ఓ తల్లి కడుపు కోత… కలైతే

అమ్మతో కలిసి పెళ్ళి చూపుల్నించి తిరిగి వస్తున్నాను. బస్సులో ఓ మూలగా పక్క పక్క సీట్లే మావి.
“ఏరా అమ్మాయి నచ్చిందా?” అమ్మ అడిగింది
ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాను.
“ఏరా నిన్నే అడిగేది… నీకిష్టం లేకపోతే ధైర్యంగా చెప్పు” సున్నితంగానే మందలించింది
“నాకు అంతగా నచ్చలేదమ్మా” ధైర్యంగా చెప్పేశాను అమ్మతో
ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన అమ్మకు అలా అంటే ఎలా బాధ కలిగిస్తుందో నాకు బాగా తెలుసు. మా అమ్మకే అలా ఉంటే ఇక అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి చెప్పనక్కర లేదు. అందుకనే అమ్మ గుచ్చి గుచ్చి అడిగితేగానీ నాకా మాట చెప్పడానికి నోరు రాలేదు. అలాగని నా అభిప్రాయాన్ని దాచుకోలేను. ఇది జీవితకాలపు నిర్ణయం. అందుకనే ఖచ్చితంగా చెప్పేశాను.
“సరేలే ఏదైనా నీకు నచ్చితేనే”…నా అభీష్టానికి వ్యతిరేకంగా మా అమ్మ ఏ పనీ చెయ్యదు.
అది కాదమ్మా “నా నిర్ణయం ఒక్కటే, అమ్మాయి నాకు జోడీ సరిపోతుందా,గుణం మంచిదేనా, కుటుంబం మంచిదేనా అని చూడండి చాలు” ఒక్క మాటతో సరిపెట్టేశాను.
కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం. మేము ప్రయాణిస్తున్న బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. కొంతమంది ముసుగు మనుషులు బిలబిలా లోనికి జొరబడ్డారు. బస్సులో ఉన్న అందరిపైనా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. తూటాలు అమ్మకెక్కడ తగులుతాయేమోనని భయంతో ఆమె తలను వంచి నా భుజంపై వాల్చుకున్నాను.
ఎక్కడి నుంచి వచ్చాయో కొన్ని తూటాలు ఒకదాని వెంబడి మరొకటి వరుసగా నా మెదడు లోకి దూసుకుపోయాయి. నాకు ఏమీ నొప్పిగా అనిపించలేదు. మెదడులో ఏదో పురుగులు పారాడుతున్న అనుభూతి. చేత్తో తాకి చూసుకున్నాను. వెచ్చటి రక్తం నా వేలికి తగిలింది. మరుక్షణం నాకు స్ప్రహ తప్పింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు అమ్మ కూడా స్పృహ కోల్పోయింది.

ఉలిక్కిపడి నిద్ర లేచాను. నీళ్ళు తాగుదామని కంగారుగా గది బయటకు వచ్చాను.
“హా లేచావా? ఇప్పుడే నిద్రలేపుదామని అనుకుంటూ వస్తున్నాను. ఇంద టీ తీసుకో” అని కప్పు చేతికందించింది మా అమ్మ. జరిగింది కల అని తెలుసుకోవడానికెంతో సేపు పట్టలేదు నాకు. నెమ్మదిగా తేరుకుని అమృతం లాంటి తేనీటి సేవనంలో మునిగిపోయాను.

ప్రేరణ: పెళ్ళి చూపులకు వెళ్ళి వస్తుండగా ఒక రైలు ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోయిన ఒక తల్లి యదార్థ కథ ఆధారంగా, నా స్వీయానుభవాలను రంగరించి అల్లుకున్న ఒక చిన్న సంఘటన. పెళ్ళికి ఎదిగి వచ్చిన కొడుకును ఒక్కసారిగా మృత్యువు కబళిస్తే, ఆ కన్నతల్లి ఆవేదన ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే హృదయవిదారకంగా అనిపించింది. జరిగిన సంఘటన ఒక కల అయ్యుంటే ఆ తల్లి ఎంత సంతోషించేదో అనే నా ఆలోచనకు అక్షర రూపమే ఈ టపా.

అడుగు జాడలు

గాఢ నిద్రలో ఉండగా ఒకతనికి ఒక అద్భుతమైన స్వప్నం సాక్షాత్కరించింది. అందులో అతను ఒక దివ్యపురుషుడితో కలిసి ఒక సుందరమైన సముద్ర తీరాన నడుస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తుంటే అతని జీవితం మొత్తం నీలి మేఘాల్లో దృశ్యాలుగా కనిపిస్తోంది. వాటి వెంటనే రెండు జతల పాదముద్రలు కూడా కనిపించాయి. ఒక జత దేవుడివి. దాన్ని అనుసరిస్తూ తనవి.

