తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ

ఒకానొక ఊర్లో ఎలుకలు బాగా ఎక్కువైపోయాయి. రైతులు కష్టపడి పండించి గోదాముల్లో దాచుకున్న ధాన్యం అంతా ఎలుకల పాలు అవసాగింది. అదే సమయంలో ఆ గ్రామానికి ఓ ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆ గ్రామ పెద్ద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు తాను ఆ సమస్యను పరిష్కరిస్తాననీ దానికి పారితోషికం ఏదైనా కావాలని కోరాడు. గ్రామస్తులంతా ఇంటికో బస్తా చొప్పున ధాన్యం ఇస్తామని ఒప్పుకున్నారు.

దానికా ఇంద్రజాలికుడు సంతోషించి తన దగ్గరున్న వేణువుతో ఓ రాగం మొదలు పెట్టాడు. ఆ రాగం వినగానే ఎక్కడెక్కడో నక్కి ఉన్న ఎలుకలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. అతనలా వాయిస్తూ నెమ్మదిగా నడక సాగిస్తుంటే ఎలుకలు కూడా అతనిని వెంబడించడం ప్రారంభించాయి. అతనలా వాయించుకుంటూ నెమ్మదిగా దగ్గరున్న నదిలోకి ప్రవేశించాడు. ఆ ఎలుకలు కూడా ఆ నదిలోకి దూకడంతో అన్నీ ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయాయి.

ఎలుకల పీడ విరగడైనందుకు గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు. చివరికి అతనికి పారితోషికం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడే గ్రామస్తులకు దుర్బుద్ధి పుట్టింది. ఇతను కేవలం వేణువు వాయించినందుకే మనం ఎందుకంత పారితోషికం ఇవ్వాలి. ఏదో ఒకటో రెండో బస్తాలు ధాన్యం ఇచ్చి పంపేద్దాం అనుకున్నారంతా కలిసి. దానికి ఇంద్రజాలికుడు ససేమిరా ఒప్పుకోలేదు. అయితే నీకు అసలేమీ ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో అన్నారంతా కలిసి. అప్పుడతనికి కోపం వచ్చి తన దగ్గరున్న వేణువు తీసి మరో రాగం ఆలపించసాగాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న పిల్లలంతా మంత్రించినట్టుగా అతని వెంటపడసాగారు. అతను నెమ్మదిగా వాళ్ళనందరినీ నది వైపు తీసుకువెళ్ళ సాగాడు. గ్రామస్తులు తమ పిల్లలందరినీ కూడా నదిలో ముంచేస్తాడేమోనన్న భయంతో అతన్ని ఆపి అతనికి రావలసిన పారితోషికాన్నిచ్చి పంపించేశారు.

రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావు?

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు.
అందుకాయన “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.”
వాళ్ళిద్దరూ భయంతో “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.
“ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా.
“బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి.
వాళ్ళిద్దరూ సంతోషంగా ముక్తకంఠంతో “ఎక్కడ?” అని అడిగారు.
“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి చక్కా తన దారిన పోయాడా సన్యాసి.
వాళ్ళిద్దరూ ఆ వేపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.
“ఈ సన్యాసులెంత మూర్ఖులు? నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.
“ఆయనంటే అన్నాడులే. ముందుగా ఇప్పుడేం చేద్దామో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.
అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉండి రెండోవాణ్ణి ఊర్లోకి పంపించాడు.

ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు.
“ఛ. ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.


ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడు ఇలా ఆలోచించాడు.
“వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు.


అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.
“పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకుని
ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
“సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.

సుల్తాన్ కూతురు – బట్టతల భర్త (కొనసాగింపు)

ముందు టపాకి కొనసాగింపు…

“మీరు చెప్పింది చేశాను. ఇప్పుడు మీ కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేయండి” అని అడిగాడు. సుల్తాన్ కు మాత్రం ఇంకా అతనికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయడానికి ఇష్టం లేదు.

“అవును నువ్వు మేం చెప్పిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. కానీ మా కుమార్తెను వివాహమాడాలంటే ఇంకో పని చేయాలి. అదే! నీ బట్టతల మీద చక్కగా ఉంగరాల జుట్టు మొలిపించుకుని రావాలి. ఇంతకు ముందు మేం చెప్పిన  పని చేశావంటే నువ్వు చాలా తెలివైన వాడివి అయ్యుండాలి కాబట్టి ఈ పని కూడా నువ్వు చాలా సులువుగా చెయ్యగల నమ్మకం నాకుంది” అన్నాడు.

