వెంకటగిరి సంస్థానం గురించిన ఆసక్తికరమైన కథ

ఈ మధ్యన నేషనల్ డిజిటల్ లైబ్రరీలో చరిత్ర పుస్తకాల కోసం వెతుకుతుంటే నానారాజన్య చరిత్రము అనే ఒక పుస్తకం దొరికింది. ఈపుస్తక రచయిత శ్రీరామ్ వీరబ్రహ్మం. 1918లో ప్రచురించారు. ఈ పుస్తకంలో వెంకటగిరి సంస్థానం గురించే కాక మరో పద్నాలుగు సంస్థానాల గురించిన చరిత్ర ఉంది. వెంకటగిరి సంస్థానం గురించి చదువుతుండగా నాకు మా పెద్దవాళ్ళ ద్వారా విన్న ఓ ఆసక్తికరమైన కథకు ఆధారం దొరికింది. ఇది వెంకటగిరి సంస్థానం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ.

************

నిజాం కాలంలో పద్మనాయక వంశానికి చెందిన చెవిరెడ్డి అనే రాజు ఉండేవాడు. అప్పటి నైజాం రాజ్యంలోని నల్లగొండ మండలం లోని ఆమనగల్లు రాజధానిలోనూ, పిల్లలమఱ్ఱి అనే రాజధానిలోనూ నివసిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈయనకు పూర్వము పదవతరం వాడైన హేమాద్రి రెడ్డి అనే రాజు పరిపాలనలో బాగా ధనాన్ని సంపాదించి దాన్ని ఒకచోట నిక్షేపించాడు. దానిపైన ఒక వేదిక కట్టించి ఒక మర్రి చెట్టును నాటాడు. దానికింద ఒక భైరవ విగ్రహాన్ని ప్రతిష్టించి ఒక కోరిక కోరుకున్నాడు.

“స్వామీ! మీరీ సంపదను కాపాడి, నా సంతతిలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వాడు, సత్కర్మలు చేయగల వాడు, సద్గుణ సంపన్నుడు అయిన వానికి అందజేయవలెన” ని దాని సారాంశం.

ఇది తెలియపరచడానికి రహస్యముగా ఒక శిలాశాసనాన్ని కూడా స్థాపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చెవిరెడ్డి ఒకసారి వేటకోసమని ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే సమయంలో వారి దివాణంలో పనిచేసే రేచడు అనే హరిజనుడు వ్యవసాయం చేయడం కోసం పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డం పడింది. అది పూర్వం హేమాద్రి రెడ్డి చెక్కించిన రహస్య శిలా శాసనం. అదే సమయానికి తమ రాజు అటువైపు వెళుతుండగా రేచడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ శాసనం గురించి చెప్పాడు.

శాసనాన్ని చదివిన చెవిరెడ్డి తన పూర్వీకులు దాచిన నిధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, దాని ప్రక్కనే ఉన్న మర్రి చెట్టును ఆశ్రయించుకున్న భేతాళుడు ఈయన ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. తన మాయలతో మేఘాలు, ఉరుములు, మెఱుపులు సృష్టించి ఆ మర్రి చెట్టు వారిపై పడేలా చేశాడు. రేచడు ఇది చూడగానే మూర్ఛపోయినాడు. కానీ చెవిరెడ్డి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. భేతాళుడు ఇతని శక్తిని మరింతగా పరీక్షించదలచి భీకరరూపంతో చెవిరెడ్డి ముందుకు దూకాడు. అంత ఆ రాజు తన కత్తి దూసి నరకబోతుండగా భేతాళుడు నిజరూపంలో ప్రత్యక్షమై అతని ధైర్య సాహసాలకు మెచ్చాననీ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అపుడా రాజు తమ వంశం వారంతా రాజ్యభోగాలతోనూ, శౌర్య ధైర్యాధి గుణములను కలిగి ఉండేలాగుననూ, తాము యుద్ధానికి వెళ్ళేటపుడు భేతాళుడు ముందు నడిచేలా వరాలను కోరుకున్నాడు. భేతాళుడు ఆ వరాలను అనుగ్రహించి అంతర్థానం అయ్యాడు.

