బెంగుళూరు జీవితం కొన్ని అనుభవాలు

బెంగుళూరుకు వచ్చి దాదాపు మూడు నెలలవుతోంది. నాకు ఎదురైన అనుభవాలతో ఓ టపా వేద్దామంటే ఇప్పటికి కుదిరింది. భాష చాలా వరకు సమస్య కాలేదు. అచ్చ కన్నడిగుడైనా తెలుగులో సహాయం అడీగితే తెలిసీ తెలియని తెలుగులో అయినా సమాధానం చెప్తారు. హైదరాబాదులో ఆటో డ్రైవర్లు కొంతమంది తెలుగు తెలిసినా హిందీ లోనే మాట్లాడేవారు కొన్ని చోట్ల. కానీ ఆటో చార్జీలు బాగా ఎక్కువ. షేరింగ్ ఆటోలు ఎక్కడా కనిపించవు. బెంగుళూరు కన్నడ దేశమే అయినా అందులో ప్రాంతీయులు కేవలం 24% మాత్రమేనట. మిగిలిన వారిలో 20% తమిళులు, 16% తెలుగు వాళ్ళు, 12% మలయాళీలు, 12% మిగతా భారతీయులు, 9% యూరోపియన్లు ఉన్నారట.

హైదరాబాదు నుంచి ఇక్కడికి రాగానే తేడా తెలిసింది అక్కడికన్నా కొంచెం ఇరుకైన రోడ్లు. కానీ ట్రాఫిక్ లో వాహన చోదకులకు కొంచెం క్రమశిక్షణ ఉందిక్కడ. కొద్దిసేపాగితే ఎంతో కొంత ముందుకు సాగుతుందని కొద్ది ఆశ ఉంటుంది. హైదరాబాదు లో అలా కాదు. ఒక్కోసారి ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే వాహనం దిగి నడిచి వెళ్ళిపోతే తొందరగా గమ్యస్థానం చేరుకోవచ్చు.

బస్సుల్లో రద్దీ అక్కడా ఇక్కడా దాదాపు ఒకటే కాకపోతే ఇక్కడ ఏసీ బస్సులు చాలా ఎక్కువ. బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువే. దగ్గర స్టాప్ లకైతే కండక్టర్లు చిల్లర తీసుకుని టిక్కెట్టివ్వకుండా నింపాదిగా వెళ్ళిపోతుంటారు. ఈ విషయంలో హైదరాబాదు కండక్టర్లు చాలా నిజాయితీపరులేమో. హైదరబాదులో నేనున్న మూడేళ్ళలో అలాంటి అనుభవం నాకెప్పుడూ ఎదురు కాలేదు.

ఇక పోతే ఈ మధ్యనే ఓ మెయిల్లో చదివాను. బెంగుళూరు లో మూడు విషయాలకు బాగా పేరు గాంచిందట. ఒకటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, రెండు అమ్మాయిలు, మూడు కుక్కలు. అలాంటిదే మా స్నేహితుడు కూడా మరో విషయం చెప్పాడు. ఇక్కడ ఓ రాయి పైకి విసిరితే అది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీదన్నా పడుతుందంట లేదా ఒక కుక్క మీదన్నా పడుతుందంట!.

ఇంటి అద్దెలు హైదరాబాదు కన్నా కొంచెం ఎక్కువే. నాకు మా కొత్త ఆఫీసు సహోద్యోగుల సహాయంతో కాస్త తక్కువ అద్దెకే ఇల్లు దొరికింది. ఆఫీసుకు చాలా దగ్గర. ఎంత దగ్గరంటే రోజూ మధ్యాహ్నం ఇంటికెళ్ళి భోంచేసి వస్తుంటాను. బెంగుళూరు రాగానే ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోవాల్సింది ఓ గొడుగు. వాన మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. వాన వస్తుందని బయటికి వెళ్ళడం వాయిదా వేసుకున్నారంటే అసలు బయటికి వెళ్ళలేం. మెట్రో పనుల వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ మందకొడిగా సాగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్లంతా బురదమయం.