అలా అన్నీ దృశ్యాలు అతని ముందు సాక్షాత్కరించాక కొన్ని చోట్ల అడుగుల జాడల్లో అతనికి ఏదో చిన్న తేడా కనిపించింది. అతని జీవితంలో అత్యంత కష్టమైన పరిస్థితుల్లో అతనికి కేవలం ఒక జత పాదముద్రలు మాత్రమే కనిపించాయి.

అతను దేవుడి వైపు తిరిగి,

“నిన్ను అనుసరిస్తే కష్ట సుఖాల్లో నాతోటే ఉంటానన్నావు. కానీ నా కష్ట సమయాల్లో ఒక జత పాదముద్రలే కనిపిస్తున్నాయి. నాకు నువ్వు బాగా అవసరమయినప్పుడే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు?” అని ప్రశ్నించాడు.

“నా భక్తులంటే నాకు ఎనలేని ప్రేమ. నువ్వనుకుంటున్నట్లు కష్ట సమయాల్లో నేను నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆ కనిపించే పాదముద్రలు నావే. ఎందుకంటే ఆ సమయంలో నిన్ను మోస్తుంది నేనే”

మీ చిరునవ్వును చెదరనీయకండి

ఒక పాప రోజూ స్కూల్ కి నడిచి వెళ్ళి వస్తుండేది. ఒక రోజు వాతావరణం మేఘావృతమైనప్పటికీ స్కూల్ కి బయలుదేరింది. తిరిగి ఇంటికి వస్తుండగా గాలులు బలంగా వీచసాగాయి. ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి.  ఆ పాప తల్లికి ఆందోళన మొదలైంది. పాప భయపడుతుందేమోనని ఆమె భయం. ఆమె వెంటనే కారు తీసుకుని కూతుర్ని వెతుక్కుంటూ బయలు దేరింది.

అలా వెళుతుండగా దారి వెంబడే పాప నెమ్మదిగా భయం లేకుండా నడుస్తూ ఉండటం కనిపించింది. మెరుపు మెరిసినప్పుడల్లా పాప ఆగి నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతోంది. కారు నెమ్మదిగా కూతురి దగ్గర ఆపి పాపని ఇలా అడిగింది.

“ఎందుకమ్మా అలా మెరుపు మెరిసినప్పుడల్లా ఆగి నవ్వుతున్నావు?” అని అడిగింది.

“పై నుంచి దేవుడు నన్ను ఫోటో తీస్తున్నాడమ్మా. అందుకనే అలా నవ్వుతూ ఫోజిస్తున్నా” అందా పాప.

అందుకే ఎంతటి కష్టంలోనైనా మీ మోము నుండి చిరునవ్వును చెదరనీయకండి.

ప్రళయ స్వప్నం

ఓ చల్లని సాయంకాలం.

“తమ్ముడూ! నీ మేనకోడలు బాగా అల్లరి చేస్తుందిరా! కాస్త మేడమీదకు తీసుకెళ్ళి ఆడించరాదూ!” అక్క అభ్యర్థన.

సంవత్సరం వయసున్న మేనకోడల్ని భుజానికెత్తుకొని మేడ పైకి ఎక్కాను. వెల్లకిలా పడుకుని పైన కూర్చోబెట్టుకున్నాను. దాని చిరునవ్వులు చూస్తూ ప్రపంచాన్ని మరిచి పోతున్న అనుభూతి.

అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. వర్షం వచ్చేటట్లుంది. పైకి లేచి పాపనెత్తుకుని చుట్టూ పరికించాను.

ఆశ్చర్యం!

పరిసరాలన్నీ ఏమయ్యాయి? ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయేమిటి? కనుచూపు మేరలో నీళ్ళు, పొగమంచు తప్ప మరేమీ కనిపించడం లేదు. నిటారుగా నిలబడి ఉన్న పర్వతాలు మొత్తం మంచుతో కప్పబడి పోయాయి. నెమ్మదిగా నీటి మట్టం పెరుగుతోంది, మేము నిల్చున్న భవంతిని కూడా తన గర్భంలో దాచుకోవడానికి…

నాలో ఉన్న తాత్వికుడు “ఏదీ శాశ్వతం కాదు నాయనా!” అని శాంతంగా భోదిస్తున్నాడు. మరో వైపు భవబంధాలను తెంచుకోలేని నాలోని లౌకికుడు అన్ని వైపుల నుంచీ చుట్టుకు వస్తున్న ప్రళయం నుంచి తన్ను , తన కుటుంబాన్ని  కాపాడుకోవడం ఎట్లా? అని ఆలోచిస్తున్నాడు. క్రమంగా నీటి మట్టం పెరిగి అంతటినీ ముంచి వేసింది. అంతే….

దిగ్గున లేచాను…చుట్టూ చూస్తే గుర్రు పెడుతూ నిద్రపోతున్న నా స్నేహితుడు తప్ప ఇంకెవరూ కనిపించలేదు…