుడు e-తెలుగు ద్వారా తన బుర్రకు పట్టిన బూజు దులుపుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని సరికొత్త రీతిలో ప్రజల్లోకి వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేశారు. e-తెలుగు తలపెట్టిన, ప్రస్తుతం ప్రణాళికలో ఉన్న రచయితల వర్క్ షాపుకు తనవంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.

ఇంకా భవిష్యత్తులో e-తెలుగు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువవ్వాలని, అందుకు కార్యనిర్వాహకుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతను కూడా సభ్యులు వ్యక్తపరచడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బ్లాగర్లు: సీబీ రావు గారు, చదువరి గారు, సుజాత గారు, చక్రవర్తి గారు, సతీష్ గారు, కశ్యప్ గారు, శ్రీనివాస కుమార్ గారు.

ఫలప్రదమైన వారాంతం

ఈ తెలుగు బ్యాడ్జీ
నా ఈ తెలుగు బ్యాడ్జీ

ఈ శనివారం, ఆదివారం భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన ఈ-తెలుగు స్టాల్ లో వాలంటీర్ గా ఉన్నాను. సందర్శకులకు కంప్యూటర్లలో తెలుగు వాడకం గురించి తెలియజేయడం మా ప్రధాన లక్ష్యం. సందర్శకుల తాకిడి బాగా ఉండటంతో మంచి ఉత్సాహంతో వివరించాము. కొందరు ప్రముఖులు కూడా ఈ తెలుగు స్టాల్ ను సందర్శించడంతో మాకు మరింత బలాన్నిచ్చింది. అంతే కాకుండా పుస్తకం ర్యాలీ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ప్రముఖులు చుక్కా రామయ్య గారికి, హాస్యనటులు జెన్నీ గారికీ, పరుచూరి వెంకటేశ్వర రావు గారికీ, టీవీ 9 రవిప్రకాష్ గారికి స్వయంగా ఈ తెలుగును గురించి వివరించడం ఇంకో మరుపురాని అనుభవం.

ఇప్పటి దాకా కేవలం బ్లాగుల ద్వారానే పరిచయమైన చాలా మంది బ్లాగర్లను వ్యక్తిగతంగా కలుసుకోవడం మరో విశేషం.  మా బాధ్యతలన్నీ నిర్వహిస్తూ కూడా మధ్యలో ఎన్నో సరదాల సరిగమలు నాకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాలా కాలం తర్వాత వారాంతం ఫలప్రదంగా గడిపినందుకు సంతోషంగా ఉంది.

బ్లాగర్ల సమావేశం విశేషాలు

గత ఆదివారం హైదరాబాద్ లోని కృష్ణకాంత్ ఉద్యానవనంలో తెలుగు బ్లాగర్ల సమావేశానికి హాజరయ్యాను. దాని విశేషాలు ఇది వరకే కొద్ది మంది రాశారు. కానీ నా మాటల్లో మళ్ళీ

ఇది వరకు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తే ఒక పావు గంట ముందుగా వెళ్ళే వాణ్ణి. కానీ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఖాళీ వేదికలు వెక్కిరిస్తుండటంతో ఈ సారి వీఐపీలాగా ఒక పావుగంట లేటుగా వెళ్దామని వెళ్ళాను. అయితే అప్పటికే ఓ పది మంది కూర్చుని ఉన్నారు.

నాకు ఇది వరకే పరిచయం ఉన్న చదువరి గారు మొదలైనవాళ్ళు కనిపించారు. వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళే అయినప్పటికీ కొద్ది మంది బ్లాగు ద్వారా పరిచయమైన వారు కనిపించారు. కొద్ది సేపటి తర్వాత పరిచయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఇవి అయిపోగానే ఈ-తెలుగు అధ్యక్షులు దుర్వాసుల పద్మనాభం గారు ఈ సంవత్సరం పీపుల్ ప్లాజాలో జరగబోయే ఈ-తెలుగు స్టాల్ కు వాలంటీర్ల సహాయాన్ని కోరారు. ఈ తెలుగు సెక్రటరీ కశ్యప్ గారికి తమ సౌలభ్యాన్ని తెలియబరచాల్సిందిగా కోరడం జరిగింది. తరువాత సుజాత( మనసులోమాట బ్లాగరి) గారు బ్లాగర్ లో కామెంట్స్ లో తాను ఎదుర్కొంటూన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఇంకా కొన్ని టెక్నికల్ విషయాల గురించి కూడా చర్చ జరిగింది.

అయితే తెలుగు బ్లాగర్ల దినోత్సవం అనగానే ఎక్కువ మందిని వ్యక్తిగతంగా కలవచ్చనే ఆశతో వచ్చిన వాళ్ళు కొంతమంది నిరాశ చెందడం కనిపించింది, నాతో సహా 🙂

సమావేశం ముగిసిన తర్వాత అందరూ గుంపులుగా చేరి కాఫీ తాగుతూ కాసేపు కొన్ని తెలుగు బ్లాగుల పోకడలపై( ఏ బ్లాగులు అని మాత్రం అడక్కండి : అవి మీకు తెలుసు! నాకు తెలుసు!!) ) సరదా సరదా కబుర్లు చెప్పుకున్నాం. సుజాత గారు ఇంటికి వెళుతూ తన కార్లో నాకు లిఫ్టిచ్చారు. థాంక్స్ సుజాత గారూ!!!”

సమావేశానికి హాజరైన వారు:

దుర్వాసుల పద్మనాభం గారు, సీబీరావు గారు, వీవెన్ గారు, చదువరి గారు, చక్రవర్తి గారు, రవిగారు, సుజాత గారు, వెంకటరమణ గారు, విజయ్ శర్మ గారు, రాజన్ గారు, అజయ్ గారు, క్రిష్ణ కిషోర్ గారు, కోడిహళ్ళి మురళిమోహన్ గారు, కశ్యప్ గారు, మురళీధర్ గారు, సుజ్జి గారు, శ్రీనివాస రాజు గారు, శ్రీనివాస కుమార్ గారు, ఆంధ్రలేఖ నుంచి ప్రతినిథి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

వీరి బ్లాగుల వివరాలకోసం విజయశర్మ గారి టపా చూడండి.