ఐన్‌స్టీన్ – ఆసక్తికర సంఘటనలు

ఐన్‌స్టీన్ ఎంత గొప్ప శాస్త్రవేత్తో మనందరికీ తెలుసు. ఆయన దగ్గర పని చేసే డ్రైవర్ ఐన్‌స్టీన్ ఉపన్యాసం ఇస్తున్నపుడు వెనుక వరుసలో కూర్చుని ఆసక్తిగా ఆలకిస్తుండే వాడు. అలా విని విని ఆయన తరచుగా చెప్పే కొన్ని అంశాల మీద ఓ అవగాహన వచ్చింది.

ఓ సారి సమావేశానికి వెళుతుండగా డ్రైవర్ అక్కడ తనే ఉపన్యాసం ఇచ్చేందుకు అవకాశం ఇమ్మన్నాడు. ఐన్‌స్టీన్ అతనికి ఓ అవకాశం ఇద్దామని సరేనన్నాడు. మధ్యలో కారు ఆపి ఒకరి రూపాలు మరొకరికి మార్చుకున్నారు.
సమావేశంలో ఐన్‌స్టీన్ రూపంలో ఉన్న డ్రైవర్ వేదికనెక్కి అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చేశాడు. అలవాటు ప్రకారం అందరూ చప్పట్లతో అభినందించారు. వెనుక కూర్చున్న ఐన్‌స్టీన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.
అంతలోనే సభికుల్లోనుంచి ఒకరు లేచి ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు అతనికి వెంటనే సమాధానం స్ఫురించలేదు. వెంటనే సమయస్ఫూర్తితో ఆలోచించి

“ఇంత మాత్రానికి నేనెందుకు? మా డ్రైవర్ సమాధానం చెబుతాడు చూడు”. అంటూ వెనుక కూర్చున్న అసలు ఐన్‌స్టీన్ వైపు చూపించేశాడు.

————————————————————-

ఐన్‌స్టీన్ భార్య చాలా సార్లు అతన్ని విధులకు హాజరయ్యేటపుడల్లా కనీసం మంచి డ్రస్సులు వేసుకుని వెళ్ళమని పోరుతూ ఉండేది. కానీ అవన్నీ అంతగా పట్టించుకోని ఐన్‌స్టీన్ “అక్కడంతా నాకు తెలిసిన వాళ్ళేగా! అంత అవసరం లేదులే” అని తోసి పుచ్చేసేవాడు.
చివరకి ఐన్‌స్టీన్ తన మొట్టమొదటిసారిగా ఓ పెద్ద కాన్ఫరెన్స్ కు హాజరయ్యే సమయం వచ్చింది. కనీసం అప్పుడైనా ఆ మంచి దుస్తులు వేసుకోమని బ్రతిమాలింది ఆవిడ. అందుకు ఐన్‌స్టీన్
అక్కడ నాకుతెలిసిన వాళ్ళెవరూ లేరుగా! ఎందుకులే” అని నిరాకరించేశాడు.

————————————————————

ఓ సారి ఎవరో ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతాన్ని సాధ్యమైనంత సరళంగా చెప్పమంటే ఈ ఉదాహరణ ఇచ్చాడు.

“నువ్వు బాగా కాలుతున్న రాతి పై కూర్చున్నావనుకో క్షణాలు కూడా భారంగా గడుస్తాయి. అలాగే ప్రియురాలి ఒడిలో పడుకును ఉన్నావనుకో యుగాలు కూడా క్షణాల్లా గడిచిపోతాయి. సాపేక్ష సిద్ధాంతం దీని ఆధారం చేసుకుని రూపొందించిందే”

స్వామీ వివేకానంద ఛలోక్తులు

 స్వామీ వివేకానంద
స్వామీ వివేకానంద

స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…

  • ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశం లా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర్ సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నాడు.
  • మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
  • ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు.