మరి వీళ్ళు చేస్తున్నదేమిటో…

రాజకీయనాయకులకు వెంకన్న టోకున వరాలు ఇచ్చేస్తున్నాడని ఏదో పుకారు లేచినట్లుంది. లేకపోతే ఉన్నట్టుండి మన రాష్ట్రంలో నాయకులకు వెంకన్నపై అమితమైన ప్రేమ పుట్టుకొచ్చేయడేమేంటి?

ఉన్నపళంగా అందరూ పొలోమని పాదయాత్రల మీద పడ్డమేంటి? ఈ యాత్ర ముందు చిరంజీవి ప్రారంభిస్తే, తరువాత చంద్రబాబు, ఇప్పుడేమో సీపీఐ నారాయణ వంతు.

ఉన్నట్టుండి తిరుమల కొండపైన రాజకీయాలు జరిగిపోతున్నాయని తెగ బాధపడిపోతున్నారు.ఇన్ని రోజులు ఏం చేస్తున్నారో! అసలు ఆ ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచీ దేవస్థానం ప్రతిష్ట మరింత దిగజారిందని నా అభిప్రాయం.

మరి వీళ్ళు అక్కడికెళ్ళి ఒరగబెట్టేస్తుందేమిటో తెలుసా? వందలకొద్దీ రాజకీయ కార్యకర్తలని, మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళ్ళడం, అక్కడ అధికారులను బలవంతంగా ఒప్పించి వీళ్ళందరికీ వసతి, ఉచిత దర్శనం ఇప్పించుకోవడం. ఇది సామాన్య భక్తులకు అసౌకర్యం కాదా? దీన్ని రాజకీయం కాక ఇంకేమంటారో!

పాపం ఉత్తరప్రదేశ్ ప్రజలు

ఉత్తర ప్రదేశ్ జనాల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పక్క ములయాం.. ఓ పక్క మాయావతి.. దొందూ దొందే… ఎవర్ని ఎన్నుకున్నా తీరు మారదాయే..

ఒక్క పదిరుపాయల కోసం క్యూల్లో నిలబడి తొక్కిసలాటలో జనాలు చచ్చిపోతుంటే ఈవిడకు మాత్రం నోట్లతో కోట్ల రూపాయల దండలు కావాలసివచ్చాయట.. ఔరా! ఎంత దౌర్బాగ్యం పట్టిందిరా మన దేశానికి…

మన దేశం డబ్బుండీ పేద దేశం అయింది ఎందుకంటే ఇలాంటి చీడ పురుగుల వల్లే..డబ్బును ఇనప్పెట్టెలో పెట్టి పూజ చేసుకుని పీనాసి పీనుగుల వల్లనే..

ఓ పక్క ఆకలితో అన్నమో రామచంద్రా అని జనం అల్లాడుతుంటే ఈమెమో కోట్లు బెట్టి విగ్రహాలు పెట్టిస్తుందట..
“ఎవడిక్కావాలండీ ఈ విగ్రహాలు.. కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ” అని నాయకులను నిలదీసి సాగనంపే రోజు వస్తుందా?

ఏమిటీ మూర్ఖత్వం?

ఇవాళ రాష్ట్రంలో ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న రభస చూస్తుంటే నాలో అసహనం చెలరేగుతుంది. చిన్నప్పుడు పిప్పరమెంట్ తింటుంటే ఎవరైనా సావాస గాళ్ళు వచ్చి అడిగితే నోట్లో ఉన్నా సరే బయటకు తీసి చొక్కా మడతలో పెట్టి కొరికి సగం పంచిచ్చే వాళ్ళం. రాష్ట్రమేమన్నా పిప్పరమెంటు బిళ్ళా, అడగ్గానే సగం కొరికి ఇచ్చెయ్యడానికి?వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకుని ఏం సాధిద్దామని?. వాళ్ళకు నచ్చజెప్పకుండా వాళ్ళ త్యాగాలను బలిదానాలని కీర్తించే భజన పరులు కొందరు. వీళ్ళలో ప్రొఫెసర్లు కూడా ఉండటం మరీ విడ్డూరం. కొంచెం కూడా తర్కం లేకుండా మాట్లాడటం వీళ్ళ ప్రత్యేకత.

