వానర రాజు

ఒకానొక కాలంలో హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు ఎనభై వేల సంఖ్యగల ఒక వానరజాతి నివసించేది. వాటన్నింటికీ బలశాలి, బుద్ధిశాలియైన ఒక వానరం రాజుగా ఉండేది. అవి నివసించే లోయ పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉండేది. అన్ని కాలాల్లో వాటి దాహార్తిని తీరుస్తూ, ఎండాకాలంలో చల్లదనాన్నిస్తూ జనావాసాల వైపుకు సాగిపోయేది. నది ఒడ్డునే మధురమైన ఫలాల్నిచ్చే ఒక చెట్టు ఉండేది. వసంత ఋతువు వచ్చిందంటే దాని పరిమళం ఆ లోయంతా వ్యాపించేది. ఎండాకాలం ఆ చెట్టు యొక్క దట్టమైన నీడ వానరాలన్నింటికీ ఎంతో ఆదరువు. శరదృతువు వచ్చిందంటే దాని ఘనమైన, తీయనైన పండ్లు వాటి ఆకలిని తీర్చేవి. అలా అవి ఆ చెట్టు నీడన సుఖంగా జీవనం సాగిస్తుండేవి.

కానీ వానరరాజు మాత్రం ఆ పండ్లను గురించి వేరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడమని వాటికి చెప్పేవాడు. అలా జరిగితే మానవులంతా వచ్చి వాటిని తరిమేస్తారని వానర రాజు భయం. కాబట్టి ఆ కోతులంతా తమ ప్రభువు చెప్పినట్లు ఆ పండ్లను మానవుల చేతిలో పడకుండా కాపలా కాస్తుండేవి. చెట్టు బాగా ఏపుగా ఎదిగేసరికి బాగా పెరిగిన కొమ్మలు నదీ ప్రవాహం మీదకు వాలి ఉండేవి. రాజాజ్ఞ మేరకు ఆ కోతులు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఆ కొమ్మల్లో పూత పూయగానే వాటిని తినేసేవి. మళ్ళీ తాము ఏమైనా పూత వదిలేసి ఉంటామేమోనని వేసవిలో కూడా పండ్లు ఉన్నాయేమో మరొక్కమారు పరికించేవి. ఆ విధంగా ఏ ఒక్కపండూ నీళ్ళలో పడి జనావాసాల వైపు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడేవి.


ఒకసారి కోతులు ఒక రెమ్మలో పూతను పొరబాటున వదిలేశాయి. వేసవిలో ఆ పండు కనపడకుండా ఆకులు కమ్మేశాయి. ఆ పండు బాగా పండి నదిలో పడిపోయింది. అలా కొట్టుకొని పోయి దూరంగా ఉన్న రాజు బ్రహ్మదత్తుని స్నాన ఘట్టం దగ్గర జాలర్లకు వలలో చిక్కింది. వాళ్ళు దాని పరిమాణాన్ని,పరిమళాన్ని చూసి అబ్బురపడి రాజుగారికి బహుమానంగా ఇస్తే మంచి ప్రతిఫలం దక్కుతుందన్న ఆశతో అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పండు రాజుకే గాక సభికులందరికీ ప్రీతిపాత్రమైంది. వారందరికీ ఇంకా తినాలనిపించింది. బ్రహ్మదత్తుడు వెంటనే ఆ పండు ఎక్కడ నుంచి వచ్చిందో వెంటనే కనుక్కోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.

ఆ పండు నదిలో దొరికింది కాబట్టి సైన్యాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళి వెతకమన్నాడు రాజు. కొన్ని రోజులకు వాళ్ళకి ఆ చెట్టు కనిపించింది. వాళ్ళు తిరిగి వచ్చి ఆ చెట్టు ఇంకా పండ్లతోనే నిండి ఉన్నదనీ, కానీ ఒక కోతిమూక వాటిని తింటూ ఉండటం చూశామని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అంతమంచి పండ్లు కోతుల పరం కావడమా? అని ఆలోచించి ఆ కోతులన్నింటినీ చంపివేస్తే తరువాత సంవత్సరం నుంచీ ఆ పండ్లన్నీ తమకే చెందుతాయని భావించాడు. కోతులు పారిపోకుండా ఒక భటుణ్ణి ఆ చెట్టుకు కాపలా పెట్టాడు.


