హాస్టల్ తిండి

కుక్క బొమ్మ

అవి నేను ఎన్ ఐ టీ వరంగల్ లో ఉన్నత చదువు (ఎంటెక్) వెలగబెడతున్న రోజులు…

ఓ రోజు మధ్యాహ్నం కాళ్ళు మెస్సు వైపు కదలనని మొరాయిస్తున్నా ఆకలి వాటిని భారంగా ఈడ్చుకెళుతోంది. అక్కడ శాకాహారులకు ఐదో నంబర్ మెస్సు ప్రత్యేకం. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్క మెతుకు వదిలి పెట్టినా పాపమే” అని చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పిన మాటలు నా మెదడులో సుడులు తిరుగుతున్నా తప్పని సరి పరిస్థితుల్లో ఎన్నో సార్లు తిండి వదిలేశాను ఆ మెస్సులో…

ఆ రోజు మెస్సులో జిలేబీ స్పెషల్. అన్నం తినడం పూర్తి చేసిన తర్వాత చవిచెడిపోయిన నోరు తీపి చేసుకుందామని జిలేబీ చివరి దాకా అట్టే ఉంచాను. నెమ్మదిగా మెస్ బయటకు వచ్చి విశ్రాంతి కోసం అక్కడే వేసి ఉన్న ఓ బెంచీ మీద కూర్చుని ప్రశాంతంగా జిలేబీ తినడానికి ఉపక్రమించాను.

రెండు ముక్కలు నోట్లోకి వెళ్ళాయో లేదో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ కుక్క నా పక్కనే కూర్చుని ఆశగా జిలేబీ వంకే చూస్తోంది. దాని మీద కొంచెం జాలిపడి మిగతా భాగం దాని ముందు పడేశాను.

అది నెమ్మదిగా దాని దగ్గరకు వచ్చి వాసన చూసి “దీన్ని కుక్కలు కూడా తినవు” అన్న సామెతను నిజం చేస్తూ వెనక్కి చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది. నాకైతే అక్కడ మొదలైన నవ్వు తిరిగి ల్యాబ్ కు వెళ్ళేదాకా ఆగనే లేదు…

కొంటె ప్రశ్నలు – తుంటరి సమాధానాలు

నేను ఐదారు తరగతుల్లో ఉన్నప్పటి సంగతి. పిల్లకాయలం అందరం రోజూ ఉదయం చెరువులోకి వెళ్ళి తిరిగొస్తూ దారి మధ్యలో పేపర్ చదవడం కోసం ఒక రైస్‌మిల్లు దగ్గర ఆగేవాళ్ళం. పేపర్ అంటే మాకు కేవలం ఆటల పేజీనే… క్రికెట్ అంటే అంత పిచ్చి మాకు.

అక్కడ మాలాంటి వాళ్ళను ఆటపట్టించడం కోసం ఒకాయన కూచొని ఉండేవాడు. ఆయన భలే సరదా మనిషి. మేం వెళ్ళి పేపర్ దగ్గర కూర్చోగానే మమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగేవాడు.అవి ఎలా ఉండేవంటే

“ఒరేయ్… మీరు చదువుకున్న వాళ్ళైతే నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండ్రా”

“రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?”

“ఆ మాత్రం మాకు తెలీదా… రాయి బరువు గా ఉండటం వల్ల మునిగిపోతుంది” అనేవాళ్ళం.

“ఓస్ ఇంతేనా మీకు తెలిసింది? చేప బరువుగా ఉంది కదా మునిగిపోతుందా? కాదు కదా. రాయి మునిగిపోయింది ఈత రాకపోవడం వల్ల” అని తేల్చేవాడు.

హ్మ్మ్ సరే.. ఇంకో ప్రశ్న అడుగుతాను దీనికైనా సరైన సమాధానం చెప్పండి చూద్దాం.

“చెరువులో నీళ్ళు ఎట్టా ఉంటాయి?”

దానికి మేము తెల్లగా ఉంటాయని ఒకడు, బురదగా ఉంటాయని ఒకడు ఇలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళం చెప్పేవాళ్ళం.