ఇకపోతే ఈ ఆదివారం ఈనాడు పుస్తకంలో చదివాను. మన హైదరాబాదులో మెట్రో కేవలం నాలుగేళ్ళలోనే పూర్తి చేస్తామని ఎల్ అండ్ టీ వాళ్ళు అన్నారట. ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. ఇక్కడ నాలుగేళ్ళ ముందే ప్రారంభించినా కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాధ్యమైందట. అదే జరిగితే బెంగుళూరుకన్నా హైదరాబాదు ప్రజా రవాణా వ్యవస్థ ఖచ్చితంగా మెరుగవుతుంది.

షాపింగ్ విషయానికొస్తే మన హైదరాబాదులోని కోఠీ, సుల్తాన్ బజార్, బేగంబజార్ ను పోలిన ప్రదేశం ఒకటుంది. అదే శివాజీ నగర్ కు దగ్గర్లో ఉన్న కమర్షియల్ స్ట్రీట్. గత శనివారం అక్కడికి వెళ్ళినప్పుడైతే అచ్చం హైదరాబాదులో తిరుగాడుతున్నట్లే అనిపించింది.

బండి సవారీ

అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. దసరా సెలవులిచ్చారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే బలే కుశాల నాకు.

సరిగ్గ అప్పుడే వానాకాలం. వానాకాలమొస్తే మా ఊరికి బస్సులుండవు. ఎందుకంటే మా ఊరికీ కాళహస్తికీ మధ్య ఓ చిన్న ఏరు అడ్డం. వానలకి అది రోడ్డు మీదకి పొంగి పొర్లుతుంది. బస్సులు సెలవు తీసుకుంటాయి. వానలు తగ్గినా దానిమీద కట్టుండే చిన్న వంతెన (సప్పెట అంటారు) కొట్టుకు పోతుంది. దాన్ని తిరిగి బాగు చేసేదాకా మాకు బస్సులుండవు.

మరి అమ్మమ్మోళ్ళ ఊరికి పోవాలంటే కాలినడకే గతి. చెట్లెంబట, పుట్లెంబట అడ్డం దొక్కోని పోవడమే. కొద్ది దూరం రోడ్డు మీద వెళితే బండి బాట మాత్రం ఉండేది.

అదృష్టవశాత్తూ అప్పుడే మా చిన్నాన్న, మా మామతో కలిసి  మా అమ్మమ్మ వాళ్ళకి తుమ్మ కట్టెలు (వంటకి వాడేందుకు) ఎడ్ల బండి మీద వేసుకుని వెళుతున్నాడు.

మా అమ్మేమో బండి మీద ప్రయాణం వద్దనింది. నేను మాత్రం వెళ్లాల్సిందేనంటూ మారాం చేశాను. అమ్మ ఒప్పుకోక తప్పింది కాదు.

ప్రయాణం మొదలైంది. బండి నిండా ఎత్తుగా కట్టెలు పేర్చారు. కట్టెల పైన  ఓ తుండుగుడ్డ పరిచి నన్నక్కడ కూర్చోబెట్టారు.

మా చిన్నాన్న బండి నొగ  మీద కూర్చుంటే మా మామ బండి వెనకాలే నడుస్తూ వస్తున్నాడు. ఉదయపు నీరెండలో నెమ్మదిగా సాగుతోంది మా ప్రయాణం. కట్టెల బరువుకు మెత్తటి బండి బాటలో నింపాదిగా అడుగులు వేస్తూ కదులుతున్నాయి ఎద్దులు.

కొద్ది దూరం వెళ్ళగానే బండి తారు రోడ్డు మీదకు ఎక్కింది. లాగడం సులభం కావడంతో ఎద్దులు నెమ్మదిగా వేగం పుంజుకున్నాయి.