తర్వాత ఆ రాజు ఆనందంతో ఆ సంపదను వెలికితీయడానికి ప్రయత్నించగా, పక్కనే భైరవమూర్తి నుంచి అశరీరవాణి ఒకటి వినిపించింది.

“ఓ రాజా, నీవు ఈ సంపదను తీసుకోవడానికి అర్హుడవే కానీ, ఈ సంపదను కొన్ని క్షుద్ర భూతములు ఆశించి ఉన్నాయి. వాటికి ఒక నరబలి ఇచ్చి ఈ సంపదను తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది” అని పలికింది.

రాజు నరహత్యకు వెనుకాడుతూ ఆలోచిస్తుండగా మూర్ఛ నుంచి తేరుకున్న రేచడు జరిగిన విషయం తెలుసుకుని తనను బలి ఇచ్చి ఆ ధనాన్ని తీసుకోమన్నాడు. కానీ ఆ రాజుకి తన దివాణంలో నమ్మకస్తుడైన అతనిని బలి ఇవ్వడానికి మనసొప్పలేదు. అప్పుడు రేచడు “మీరు ఈ ధనాన్ని మంచి కోసమే వినియోగించగలరని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కోరిన కోరికలు తీర్చి నన్ను బలి ఇస్తే మీకు నరహత్య పాపం అంటదు.” అన్నాడు. దాంతో రాజు రేచడు కోరినట్లు తమ వంశం వారినందరినీ తరతరములకు రాజా వారి వంశీయులు పోషించుటకు, తమకు వివాహం జరిగేటపుడు రేచని వంశీయులకు వివాహం జరిగేలా అంగీకరించి వానిని బలియిచ్చి ధనాన్ని స్వీకరించాడు. భేతాళుని కారణముగా ఈయనకు భేతాళ నాయడనని కూడా పేరు.

వెంకటగిరి రాజుల పేర్ల వెనుక యాచేంద్ర అని చేర్చుకుంటారు. ఉదాహరణకు ఇటీవలి తరానికి చెందిన వారి పేర్లు గోపాలకృష్ణ యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర. ఈ రేచడి పేరే తర్వాతి తరంలో యాచమ నాయుడనీ, యాచేంద్ర అనీ రూపాంతరం చెంది ఉండవచ్చని నా ఊహ.

God lived with them – పుస్తక పరిచయం

శ్రీరామకృష్ణ పరమహంస యొక్క సన్యాసాశ్రమ శిష్యుల జీవితాల గురించి స్వామి చేతనానంద రాసిన పుస్తకం ఇది. ఒక మిత్రుని ద్వారా నా దగ్గరకు వచ్చింది. శ్రీరామకృష్ణులతో స్వామీ వివేకానంద తో సహా మరో పదిహేను మంది ప్రత్యక్ష శిష్యుల అనుభవాల సారమే ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవక ముందు నాకు కేవలం వివేకానంద గురించి మాత్రమే తెలుసు. కానీ మిగతా పదిహేను మంది కూడా ఏమాత్రం తీసిపోని వారు. వీరిలో బాగా చదువుకున్న వారి దగ్గర్నుంచి కేవలం అక్షర జ్ఞానం లేని వాళ్ళు, సంసారం నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు.

నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు బాగా చదివే వాడిని. కానీ కొంచెం పరిపక్వత వచ్చాక అవి రుచించడం మానేశాయి. ఎందుకంటే వాటిలో ఉండే విషయాలు చాలావరకు ఉపదేశ ధోరణి లో ఉండటమే. ఇవి చదివినంత సేపు బాగానే ఉన్నా ఆచరణలో పెట్టాలంటే కష్టంగా ఉండేది. అప్పుడే శ్రీకాళహస్తి శాఖా గ్రంథాలయంలో కొంతమంది ప్రముఖుల జీవితాల్ని చదవడం ద్వారా కొంత స్ఫూర్తి పొందాను. మనసు కొంచెం ఆధ్యాత్మిక జీవనం వైపు మొగ్గాక ఈ పుస్తకం చదవడం ప్రారంభించాను. ఎందుకంటే ఈ పుస్తకంలో రాసిందంతా శ్రీరామకృష్ణుల శిష్యులు తమ జీవితంలో ఆచరించి చూపించిన విలువలే. నిజజీవిత సంఘటనలు చదివితే అరే వాళ్ళు అలా ఆచరించి చూపించినపుడు మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు? అని స్ఫూర్తి నిస్తుంది కదా!

ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో విచిత్రమైన గాథ. అందరూ విరుల తావికి ఆకర్షించబడిన తుమ్మెదల్లాగా భగవత్ జ్ఞానం కోసం శ్రీరామకృష్ణుని చేరిన వారే. వీళ్ళ గురించి చదివే దాకా సన్యాసం అంటే సమాజంతో సంబంధం లేకుండా తమ లోకంలో తాము బతకడమన్న అభిప్రాయం ఉండేది నాకు. కానీ వీరు మాత్రం సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కూడా గురువు యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి, వైదిక ధర్మ ప్రాశస్త్యాన్ని వివరించడానికి దేశ విదేశాలు పర్యటించారు. కేవలం గురువాజ్ఞ కోసం నానా కష్టాలు పడ్డారు. పేదరికాన్ని చూసి చలించిపోయారు. మానవ సేవను తమ జీవితాల్లో ప్రధాన భాగం చేసుకున్నారు.

రామకృష్ణులకు ప్రియమైన శిష్యులంతా కారణ జన్ములే. వీళ్ళందరూ పూర్వ జన్మలో ఎవరో రామకృష్ణులు ఏదో ఒక సందర్భంలో తెలియజేశారు. శిష్యులను ఎవరి తత్వానికి తగ్గట్టు వారికి శిక్షణ ఇచ్చేవాడు. మంచి చదువరులైతే జ్ఞానమార్గం, అంతగా చదువులేని వారికి భక్తిమార్గం ద్వారా ఉపదేశం చేశాడు. అలాగే సన్యాసాశ్రమ శిష్యులకు బోధించేటపుడు గృహస్థులకు దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు.

రామకృష్ణులు మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఓ సారి స్వామీ వివేకానంద ఆయనకు దగ్గర్లోనే కూర్చున్నాడు. రామకృష్ణులు గొంతు క్యాన్సర్ వల్ల విపరీతమైన బాధతో ఉన్నారు. వివేకానంద మనసులోనే ఇలా అనుకున్నాడు. “మీరే భగవంతుని ఇప్పుడైనా ప్రకటించగలిగితేనే నేను మీరు నిజంగా ఆ పరమాత్మయే అని నమ్ముతాను.” వెంటనే శ్రీ రామకృష్ణులు వివేకానంద వైపు చూసి

“ఎవరైతే రాముడిగా, కృష్ణుడిగా వచ్చాడో వారిద్దరే ఇప్పుడు శ్రీరామకృష్ణుడిగా ఈ శరీరంలో ఉన్నాడు” అని ప్రకటించాడు. వెంటనే వివేకానందకున్న భ్రమలన్నీ కరిగిపోయాయి.