కొన్ని కోతులు కొమ్మల చాటు నుంచి ఈ తతంగాన్నంతా తిలకిస్తున్నాయి. అవి ఎంతో బాధతో వచ్చి వానర రాజు దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. “మనం ఈ ఆపద నుంచి బయటపడేలా లేము. వేరే చెట్టు మీదకు వెళ్ళాలంటే చాలా దూరం. మనమంతా చనిపోతామేమో!” అన్నాయి.

వానర రాజు కొద్ది సేపు తమ పరిస్థితి గురించి ఆలోచించి ఒక పథకం వేసింది. “నేను బాగా బలిష్టంగా ఉన్నాను కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను.” అన్నది.

మరుసటి రోజు ఉదయాన్నే వానర రాజు ఒక్క ఉదుటున నదికి ఇవతల ఉన్న పండ్ల చెట్టు నుంచి నదికి అవతల ఉన్న మరో వృక్షం మీదికి దూకింది. ఆ వృక్షం యొక్క బలమైన, పొడుగ్గా ఉన్న ఊడని పట్టుకుని ఒక కొన బలమైన కొమ్మకు ముడివేసింది. మరో కొన తన కాలికి ముడివేసుకొన్నది. తిరిగి పండ్ల చెట్టు మీదకు లంఘించి ఓ కొమ్మని పట్టుకొంది. కానీ రెండు చెట్ల మధ్య కట్టడానికి ఆ ఊడ పొడవు సరిపోలేదు. ఇప్పుడు తన జాతిని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అలాగే కొమ్మని పట్టుకొని మిగతా వానరాలన్నింటినీ తన మీద నుంచి దాటి మరో చెట్టు మీదకి దూకి వాటి ప్రాణాలు రక్షించుకోమని కోరింది. కొన్ని గంటల పాటు ఆ ఎనభైవేల కోతులన్నీ ఆ రాజు మీదుగా దూకి నదికి అవతలివైపుకు చేరుకున్నాయి. చివరి కోతి దాటుకుని వెళ్ళేంత వరకూ తన శక్తినంతా కూడదీసుకుని పట్టుకుని ఉన్న రాజు చివరికి బాధతో మూలుగుతూ కిందపడిపోయింది. బ్రహ్మదత్తుడు ఈ శబ్దాన్నంతటినీ విని మేల్కొని ఉన్నాడు. తన ప్రజల కోసం ఆ వానర రాజు పడ్డ తాపత్రయమంతా కళ్ళారా చూశాడు. అది కింద పడిపోగానే సేవకుల్ని నీళ్ళు, నూనె తెచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించాడు.

“నువ్వు మీ ప్రజలను రక్షించడం కోసం చేసిన త్యాగం అమోఘమైనది.” బ్రహ్మదత్తుడు వానరరాజును ప్రశంసించాడు.

“వాళ్ళు నాయందు నమ్మకముంచారు. కాబట్టి నేను వారిని కాపాడి తీరాలి. వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక నిశ్చింతగా చనిపోవచ్చు. కానీ రాజా! ప్రేమ మాత్రమే నిన్ను గొప్ప రాజును చేస్తుంది. అధికారం మాత్రం కాదు.” అని చెప్పి అది కన్ను మూసింది.

వానర రాజు చనిపోతూ చెప్పిన ఆ మాటలు బ్రహ్మదత్తుడు ఎన్నడూ మరిచిపోలేదు. తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాడు. దానికోసం ఓ గుడి కూడా కట్టించాడు. అప్పటి నుంచి తన ప్రజలను కూడా అదే విధంగా పరిపాలిస్తూ గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు.

కాలుతున్న గుడిసె దేనికి సంకేతమో?