మరి కొంచెం దూరం వెళ్ళగానే తారు రోడ్డు దిగి మళ్ళీ బండి బాటలోకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి దాకా సులభంగా లాక్కొచ్చేస్తున్న ఎద్దులు మళ్ళీ గతుకుల బండి బాటలోకి దిగాలనేసరికి మొరాయించడం మొదలు పెట్టాయి.

“ప ప్పా… డిర్ర్ ” గట్టిగా అదిలించాడు మా చిన్నాన్న. ఉహూ కదల్లేదు. ముల్లుగర్ర తో పొడిచాడు. కొంచెం చలనం వచ్చింది. ఎలపటి ఎద్దుని మా చిన్నాన్న, దాపటి ఎద్దుని మా మామ తోక పట్టి గట్టిగా మెలేశారు.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా పక్కకు తిరిగాయి ఎద్దులు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే బండి నెమ్మదిగా వాలి తిరగబడింది! ఎద్దులు పక్కకు తప్పుకున్నాయి.

ముందు నేను, నా పైన కట్టెల మోపులు, దాని పైన బండి! మా చిన్నాన్న కి, మామ కి ఏం చేయాలో పాలుపోలేదు.

ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి నా తల భాగం, భుజాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. చెరో చెయ్యి పట్టుకుని నెమ్మదిగా బయటికి లాగారు.

చిన్నతనంలో సహజంగా కనిపించే భయం నా మొహంలో ఏ మాత్రం  కనిపించలేదు. అంతకంటే విచిత్రమైన విషయం నా ఒంటిమీద ఎక్కడా ఒక్క గాయం కానీ, రక్తం కానీ కనిపించలేదు. శరీరం లో ఏ భాగంలో కూడా చిన్న నొప్పి కూడా తెలియలేదు.

“హమ్మయ్య ఏ దేవుడో మనందుణ్యాడు బో…” వాళ్ళిద్దరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంక నన్ను పక్కన కూర్చోమని ఒక అర్ధ గంటలో వాళ్ళిద్దరూ కొన్ని మోపులు దీసి పక్కనేసి బండి పై కెత్తి మళ్ళీ నింపేసినారు.

ఆ సంఘటన వల్ల షాక్ తోననుకుంటా మిగతా ప్రయాణమంతా మేం పెద్దగా మాట్లాడుకోనేలేదు. పైకి కనిపించలేదు గానీ వాళ్ళిద్దరూ లోలోన చాలా భయపడిపోయారు. ఎందుకంటే మా అమ్మనాన్నలకి నేను లేక లేక కలిగిన కొడుకుని. ఏమన్నా అయ్యుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అని తెగ ఆలోచనలో పడిపోయామని నాకు తరువాత చెప్పారు. ఈ సంఘటన చాలా రోజుల వరకు మా ముగ్గురి మధ్యనే ఉండిపోయింది.

తర్వాత ఒక రోజు నేనే అందరికీ చెప్పేశాను. ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

మా అమ్మ, అమ్మమ్మ మాత్రం “మనం నమ్ముకున్న దైవం మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది నాయనా, కాబట్టి ఎప్పుడు నీకు కష్టకాలం వచ్చినా భగవంతుణ్ణి తలుచుకో. నీకు ప్రశాంతత చేకూరుతుంది” అనే జీవిత సత్యాన్ని తెలియజేశారు.

మనసును దోచే మున్నార్

“మీ సాఫ్ట్‌వేరోళ్ళు ఎప్పుడూ ఇంతేనంటగా. మా ఫ్రెండ్ చెప్పింది. పట్టుమని పది రోజులు కూడా ఇంటి దగ్గర ఉండరట. ఎప్పుడు చూసినా ఆఫీసు, పనులు అంటూ ఉంటారంట. ఇంక మన హనీమూన్ అయినట్టేలే” పెళ్ళికి తీసుకున్న మూడు వారాల సెలవులు అయిపోయి నేను తిరిగి హైదరాబాద్ వచ్చేస్తుండగా మా శ్రీమతి నాపై విసిరిన విసుర్లు.