ఆయన మాత్రం “ఓర్నీ ఇంతేనా మీకు తెలిసింది. చెరువులో నీళ్ళు గట్టు వేస్తే ఉంటాయి” అనే వాడు.

సరే ఇంకో ప్రశ్న “దారిన పోయే మనిషి ఎట్టుంటాడు?”

మేం ఏం చెప్పినా దానికి కౌంటర్ ఏస్తాడని మేం గమ్మునే ఉండిపోతే…

“మీ అయ్యోర్లు మీకు ఏం పాఠాలు జెప్తాఉండారో ఏమో… ఒక్క ప్రశ్నక్కూడా కరట్టుగా జవాబు చెప్పలేకుండా ఉన్నారు. నేం జెప్తా జూడు”

“దారిన పోయేవాణ్ణి ఉండమంటే ఉంటాడు. ఇది కూడా తెలీదు. ఏం జదవతుండార్రా మీరు!”

అలాంటిదే ఇంకో ప్రశ్న అడిగేవాడు.

“ఒక రైలు పది గంటలకు కాళాస్తిర్లో బయల్దేరింది. పన్నెండు గంటలప్పుడు అది ఎక్కడ వెళుతుంటుంది?”

మేం మధ్యలో ఉండే ఊర్లు పేర్లు ఏదేదో చెప్పేవాళ్ళం. ఆయన మాత్రం “దానిగ్గూడా అంత ఆలోచిస్తుండారేంది మీరు? దానికోసం అంత ఆలోచించ బళ్ళే…
పన్నెండు గంటలప్పుడు అది పట్టాల మీద బోతా ఉంటది” అనేవాడు.

మళ్ళీ ఎప్పుడు కనిపించినా ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు. ఒక్కోసారి మళ్ళీ “రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?” అని అడిగేవాడు.

అప్పుడు గానీ ముందుగా ఆయన సమాధానం గుర్తు బెట్టుకుని “రాయికి ఈత రాక మునిగిపోయింది” అన్నామనుకో ఇంకా గట్టిగా నవ్వేసేవాడు

“ఒరే పిచ్చోడా! రాయికి ఏడైనా ఈతొస్తుందటరా…” అనేవాడు.

ఇంక ఈయన్తో మనకెందుకులే అని మా పిల్ల గ్యాంగంతా సాధ్యమైనంతవరకు తప్పించుకుని తిరిగేవాళ్ళం.

చెంప దెబ్బలు

ఈ మధ్య ఊరికెళ్ళినపుడు కాళహస్తి నుంచి మా ఊరెళ్ళడానికి ఎర్రబస్సెక్కాను. అప్పటికే బస్సంతా నిండిపోయి ఉండటంతో ఒక సీటు పక్కగా నిల్చున్నాను. బస్సు బయలుదేరింది.

క్రిక్కిరిసిన బస్సులో ఉక్కపోతకు చొక్కా ముందుకు లాగి ఉఫ్ఫూ ఉఫ్ఫూ అని ఊదుకుంటున్నా.

పక్క సీట్లో ఓ అమ్మాయి ఓ పిల్లాడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూంది. పక్కన ఆమె భర్తనుకుంటా, కూర్చుని కొడుకునే మురిపెంగా చూస్తున్నాడు.

ఆమెను చూడగానే నా మెదడు పాదరసంలా పనిచేసి ఒక పేరును బయటకులాగింది.

వెంటనే ” ఏం సుజాతా, నన్ను గుర్తు పట్టలేదా!” అడిగాను.

ఆ అమ్మాయి క్షణం ఆలోచించి ఆశ్చర్యం నిండిన మొహంతో “ఓ రవిచంద్రా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఇంతకాలమైనా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంది

ఓ చిరునవ్వు నవ్వాను.

“ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఇన్నాళ్ళకిలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? అమ్మా, అక్కా, అవ్వ, తాత వాళ్ళంతా బాగున్నారా?” అని ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది.

“అందరూ బాగున్నారు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నా. మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా?” అని అడిగాను.