అలాగే నరేంద్రుడి (వివేకానంద) జననం ముందు కూడా రామకృష్ణులకు లీలామాత్రంగా ఓ దృశ్యం గోచరించింది. ఒక రోజు రామకృష్ణులు సమాధి స్థితిలో ఉండగా ఆయన మనసు ఓ వెలుగు రేఖల వైపు ప్రసరిస్తూ వెళుతోంది. ఆయనకిరువైపులా అనేక దేవతా మూర్తులు గోచరిస్తున్నాయి. అలా సాగుతూ దేవతా మూర్తులనూ, అన్నీ అంతరాలన్నీ దాటుకుంటూ ఓ శూన్యమైన స్థితికి చేరింది. వెంటనే ఆయనకు సప్తర్షులు కనిపించారు. ఈ రుషులు తమ తపశ్శక్తితో కేవలం మానవులనే కాక దేవుళ్ళను కూడా అధిగమించినట్లు ఆయనకు అనిపించింది. అలా చూస్తుండగా కొన్ని వెలుగు రేఖలు కలిసి ఒక దివ్యమైన స్వరూపం కలిగిన బాలుడిగా రూపుదిద్దుకొన్నాయి. ఆ బాలుడు నెమ్మదిగా వచ్చి సప్తర్షులలో ఒకరి దగ్గరకు వచ్చి  మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా పిలుస్తూ సమాధి స్థితి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ అధ్బుతమైన స్పర్శ తగలగానే ఆ రుషి నెమ్మదిగా కళ్ళు తెరిచి అర్ధ నిమీలిత నేత్రాలతో ఆ బాలునివైపు చూశాడు. ఆ బాలుడు పరమానందభరితుడై ఆ రుషితో ఇలా అన్నాడు “నేను కిందకు వెళుతున్నాను. మీరు కూడా నాతో పాటు రావాలి.” ఆ రుషి మౌనంగా ఉండి పోయాడు. కానీ ఆయన చిరునవ్వే అంగీకారంగా తోచింది.  నరేంద్రుడు తన దగ్గరకు రాగానే రామకృష్ణులకు ఆ ఋషే గుర్తుకు వచ్చాడు.

తరువాత ఆ దివ్యశిశువు తనేనని కూడా ప్రకటించాడు.

మరో శిష్యుడు రాఖల్ (బ్రహ్మానంద) రాక మునుపు ఆయనకు కాళికా దేవి స్వప్నంలో సాక్షాత్కరించి ఆయన ఒళ్ళో ఒక బిడ్డనుంచి “ఇదిగో మీ అబ్బాయి” అన్నది. ఆయన ఆశ్చర్యపడి “ఏవంటున్నావ్ తల్లీ! నాక్కూడా సంతానమా?” అని అడిగాడు.  ఆమె చిరునవ్వు నవ్వుతూ “దైవిక సంతానమేలే!” అన్నది. అంతతో ఆయన సంతృప్తి పడ్డాడు.  రాఖల్ ఆయన దగ్గరకు రాగానే అతన్ని కాళికా దేవి వరప్రసాదంగా గుర్తించాడు.  రాఖల్ గురించే ఇంకో సారి మరో దృశ్యం సాక్షాత్కరించింది. ఇద్దరు బాలురు గంగానదిపై వికసించిన ఓ పెద్ద కమలంపై నాట్యమాడుతున్నారు. ఒకరేమో శ్రీకృష్ణ పరమాత్మ. మరొకరు కాళికాదేవి తన ఒడిలో ఉంచిన పసిపాపడిగా గుర్తించాడు. రాఖల్ జన్మ వృత్తాంతాన్ని గురించి ఇతర శిష్యులకు చెబుతూ శ్రీరామకృష్ణులు “రాఖల్ కు తన నిజ స్వరూపం తెలిసిన మరుక్షణం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండబోడు. అంతలోపు అతను నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అతనికి తెలియకుండా గోప్యంగా ఉంచండి.” అని చెప్పాడు.

సన్యాసులైనా వారి జీవితం కూడా సుఖదుఃఖాలకు కోప తాపాలకూ అతీతమేమీ కాదు. అయితే వారు అలాంటి వాటిని ఎలా పరిష్కరించుకున్నారో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి కోపం వచ్చిన కేవలం కొద్ది సేపు మాత్రమే. తర్వాత ఎంతో ప్రేమగా కలిసిపోయేవారు.  తమ వ్యక్తిత్వాన్ని మలచడానికి, సాధన సక్రమమైన మార్గంలో పెట్టడానికి గురువు తమ పట్ల కఠినంగా ప్రవర్తించినా ప్రేమగా అర్థం చేసుకున్నారు.