తన సెలైనాహారదీక్షతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేసిన కేసీయార్ పిల్లి కూతలకు భయపడిపోయిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుందంటూ ప్రకటన చేసింది. దీనికి  సీమాంధ్ర ప్రాంతాల నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురవడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకుంది. జేసీ లాంటి విజ్ఞుల సలహాతో రాష్ట్ర విభజన అంత తేలిగ్గా జరిగే ప్రక్రియ కాదనీ  తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం తదుపరి ప్రకటనలో రాష్ట్ర విభజన కోసం విస్తృతమైన చర్చలు జరపాలనే అభిప్రాయం  వ్యక్తం చేసింది.

దాని ఫలితమే శ్రీకృష్ణ కమిటీ. ఎవరేమన్నా ఈ కమిటీ రాష్ట్ర విభజన కోసం వేసిన కమిటీయే. అసలు ఇప్పుడు సమైక్యంగానే ఉంటే మళ్ళీ సమైక్యంగా ఉండటానికి కమిటీ ఎందుకు? తెలంగాణా వాదుల డిమాండ్ మేరకే కదా ఈ కమిటీ ఏర్పడింది. దాన్ని గడ్డి పీకమని చెప్పి వీళ్ళు మాత్రం రోజూ ఉద్యమాలు చేస్తూ హైదరాబాద్ ను రావణకాష్టంగా మారుస్తారట. ఇదెక్కడి న్యాయం? అసలు వీళ్ళు విద్యార్థులేనా?

కొంచెం కూడా ఆలోచించరా? వీళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఆ కమిటీ దగ్గరకు వెళ్ళి తమ వాదనలేమిటో బలంగా వినిపించాలి గానీ ఇలా వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకుంటూ, వాళ్ళ భవిష్యత్తునే కాకుండా ఉస్మానియాలో చేరిన పాపానికి అమాయకులైన మిగతా విద్యార్థుల భవిష్యత్తును కూడా పాడుచేస్తూ ఏం సాధిద్దామనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు.

మన ప్రభుత్వానికి ఆ దమ్ముందా?

ఇన్నాళ్ళు చంపుతాం, నరుకుతాం, తెగ్గోస్తాం, రక్తపుటేర్లు పారిస్తాం అని ప్రేలుతున్న కొంత మంది వేర్పాటు వాదుల గురించి  అందరూ మీడియాలోనూ, బయట మాట్లాడటం తప్పిస్తే ఎవరూ ఎక్కడా చట్టపరమైన చర్యలు చేపట్టమని కోరిన దాఖలాల్లేవు. స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ పని చేయడం ద్వారా ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసిందనిపిస్తుంది నాకు.

కేసీఆర్, మరికొందరు నాయకులు పలు సందర్భాల్లో వాడిన పరుష పదజాలాన్ని, వాటిని ప్రచురించిన వార్తల క్లిప్పింగులను ఆమె మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డికి సమర్పించారు. తెలంగాణాలో ఆంధ్ర అనే పదం ఎక్కడా వినిపించ కూడదంట,కనిపించకూడదంట. ఇడ్లీ సాంబార్ అనే మాట కూడా  వినిపించకూడదంట!!!…ఇలా వాళ్ళ నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడటం ద్వారా తెలంగాణా లో నివసించే ఇతర ప్రాంతాల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నది ఆమె ఫిర్యాదు సారాంశం. ఈ వాదన సమంజసంగా అనిపించిన సుభాషణ్ రెడ్డి ఇలాంటి వాటిని ఆపడానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో డీజీపీని వివరణ అడిగారు. ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై చర్య తీసుకునే దమ్ము మన ప్రభుత్వానికుందా? అనేదే అసలు ప్రశ్న.