మనసును దోచే మున్నార్

“మీ సాఫ్ట్‌వేరోళ్ళు ఎప్పుడూ ఇంతేనంటగా. మా ఫ్రెండ్ చెప్పింది. పట్టుమని పది రోజులు కూడా ఇంటి దగ్గర ఉండరట. ఎప్పుడు చూసినా ఆఫీసు, పనులు అంటూ ఉంటారంట. ఇంక మన హనీమూన్ అయినట్టేలే” పెళ్ళికి తీసుకున్న మూడు వారాల సెలవులు అయిపోయి నేను తిరిగి హైదరాబాద్ వచ్చేస్తుండగా మా శ్రీమతి నాపై విసిరిన విసుర్లు.

“నీకెందుకు? ఈ డిసెంబర్ లోపల హనీమూన్ నేను ప్లాన్ చేస్తాగా” అని అభయమిచ్చి  వచ్చేశాను.

ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల దీపావళికి ముందు మూడు రోజులు సెలవు పెడితే మొత్తం తొమ్మిది రోజులు సెలవులు కలిసొచ్చాయి. వీటిలో ఓ ఐదు రోజులు మున్నార్ లో, నాలుగు రోజులు దీపావళికి ఇంట్లోను ఉండేలా పథకం వేసుకున్నా.

ముందుగా హైదరాబాద్ నుంచి మా ఊరు శ్రీకాళహస్తికి వెళ్ళి, అక్కడ నుంచి మా ఆవిడని తీసుకుని రేణిగుంట నుంచి ఎర్నాకుళం దాకా దాదాపు పదమూడు గంటలపాటు రైలు ప్రయాణం. ఎర్నాకుళం లో బీటెక్ లో మా లెక్చరర్ జయరాం గారు మాకు అక్కడే ఓ హోటల్లో బస, అక్కడ నుంచి అతిరిపల్లి జలపాతం చూసేందుకు ఓ కారు ఏర్పాటు చేశారు. ఈ జలపాతం దగ్గర చాలా సినిమా షూటింగులు కూడా జరిగాయట. చాలా ఎత్తైన జలపాతం. పాల నురగ లాంటి స్వచ్చమైన నీరు పై నుంచి అలా జాలువారుతుంటే చూడ్డానికి రెండు కళ్ళూ చాలవంటే నమ్మండి. బాగా ఎత్తైన ప్రదేశం నుంచి ఎక్కువ నీళ్ళు కింద పడటం వల్ల తుంపర్లు చాలా దూరం వరకూ పడుతూ ఉంటాయి. లెన్స్  మీద నీళ్ళు పడకుండా ఉండాలంటే కొంచెం దూరం నుంచే ఫోటోలు తీయాలి.


కమల్ హాసన్ సినిమా డ్యాన్స్ మాస్టర్ లో మొదట హీరో, హీరోయిన్లు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు. అది ఇక్కడే చిత్రీకరించారు. ఇటీవల సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలో ‘మన్మథుడే బ్రహ్మను పూని‘ అనే పాటలో కొంత భాగం కూడా ఇక్కడే చిత్రీకరించారు.

అక్కడి నుంచి సాయంత్రానికి మళ్ళీ ఎర్నాకుళం తిరిగొచ్చేసి మరుసటి రోజు మున్నార్ కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే మరుసటి రోజుకు మున్నార్ లో ఓ హోటల్ కూడా బుక్ చేసుకున్నాం. రాత్రి అక్కడే పడుకుని మరుసటి రోజు మున్నార్ కు కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం. ఎర్నాకుళం నుంచి మున్నార్ కు ప్రతి అర్ధ గంటకూ ఓ బస్సుంది. మొత్తం నాలుగున్నర గంటల ప్రయాణం. చాలా వరకు ఘాట్ రోడ్డు ప్రయాణమే. చల్లటి వాతావరణం. అంబరాన్ని చుంబిస్తున్నట్లుండే పర్వత శిఖరాలు, వాటితో పోటీ పడుతూ మబ్బుల్లోకి దూసుకెళ్ళినట్లనిపించే చెట్లు  చూసేవారికి కనువిందు కలిగించక మానవు.

మున్నార్ సుందర దృశ్యాలు వీక్షించాలంటే అక్కడి నుంచి మూడు మార్గాలున్నాయి. ఒకటి ఎర్నాకుళం వైపు, రెండోది కొడైకెనాల్ వైపు(సుమారు 60 కి.మీ), మూడోది కోయంబత్తూర్ వైపు. ప్రసిద్ధి చెందిన ప్రదేశాలన్నీ ఈ మార్గాల్లోనే  ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన దక్షిణభారతదేశంలోనే ఎత్తైన పర్వతశిఖరం అనైముడి కోయంబత్తూర్ వెళ్ళే మార్గంలో వస్తుంది.