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ భగవంతుని రాకకో సంకేతం కావచ్చు.

అంబరీషుని కథ

మా ఊళ్ళో పాండురంగ భజన జరిగేటప్పుడు భజన పాట ప్రారంభంలో

“ప్రహ్లాద వరద గోవిందా.. గోవిందా

అంబరీష వరద గోవిందా…. గోవిందా” అని గోవింద పెడతారు.

ప్రహ్లాదుడిలానే అంబరీషుడు కూడా ఒక భక్తుడే అనుకున్నాను కానీ ఇప్పటి దాకా ఆయన కథ తెలుసుకోలేదు. ఈ మధ్య టీవీలో చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు విని వీరి గురించి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది.

అంబరీషుని కథ భాగవత పురాణంలో ఉంది. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. నభగ మహారాజు కుమారుడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు.

ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు.ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి, ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి, ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాసుడు అక్కడికి విచ్చేశాడు. ఆయనను అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుణ్ణి తన గౌరవ అతిథి గా ఉండమని అర్థించాడు అంబరీష మహారాజు. దుర్వాసుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్ళాడు.

దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది. నదీ స్నానానికని వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అంబరీషుడు తమ కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ దళం తో కొంత మంచి నీళ్ళు పుచ్చుకుని దీక్ష విరమించి దుర్వాస ముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహోదరుడయ్యాడు. దుర్వాస ముని కోపం గురించి తెలిసిందే కదా!

అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంటుకని లాగి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటుతో ఆ రాక్షసుణ్ణి సంహరించి దుర్వాసుడి వెంట పడింది. దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మ, ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదనీ, మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమన్నారు. చివరికి దుర్వాసుడు శ్రీ మహా విష్ణువును వేడుకున్నాడు. ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బంధీ కాబట్టి ఆయన్నే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే, ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్నమాట.

బావి

చాలా కాలం క్రితం రాజస్థాన్ లో గోవింద రాం అనే ఒకాయన ఉండేవాడు. ఆయనకు ఎడారి మధ్యలో ఒక బావి ఉండేది. చుట్టు పక్కల కొన్ని మైళ్ళ దూరానికంతా అదొక్కటే తాగునీటి వనరు. చాలామంది అక్కడికి వచ్చి తియ్యటి నీటిని తాగి దాహం తీర్చుకునేవారు. గోవింద రాం ఔదార్యమే లేకుంటే ఎడారి దాటేవాళ్ళు చాలా మంది దాహంతో చనిపోయే వాళ్ళు. అక్కడ నీళ్ళు ఉచితం. ప్రయాణికులు అక్కడ వారి దప్పిక తీరేదాకా తనివితీరా నీళ్ళు తాగి తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు.

అలా దాహం తీర్చుకునే వారిలో గోపాల్ దాస్ ఒకడు. మంచి నిజాయితీగల వ్యాపారి. అతను ప్రతి సంవత్సరం తన స్వగ్రామాన్ని విడిచి కాలినడకన గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణానికి వెళ్ళేవాడు. అది దాదాపు వెయ్యి మైళ్ళ ప్రయాణం. మైళ్ళ తరబడి వేడి ఇసుక తప్ప మరేమీ కనిపించని ఆ ఎడారిలో తిండి, నీరు దొరకడం కష్టంగా ఉండేది. ప్రతి సంవత్సరం గోపాల్ దాస్ ఈ బావిని నమ్ముకునే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకునేవాడు.

ఒక ఏడాది గోపాల్ దాస్ మరియి కొంతమంది గ్రామస్థులు కలిసి కాశీ యాత్రకు సంకల్పించారు. బాగా ఎండగా ఉంది. తిండి, నీరు దొరకడం కష్టంగా ఉంది. కానీ గోపాల్ దాస్ తోటి ప్రయాణికులకు గోవింద రాం బావిని గురించి, అందులోని తియ్యటి నీటి గురించి చెప్పి ఉత్సాహ పరిచాడు.