“నీకెందుకు? ఈ డిసెంబర్ లోపల హనీమూన్ నేను ప్లాన్ చేస్తాగా” అని అభయమిచ్చి  వచ్చేశాను.

ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల దీపావళికి ముందు మూడు రోజులు సెలవు పెడితే మొత్తం తొమ్మిది రోజులు సెలవులు కలిసొచ్చాయి. వీటిలో ఓ ఐదు రోజులు మున్నార్ లో, నాలుగు రోజులు దీపావళికి ఇంట్లోను ఉండేలా పథకం వేసుకున్నా.

ముందుగా హైదరాబాద్ నుంచి మా ఊరు శ్రీకాళహస్తికి వెళ్ళి, అక్కడ నుంచి మా ఆవిడని తీసుకుని రేణిగుంట నుంచి ఎర్నాకుళం దాకా దాదాపు పదమూడు గంటలపాటు రైలు ప్రయాణం. ఎర్నాకుళం లో బీటెక్ లో మా లెక్చరర్ జయరాం గారు మాకు అక్కడే ఓ హోటల్లో బస, అక్కడ నుంచి అతిరిపల్లి జలపాతం చూసేందుకు ఓ కారు ఏర్పాటు చేశారు. ఈ జలపాతం దగ్గర చాలా సినిమా షూటింగులు కూడా జరిగాయట. చాలా ఎత్తైన జలపాతం. పాల నురగ లాంటి స్వచ్చమైన నీరు పై నుంచి అలా జాలువారుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి. బాగా ఎత్తైన ప్రదేశం నుంచి ఎక్కువ నీళ్ళు కింద పడటం వల్ల తుంపర్లు చాలా దూరం వరకూ పడుతూ ఉంటాయి. లెన్స్  మీద నీళ్ళు పడకుండా ఉండాలంటే కొంచెం దూరం నుంచే ఫోటోలు తీయాలి.


కమల్ హాసన్ సినిమా డ్యాన్స్ మాస్టర్ లో మొదట హీరో, హీరోయిన్లు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. అది ఇక్కడే చిత్రీకరించారు. ఇటీవల సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలో ‘మన్మథుడే బ్రహ్మను పూని‘ అనే పాటలో కొంత భాగం కూడా ఇక్కడే చిత్రీకరించారు.

అక్కడి నుంచి సాయంత్రానికి మళ్ళీ ఎర్నాకుళం తిరిగొచ్చేసి మరుసటి రోజు మున్నార్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే మరుసటి రోజుకు మున్నార్ లో ఓ హోటల్ కూడా బుక్ చేసుకున్నాం. రాత్రి అక్కడే పడుకుని మరుసటి రోజు మున్నార్ కు కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం. ఎర్నాకుళం నుంచి మున్నార్ కు ప్రతి అర్ధ గంటకూ ఓ బస్సుంది. మొత్తం నాలుగున్నర గంటల ప్రయాణం. చాలా వరకు ఘాట్ రోడ్డు ప్రయాణమే. చల్లటి వాతావరణం. అంబరాన్ని చుంబిస్తున్నట్లుండే పర్వత శిఖరాలు, వాటితో పోటీ పడుతూ మబ్బుల్లోకి దూసుకెళ్ళినట్లనిపించే చెట్లు  చూసేవారికి కనువిందు కలిగించక మానవు.

మున్నార్ సుందర దృశ్యాలు వీక్షించాలంటే అక్కడి నుంచి మూడు మార్గాలున్నాయి. ఒకటి ఎర్నాకుళం వైపు, రెండోది కొడైకెనాల్ వైపు(సుమారు 60 కి.మీ), మూడోది కోయంబత్తూర్ వైపు. ప్రసిద్ధి చెందిన ప్రదేశాలన్నీ ఈ మార్గాల్లోనే  ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన దక్షిణభారతదేశంలోనే ఎత్తైన పర్వతశిఖరం అనైముడి కోయంబత్తూర్ వెళ్ళే మార్గంలో వస్తుంది.


