విద్యార్థి దశలో నన్ను బాగా ప్రభావితం చేసిన ఇంకొక మాస్టారు అశ్వత్థరావు సార్. బాకరాపేట నుంచి మా ఊరికి బదిలీ అయి వచ్చారు. బ్రాహ్మణ కుటుంబం. ఉన్నంతలో శుభ్రంగా ఉన్న ఇల్లు బాడుగకి తీసుకున్నారు. కొత్తగా వచ్చారు కాబట్టి అందరూ కొత్తయ్యోరు అని పిలిచేవాళ్ళు. ఆ పిలుపు ఆయన సుమారు పదేళ్ళు మా ఊళ్ళో పనిచేసి బదిలీపై వెళ్ళేదాకా అలాగే కొనసాగింది. మాది అప్పటికి ప్రాథమికోన్నత పాఠశాల. ఆయన ఆరు, ఏడు తరగతులకు పాఠాలు చెప్పేవారు. సాయంత్రం పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేవారు. మంచి క్రమశిక్షణగా చదివించేవారు. చదివేటప్పుడు మాట్లాడితే అస్సలు ఊరుకునే వాడు కాదు. పిల్లలందరూ మిద్దె మీద కూర్చుని చదువుకునే వారు. వాళ్ళు కింద కాపురముండేవాళ్ళు. మేం పైన నడుస్తుంటే కింద శబ్దం రాకూడదని నెమ్మదిగా మునిగాళ్ళ మీద నడవమనే వాడు. బడికి వచ్చే దాదాపు అందరూ పిల్లలు ఆయన ట్యూషన్ కి కూడా వచ్చేవాళ్ళు. ఎందుకో ఆయన దగ్గరకి ట్యూషన్ కి పంపితే పిల్లలు బాగా చదువుకుంటారని అందరికీ గురి కుదిరింది.
మాకు ఇంగ్లీషు మీద శ్రద్ధ కలిగింది ఆ సార్ వచ్చిన తర్వాతే. ఒకసారి ఆయన రిజిష్టరులో ఏదో రాసుకుంటూ ఉంటే అందులో నాకు తెలీని పదాలు కూడి కూడి చదువుతుండేవాడిని. ఆయన ఆ ఆసక్తిని గమనించి మాకందరికీ ట్యూషన్లో రోజూ స్పెల్లింగ్ , ఉచ్ఛారణలతో సహా కొన్ని ఆంగ్ల పదాలు వాటికి తెలుగులో అర్థాలు మా పలకల్లో రాసిచ్చి బట్టీపట్టమనే వాడు. ఒక అరగంటో గంటో చదివిన తరువాత వాటిని డిక్టేషన్ రాయమనే వాడు. అలా చాలా పదాలు నేర్చుకున్నాను నేను.
దార్లో ఆయన వస్తున్నాడంటే ఆడుకునే పిల్లలంతా ఇళ్ళల్లోకి పరిగెత్తేసే వాళ్ళం. ఒకసారి అలాగే గోలీకాయలాడుతుంటే అందరూ చాకచక్యంగా తప్పించుకున్నా అడ్డంగా దొరికిపోయాన్నేను. అబ్బే నేనడ్డంలేదు సార్. వాళ్ళాడుతుంటే నేను ఊరికే చూస్తూ నిలుచున్నానని అమాయకంగా అబద్ధమాడేశా. అది ఆయన మా ఇంట్లో వాళ్ళతో సహా అందరికీ చెప్పీ పడీ పడీ నవ్వాడు నా అమాయకత్వానికి.
ఆయన భార్య పేరు మంజులా మేడం. సంగీతం నేర్చుకున్నదనుకుంటా. చక్కగా పాటలు పాడేది. సినీనటుడు పద్మనాభం ఆమెకు బంధువులంట. ఆమె చిన్నప్పుడు పద్మనాభం గారు తెచ్చిచ్చిన గౌను జాగ్రత్తగా ఉంచుకుని ఓ సారి మా అక్కవాళ్ళకు చూపించిదంట. ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్ళివచ్చింది. కూడా. ఊర్లో ఎవరైనా ఇంట్లో నీటి అవసరాలకి బావినుంచో, బోరు నుంచో తెచ్చుకునే వారు. పాపం ఆమెకు కష్టంగా ఉండేదని పిల్లలం మేమే నీళ్ళ బిందెలు చెరోవైపు పట్టుకుని తెచ్చిచ్చేవాళ్ళం. బ్రాహ్మణులకు సేవ చేస్తే మంచిదని ఊర్లో వాళ్ళు కూడా ఎవరూ అడ్డు చెప్పేవాళ్ళు కాదేమో.