సుల్తాన్ తనని మోసం చేశాడని గ్రహించి అతను నెమ్మదిగా ఇంటి దారి పట్టాడు. ఒక నెల రోజుల పాటు ఇంట్లోంచి బయటికే రానేలేదు. ఒకరోజు ఉదయాన్నే సుల్తాన్ తన కూతుర్ని వజీరు కొడుక్కిచ్చి పెళ్ళిచేయడానికి నిశ్చయించాడని తెలియవచ్చింది. అంతే కాకుండా రాజభవనంలోనే వీలైనంత తొందర్లో పెళ్ళి కూడా చేయాలని అనుకుంటున్నాడని తెలిసింది.

అతను కోపంతో ఊగిపోయాడు. వెంటనే లేచి రాజభవనం మరమ్మత్తులు చేయడానికి పనివాళ్ళు ఉపయోగించే మార్గం గుండా అందరి కళ్ళుగప్పి లోనికి ప్రవేశించాడు. నెమ్మదిగా లోపల పెళ్ళి జరగబోతున్న మసీదు దగ్గరికి వచ్చాడు. ఎవరూ చూడని ఓ ద్వారం గుండా పెద్ద హాలు లోకి ప్రవేశించాడు. అక్కడ వధూవరులు, వారి బంధు మిత్రులు కొంతమంది మాత్రమే ఉన్నారు. అందరూ సుల్తాన్ రాక కోసం వేచి చూస్తున్నారు. ఆయన వచ్చి వివాహ పత్రాలపై సంతకం చేస్తే పెళ్ళైపోయినట్లే.

అతను నెమ్మదిగా మసీదు పై భాగాన్ని చేరి అక్కడ నుంచి తనకు ఎడారిలో సాధువు ఉపదేశించిన మంత్రాన్ని పఠించాడు. అంతే ఎక్కడి వాళ్ళు అక్కడే శిలా ప్రతిమల్లా ఆగిపోయారు. అంతా సిద్ధమయిందో లేదో తెలుసుకునేందుకు సుల్తాన్ పంపించిన సైనికులకు కూడా అదే గతి పట్టింది.

అక్కడ సుల్తాన్ చాలా సేపు ఎదురు చూసి చూసి అసహనంతో ఏం జరుగుతుందో చూద్దామని తానే స్వయంగా వచ్చి చూశాడు. అక్కడి వాళ్ళు శిలా విగ్రహాల్లా నిలబడిపోయి ఉన్నారు. రాజుకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉంది. అంతా మాయగా ఉందని తలచి తన సేవకుణ్ణి ఒకడ్ని పిలిచి రాజ్యంలో నివసించే మాంత్రికుడిని పిలుచుకురమ్మని పురమాయించాడు.

ఆ మాంత్రికుడు రాగానే రాజు ముందు జరిగిందంతా చెప్పాడు. అతడు కాసేపు ఏదో ఆలోచించి “ఇదంతా మీ పొరపాటు వల్లే జరిగింది జపాహనా!” అన్నాడు. “మీరు ఆ యువకుడికిచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుని ఉంటే ఇప్పుడు మీ కుమార్తెకు గతి పట్టేది కాదు. ఇప్పుడు దీనికి ఒకే పరిష్కారం ఉంది. ఆ బట్టతల యువకుడు ఎక్కడున్నా వెతికి తెచ్చి ఆమెతో పెళ్ళి చేయడమే” అన్నాడు.

రాజుకి ఏమీ పాలుపోలేదు. అలాగని మాంత్రికుడు చెప్పిన మాటను కాదనలేడు. ఎందుకంటే మాయలు, మంత్రాలు తనకంటే అతనికే బాగా తెలుసు కాబట్టి. ఇంక చేసేదేమీ లేక అతను ఎక్కడున్నా వెతికి తీసుకురావాల్సిందిగా సేవకుల్ని ఆజ్ఞాపించాడు.

ఇదంతా అతను ఓ స్తంభం చాటు నుంచి గమనిస్తూనే ఉన్నాడు. అంతా విని చిరునవ్వులు నవ్వుకుంటూ త్వరత్వరగా ఇంటి వైపు నడిచాడు. ఇంటికి వెళ్ళగానే తల్లిని పిలిచి ఈ విధంగా చెప్పాడు.