మున్నార్ లో ఎటు చూసినా పచ్చదనమే. వీటిలో తొంభై శాతం టాటా వారి ఆధ్వర్యంలో నడిచే తేయాకు, కాఫీ తోటలే. మేం చూసిన ముఖ్యమైన ప్రదేశాలు పోతంబేడు వ్యూ పాయింట్, మాటుపెట్టై డ్యామ్, ఏనుగులు వచ్చే చోటు, కుండేల్ సరస్సు, టాప్ స్టేషన్, లక్కోం జలపాతం, బ్లాసమ్ పార్క్. కోయంబత్తూర్ కు వెళ్లే దారిలో ఎర్రచందనం అడవులు, వెదురు చెట్లు, వన్యమృగాలు దర్శనమిస్తాయి. మున్నార్ లో సాధారణంగా ఎప్పుడూ బాగా వర్షాలు పడుతుంటాయట. కానీ మేం వెళ్ళిన రెండు రోజులూ అదృష్టవశాత్తూ వర్షం ఏమీ పడలేదు. వాతావరణం కూడా పెద్దగా చలిగా లేకుండా ఆహ్లాదకరంగా ఉంది.

మున్నార్ నుంచి కారు అద్దెకు తీసుకోవాలంటే ఖర్చు అనుకునేవారు సెవెన్ సీటర్ ఆటోలు, జీపులు కూడా అద్దెకు మాట్లాడుకోవచ్చు. మొదటి రోజు కొచ్చిన్ వైపు వెళ్లేదారిలో ప్రదేశాలు చూశాం. రెండో రోజు కొడైకెనాల్ దారిలో వచ్చే ప్రదేశాల్ని కవర్ చేశాం. మూడోరోజు సాయంత్రం కోయంబత్తూర్ లో మేం కోయంబత్తూర్ లో రైలు ఎక్కాల్సి ఉంది. ఉదయాన్నే హోటల్ ఖాళీ చేసేసి కోయంబత్తూర్ వైపు వెళుతూ దారిలో చూడాల్సిన ప్రదేశాలు కవర్ చేసేశాం.

అప్పటి దాకా కేరళ God’s own country గా వినడమే కాక చూసింది లేదు. అలాంటి ప్రదేశానికి మేమిద్దరం మొదటి సారి కలిసి వెళ్ళడం మా ఇద్దరికీ మరిచిపోలేని అనుభూతి మిగిల్చింది.


పెళ్ళి ముచ్చట్లు

పెళ్ళి చేసుకుని తిరిగొచ్చి ఆరు రోజులౌతుంది. టపా రాయడానికి ఇప్పుడు తీరిక చేసుకుంటున్నా.

వెళుతూ వెళుతూ ఆహ్వానం టపా రాసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఓ నెల పాటు బ్లాగు వైపు చూడనే లేదు.

ముందుగా ఆ టపాలో శుభాకాంక్షలందజేసిన ఆత్మీయ మిత్రులు  రిషి, యజ్ఞవల్క, యనమండ్ర, మాలా కుమార్, సునీత, దుర్గేశ్వర, రంజని, జాన్ హైడ్, సుజాత, హరే కృష్ణ, వల్లభ, తెలుగిల్లు, శ్రావ్య వట్టికూటి, నేస్తం, క్రిష్ణ, అనుపమ, శీను, క్రిష్ణమోహన్, స్నిగ్ధ, సుధాకర బాబు, నెలబాలుడు గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ అందరి ఆశీస్సులతో పెళ్ళి బాగా జరిగింది. ముహూర్తం సమయం 10-11 మధ్యనే కావడంతో కార్యక్రమాలన్నీ హడావిడిగా జరిపించేశాడు మా పంతులు. తీరా నన్ను పెళ్ళికొడుకుని చేసే సమయానికి నేను పట్టుబట్టి మరీ తెప్పించుకున్న పట్టుపంచ ధోవతి లాగా కట్టే వాళ్ళే కరువయ్యారు. ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు కదా ఎవరో ఒకరు కడతార్లే అనుకున్నా. చివరికి అడ్డ పంచె లాగా కట్టుకోవడానికి ఉద్యుక్తుడనవుతుండగా పక్కనే ఉన్న ఒక షాపు నుంచి ఒకాయన దేవుడు పంపించినట్లు వచ్చి ధోవతి కట్టేసి వెళ్ళిపోయాడు.