“బాగున్నారు” అనేసి వాళ్లాయన నా గురించి అడిగేసరికి ఏదో చెబుతోంది. ఆయన నవ్వుతూ నా వంక చూస్తున్నాడు. నా మనసు మాత్రం ఆరో తరగతి క్లాస్ రూం లోకి వెళ్ళిపోయింది.

********************************************************************************

మా తెలుగు మాస్టారు మునిక్రిష్ణారెడ్డి గారు  ఒక్కోకర్ని లేపి జిహ్వ చాపల్యం అనే పదానికి అర్థం అడుగుతున్నారు.

ఎవరూ చెప్పలేకపోతున్నారు. చివరికి నా వంతు వచ్చింది.

“జిహ్వ చాపల్యం అంటే ఏదైనా రుచి చూడాలనే కోరిక సార్” అన్నాను.

“వెరీ గుడ్. ఇప్పుడు లేచి ఉన్నవాళ్ళందరికీ చెంప దెబ్బలెయ్” అన్నాడు.

మొదటి వాడి దగ్గరికెళ్ళి వాడి బుగ్గలకు గంధం రాసినట్టు అలా రెండు దెబ్బలేశాను. గట్టిగా వేస్తే ఎలాంటి సమస్యలొస్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి అవిక్కడ చెప్పుకోవడం అనవసరం. 🙂

దాంతో మా మాస్టారు “ఇదిగో రవీ, చెంపదెబ్బలంటే అలా వెయ్యకూడదు. వేశావంటే చెంప చెళ్ళుమనాలి. నువ్వు గానీ ఇప్పుడు వేసినట్టు వేశావంటే ముందు నీకు పడతాయి దెబ్బలు” అన్నాడు.

“దేవుడా! చివరికి నా ప్రాణం మీదకే వచ్చిందా,” అనుకుంటూ రెండో వాడి నుంచి చెళ్ చెళ్ మంటూ దెబ్బలేసుకుంటూ వెళ్ళిపోయాను.

దెబ్బలు తిన్న వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

తిరిగి వచ్చి నిశ్శబ్దంగా నా సంచీ పక్కన కూర్చున్నాను. మిగతా క్లాసంతా మాస్టారు పాఠం చెబుతుంటే గంభీరంగా జరిగిపోయింది. క్లాసు పూర్తయింతర్వాత మాస్టారు వెళ్ళిపోయాడు.

క్లాసు ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా ఓ ఏడుపు వినిపిస్తోంది.

వెనక్కి తిరిగి చూశాను. నా చేత దెబ్బలు తిన్న ఒకమ్మాయి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంది. మా క్లాస్‌మేట్సంతా నా వైపు ఉరిమి చూస్తున్నారు. నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాను.

“గట్టిగా తగిలిందా!… సారీ” అన్నాను.

ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అసలు విషయం చెప్పారు. ఆ అమ్మాయికి నిన్నటి నుంచి పక్క పన్ను నొప్పిగా ఉందట. నేను కొట్టిన దెబ్బకి ఆ నొప్పి ఇంకా ఎక్కువయ్యిందేమో పాపం. ఇంక ఏడవక ఏం చేస్తుంది?

ఇక నేను దగ్గరికెళ్ళి బ్రతిమాలడం మొదలు పెట్టాను. “నిజంగా సారీ తెలియక కొట్టాను. ఇంకెప్పుడూ గట్టిగా కొట్టను. ఐనా నీకు నొప్పి ఉన్న సంగతి సార్ తో చెప్పుంటే ఇంత దాకా వచ్చేదా!” అని ఏదో నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఎలాగోలా ఏడుపు మానిపించగలిగాను.

అప్పట్నుంచీ అమ్మాయిలకు చెంపదెబ్బలెయ్యాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవాణ్ణి.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు కదూ… పైన నాకు బస్సులో కనబడ్డ సుజాత.