“ఇక్కడికి సుల్తాన్ భటులు వచ్చి నాకోసం అడుగుతారు. అప్పుడు నువ్వు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయి చాలా కాలమైందనీ ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదనీ చెప్పు. నేనెక్కడుంటానో కూడా తెలియదనీ, పేదదాన్ని గనుక తగినంత డబ్బులిస్తే వెతకడానికి ప్రయత్నిస్తాననీ చెప్పు.”అని చెప్పి పైన అటక పైకెక్కి దాక్కున్నాడు.

మరు నిమిషమే ద్వారం దగ్గర తలుపు తట్టిన చప్పుడైంది. ఆమె వెళ్ళి తలుపు తీసింది. తక్షణమే బిల బిల మంటూ కొందరు భటులు లోనికి ప్రవేశించారు.

“మీ బట్టతల అబ్బాయి ఇక్కడే ఉన్నాడా?” అడిగారు ఆమెని. “ఇక్కడే ఉంటే వెంటనే పంపించండి. రాజు గారు అతనితో నేరుగా మాట్లాడతారంట.”

“అయ్యో! నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయి చాలా కాలమైంది. అప్పటి నుంచీ ఎక్కడికెళ్ళాడో, ఏమైపోయాడో కూడా తెలియలేదు.” అంది విచారంగా మొహం పెట్టి.

“అయ్యో పాపం . పోనీ ఎక్కడైనా ఉన్నట్లు ఏమైనా ఆచూకి తెలుసా? అతనికి సాక్షాత్తూ సుల్తాన్ తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని తోడ్కొని వచ్చిన వారికి తప్పనిసరిగా పలు కానుకలందించగలడు” అన్నాడు.

“అతను ఎక్కడికెళుతున్నదీ నాతో చెప్పలేదు. కానీ సుల్తాన్ అంతగా కోరుతున్నాడు కాబట్టి చెబుతున్నా. అతను కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. అవి నాకే తెలుసు. నేను అసలే పేదదాన్ని. నాకు అక్కడికి వెళ్ళేందుకు సరిపోయే ధనం లేదు” అంది దీనంగా.

“ఓహ్! అది సమస్యే కాదు” అంటూ ఓ చిన్న సంచీ చేతికిచ్చి. ఇందులో వెయ్యి బంగారు నాణేలున్నాయి. నీకిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో. అతనెక్కడున్నాడో చెప్పు. నీకింకా ధనం కావాలన్నా ఇస్తాం” అన్నాడో భటుడు.

“అయితే సరే!, నేను ప్రయాణానికి కొంచెం సిద్ధం చేసుకోవాలి. కొద్ది రోజుల్లోనే మీకు వర్తమానం పంపుతాను”

అలా ఓ వారం రోజుల పాటు ఆమె, ఆమె కొడుకు రాత్రి తప్ప ఇంటిని వదిలి బయటకు రానే లేదు. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసేస్తారని భయం. కనీసం లాంతరు లాంటివి కూడా వెలిగించలేదు. అందరూ ఆ గుడిసె లో ఎవ్వరూ లేరనే అనుకున్నారు. అలా కొద్దొ రోజులకు ఒక రోజు వేకువ ఝామునే అతను లేచి మంచి బట్టలు కట్టుకుని, అల్పాహారం తిని రాజభవనం వైపు దారితీశాడు.

అక్కడ ఉన్న పెద్ద నీగ్రో సేవకుడు కూడా అతని రాక గురించి తెలిసినట్లుంది. చూసీ చూడగానే దోవ ఇచ్చేశాడు. లోపల అతనికోసం ఎదురు చూస్తున్న ఇంకో సేవకుడు అతన్ని నేరుగా రాజమందిరం లో సుల్తాన్ సమక్షం లోకి తీసుకుని వెళ్ళాడు. సుల్తాన్ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు.

“రా బాబూ! నీ కోసమే ఎదురు చూస్తున్నాను? ఇన్నాళ్ళూ ఏమైపోయావు? ఎక్కడున్నావు?” అంటూ కుశల ప్రశ్నలడిగాడు.