మున్నార్ లో ఎటు చూసినా పచ్చదనమే. వీటిలో తొంభై శాతం టాటా వారి ఆధ్వర్యంలో నడిచే తేయాకు, కాఫీ తోటలే. మేం చూసిన ముఖ్యమైన ప్రదేశాలు పోతంబేడు వ్యూ పాయింట్, మాటుపెట్టై డ్యామ్, ఏనుగులు వచ్చే చోటు, కుండేల్ సరస్సు, టాప్ స్టేషన్, లక్కోం జలపాతం, బ్లాసమ్ పార్క్. కోయంబత్తూర్ కు వెళ్లే దారిలో ఎర్రచందనం అడవులు, వెదురు చెట్లు, వన్యమృగాలు దర్శనమిస్తాయి. మున్నార్ లో సాధారణంగా ఎప్పుడూ బాగా వర్షాలు పడుతుంటాయట. కానీ మేం వెళ్ళిన రెండు రోజులూ అదృష్టవశాత్తూ వర్షం ఏమీ పడలేదు. వాతావరణం కూడా పెద్దగా చలిగా లేకుండా ఆహ్లాదకరంగా ఉంది.

మున్నార్ నుంచి కారు అద్దెకు తీసుకోవాలంటే ఖర్చు అనుకునేవారు సెవెన్ సీటర్ ఆటోలు, జీపులు కూడా అద్దెకు మాట్లాడుకోవచ్చు. మొదటి రోజు కొచ్చిన్ వైపు వెళ్లేదారిలో ప్రదేశాలు చూశాం. రెండో రోజు కొడైకెనాల్ దారిలో వచ్చే ప్రదేశాల్ని కవర్ చేశాం. మూడోరోజు సాయంత్రం కోయంబత్తూర్ లో మేం కోయంబత్తూర్ లో రైలు ఎక్కాల్సి ఉంది. ఉదయాన్నే హోటల్ ఖాళీ చేసేసి కోయంబత్తూర్ వైపు వెళుతూ దారిలో చూడాల్సిన ప్రదేశాలు కవర్ చేసేశాం.

అప్పటి దాకా కేరళ God’s own country గా వినడమే కాక చూసింది లేదు. అలాంటి ప్రదేశానికి మేమిద్దరం మొదటి సారి కలిసి వెళ్ళడం మా ఇద్దరికీ మరిచిపోలేని అనుభూతి మిగిల్చింది.


సూర్యలంక బీచ్

రిసార్ట్స్
రిసార్ట్స్

ఈ వారాంతం మా టీమ్ తో కలిసి బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక బీచ్ కు వెళ్ళాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి హరిత రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేసుకున్నాం. శని ఆదివారాలు కాబట్టి జనం బాగానే ఉన్నారు.

బీచ్ చాలా విశాలంగా ఉండి జలకాలాడ్డానికి అనుకూలంగా ఉంది. 250 మీటర్ల లోతు దాకా వెళ్ళినా అలలు నడుం లోతు దాకా కూడా రాలేదు. అసలు బయటకు రావాలని అనిపించలేదు. అలలపై తేలియాడినట్లుంది అనే కవితాత్మక భావనని ప్రత్యక్షంగా అనుభవించాను నేనైతే…

కాకపోతే ఇటీవల సంభవించిన లైలా తుఫానుకు కొంచెం కళ తప్పినట్లు కనిపించింది. ఎటొచ్చీ ప్రభుత్వ సంస్థ అనే పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడి ఉద్యోగులు నిర్వహణ లో తమ అలసత్వ ప్రదర్శనతో మమ్మల్ని అలరించారు. ఏసీ గదులు బుక్ చేసుకున్నా వాటిలో శుభ్రత లేదు. ఆ ఏసీలు సరిగా పనిచేయలేదు. ఇక మామూలు గదులు ఎలా ఉంటాయో?

మొత్తమ్మీద రెండు రోజులు మరో బోరింగ్ వీకెండ్ కాకుండా సరదాగా గడిచిపోయింది…

నైవేలి విశేషాలు

నైవేలి
నైవేలి విహంగ వీక్షణం

గత శనివారం ఓ వ్యక్తిగత పని మీద తమిళనాడులోని నైవేలి వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై నుంచి దక్షిణంగా సుమారు 200 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ లిగ్నైట్ విస్తారంగా దొరుకుతుంది. లిగ్నైట్ అంటే పూర్తి స్థాయి బొగ్గుగా మారకుముందు రూపమన్న మాట. ఇందులో బొగ్గు కన్నా తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగభాగం (సుమారు 2500 మెగావాట్లు) ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందట.