అమ్మ చేతి దెబ్బ

అమ్మ చేతిలో ఒక్కసారైనా దెబ్బ తినని వాళ్ళు ఉండటం చాలా అరుదని నా నమ్మకం. అందుకు నేనూ మినహాయింపు కాదు. చిన్నప్పుడు నాకు బంకమట్టితో బొమ్మలు చేయడమంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే చాలు అదే పని. రక రకాల వాహనాలు, పరికరాలు వంటివి చాలా తయారు చేస్తుండే వాడిని. నాకోసమే కాదు. నా పక్కన తిరిగే పిల్ల గ్యాంగ్ అంతటికీ నేనే చేసిపెట్టే వాడిని.

ఒక సారి మా అమ్మ గదిలో పూజ చేస్తూ పూజ అయిపోయేదాకా నన్నక్కడే కూర్చోమనింది. నేను నెమ్మదిగా అక్కణ్ణుంచి జారుకుని మట్టి బొమ్మలు చేయడానికి వెళ్ళిపోయాను. ఆటల్లో పడి పూజైపోయేదాకా తిరిగి రాలేదు. ఎవరో వచ్చి మా అమ్మ ఇంటి దగ్గర బెత్తం ఎత్తుకుని నా కోసం కాసుక్కూచుందని చెప్పారు.

అప్పటిదాకా మా అమ్మ నన్నెప్పుడూ  తిట్టిందే తప్ప కొట్టింది లేదు. ఏంజరుగుతుందోనని భయం భయంగా ఇంటికెళ్ళాను. వెళ్ళగానే మా అమ్మ బెత్తం తీసింది. అంతే ఒంటి మీద చిన్న దెబ్బ పడిందో లేదో రోషం పొడుచుకొచ్చింది…అసలే పౌరుషం ఎక్కువ.. పైగా ఇంట్లో వాళ్ళందరి దగ్గర గారాబం… ఆ బెత్తం తీసుకుని మా అమ్మని తిరిగి నాలుగిచ్చేశా…అంతటితో ఆగానా… అన్నం తినకుండా అలక పాన్పు ఎక్కేశా. అలక తీర్చడానికి మాకుటుంబం మొత్తం రంగం లోకి దిగింది. ఒక్క దెబ్బకి నాలుగు దెబ్బలు తిరిగిచ్చి మళ్ళీ నేనే అలిగానని మా ఇంట్లో వాళ్ళంతా ఒకటే నవ్వులు. నాకు మాత్రం ఉక్రోషం పెరిగిపోతోంది. చివరికి మా తాత వచ్చి బుజ్జగించి ఎప్పట్నుంచో మూలన పడి ఉన్న ఈచెయిర్ రిపేర్ చేసి ఇచ్చేదాకా పట్టు వదల్లేదు.

కోపం తగ్గాక ఆ కుర్చీ మీద దర్జాగా కూర్చుని చెయ్యి చాపుతుంటే మా అమ్మ ఒక్కో ముద్ద కలిపి చేతిలో పెడుతూ…

“అది కాదు నాయనా.. పూజ దగ్గిర ఉండమంటే నువ్వు చెప్పా పట్టకుండా అట్ట ఎల్లిపోతే ఎట్టా చెప్పు… తప్పు గదా..” అంటూ నెమ్మదిగా మంచిమాటలు చెప్పింది.

“అయితే ఇంకెప్పుడూ అలా చెయ్యనులే…. నువ్వు కూడా నన్నెప్పుడూ కొట్టగూడదు” అన్నా…

అదే మొదటి మరియు చివరి అమ్మ చేతి దెబ్బ… ఇంకెప్పుడూ దెబ్బలు తినలేదు. మా నాన్న దగ్గరైతే ఆ ఒకసారి కూడా దెబ్బలు తినలేదు.

నేను తప్పిపోయాను

ఇప్పుడు కాదు లెండి 12 ఏళ్ళ వయసులో మద్రాసులో తప్పిపోయాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. అందుకనే మీతో పంచుకుంటున్నాను.