“రాజా! ధర్మబద్ధంగానే మీ కూతుర్ని గెలుచుకున్నాను. కానీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యలేదు. తర్వాత నాకు ఇంటి మీదే ధ్యాస లేదు. నేను అలా ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాను. కానీ మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నారు కావున మీ కుమార్తెను నా భార్యను చేసుకునేందుకు వచ్చాను. ఇప్పుడు మాకిద్దరికీ వివాహం జరిపించండి”

రాజు అలాగే అని వజీరుతో వివాహ పత్రం రద్దు చేయించుకుని వీరిద్దరి కోసం కొత్తగా మరో పత్రం సిద్ధం చేయించాడు. ఆ తర్వాత అతను సుల్తాన్ ను పెళ్ళి కూతురి దగ్గరకు తీసుకు వెళ్ళాల్సిందిగా కోరాడు. ఇద్దరూ కలిసి పెద్ద హాల్లోకి ప్రవేశించారు. అతను మంత్రం వేసినప్పటి నుంచీ అక్కడూ ఎవ్వరూ అంగుళం కూడా కదిలినట్లు లేరు.

“ఈ మాయ నుండి వాళ్ళను విముక్తి చేయగలవా?” అని అడిగాడు సుల్తాన్ అతన్ని.

“చేయగలననుకుంటా!.”  అతనికి అనుమానంగా, ఆందోళనగా ఉంది.

కొంచెం ఆలోచించి ముందు చెప్పిన మంత్రాన్ని తిరగేసి చదివాడు. అంతే! అక్కడ శిలల్లాగా నిలబడిపోయిన వారంతా తిరిగి ప్రాణం పోసుకున్నారు. రాజకుమారి ఆనందంగా తన భర్త చేయినందుకుంది…

సుల్తాన్ కూతురు – బట్టతల భర్త (టర్కీ జానపద కథ)

ఒకానొక కాలంలో టర్కీ దేశంలో కొండల మధ్యన ఒక చిన్న గుడిసెలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి జీవిస్తుండేది. కానీ ఆ అబ్బాయి వయసు ఇరవై ఏళ్ళు పై బడ్డా తలపై జుట్టు మాత్రం ఇంకా అప్పుడే పుట్టిన శిశవుకు లానే ఉండేది. అందువల్ల అతను వయసైపోయినవాడిలా కనిపించేవాడు. దానికితోడు అతను ఏ పనీ సక్రమంగా చేసేవాడు కాదు. తల్లి అతన్ని ఎక్కడ పనిలో పెట్టినా వెంటనే తిరిగొచ్చేసేవాడు.

అలా ఉండగా ఓ వేసవి కాలం ఉదయం వాళ్ళ గుడిసె బయట ఉన్న తోటలో మగత నిద్రలో పడుకుని ఉండగా సుల్తాన్ కూతురు అందంగా అలంకరించుకుని తన చెలికత్తెలతో కలిసి గుర్రం మీద అటువైపుగా వెళుతూ కన్పించింది. పడుకున్న వాడల్లా అలా మోచేతి మీద పైకి లేచి ఆమె వైపు చూశాడు. అంతే! ఆ ఒక్క చూపు అతని స్వభావాన్నే మార్చేసింది.

వెంటనే దిగ్గున పైకి లేచి ఈ అమ్మాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోకూడదు అని నిర్ణయించుకుని గంతులు వేస్తూ తల్లి దగ్గరకు వెళ్ళి,

“నువ్వు వెంటనే సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆయన కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేయమని అడగాలి” అన్నాడు.

ఉన్నట్టుండి కొడుకు అలా విచిత్రమైన కోరిక కోరేసరికి ఆమెకు పిచ్చి పట్టినట్లయి నిస్సహాయంగా ఓ మూలన కూలబడిపోయింది.

“చెప్తుంటే అర్థం కావడం లేదా నువ్వు పోయి సుల్తాన కూతుర్నిచ్చి నాకు పెళ్ళి చేయమని అడగాలి” అసహనంగా అన్నాడు.

“కానీ నువ్వు…. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా?” ఆమె మాటలింకా తడబడుతూనే ఉన్నాయి.

“నీకు ఏ వ్యాపారం తెలీదు. మీ తండ్రి నీకోసం నాలుగు బంగారు నాణేలు తప్ప చిల్లి గవ్వ ఆస్తి కూడా మిగల్చలేదు. అలాంటిది నీకు సుల్తాన్ తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తాడంటావా? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా?” అన్నది.

“అదంతా నాకు తెలీదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్లు సుల్తాన్ దగ్గరికి వెళ్ళాల్సిందే” అంటూ పట్టు బట్టాడు. మోహం అటువంటిది మరి!