గురువు గారు పరమపదించిన తర్వాత కనీసం తినడానికి తిండి లేకపోయినా సన్యాసం నుంచి పారిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా తమ గురువు మీద అచంచలమైన విశ్వాసంతో కేవలం ఒక్కపూట భోజనం తిని, లేదా రోజుల తరబడి పూర్తి ఉపవాసాలున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత రామకృష్ణులు తన గృహస్థాశ్రమ శిష్యుడైన సురేంద్ర నాథ్ మిత్రాకు కలలో కనిపించి తన శిష్యుల పరిస్థితి గురించి చెప్పి వారికి ఏదో దారి చూపించమన్నాడు. ఆయన కొంత నెల నెలా కొంత ధన సహాయం చేయడంతో ఒక పాడుబడ్డ బంగళాను అద్దెకు తీసుకుని అందులో తమ సాధనను కొనసాగించారు.


రామకృష్ణులు తన శిష్యుల్ని పరీక్షించినట్టే శిష్యులు కూడా తమ గురువును అంతకంటే ఎక్కువగానే పరీక్షించారు. ఒక్కోసారి కావాలనే భిక్షకు వెళ్ళకుండా “మా గురువు సదా మా అండగా ఉండేది నిజమే అయితే ఆయనే మాకు భోజనం సమకూర్చుగాక!” అనుకుంటూ కూర్చుంటే ఏదో విధంగా వారికి తినడానికి ఏదో ఆహారం దొరికేది. కాలినడకన దేశమంతా యాత్రలు చేస్తూ అడవుల్లో, పర్వతాల్లో దారి తప్పిపోయినప్పుడల్లా గురువు మీద భారం వేసి నడుస్తూ వెళుతుంటే ఏదో జనావాసాలను చేరుకునే వారు. ఇలా జరిగినప్పుడల్లా వారికి గురువుపై విశ్వాసం రెట్టింపయ్యేది.

గురుసేవలో వారు ఎంత తరించిపోయారంటే ఆయన పరమపదించిన తర్వాత కూడా బతికున్నప్పుడు ఎలాగైతే సేవలు చేసేవారో అలాగే సేవలు చేసేవారు. ఆయనకిష్టమైన ఆహారపదార్థాల్ని వండిపెట్టేవారు. ఆయన పడుకున్న పడకను శుభ్రంగా ఉంచేవారు. విసనకర్రతో విసురుతూ నిద్రపుచ్చేవారు. ఇలా రామకృష్ణుల సేవలో తరించిపోయిన  శశి కి వివేకానంద తర్వాత రామకృష్ణానంద అని నామకరణం చేశాడు.

ఇలా ఈ పుస్తకంలో ఎన్నో సంఘటనలు నన్ను కదిలించాయి, ప్రభావితం చేశాయి. ఒక పుస్తకం చదివాక అందులో విషయాలు మనకు ఎంతకాలం వరకు మళ్ళీ గుర్తుకు వస్తాయో, ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందో దాన్ని బట్టి పుస్తకం గొప్పతనాన్ని అంచనా వెయ్యొచ్చు. అలా ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పుస్తకం!

అన్వేషణ – అనుభూతి: పుస్తక సమీక్ష

ఈ రోజు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ఏదైనా పుస్తకం చదువుదాం అని వెతుకుంటే యథాలాపంగా “అన్వేషణ – అనుభూతి” అనే పుస్తకం పైకి నా దృష్టి మళ్ళింది. ఆ సమయంలో ఏం అన్వేషించాలో తెలియని అన్వేషణ నాది. ఈ పుస్తకంలో అన్వేషణ దేని గురించో చూద్దామని పుస్తకం తెరిచా. రచయిత డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి. “ఇంతకుముందు ఈ పేరెప్పుడూ విన్నట్టు లేదే. అయినా పేరున్న రచయితల పుస్తకాలు ఎప్పుడూ చదివేవేగా; చూద్దాం ఈ పుస్తకంలో ఏముందో?” అనుకుంటూ పేజీ తిప్పాను. ప్రచురణ కర్తలు: ది వరల్డ్ టీచర్ ట్రస్టు సోదర బృందం, అమలాపురం అని రాసి ఉంది. ఇంకా 1982 లో ముద్రించబడినట్టుగా రాసుంది ఆ పుస్తకంలో.