1935 లో జంబులింగ మొదలియార్ అనే ఆసామి తన పొలంలో బోర్ వేస్తుండగా నల్లటి రాళ్ళు బయట పడ్డాయి. దాన్ని పరీక్ష కోసం పంపించగా ఆ ప్రాంతం యొక్క భూగర్భంలో విస్తారమైన లిగ్నైట్ నిల్వలు ఉన్నట్లు తెలియవచ్చింది. 1956 లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే పేరుతో  భారత ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పనులు ప్రారంభించింది. 1962  నుంచి అక్కడ మైనింగ్ ప్రారంభమైంది.

నటరాజ స్వామి
నటరాజ స్వామి

ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలతో చక్కటి టౌన్ షిప్ నిర్మించి ఇచ్చింది. సుమారు 55 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తారమైన వృక్షసంపదతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా తమిళనాడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. బొగ్గును వెలికితేసే కార్యక్రమంలో భాగంగా కుప్పలుగా పోసిన ఫ్లై యాష్, మట్టి పెద్ద పర్వతాల్లాగా కనిపిస్తాయి. అవి పర్యావరణానికి అంతగా మంచిది కాదనడంతో ఇటీవలే వాటి మీద చెట్లను పెంచడం ప్రారంభిస్తున్నారు.

ఆవరణలో నాలుగు దేవాలయాలు, రెండు చర్చిలు, మసీదు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్దదైన, పన్నెండు అడుగుల ఎత్తైన పంచలోహ నటరాజ స్వామి విగ్రహం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంకా నేను చూడాలనుకున్న చిదంబరం, తంజావూరు కూడా ఇక్కడకు దగ్గరే. ఇంకెప్పుడైనా వెళ్ళినపుడు చూడాలి.

కాంచితి అమరావతీ నగర అపురూప శిల్పాలు…

మిత్రుల సమాగమం
మిత్రుల సమాగమం

అమరావతి శిల్పం
అమరావతి శిల్పం

గత శుక్రవారం మా స్నేహితుడు కొండారెడ్డి పెళ్ళి. వినుకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కర్ నగర్ అనే చిన్న పల్లెటూర్లో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్ళి. మా ఎంటెక్ క్లాస్ మేట్స్ రవికుమార్, మురళి, వేణు, ప్రతాప్, ప్రభాకర్, జూనియర్ ప్రవీణ్ వచ్చారు. ఇక సందడే సందడి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత  కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు. భలే సరదాగా గడిచిపోయింది. ముహూర్తం రాత్రి 2 గంటలకు కావడంతో అప్పటి దాకా మేలుకుని ఊరంతా తిరుగుతూనే గడిపాం.

శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఓ కునుకు తీసి అమరావతి చూడడానికి బయలు దేరాం. వినుకొండ నుండి అమరావతి చేరేసరికి సాయంత్రం నాలుగైంది. అమరావతి లో భోజనం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ లో ఉప్పు చప్పని కూరలు తిని మొహం మొత్తేసిన చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టనిపించింది. తర్వాత మ్యూజియం చూడ్డానికి వెళ్ళేసరికి సమయం నాలుగన్నరైంది. ఓ అర్ధగంటలో అన్నీ మ్యూజియం మూసేస్తామన్నారు. కానీ లోపల గంట సేపటి దాకా గడిపాం.

లోపల శిల్పాలు సుమారు 2000 ఏళ్ళ కాలం నాటివి. వాటిని చెక్కడానికి వాడిన రాయి ఇప్పటిదాకా నేనెక్కడా చూడలేదు. బౌద్ధ సాంప్రదాయంలోని అనేక చిహ్నాలైన త్రిపీఠకాలు, బుద్ధుడి జీవిత విశేషాలు మొదలైనవాటిని శిల్పాల్లాగా మలచి ఉన్నారు. చిన్నప్పుడు తరగతి పుస్తకాల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసి,చదివిన అపురూప శిల్పాలను కళ్ళారా చూసినప్పుడు కలిగిన ఆ అనుభూతే వేరు.

తర్వాత పక్కనే ఉన్న మహా స్థూపాన్ని చూడ్డానికి వెళ్ళాం. దీన్ని కట్టడానికి వాడిన ఇటుకలు చాలా పెద్దవి, బలమైనవి కూడా. చాలా వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చుట్టూ పేర్చి ఉన్న శిలలపై అక్కడకక్కడా శాసనాలు చెక్కించి ఉన్నారు. ముందుగా కొంచెం అమరావతి గురించి రీసెర్చి చేసుకుని వెళ్ళాను కాబట్టి నేనే అక్కడక్కడా మా వాళ్ళకి గైడునయ్యాను :). తర్వాత కృష్ణానదీ ఒడ్డునే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.ఇక్కడ  శివలింగం మామూలు విగ్రహాలకన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. కొండవీడు కోట కూడా చూద్దామనుకున్నాం కానీ సమయం చాల్లేదు. మళ్ళీ ఎపుడైనా వెళ్ళినప్పుడు చూడాలి.