వెంకటగిరి సంస్థానం గురించిన ఆసక్తికరమైన కథ

ఈ మధ్యన నేషనల్ డిజిటల్ లైబ్రరీలో చరిత్ర పుస్తకాల కోసం వెతుకుతుంటే నానారాజన్య చరిత్రము అనే ఒక పుస్తకం దొరికింది. ఈపుస్తక రచయిత శ్రీరామ్ వీరబ్రహ్మం. 1918లో ప్రచురించారు. ఈ పుస్తకంలో వెంకటగిరి సంస్థానం గురించే కాక మరో పద్నాలుగు సంస్థానాల గురించిన చరిత్ర ఉంది. వెంకటగిరి సంస్థానం గురించి చదువుతుండగా నాకు మా పెద్దవాళ్ళ ద్వారా విన్న ఓ ఆసక్తికరమైన కథకు ఆధారం దొరికింది. ఇది వెంకటగిరి సంస్థానం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ.

************

నిజాం కాలంలో పద్మనాయక వంశానికి చెందిన చెవిరెడ్డి అనే రాజు ఉండేవాడు. అప్పటి నైజాం రాజ్యంలోని నల్లగొండ మండలం లోని ఆమనగల్లు రాజధానిలోనూ, పిల్లలమఱ్ఱి అనే రాజధానిలోనూ నివసిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈయనకు పూర్వము పదవతరం వాడైన హేమాద్రి రెడ్డి అనే రాజు పరిపాలనలో బాగా ధనాన్ని సంపాదించి దాన్ని ఒకచోట నిక్షేపించాడు. దానిపైన ఒక వేదిక కట్టించి ఒక మర్రి చెట్టును నాటాడు. దానికింద ఒక భైరవ విగ్రహాన్ని ప్రతిష్టించి ఒక కోరిక కోరుకున్నాడు.

“స్వామీ! మీరీ సంపదను కాపాడి, నా సంతతిలో అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వాడు, సత్కర్మలు చేయగల వాడు, సద్గుణ సంపన్నుడు అయిన వానికి అందజేయవలెన” ని దాని సారాంశం.

ఇది తెలియపరచడానికి రహస్యముగా ఒక శిలాశాసనాన్ని కూడా స్థాపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చెవిరెడ్డి ఒకసారి వేటకోసమని ఆ ప్రాంతానికి వచ్చాడు. అదే సమయంలో వారి దివాణంలో పనిచేసే రేచడు అనే హరిజనుడు వ్యవసాయం చేయడం కోసం పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డం పడింది. అది పూర్వం హేమాద్రి రెడ్డి చెక్కించిన రహస్య శిలా శాసనం. అదే సమయానికి తమ రాజు అటువైపు వెళుతుండగా రేచడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ శాసనం గురించి చెప్పాడు.

శాసనాన్ని చదివిన చెవిరెడ్డి తన పూర్వీకులు దాచిన నిధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, దాని ప్రక్కనే ఉన్న మర్రి చెట్టును ఆశ్రయించుకున్న భేతాళుడు ఈయన ధైర్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. తన మాయలతో మేఘాలు, ఉరుములు, మెఱుపులు సృష్టించి ఆ మర్రి చెట్టు వారిపై పడేలా చేశాడు. రేచడు ఇది చూడగానే మూర్ఛపోయినాడు. కానీ చెవిరెడ్డి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. భేతాళుడు ఇతని శక్తిని మరింతగా పరీక్షించదలచి భీకరరూపంతో చెవిరెడ్డి ముందుకు దూకాడు. అంత ఆ రాజు తన కత్తి దూసి నరకబోతుండగా భేతాళుడు నిజరూపంలో ప్రత్యక్షమై అతని ధైర్య సాహసాలకు మెచ్చాననీ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అపుడా రాజు తమ వంశం వారంతా రాజ్యభోగాలతోనూ, శౌర్య ధైర్యాధి గుణములను కలిగి ఉండేలాగుననూ, తాము యుద్ధానికి వెళ్ళేటపుడు భేతాళుడు ముందు నడిచేలా వరాలను కోరుకున్నాడు. భేతాళుడు ఆ వరాలను అనుగ్రహించి అంతర్థానం అయ్యాడు.

తర్వాత ఆ రాజు ఆనందంతో ఆ సంపదను వెలికితీయడానికి ప్రయత్నించగా, పక్కనే భైరవమూర్తి నుంచి అశరీరవాణి ఒకటి వినిపించింది.