ఈ పుస్తకం దేని గురించి రాశారో పరిచయ వాక్యాలు కొన్ని చదివేసరికి అర్థమయ్యింది. అప్పట్లో విద్యార్థులు తమ యవ్వనంలో విపరీతమైన భావావేశపు తుఫానులో కొట్టుకుపోతుంటే కొన్ని స్వార్థ శక్తులు వారిని తమ రాజకీయాలకు, మత ప్రయోజనాలకు, దేశ విద్రోహ చర్యలకు వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆలంబనగా డాక్టర్ కృష్ణస్వామి తన ఆత్మకథనే ఈ పుస్తకంగా రాశారు. నా చిన్నతనంలో, చదువుకునే రోజుల్లో నక్సలిజం ప్రభావం అంతగా లేకపోయినా, అప్పట్లో బాగా చదువుకున్న వాళ్ళు, మేథావులు కూడా సమాజాన్ని బాగుచేయాలనే ఉద్దేశ్యంతో అడవుల బాట పట్టేవారని విన్నాను. “అలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు?” అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నాను. అందుకు ఈ పుస్తకంలో కొంత సమాధానం దొరకవచ్చని చదవడం మొదలుపెట్టాను.

క్రిష్ణస్వామి గారు ఈ పుస్తకంలో తాను చిన్నతనం నుంచి పెద్దయ్యేంత వరకు తన ఆలోచన స్రవంతీ ఎలా సాగిందీ క్లుప్తంగా, స్పష్టంగా వివరిస్తారు. చిన్నతనంలోనే ఆయన్ను సమాజంలోని తారతమ్యాలు, కుల వర్గ వైషమ్యాలు మొదలైనవి ఆలోచింపజేశాయి. వాటిని ఎలా రూపు మాపాలో ఆయన అనునిత్యం మథనపడుతూ ఉంటాడు. ఆ మార్గంలో ఆయన ఎవరెవరినీ కలుసుకున్నదీ, ఎలా ఇంటరాక్ట్ అయిందీ వివరిస్తాడు. అలా ఆయన ఎమ్మే చదివేటపుడు తనతో భావ సారూప్యత గల సీనియర్లతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు కృష్ణస్వామిని “విప్లవ మార్గం” లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన వారి పద్ధతులలో లోటుపాట్లను ఎత్తి చూపుతాడు. వాళ్ళు తమ మార్గం సరైంది కాకపోతే, సరైన మార్గం ఏదని అడుగుతారు. ఆయన నా అన్వేషణ అందుకోసమే అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తారు. అలా కొంతకాలం తనలోతానే మథనపడి ఈ సమాజాన్ని బాగు చేసే మార్గం తన వద్ద లేదనీ, అలా బతకడం కన్నా చనిపోవడమే మేలనుకుంటాడు. చివరికి తన గురువు సాహచర్యంలో జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు.

ఇలాంటి విషయాల గురించి బొందలపాటి గారు తన బ్లాగులో తరచుగా రాస్తూ ఉంటారు. బొందలపాటి గారూ, ఒక వేళ మీరు ఇదివరకే ఈ పుస్తకం చదవకుండా ఉంటే ఈ టపా మీ కోసమే!

*పుస్తకం కేవలం 49 పేజీలు మాత్రమే. ప్రింట్ లో ఉన్నదీ లేనిదీ తెలియదు. ఆన్‌లైన్ లో మీరూ చదవాలనుకుంటే పైన పుస్తకం పేరులో ఇచ్చిన లింకు మీద నొక్కి చదవచ్చు.

సాంకేతిక పుస్తకాల సమీక్షలు… తెలుగులో

పుస్తకం.నెట్ వారు ఈ నెల ఫోకస్ లో భాగంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచే పుస్తకాల సమీక్షలకు చోటివ్వడం ముదావహం. అందులో మొదటి వ్యాసం నాది కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చరిత్రను కీలకమైన మలుపు తిప్పిన సీ భాష కు సంబంధించిన పుస్తకాన్ని పరిచయం చేశాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. అలాగే మీకు నచ్చిన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాల గురించి కూడా రాయండి.