ఆమె వినీ విన్నట్లు ఉన్నా పగలూ రాత్రీ అదే పనిగా ఆమెను విసిగించేవాడు. వాడి పోరు తట్టుకోలేక ఒకనాడు ఆమె ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని కొండకవతల ఉన్న రాజప్రాసాదానికి బయలు దేరింది.

ఆ రోజనగా సుల్తాన్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించి ఉన్నాడు కాబట్టి ఆమె సుల్తాన్ ను దర్శనం చేసుకోవడానికి కష్టం కాలేదు.

“జహాపనా! దయచేసి నన్ను పిచ్చిదాన్నిగా భావించకండి. నేనలా కనిపించవచ్చు. కానీ నాకో కొడుకున్నాడు. వాడు మీ కుమార్తెను చూసినప్పటి నుంచీ నేను ఇక్కడికి వచ్చేదాకా ఒక్కరోజు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వాడు పెళ్ళి చేసుకుంటే మీ కుమార్తెనే పెళ్ళి చేసుకుంటాడట.”

“నేనప్పటికీ ఎంతగానో నచ్చజెప్పి చూశాను. అసలు ఇలా మాట్టాడినందుకు సుల్తాన్ నా తల తీసేసినా ఆశ్చర్యం లేదని చెప్పాను అయినా విన్లేదు. అందుకే మీ దగ్గరకు ఇలా వచ్చాను. ఇక మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి” అని చెప్పి తలవంచుకుని నిలబడింది.

ఆ సుల్తాన్ కి ఎప్పుడూ ఇలాంటి మనుషులంటే ఆసక్తే. పైగా ఇదంతా ఆయనకు కొత్తగా, వింతగా తోచింది.  అందుకనే అలా చేతులు కట్టుకుని వణుకుతూ నిల్చున్న ఆమెతో

“సరే! ముందు నీ కొడుకుని ఇక్కడికి పంపించు” అన్నాడు.

ఆమెకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. తన్ను తాను నమ్మలేక పోయింది. కానీ సుల్తాన్ రెండో సారి మరింత మార్ధవంగా పలికేసరికి ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుని వంగి వంగి సలామ్ చేస్తూ అక్కడి నుంచి ఇంటివైపు దారి తీసింది.

ఆమె ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే కొడుకు ఆదుర్దాగా “ఏమైంది విషయం?” అంటూ ఎదురొచ్చాడు.

“నువ్వు వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా సుల్తాన్ దగ్గరికి వెళ్ళి నేరుగా ఆయనతోనే మాట్లాడాలి” అంది.

ఆ శుభవార్త వినగానే అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె మాత్రం “నా కొడుక్కి కొంచెం వెంట్రుకలుండుంటే ఇంకా అందంగా ఉండేవాడు కదా” అని బాధ పడింది.

“వెళతాను! మెరుపు కన్నా వేగంగా వెళతాను!!” అని అప్పటికప్పుడే అక్కడి నుండి అదృశ్యమైపోయాడు.

సుల్తాన్ ఆ బట్టతల వాడిని చూడగానే ఇంక వాళ్ళతో పరిహాసమాడటం మంచిది కాదని భావించాడు. ఎలాగూ అతన్ని తనే పిలిపించాడు కాబట్టి కారణం లేకుండా అతన్ని తిప్పి పంపడం ఇష్టం లేక అతనితో

“నువ్వు మా కుమార్తెను వివాహమాడదలచావని విన్నాను. కానీ ఆమెను వివాహం చేసుకోవాలంటే ఓ షరతుంది. ఆమెను పెళ్ళి చేసుకోబోయే వాడు ఈ ప్రపంచంలో ఉండే పక్షులన్నింటినీ పట్టి ఇక్కడ ఉద్యానవనంలోకి తీసుకురావాలి” అన్నాడు.

సుల్తాన్ నోటవెంట ఆ మాట వినగానే అతని ఉత్సాహమంతా నీరు గారిపోయింది.

“అసలు ప్రపంచంలో ఉండే పక్షులనంతా ఎలా పట్టాలి? ఒకవేళ అలా పట్టుకున్నా వాటన్నింటినీ ఉద్యానవనానికి చేర్చాలంటే ఎంత సమయం పడుతుంది?” ఇలా పరి పరి విధాలా ఆలోచించాడు.