దాదాపు రాత్రి ఒంటి గంటయ్యే సమయానికి కార్యక్రమాలన్నీ పూర్తైపోయాయి. అప్పుడు గుడికి వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుందామంటే గుడి మూసేసి ఉంది. గుడి ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు. అప్పటి దాకా మేలుకుని ఉండి పెళ్ళిబట్టలతో గుడికెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదని పంతులుగారు సలహా ఇచ్చారు.

ఇక అప్పుడు మొదలయ్యాయి మా కష్టాలు. ఓ వైపు పెళ్ళి కొచ్చిన బంధువులంతా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వెళ్ళిపోయారు. చివరికి మేమిద్దరమే మిగిలాం. ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఎలాగోలా కునుకు తీయకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి అప్పటి దాకా ఆమోదించిన వర్షం ఒక్కసారిగా ప్రారంభమైంది. కొత్త దంపతులు వర్షంలో తడవకూడదని చెప్పారు. మళ్ళీ ఓ గంటసేపు వర్షం తగ్గేదాకా అలాగే ఎదురు చూశాం. ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఇంటికి వెళ్ళాం. స్నానం చేసి బెడ్ మీద పడితే ఎలా నిద్ర పట్టిందో కూడా గుర్తు లేదు.

నిరుడు మా గృహ ప్రవేశం జరిగినప్పటి నుంచీ వాయిదా పడుతూ వస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతం మా నవదంపతుల చేతుల మీదుగా జరగాలని ఉందేమో, మరుసటి ఆదివారం కుదరడంతో జరిపించేశాం.  ఇక ఆ తర్వాత విందులూ, వినోదాలూ మామూలే కదా… అలా జరిగిపోయింది.

ఆహ్వానం

ప్రతి మనిషి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం పెళ్ళి. నా జీవితంలో ఆ శుభ ఘడియలు సమీపిస్తున్న వేళ తెలుగు బ్లాగర్లందరికీ ఇదే నా ఆహ్వానం.

ఆహ్వానం
ఆహ్వానం

గమనిక: ఈ రోజు సాయంత్రం నుంచి నేను సెలవులో వెళుతున్నందున ఈ బ్లాగుకు ఓ నెలరోజుల పాటు విరామం. మళ్ళీ కలుసుకుందాం.

ప్రయాణంలో పదనిసలు

గతవారం నా నిశ్చితార్థం కోసం మా ఇంటికెళ్ళాను. తిరిగొచ్చేటపుడు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. రైలు రావడానికి ఇంకా అర గంట సమయముంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. అప్పుడు గుర్తొచ్చింది శుక్రవారం నిశ్చితార్థం ఫంక్షన్ లో తన దగ్గర తీసుకున్న ఫోన్ నంబర్ గురించి. రెండు రోజులైనా ఫోన్ చేయలేదు. ఏమనుకుంటూ ఉంటుందో ఏమో!

ఫంక్షన్ నుంచి వచ్చిన వెంటనే ముందు రోజు ప్రయాణం వల్ల నిద్ర ముంచుకొచ్చేస్తుండటంతో పడుకుండిపోయాను. మరుసటి రోజు తీరిగ్గా ఫోన్ చేద్దామనుకుంటుంటే మా చిన్నాన్న పొలంలో పని చేస్తుంటే పాము కరిచిందని తెలియడంతో ఆ హడావుడిలో పడి ఫోన్ చేయడమే మరిచిపోయాను.

ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నా.

“హ్మ్మ్ ఇప్పటికి గుర్తొచ్చిందన్న మాట…” అటు వైపు నుంచి సమాధానం..