అవి నేను ఏడో తరగతి రోజులు. మా పెద్దక్కకి పెళ్ళి కుదిరింది. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. మా తాతకి (మా అమ్మ వాళ్ళ నాన్న) క్యాన్సర్ మొదటి దశలో ఉందని తేలింది. పెళ్ళికి ముందే ఆసుపత్రికి వెళ్ళమంటే వెళ్తే ఏం చెప్తారో అనే భయంతో మా తాత అంగీకరించలేదు. పెళ్ళయిన తర్వాత హాస్పిటల్ కు వెళితే ఏమైపోయినా పరవాలేదన్నాడు. అలాగే పెళ్ళైపోయింది. మాకు దగ్గర్లో ఉన్న తిరుపతిలో, నెల్లూరులో  దానికి తగ్గ చికిత్సలులేవు. ఒకవేళ చేయించాలన్నా ఎక్కడనుంచో వైద్యులొచ్చి చికిత్స చేయాలి కాబట్టి బాగా ఖర్చుతో కూడిన పని. మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. ఇలా ఉంటే ఇది వరకే క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న మా ఊరి వాళ్ళలో ఒకాయన మద్రాసు వెళ్ళమని సలహా ఇచ్చారు.

మద్రాసు అడయార్ ఆసుపత్రిలో అయితే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా వైద్యం చేస్తారని అక్కడ చేర్పించాం. నేనూ, మా అమ్మ, మా అక్కవాళ్ళిద్దరు, ఇంకా మా ఊరివాళ్ళు ఓ నలుగురు కలిసి మద్రాసుకు బయలు దేరాం. అందరు బస్సులో వెళ్ళాలంటే చార్జీలు ఎక్కువౌతాయని రైలులో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. రేణిగుంటలో మాకు తెలిసిన రైల్వే ఉద్యోగితో కలిసి వెళితే కొద్దిమంది ఆయన పాస్ మీద వెళ్ళచ్చని ఆయన్ని కూడా మాతో రమ్మన్నాం.

మద్రాసుకెళ్ళి మా తాతను చూశాం. అప్పుడు ఆయనకి కీమోథెరపీ చికిత్స జరుగుతోంది. మాకు ఓ మహానగరానికెళ్ళడం అదే కొత్త. ఇంక మనం ఈ మహానగరాన్ని చూడ్డానికి ఎప్పుడు వస్తామో ఏమో అని అందరం కలిసి గోల్డెన్ బీచ్‌ చూద్దామనుకున్నాం. అంతా చూసుకుని సాయంత్రం మళ్ళీ ఆస్పత్రికెళ్ళి మా తాతనొకసారి చూసేసి ఊరెళ్ళిపోదామనుకున్నాం.

గోల్డెన్ బీచ్ నుంచి అడయార్ కు రావడానికి 1J అనే బస్సు ఎక్కాం. బస్సులో నాకు కిటికీ పక్కనే సీటు దొరికింది . నా పక్కనే ఆ రైల్వే పెద్దాయన కూర్చున్నాడు. అప్పటిదాకా మా పల్లెటూరు, పక్కన శ్రీకాళహస్తి తప్ప మిగతా ఊళ్ళు ఎలా ఉంటాయో ఎరగని నేను ఆ పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, ఎడతెరిపిలేని వాహనాలు, డబుల్ డెకర్ బస్సులు మొదలైన మహానగరపు వింతలు, విడ్డూరాలు చూడ్డంలో మునిగిపోయా.

కొద్దిసేపటి తర్వాత నా పక్కన ఉన్న పెద్దాయన ఎవరో వస్తే వాళ్ళను పలకరించడానికన్నట్లు లేచి సీటిచ్చాడు. సరే ఎవరో తెలిసిన వాళ్ళేమో అనుకున్నాను. కానీ రాబోయే స్టాపే దిగాల్సిన స్టాపని నాకప్పుడు తెలియలేదు. కాసేపటి తర్వాత బస్సులో కలియజూస్తే ఇంకేముంది?. బస్సులో నాకు తెలిసిన ఒక్క మొహం కూడా కనిపించలేదు.