వారు ఆ బావిని చేరుకునే సరికి బాగా అలిసిపోయి ఉన్నారు. గొంతు దాహంతో పిడచకట్టుకు పోతోంది. గోపాల్ దాస్ దూరం నుంచే చూసిన దాన్ని బట్టి ఆ ప్రదేశం మునుపటిలా లేదు. బావి చుట్టూ కంచె వేసి ఉంది. రక్షణగా ఓ భటుడు నిలబడి ఉన్నాడు.

“మాకు కొంచెం నీళ్ళు కావాలి. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాం” అడిగాడు గోపాల్ దాస్.

“అలాగే వెళ్ళండి. కానీ ఒక గ్లాసు నీళ్ళ ఖరీదు రెండణాలు” అన్నాడా భటుడు.

గోపాల్ దాస్ కు కొంచెం కోపం వచ్చింది.

“కానీ ఇక్కడ ఇంతకు ముందు ఉచితంగానే నీళ్ళు తాగనిచ్చేవారు కదా? ఇక్కడ డబ్బు కట్టి నీళ్ళు తాగాలంటే చాలా మంది దాహంతో చనిపోతారు” అన్నాడా భటుడితో.

ఆ భటుడు చాలా మర్యాదగా గోవిందరాం చనిపోయాడనీ, అతని కుమారుడు ఆ బావికి యజమాని అయ్యాడనీ, కావాలంటే అతని దగ్గరకు తీసుకెళతానని చెప్పాడు.

గోవింద రాం కుమారుడు చాలా తెలివైన వాడు. బావి చుట్టూ కంచె వేయడం వెనుక కారణాన్ని చాలా విపులంగా వివరించాడు.

“చూడండీ. ఈ బావిని తవ్వించడానికి వెయ్యి రూపాయలు ఖర్చయ్యింది. కానీ దాన్నుంచి మా కేమీ ఆదాయం లేదు. ఆ డబ్బంతా మేం తిరిగి రాబట్టుకోవాలనుకున్నాం. అందుకే గ్లాసుకు రెండణాలు చొప్పున వసూలు చేస్తున్నాం. ఇందులో అన్యాయమేమీ లేదు.”

గోపాల్ దాస్ చాలా బాధ పడ్డాడు. కానీ అతని మదిలో అప్పటికప్పుడే  ఓ పథకం రూపుదిద్దుకుంది.

“నేను ఆ బావిని మీ దగ్గర్నుంచి కొంటాను. మీరు రెండు వేల రూపాయలు తీసుకుని దాన్ని నాకు వదిలేయండి” అన్నాడు.

గోవిందరాం కొడుకు అందుకు సంతోషంగా సమ్మతించాడు. అతనికి చాలా లాభం దక్కింది కదా మరి. గోపాల్ దాస్ ఆ బావికి ఇప్పుడు యజమాని అయ్యాడు.

వెంటనే ఆ భటుడ్ని అక్కడి నుంచి పంపించి వేశాడు. కంచె పీకి వేయించాడు. ఈ నీళ్ళు ఇక అంతా ఉచితం అని ప్రకటించాడు. అక్కడ చేరుకున్న ప్రయాణికులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. ఒక ప్రయాణికుడు ఆనందంతో గోపాల్ దాస్ దగ్గరకు వచ్చి “మీరు పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలి” అన్నాడు.

“అసలు నాకు కొడుకులే వద్దని ఆశీర్వదించండి” అన్నాడు గోపాల్ దాస్.

ప్రయాణికులంతా ఆశ్చర్యంగా చూస్తుంటే మళ్ళీ తనే 

“నా తదనంతరం నా కొడుకు కూడా గోవింద రాం కొడుకు లాగే ఆధునిక వ్యాపారిగా పెరగవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు ఈ నీళ్ళకోసం డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. అందుకని అలా అన్నాను.” అన్నాడు.

ప్రయాణికులంతా సంతోషించి కాశీ ప్రయాణం కొనసాగించారు.