“అసలేం జరిగిందంటే…” నా వైపు నుంచి వివరణ… ఇదే మొదలు… ఇంక అది అనంతంగా సాగిపోతుందనుకుంటా… 🙂

కాబోయే జీవిత భాగస్వామితో మొదటి సారిగా మాట్లాడుతుంటే బాహ్య ప్రపంచంతో సంబంధం ఉంటుందా ఎవరికైనా? నాక్కూడా అంతే…:)

అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ బెంచీ దగ్గరకొచ్చి కూర్చున్నాను. దానికి  ఓ పక్క ఎవరో ఫుల్లుగా లాగించి పడుకుని నిద్రపోతున్నారు. నేను నా పాటికి మాట్లాడుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఏవో కలవరింతలు వినిపిస్తున్నాయి.

“ఏవేయ్ అంకమ్మా…కొంచెం నీళ్ళియ్యే.. ఒక్కసారి నిన్ను కోప్పడినంత మాత్రాన నా మీద అంత కోపమా! నువ్వు నాతో మాట్లాడకపోతే సచ్చిపోతానే… నేనేం తప్పు జేశానే…” ఇలా మత్తులో ఏదేదో మాటలు.

సరే అవేవీ పట్టించుకోకుండా కాసేపు నా పనిలో నేనున్నాను. కొద్ది సేపటి తర్వాత దగ్గరికెళితే కళ్ళు మూసుకుని నా వైపు చూడకుండానే

“దాహం… దాహం… కొంచెం నీళ్ళివ్వండి సార్… ఇప్పటి దాకా ఒక వందమందిని అడిగుంటాను. ఒక్కరు కూడా ఇవ్వలేదు. ” అని అడుగుతున్నాడు.

నా దగ్గర అప్పటికి వాటర్ బాటిల్ లేదు. రైల్లోకెక్కింతర్వాత కొనుక్కుందాం లే అనుకున్నాను.

” పక్కనే కొళాయి ఉంది. లేచి మొహం కడుక్కుని నీళ్ళు తాగు” అన్నాన్నేను.

“లేవలేను సార్. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీరసంగా ఉంది. దయచేసి నీళ్ళుంటే ఇవ్వండి సార్ పుణ్యముంటుంది”  అన్నాడు.

“నువ్వు లేవలేకపోతే నేను పట్టుకుంటా లెయ్యి” అన్నా. ఉహూ! అసలు కదలడం లేదు.

నీళ్ళ కోసం అటూ ఇటూ చూస్తున్నా. ఓ మధ్య వయస్కుడు చేతిలో వాటర్ బాటిల్ అందులో అడుగున కొద్దిగా నీళ్ళు కనిపించాయి.

అతని దగ్గరికెళ్ళి ” ఏవండీ అక్కడ ఒకతను తాగి పడిపోయి ఉన్నాడు. దాహం దాహం అంటూ కలవరిస్తున్నాడు. నా దగ్గర ఇప్పుడు వాటర్ బాటిల్ లేదు. మీ దగ్గరున్న నీళ్ళు కొంచెం అతనికిస్తారా?” అనడిగాను.

అతను నా వైపు విచిత్రంగా ఓ చూపు చూసి “సరే నేనిప్పుడు వాటర్ బాటిల్ ఇస్తాను. మళ్ళీ నాకు కొత్త బాటిల్ తెచ్చిస్తావా?” అనడిగాడు

నేను మొహమాటపడుతుండగానే “చూడు బాబూ! తాగుబోతుల గురించి ఎప్పుడూ జాలిపడొద్దు. అసలు వాడిని అంతలా ఎవరు తాగమన్నారు? అలా కిందపడి ఎవరు దొర్లమన్నారు?”

ఇంకా అతని మాటలు వినదలుచుకోలేదు. చుట్టూ చూస్తే కొంచెం దూరంలో ఒకతను నీళ్ళ బాటిళ్ళు అమ్ముకుంటూ వస్తున్నాడు. తొందరగా అక్కడికెళ్ళి బాటిల్ తీసుకుని వస్తున్నా.