ఏడుపు మొహం పెట్టుకుని మా అమ్మవాళ్ళనెవరైనా చూశారా అని అందర్నీ అడగడం మొదలుపెట్టాను. అసలే తమిళులకు భాషాభిమానం జాస్తి. నాకేమో తెలుగు తప్ప వేరే ఏ భాష రాదు. అప్పుడు ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలకోసం బట్టీ పట్టిన వాటీజ్ యువర్ నేమ్, వాట్ ఆర్ యు స్టడీయింగ్ లాంటి ప్రశ్నలు సమాధానాలతో సహా గుర్తుకొచ్చాయి.

వాటికి సమాధానాలన్నీ ఒక పేరాగ్రాఫ్ లాగా మనసులోనే తయారు చేసుకుని కొంచె చదువుకున్నాయనలా కనిపిస్తున్న దగ్గరికెళ్ళి ఏకరువు పెట్టుకున్నాను. ఆ మహానుభావుడికి నా తిక్క ఇంగ్లీషు ఏం అర్థమైందో ఏమో.. ఇంకా కొన్ని ప్రశ్నలడిగాడు. వాటికి సమాధానాలివ్వడం నాకు తెలియక

గ్రాండ్ ఫాదర్, క్యాన్సర్, అడయార్ హాస్పిటల్, సీ, మదర్, సిస్టర్స్,  మిస్సింగ్ అని నాకు తెలిసిన ఇంగ్లీషు పదాలన్నీ ఒక వాక్యంలాగే కలిపేసి చెప్పేశాను.

ఆయనకి కొంచెం అర్థమై బస్సులో నాతో పాటే అక్కడే దిగేసి వేరే బస్సులో అడయార్ హాస్పిటల్ దగ్గర దింపాడు. కానీ ఆ హాస్పిటల్ మా తాత ఉండే హాస్పిటల్ లాగా కనిపించడం లేదు. ఆయన నన్ను ఆ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గరకు తీసుకెళ్ళాడు.  ఆయనకు  తెలుగు వచ్చు. తెలుగు వాళ్ళు కనిపించేసరికి నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన దగ్గర నా గోడంతా వెళ్ళబోసుకున్నాను.

“ఇంత పెద్ద మహానగరంలో అంత పరాకుగా ఉంటే ఎలా?” అని సున్నితంగా మందలించాడు నన్ను. మేం వచ్చింది అడయార్ కొత్త హాస్పిటల్ కనీ, ఇంకొంచెం ముందుకెళితే పాత హాస్పిటల్  వస్తుందనీ మా తాత అక్కడే ఉంటాడనీ చెప్పాడు. దాంతో నాకు మనం సరైన చోటుకే చేరుకున్నామనే నమ్మకం వచ్చింది. నన్ను అక్కడి దాకా తీసుకువచ్చినాయన అంతటితో ఆగకుండా పాత హాస్పిటల్ దాకా తీసుకుని పోయి మా తాత దగ్గర దిగబెట్టాడు. మా తాత కళ్ళనీళ్ళతో రెండు చేతులెత్తి అతనికో నమస్కారం చేశాడు. ఆయన ఆ చేతుల్ని కిందకు దించమని వారించి వెళ్ళిపోయాడు. ఆయనే గనక లేకపోతే నేనేమయ్యే వాడినో!

ఇదిలా ఉంటే బస్సులో నన్నొదిలేసి దిగేసిన ముసలాయన అజాగ్రత్తను గురించి అందరూ కాసేపు తర్జన భర్జలు పడి వెతుకులాట ప్రారంభించారు. దారిలో కనిపించిన వాళ్ళనంతా అడగడం మొదలు పెట్టారు. లాభం లేదు. వెతికి వెతికి విసిగి పోయి ఆసుపత్రికొచ్చి మా తాతకు విషయం చెప్పి టీవీల్లో, వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకునేశారు. అలా అక్కడికి వచ్చేసరికి నేను కనిపించాను. అప్పుడు వాళ్ళనుభవించిన భావన నేను మాటల్లో వర్ణించలేనిది. అసలే లేక లేక కలిగిన మగ సంతానాన్ని. వరప్రసాదంగా పుట్టానట. నేను పుట్టిన తర్వాత తిరువళ్ళూరు వీరరాఘవుల స్వామికి నా బరువు ధనం తూచి ఇచ్చారట. ఇంత సేపు ఎలా తట్టుకునిందో మా అమ్మ నేను కనిపించానని తెలియగానే నడిరోడ్డు మీదనే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడుండే వాళ్ళంతా ఏం జరిగిందోనని ఆసక్తిగా చూస్తున్నారు. మా అక్కవాళ్ళిద్దరు వచ్చి చెరో పక్కన కూర్చున్నారు.నేనెళ్ళి ఒళ్ళో పడుకుని కాసేపు గట్టిగా కౌగలించుకుని మొహం మీద నీళ్ళు చల్లితే గానీ లేవలేదు.