సత్సంగం గొప్పతనం

ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి “సత్సంగం యొక్క గొప్పతనం ఏమిట”ని అడిగాడు.

శ్రీకృష్ణుడు వెంటనే ఒక పురుగు ను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు అలాగే వెళ్ళి ఆ పురుగుని “సత్సంగం వల్ల ఫలం ఏమిట”ని అడిగాడు. అలా అడగ్గానే ఆ పురుగు నారదుల వైపు ఒక్కసారి చూసి టక్కున చచ్చిపోయింది.

నారదుడు మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి “స్వామీ, ఆ పురుగు సమాధానం చెప్పేలోపే చనిపోయింది. ” అన్నాడు.

శ్రీకృష్ణుడు అప్పుడే పుట్టిన ఓ చిలుకను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు ఆ చిట్టి చిలుకను అదే ప్రశ్న అడిగాడు. అది కూడా నారదుడి వైపు తేరిపార చూసి వెంటనే ప్రాణాలు విడిచింది.

నారదుడికి బాధ కలిగింది. మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. “స్వామీ! మీరే సమాధానం చెప్పండి.” అని అడిగాడు.

ఆయన ఈసారి “అయితే ఈ సారి ఇప్పుడే పుట్టిన ఆ లేగ దూడను అడుగు” అన్నాడు.

నారదుడు ఈ సారి భయం భయంగా ఆ దూడ దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్నను అడిగాడు. అది కూడా వెంటనే మరణించింది.

మూడు జీవాల మరణం నారదుణ్ణి బాగా కలచి వేసింది.

మళ్ళా శ్రీకృష్ణుని దగ్గరకెళ్ళి “హే కృష్ణా! ఏమిటయ్యా నాకీ పరీక్ష!!” అన్నాడు .

ఆయన ఈ సారి నారదుణ్ణి ఒక రాజభవనం లోకి వెళ్ళి అప్పుడే పుట్టిన రాజకుమారుణ్ణి అడగ మన్నాడు. ఈసారి రాజ కుమారుడు మరణించడని కూడా అభయమిచ్చాడు.

నారదుడు అలాగే రాజభవనం లోకి వెళ్ళి అప్పుడే పుట్టిన పసికందు రాజకుమారుణ్ణి అదే ప్రశ్న వేశాడు.

“ఓ నారద మునీంద్రా! సత్సంగ మహిమ మీకింకా అర్థం కాలేదా? మీరు నన్ను మొదట ప్రశ్నించినపుడు నేను ఓ పురుగుని. మీ దర్శన భాగ్యం చేత రెండో సారి చిలుకనై పుట్టాను. మీరు వచ్చి మళ్ళీ నన్ను అడిగారు. అప్పుడు నేను లేగదూడ జన్మనెత్తాను. మీరు మూడో సారి వచ్చి కూడా నన్ను అడగడం వల్ల పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించింది.కేవలం సాధు పుంగవులైన మీ దర్శన భాగ్యంచేతనే నాకింతటి అదృష్టం ప్రాప్తించింది” అన్నాడు నవ్వుతూ.

జై శ్రీకృష్ణ!!

రెండు కప్పల కథ

ఓ కప్పల గుంపు ఓ అడవి గుండా ప్రయాణిస్తూ ఉంది. ఆ గుంపులో నుండి రెండు కప్పలు అకస్మాత్తుగా ఓ లోతైన గోతిలో పడిపోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గొయ్యి చాలా లోతైందని గ్రహించి ఆ రెండు కప్పలతో “మీరు ఇక బయటికి రాలేరు. ఒకవేళ బయటికి రావాలని ప్రయత్నించినా కిందపడి చనిపోతారు. కాబట్టి అక్కడే ఉండిపోండి” అన్నాయి.

ఆ రెండు కప్పలు మాత్రం వాటి మాటలు పట్టించుకోకుండా వాటి శక్తి కొద్దీ బయటికి దుమకడానికి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కప్పలు వాటిని బయటికి రావడానికి ప్రయత్నించవద్దనీ, లోపలే ఉండిపోమనీ అరుస్తున్నాయి. చివరికి వాటిలో ఒక కప్ప మిగతా కప్పల మాటలు విని ప్రయత్నించడం ఆపేసింది. కిందపడి చనిపోయింది.