ఇంతలోనే అక్కడే ఉన్న యాత్రికులెవరో నీళ్ళిచ్చినట్టున్నారు. ఆబగా తాగేస్తున్నాడతను. ఎంత దప్పికగా ఉన్నాడో ఏమో రెండు లీటర్ల బాటిల్ చేతికిస్తే సగానికి పైగా ఖాళీ చేసేశాడు.

నాకు ముందు బాటిల్ ఇవ్వడానికి నిరాకరించిన అతనే మళ్ళీ కల్పించుకుని “అనవసరంగా వాళ్ళకెందుకండీ ఇంపార్టెన్స్ ఇవ్వడం.” అంటున్నాడు.

నేనిక ఉండబట్టలేక “అతను ఎలాంటి వాడైనా కావచ్చు. ఇలా తాగేసి పడిపోయి నీళ్ళు ఇచ్చే దిక్కులేక చనిపోయిన సందర్భాలు కొన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. తెలిసి కూడా అలా వదిలేస్తే పాపం కదండీ! మానవత్వం కొద్దీ అయినా సహాయం చేయాలి గదా!” అన్నాను.

దాంతో అతను కొంచెం సర్దుకుని “నిజమే సహాయం చేయూలన్న మీ ఆలోచన కరెక్టే కానీ ఇలాంటి వాళ్ళకు సహాయం చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు” అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు.

నేను నెమ్మదిగా అతని వైపు నడిచి “ఏంటయ్యా దాహం తీరిందా? ఇంకా కావాలా? ” అన్నాను.

“ఇంక చాలు… చాలా ట్యాంక్స్ సర్ ” అన్నాడు ఇంకా మత్తులోనే.

” నాకు ట్యాంక్స్ తరువాత… ఇక నుంచైనా నీ ట్యాంక్ నిండా పట్టించకుండా కొంచెం తక్కువగా తాగు” అని చెప్పేసి చక్కా వచ్చేశాను.

కుక్కాశ గుండ్రాయితో తీరిపోయింది

దేనిమీదైనా బాగా ఆశ పెట్టుకున్నపుడు అది నెరవేరకపోతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ సామెతను విరివిగా వాడేది. గత రెండేళ్ళుగా నేను ఎదురుచూస్తున్న కోరిక ఫలించకపోవడంతో ఇప్పుడు ఈ సామెత గుర్తుకు వచ్చింది.

ఈ సామెత నేపథ్యం ఏమిటంటే, కుక్క ఒకసారి ఆకలితో  అన్నం తింటున్నపుడు ఆశగా ఎదురు చూస్తూ తోకాడిస్తూ వచ్చిందంట. ”యేహే తినేటప్పుడు నీ గోలేంటే”  అని పక్కనే ఉన్న గుండ్రాయెత్తి దానిమీదకి విసిరేశారంట. అదీ సామెత.

“పెరుగుదల” కోసం కళ్ళు కాయలు కాసి కాసి, పండిపోయి, కుళ్ళిపోయి విత్తనాలు నేలరాలిపోయాయి. ఆ విత్తనాలు అదే నేలలో నాటాలా? లేక వేరే భూమిలో నాటాలా అని తెగ సతమతమైపోతున్నా. సరిగ్గా ఇదే సమయంలో పక్కవాడి పొలంలో పైరు బాగా పండితే మనిషిలోని సహజ ఈర్ష్య స్వభావం వెర్రి తలలు  వేస్తుంది. అదిగో అప్పుడే కావాలి సంయమనం. ఆ ఈర్ష్యను ఉక్కుపాదంతో అణిచేయాలి, లేకపోతే అణిగేదాకా ఆగాలి. ఒక పంట వేసిన వెంటనే రెండో పంట వేసేస్తే భూమిలో సారం ఉండదు కదా. అందుకనే ప్రస్తుతానికి నేలను సిద్ధం చేసే పనిలో పడ్డా…