కానీ తాను ఏ ప్రయత్నం చేయకుండానే రాజకుమార్తెను వదులుకున్నాననే భావన రాజులో కలగనీయకూడదని రాజుతో “అలాగే!” అని చెప్పి రాజభవనం దాటి ఇష్టం వచ్చిన దిక్కుకు నడవసాగాడు. ఆ విధంగా ఓ వారం రోజులపాటు నడిచాడు. అలా సాగిపోతుండగా అతనికి పెద్ద పెద్ద రాళ్ళు అక్కడక్కడా విసిరేసినట్లుండే ఓ ఎడారి ఎదురైంది.

sultan_story
sultan_story

దాన్ని దాటుతూ ఉండగా ఒకానొక రాతి నీడలో కూర్చుని ఉన్న ఒక సాధువు దర్శనమిచ్చాడు. ఆయన్ను సమీపిస్తుండగా చేయి జాపి రమ్మని సైగ చేశాడు.

అక్కడికెళ్ళి కూర్చోగానే ఆ సాధువు “నువ్వు ఏదో సమస్యల్లో ఉన్నట్లున్నావు. అదేంటో చెబితే నేను కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు.

“ఓ ఋషివర్యా! నేను మా దేశాన్ని పాలించే సుల్తాన్ కుమార్తెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆయన ఈ ప్రపంచంలో ఉండే పక్షులన్నింటినీ తీసుకొచ్చి ఉద్యానవనంలో వదిలితేగానీ కుదరదంటున్నాడు. ఈ పని ఎవరైనా చేయగలరా అసలు?” అని అడిగాడు.

“అధైర్యపడకు నాయనా! ఆ పని నీవనుకున్నంత కష్టమేమీ కాదులే ఇక్కడి నుండి పడమట దిక్కుగా ఓ రెండురోజులు ప్రయాణం చేస్తే ఓ తమాల వృక్షం కనిపిస్తుంది. అంతపెద్ద చెట్టు నువ్వు ఈ భూమ్మీద మరెక్కడా చూసి ఉండవు. దాని కిందకు వెళ్ళి బాగా దట్టంగా నీడ ఉన్న చోట మొదలుకు దగ్గరగా కదలకుండా కూర్చో.”

“కొద్దిసేపటి తర్వాత నీకు బ్రహ్మాండమైన పక్షి రెక్కల శబ్ధం వినిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని పక్షులూ అక్కడికే వచ్చి దాని శాఖల్లో చేరతాయి. అంతా నిశ్శబ్దం అయ్యేంత వరకూ ఏమీ చెయ్యొద్దు. ఆ తరువాత నేను నీకు చెప్పబోయే మంత్రాన్ని జపించు. అంతే పక్షులన్నీ ఎక్కడివక్కడ అలాగే ఉండిపోతాయి. అప్పుడు నువ్వు వాటన్నింటినీ నీ తలపైన, భుజాలపైన ఎక్కించుకుని సుల్తాన్ దగ్గరికి తీసుకెళ్ళవచ్చు” అని చెప్పి చెవిలో ఓ మంత్రం ఉపదేశించాడు.

అతను ఆనంద పరవశుడై ఆ సాధువుకు నమస్కరించి ఆయన చెప్పిన దిక్కుగా సాగిపోయాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు సుల్తాన్ ఆస్థానంలోకి పక్షుల రెక్కలతో కప్పబడియున్న ఓ విచిత్ర ఆకారం లోపలికి వస్తూ అతని కంటపడింది. సుల్తాన్ ఆశ్చర్యానికి అంతే లేదు. అంతకు ముందెన్నడూ ఆయన అలాంటి దృశ్యాన్ని చూసి ఎరుగడు. చిన్ని చిన్ని పక్షులు బెరుకు బెరుకు కళ్ళతో చూస్తూ వస్తూ ఉంటే అదో అద్భుత దృశ్యంలా గోచరించింది అతనికి.

నెమ్మదిగా రెక్కల చప్పుడు ప్రారంభమైంది. రంగు రంగుల రెక్కలు విచ్చుకుంటున్నాయి. వాటి మధ్యలో నుంచి “వెళ్ళండి” అనే అరుపు వినపడగానే అవి నలువైపులా ఎగురుతూ సుల్తాన్ చుట్టూ ఒకసారి తిరిగి తెరచి ఉన్న కిటికీల గుండా పక్కనే ఉన్న తోటలో తమ గూళ్ళను వెతుక్కోవడానికి వెళ్ళిపోయాయి.

[ఇంకా ఉంది…]