రెండో కప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. పైనున్న కప్పల గుంపు ఇంకా రావద్దని, కిందపడి చనిపోతావని అరుస్తూనే ఉన్నాయి. ఆ కప్ప బలంగా ప్రయత్నించి ఎలాగోలా బయటికి వచ్చేసింది. అది బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కప్పలన్నీ

“అసలు మేం అరుస్తుంటే విన్నావా?” అని అడిగాయి.

అప్పుడా కప్ప “నాకు చెవుడు. మీరేం చెబుతున్నారో సరిగ్గా అర్థం కాలేదు. కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని మాత్రం అర్థమైంది.అందుకనే బయటకి రాగలిగాను” అన్నది.

దొంగ సంతకం

అనగనగా ఇద్దరు రాజులు. ఇద్దరూ మంచి మిత్రులు. అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు బాగా సహాయం చేసుకునే వాళ్ళు. ఒకసారి వాళ్ళలో ఒకరికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరమైంది. ఆ సొమ్ము కోసం తన స్నేహితుడైన మరో రాజును అడిగాడు. వారిరువురూ మంచి స్నేహితులు కాబట్టి అతను ఆ సొమ్ము ఇవ్వడానికి వెంటనే ఒప్పుకున్నాడు. మొదటి రాజు తన మంత్రిని పంపిస్తాననీ, సొమ్ము అతనికిచ్చి పంపిచాల్సిందిగా రెండో రాజును కోరాడు. అందుకు అతను అంగీకరించాడు. మరుసటి రోజే మొదటి రాజు తన మంత్రిని, ముగ్గురు అంగరక్షకుల సహాయాన్నిచ్చి రెండో రాజు దగ్గరికి పంపించాడు.

మొదటి రాజు రాజ్యంలో రంగా అనే పేరుమోసిన ఒక గజదొంగ ఉండేవాడు. ప్రతీ రాత్రీ కనీసం ఒక్క దొంగతనమైనా చెయ్యందే అతనికి సరిగా నిద్ర పట్టేది కాదు. అతన్ని పట్టుకోవడం ఎవరి వల్లా కాలేదు. అతను దోచుకున్న చాలా డబ్బుతో రాజభవనంలో పనిచేసే కొంత మంది అధికారులకు లంచాలిచ్చి వాళ్ళ నుంచి రాజభవనంలో ఏంజరుగుతుందో గ్రహించేవాడు. ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని ఏదో ఒకరోజు రాజ భవనంలోకి ప్రవేశించి మొత్తం దోచుకోవాలని అతని వ్యూహం.

మొదటి రాజు తన మంత్రిని డబ్బు కోసం రెండో రాజు దగ్గరికి పంపిస్తున్నాడని రంగా కి సమాచారం అందింది. ఆ రోజు సాయంత్రం మంత్రి, ముగ్గు అంగరక్షకులు రాజభవనం నుంచి బయలు దేరారు. దారిలో రంగా, అతని అనుచరులు వీళ్ళ నలుగుర్నీ అటకాయించారు.

రంగా: “మర్యాదగా మేమిచ్చిన దుస్తుల్ని తీసుకుని మీ బట్టలు మాకిచ్చేయండి.నేను మంత్రి బట్టలు వేసుకుంటాను. నా ముగ్గురు అనుచరులు అంగరక్షకుల బట్టలు వేసుకుంటారు.” అని హుంకరించాడు. అలా బలవంతంగా మంత్రి, అతని అంగరక్షకుల బట్టలు రంగా, అతని అనుచరులు వేసుకున్నారు.

రంగా కి చదవడం, రాయడం తెలీదు కానీ బహు నేర్పరి. ఈ సమాచారం తెలిసిన వెంటనే అతను ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి మంత్రి గారి సంతకం చేయాలో అడిగాడు.