ఆ ముసలాయన “ఎంత పని జేసినావురా బాబూ! హాఫ్ ఏసినా ఫుల్లుగా ఎక్కేసేది, ఫుల్లేసినా ఎక్కలేదు గదరా నాయనా” అని పరాచికాలాడినాడు వాతావరణాన్ని తేలిక పరచడానికి

అందరూ పెద్దగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు సాయంత్రమే ఊరికెళ్ళిపోయాం. మరుసటి రోజు నుంచి మా తాత జ్వరంతో మంచమెక్కి వారం రోజులపాటు లేవలేదని తెలిసింది. ఈ సంగతి ఎప్పుడు గుర్తు చేసుకున్నా మా ఇంట్లో వాళ్ళు అదో రకమైన ఉద్వేగానికి లోనైపోతుంటారు.చిన్ననాటి ప్రపంచంలోకి మళ్ళా ఒకసారి

నిన్ననే మిట్టూరోడి పుస్తకం చదవడం పూర్తిజేసినా. ఆ కథల్లోని పాత్రలు ఇంకా అట్నే కళ్ళముందు కదలాడతా ఉండాయి.అవి పాత్రలయితే గదా.. చితికిపోయిన రైతన్న యధార్థ సిత్రాలు. కొద్దిగా చదివి కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళ ముందు సినిమా రీలు లాగా కదిలిపోతుండాయి. ఏదో సినిమా రచయిత చెప్పినట్టుగా మరిచి పోవడానికి అయేమన్నా  జ్ఞాపకాలా? మన జీవితాలు.

రైతు కుటుంబంలో బుట్టిన నాకు సేద్యం  కొత్తేం గాదు. కరువు కోరల పదునెంతో 2000-04 సంవత్సరాల మధ్యలో కరువుకాలంలో నీళ్ళకోసం మా కుటుంబం పడ్డ కష్టాల వల్ల తెలుసు. కాకపోతే కాసుల వేటలో బడి కాంక్రీటు అరణ్యంలో కొచ్చి పడ్డాక ఆ జ్ఞాపకాలన్నీ గుంటబెట్టి గంట వాయించేస్తిని. ఎప్పుడో ఒకప్పుడు ఊరికి బోయినా పచ్చంగా ఉండే పైర్లను బుల్లి పెట్టెలో బంధించి తీసుకొచ్చేసి ఆఫీసులో ఉండే వోళ్ళకి చూపిచ్చేసి సంబర పడిపోతా ఉండాను. కానీ ఆ సంబరం ఏ మాత్తరం విలువ లేనిదని ఇప్పుడీ కథలు చదివింతర్వాత తెలస్తా ఉంది. ఈ కథల్లో ఉండే ఆత్మ అటువంటిది. గడిచిపోయిన రోజులు ఎంత బాధాకరంగా నైనా ఉండనీ, నాకు మాత్రం అయే బాగుంటాయనిపిస్తాది అవి కూటికి గతిలేని రోజులైనా గానీ.

ఏది ఏమైనా కార్పోరేట్ ముసుగును చీల్చి నా చేయి బట్టి నిజ ప్రపంచంలోకి లాక్కుపోయినందుకు, నా బాల్యాన్ని మళ్ళీ జీవింపజేసినందుకు నామిని గారికి వందనాలు.