“మంత్రి గారి సంతకం నీ కెందుకు?” అని అడిగాడా పండితుడు.

“ఆ విషయం నీ కెందుకు? నా పనులు నాకుంటాయి” అన్నాడు కోపంగా.

“నువ్వేమన్నా సరే. నేను మాత్రం నేర్పించను” అన్నాడా పండితుడు ఏదో కీడును శంకిస్తూ.

చివరికి రంగా “నేర్పిస్తావా? లేక చస్తావా?” అని బెదిరించే సరికి అతనికి సంతకం నేర్పించక తప్పలేదు.

ఒక వేళ రెండో రాజు డబ్బు తీసుకున్నట్టు రసీదు మీద సంతకం పెట్టమంటే పెట్టాలి కదా! ఎలాగూ తను మంత్రి దుస్తులు వేసుకుంటాడు. ఇక మంత్రి సంతకం కూడా నేర్చేసుకుంటే ఏ సమస్యా ఉండదు అనుకున్నాడు రంగా.

బట్టలు మార్చుకున్న తర్వాత రంగా, అతని అనుచరులు డబ్బు కోసం రెండో రాజు దగ్గరికి వెళ్ళారు. రంగా కేమో తను కొత్తగా నేర్చుకున్న సంతకం రాసి చూపించాలనే కోరిక.

“మీకు నా సంతకం అవసరం లేదా?” అని అడిగాడు.

” అవసరం లేదు. మీ రాజు, నేను ప్రియ మిత్రులం, నాకామాత్రం నమ్మకం ఉంది.” అన్నాడా రాజు.

కానీ రంగాకి మాత్రం కొంచెం అతివిశ్వాసం. “అయినా సంతకం తీసుకుంటే ఎందుకైనా మంచిది కదా!” అన్నాడు.

అప్పుడా రాజు “అలాగైతే సరే. సంతకం చేసే వెళ్ళండి” అన్నాడు.

అప్పుడు రంగా రంగా ఒక దొంగ అని సంతకం చేసిచ్చాడు.

రాజు దాన్ని చూసి ఒక్కసారిగా అదిరిపడ్డాడు. “ఇదెలా సాధ్యం?” అని మనసులో అనుకుని, వాళ్ళ నలుగుర్నీ కాసేపు వేచియుండమని చెప్పి తన సేవకులను కొంతమందిని మొదటి రాజు దగ్గరికి పంపించాడు.

వాళ్ళు ఆ రాజు దగ్గరికి వెళ్ళి “రంగా అనే వాడు మీ రాజ్యంలో పేరుమోసిన దొంగ అని విన్నాం. కానీ మీ మంత్రి ఆ దొంగ పేరు ఎందుకు సంతకం చేశారు? కొంపదీసి మీ మంత్రి మా రాజుగారితో వేళాకోళం ఆడడం లేదు కదా?” అనడిగారు.

అప్పుడే దొంగలిచ్చిన దుస్తుల్లో ఉన్న మంత్రి, అనుచరులు అక్కడికి వచ్చి జరిగిన సంఘటనను వివరించారు. వెంటనే ఈ సంగతి రెండో రాజుకు తెలియజేసి రంగాను బంధించమన్నాడు. తర్వాత రాజే స్వయంగా వచ్చి సొమ్ము అందజేశాడు.

ఇంతకీ దొంగ ఎలా పట్టుబడ్డాడంటే ఆ పండితుడి తెలివితేటల వల్ల, ఇంకా రంగా గర్వం వల్ల. రంగా నిరక్షరాస్యుడు కావడం వల్ల, ఆ పండితుడు దొంగకి అతని సంతకమే నేర్పించి అది మంత్రి సంతకమే అని అబద్ధం చెప్పాడు. ఆ దొంగకి  కొంచెం గర్వం ఉందనీ, అతను ఖచ్చితంగా రాజు దగ్గర సంతకం చేసే వస్తాడని పండితుడికి తెలుసు. సరిగ్గా అక్కడే రంగా పట్టుబడ్డాడు.