“ఓ రాజా, నీవు ఈ సంపదను తీసుకోవడానికి అర్హుడవే కానీ, ఈ సంపదను కొన్ని క్షుద్ర భూతములు ఆశించి ఉన్నాయి. వాటికి ఒక నరబలి ఇచ్చి ఈ సంపదను తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది” అని పలికింది.

రాజు నరహత్యకు వెనుకాడుతూ ఆలోచిస్తుండగా మూర్ఛ నుంచి తేరుకున్న రేచడు జరిగిన విషయం తెలుసుకుని తనను బలి ఇచ్చి ఆ ధనాన్ని తీసుకోమన్నాడు. కానీ ఆ రాజుకి తన దివాణంలో నమ్మకస్తుడైన అతనిని బలి ఇవ్వడానికి మనసొప్పలేదు. అప్పుడు రేచడు “మీరు ఈ ధనాన్ని మంచి కోసమే వినియోగించగలరని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కోరిన కోరికలు తీర్చి నన్ను బలి ఇస్తే మీకు నరహత్య పాపం అంటదు.” అన్నాడు. దాంతో రాజు రేచడు కోరినట్లు తమ వంశం వారినందరినీ తరతరములకు రాజా వారి వంశీయులు పోషించుటకు, తమకు వివాహం జరిగేటపుడు రేచని వంశీయులకు వివాహం జరిగేలా అంగీకరించి వానిని బలియిచ్చి ధనాన్ని స్వీకరించాడు. భేతాళుని కారణముగా ఈయనకు భేతాళ నాయడనని కూడా పేరు.

వెంకటగిరి రాజుల పేర్ల వెనుక యాచేంద్ర అని చేర్చుకుంటారు. ఉదాహరణకు ఇటీవలి తరానికి చెందిన వారి పేర్లు గోపాలకృష్ణ యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్ర. ఈ రేచడి పేరే తర్వాతి తరంలో యాచమ నాయుడనీ, యాచేంద్ర అనీ రూపాంతరం చెంది ఉండవచ్చని నా ఊహ.

తెలివైన ఇంద్రజాలికుడు – పిల్లల కథ

ఒకానొక ఊర్లో ఎలుకలు బాగా ఎక్కువైపోయాయి. రైతులు కష్టపడి పండించి గోదాముల్లో దాచుకున్న ధాన్యం అంతా ఎలుకల పాలు అవసాగింది. అదే సమయంలో ఆ గ్రామానికి ఓ ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆ గ్రామ పెద్ద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పాడు. అప్పుడు ఆ ఇంద్రజాలికుడు తాను ఆ సమస్యను పరిష్కరిస్తాననీ దానికి పారితోషికం ఏదైనా కావాలని కోరాడు. గ్రామస్తులంతా ఇంటికో బస్తా చొప్పున ధాన్యం ఇస్తామని ఒప్పుకున్నారు.

దానికా ఇంద్రజాలికుడు సంతోషించి తన దగ్గరున్న వేణువుతో ఓ రాగం మొదలు పెట్టాడు. ఆ రాగం వినగానే ఎక్కడెక్కడో నక్కి ఉన్న ఎలుకలన్నీ అతని వెంట పడటం ప్రారంభించాయి. అతనలా వాయిస్తూ నెమ్మదిగా నడక సాగిస్తుంటే ఎలుకలు కూడా అతనిని వెంబడించడం ప్రారంభించాయి. అతనలా వాయించుకుంటూ నెమ్మదిగా దగ్గరున్న నదిలోకి ప్రవేశించాడు. ఆ ఎలుకలు కూడా ఆ నదిలోకి దూకడంతో అన్నీ ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయాయి.

ఎలుకల పీడ విరగడైనందుకు గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు. చివరికి అతనికి పారితోషికం ఇచ్చే సమయం ఆసన్నమైంది. అప్పుడే గ్రామస్తులకు దుర్బుద్ధి పుట్టింది. ఇతను కేవలం వేణువు వాయించినందుకే మనం ఎందుకంత పారితోషికం ఇవ్వాలి. ఏదో ఒకటో రెండో బస్తాలు ధాన్యం ఇచ్చి పంపేద్దాం అనుకున్నారంతా కలిసి. దానికి ఇంద్రజాలికుడు ససేమిరా ఒప్పుకోలేదు. అయితే నీకు అసలేమీ ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకో అన్నారంతా కలిసి. అప్పుడతనికి కోపం వచ్చి తన దగ్గరున్న వేణువు తీసి మరో రాగం ఆలపించసాగాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న పిల్లలంతా మంత్రించినట్టుగా అతని వెంటపడసాగారు. అతను నెమ్మదిగా వాళ్ళనందరినీ నది వైపు తీసుకువెళ్ళ సాగాడు. గ్రామస్తులు తమ పిల్లలందరినీ కూడా నదిలో ముంచేస్తాడేమోనన్న భయంతో అతన్ని ఆపి అతనికి రావలసిన పారితోషికాన్నిచ్చి పంపించేశారు.

రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావు?

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు.
అందుకాయన “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.”
వాళ్ళిద్దరూ భయంతో “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.
“ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా.
“బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి.
వాళ్ళిద్దరూ సంతోషంగా ముక్తకంఠంతో “ఎక్కడ?” అని అడిగారు.
“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి చక్కా తన దారిన పోయాడా సన్యాసి.
వాళ్ళిద్దరూ ఆ వేపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.
“ఈ సన్యాసులెంత మూర్ఖులు? నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.
“ఆయనంటే అన్నాడులే. ముందుగా ఇప్పుడేం చేద్దామో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.
అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉండి రెండోవాణ్ణి ఊర్లోకి పంపించాడు.

ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు.
“ఛ. ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.


ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడు ఇలా ఆలోచించాడు.
“వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు.


అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.
“పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకుని
ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
“సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.

భీష్ముణ్ణి స్మరించుకుందాం…

భీష్ముడనగానే మనకు గుర్తుకొచ్చేది తండ్రి కోసం ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మాట తప్పని కఠోర దీక్ష. ఈ రోజు భీష్మ ఏకాదశి. మానవ జాతికి ఆదర్శ ప్రాయుడైన ఆ మహనీయుడు కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి స్వచ్ఛంద మరణాన్ని పొందిన రోజు. వెళుతూ వెళుతూ తన అపారమైన పాలనా పరిజ్ఞానాన్ని ధర్మ రాజాదులకు అందించి వెళ్ళాడు. ఆ అమూల్యమైన సలహాలు నేటికీ ఆచరణీయం. 

ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్టుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగా దేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది.

ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన  బాధ పడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది.  ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు.

గంగాదేవి వెళ్ళిపోయిన తరువాత శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతీ దేవిని ఇష్టపడతాడు. దేవవ్రతుడు ఉండగా తన కుమారులకు రాజ్యాధికారం దక్కదని ఆమె అందుకు అంగీకరించదు. అందుకు ఆయన తాను జీవిత కాలం బ్రహ్మచారిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేసి భీష్ముడని పేరు గాంచాడు. కుమారుని పితృభక్తికి మెచ్చి స్వచ్ఛంద మరణాన్ని (తను కోరుకున్నప్పుడు మరణం) వరంగా ప్రసాదించాడు తండ్రి.

తన పిన తల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు తగిన కన్యల కోసం అన్వేషిస్తూ యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీ రాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తెస్తాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను వేరే రాజ కుమారుడిని వరించానని చెబుతుంది. భీష్ముడు ఆమెను ఆ రాజు వద్దకు పంపిస్తాడు. ఆ రాజు యద్ధంలో తాను ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెబుతాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరుతుంది. తను ఆజన్మ బ్రప్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించడు.

ఆమె కోపంతో వెళ్ళి భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుతుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్ళి చేసుకోమంటాడు. ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు. యుద్ధం అనివార్యమౌతుంది. హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరిస్తాడు భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగిస్తాడు. భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయాగిస్తాడు. రెండూ ఢీకొంటే జగత్ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకొంటారు. గురువును మించిన శిష్యుడివయ్యావంటూ పరుశురాముడు భీష్ముణ్ణి ప్రశంసిస్తాడు.

పరశురాముడు కూడా తనకు సహాయం చేయలేకపోయినందుకు అంబ విచారించి శివుని గురించి తపస్సు చేస్తుంది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆమె తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముని చావుని కోరుకుంటుంది. అది ఆమె ఆ జన్మలో ఉండగా జరగదని చెబుతాడు శివుడు.  ఆమె తర్వాతి జన్మలో శిఖండిగా జన్మించి భీష్ముడి చావుకు కారణమైంది.

శ్రీకాళహస్తి గురించి సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పిన విశేషాలు

గత టపాలో నా శివరాత్రి అనుభవాల గురించి రాశాను. ఇందులో ప్రత్యేకించి సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగ విశేషాలను గురించి ప్రస్తావించదలచాను.

శ్రీ శర్మ గారి ప్రసంగం శివరాత్రి ముందురోజున ఏర్పాటు చేశారు. నిజానికి శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు చాలా సంవత్సరాల నుంచీ ఆయన్ను శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రవచనం కోసమని ఆహ్వానిస్తూనే ఉన్నారట. ఆయనకు ముందుగానే వేరే ఆలయాల్లో పూజలకు ఒప్పుకొని ఉండటం వల్ల రాలేకపోయానని చెప్పారు. అయితే ఈసారి కొంచెం ముందస్తుగా ఏర్పాటు చేసుకొని రాగలిగినందుకు సంతోషాన్ని వెలిబుచ్చారు.

శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ – సాలె పురుగు, కాళ – సర్పము, హస్తి – ఏనుగు అనే మూగజీవాలకు ముక్తి నిచ్చిన క్షేత్రమని చాలా మంది వినే ఉంటారు. కాబట్టి దీన్ని గురించి ఎక్కువగా విడమరిచి చెప్పడం లేదు. ఇది జరగక మునుపే ఇక్కడ చాలా సంఘటనలు జరిగున్నాయట. అప్పుడు ఈ ప్రాంతాన్ని గజకాననం అనే వారట.

బ్రహ్మ ముందు ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన తర్వాతనే సృష్టికార్యం ప్రారంభించాడట. ఇక్కడ శివుడు జ్ఞానానికి ప్రతీకయైన దక్షిణామూర్తి స్వరూపంలో కూడా వెలసిఉన్నాడు.

వశిష్ట మహర్షికి విశ్వామిత్రునితో వైరము వలన తన నూర్గురు పుత్రులనూ పోగొట్టుకుంటాడు. ఆయన జ్ఞాన సంపున్నుడే అయినా పుత్రశోకంతో మాయ కప్పివేయడం మూలాన గజకాననానికి వచ్చి ఓ పర్వతం ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడట. అప్పుడు భూమత అతన్ని రక్షించింది. శివుని గురించి తపస్సు చేయమని కర్తవ్యబోధ చేసింది. అలా కొన్నేళ్ళపాటు తపస్సు గావించిన వశిష్టునికి మహాశివుడు, దక్షిణామూర్తి స్వరూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాజ్ఞానియైన ఆయన ప్రాపంచిక విషయాల గురించి ఏం కోరుకుంటాడు?. అయినా లోక కల్యాణం కోసం శివుడిని జ్ఞానప్రదాత గా ఆ క్షేత్రంలో కొలువై ఉండమని కోరుకున్నాడట. అలా శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రమైంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ.

శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో ధూర్జటి ఒకరు. అవి ప్రభంద సాహిత్యపు రోజులు. అందరు కవులూ రాజుల గురించి ఇతివృత్తాలను ఎన్నుకుంటుంటే ఆయన మాత్రం ఆయన ఇష్టదైవమైన శ్రీకాళహస్తీశ్వరుని ఇతివృత్తంగా ఎన్నుకొని శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం రాశాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు. ఆయన శైలిని గురించి రాయలు స్వయంగా

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

అని కీర్తించినట్లు చెబుతుంటారు. తర్వాత ఆస్థానంలో ఆయనపై కొంతమంది ఏవో నిందలు వేయడంతో రాయలవారు ధూర్జటికి రాజ్య బహిష్కార శిక్షను విధించారట. వెంటనే ధూర్జటి కట్టుబట్టలతో భార్యతో కలిసి ఒక అడవికి వచ్చేశాడట. అక్కడే ఇద్దరు ముని దంపతుల ఆశ్రమంలో ఉంటూ వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళు పెట్టే భోజనం తింటూ దైవ ప్రార్థనలో ప్రశాంత జీవనం గడుపుతున్నారట.

ఒకరోజు ధూర్జటి దంపతులు నదీ స్నానం కోసం వెళ్ళగా అక్కడికి వచ్చిన రాయల వారి సైనికులు వీరిని గుర్తు పట్టి, ఆయన మీద వేసిన నిందలు అసత్యాలుగా నిరూపణలు అయ్యాయనీ,  రాజు వాళ్ళను తిరిగి రాజ్యానికి ఆహ్వానించారనీ చెప్పారు. వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తూ ఆశ్రమం వైపు నడుస్తున్నారు. కానీ వారికి ఎంత సేపు వెతికినా ఆయాశ్రమమూ కనిపించలేదు, వృద్ధ దంపతులూ కనిపించలేదు. చివరికి అది శ్రీకాళహస్తీశ్వరుని మహత్తుగా భావించి తాము వారితో రావడం లేదని ఆ సైనికులను తిరిగి పంపించి వేసి తమ శేష జీవితాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంలోనే గడిపాడని చెబుతారు. అయితే దీనికి చారిత్రక ఆధారలేమీ లేవని శ్రీ శర్మ గారే స్వయంగా చెప్పారు.

ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది అసలు పేరు సువర్ణముఖరీ నది. అగస్త్య మహర్షి ప్రభావంతో ఈ నదీ ప్రవాహం ఏర్పడ్డదని స్థల పురాణం చెబుతోంది.

దండక మహారాజు కథ

దండక మహారాజు పిత్రా రాజ్యమను దక్షిణ దేశ రాజ్యానికి అధిపతి. ఆయన కులీనుడు (మంచి కులమున పుట్టిన వాడు). కానీ కాముకుడు. శుక్రాచార్యులను తన గురువుగా చేసుకొన్నాడు.

ఒక రోజున మహారాజు గుర్రమెక్కి అరణ్యానికి వెళ్ళాడు. అదే సమయంలో శుక్రాచార్యుని కుమార్తెయైన విరజ అడవిలోని ప్రకృతి శోభను తిలకించడానికి ఒంటరిగా వచ్చింది. ఆమెకింకా పెళ్ళి కాలేదు. మంచి అందగత్తె. బాల్యం నుండి అప్పుడే యవ్వనం లోకి అడుగిడుతున్న వయసు ఆమెది. అటూ ఇటూ తిరుగుతూ పూలు కోసుకొంటున్నది. రాజు దృష్టి ఆమె మీద పడింది. ఆమె అందానికి వశుడయ్యాడు. అతని మనస్సు అతని ఆధీనం లో లేదు. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, స్నేహపూరిత స్వరంతో

“భామినీ, ఎవరు నీవు? ఎవరి కుమార్తెవు? ఎవ్వని భార్యవు? ఈ నిర్జనారణ్యంలో ఇలా ఒంటరిగా తిరుగుతున్నావేం? కనీసం నీకు పాదరక్షలు కూడా లేవు. ”

అది విని ఆమె సిగ్గుతో “రాజా! నేను శుక్రాచార్యుని పుత్రికను. నాకు ఇంకా వివాహం కాలేదు.” అన్నది

“దేవీ! నేను ఈ దేశమునకు రాజును. నీ సౌందర్యం నన్ను వివశుణ్ణి చేయుచున్నది. నేను నీకు దాసుడిని. కావున నాయందు దయయుంచుము.”

“ఓ రాజా! మీరిలా మాట్లాడటం భావ్యంగా లేదు. మాట్లాడటం సరి కదా, మనస్సులో ఈ ఆలోచన పుట్టడం కూడా తప్పే. నీవు రాజువు కాబట్టి అందరికీ తండ్రి లాంటి వాడివి. ఆ విధంగా నేను నీ కూతురితో సమానం. మా తండ్రి నీకు గురువు. ఆ విధంగా నీకు నేను సోదరితో సమానం. పైగా నేను బ్రాహ్మణ కన్యను. నీవు క్షత్రియుడవు. కాబట్టి నీ కోరిక అంగీకరించడం సాధ్యం కాదు. పుత్రిక, సోదరి ఎడల చెడు ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఆ ఆలోచనలు నీ మనస్సు నుండి పారద్రోలి మా తండ్రి గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించండి.”

“కానీ నా మనస్సు నా ఆధీనమునందు లేదే. ఈ సంబంధం అనుచితమైనదని నాకు తెలుసు. కానీ నా మనస్సు నీయందు చిక్కుబడిపోయింది. నీయందు అమితమైన అనురాగం ఏర్పడిపోయింది. ప్రేమ గుడ్డిది కదా.దానికి నియమమనేది ఉండదు.”

“రాజా ప్రేమ అనే శబ్దానికి కళంకము తేవద్దు. నీ పని అధర్మము, అనుచితము. తెలిసి తెలిసి విషం కోరుకుంటున్నావు. ఈ విషయం గురించి మా తండ్రి గారికి తెలిస్తే మిమ్మల్ని సర్వ నాశనం చేయగలడు. నీ చావును నీవే కొనితెచ్చుకుంటున్నావు. నేను ఇంకనూ రజస్వల కాలేదు. ఏ విధంగా చూసినా ఇది సాధ్యం కాని పని. నీ మంచికోరే చెబుతున్నాను. దయచేసి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళండి.”

కానీ ఆ రాజు కళ్ళను కామపు పొరలు కమ్మివేసినవి. “నేను చనిపోయినా పరవాలేదు. కానీ నీతో ఒక్కసారి సుఖిస్తే చాలు. ఈ రాజ్యము, ధనం నీతో పోలిస్తే నాకు తృణప్రాయము.”

ఆమెకు కోపం వచ్చి. “ఓరీ నీచుడా! పో అవతలికి!! ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తావా?” అని చెప్పి వడివడిగా అవతలికి పోసాగింది.

ఆ రాజుకు వివేకం పూర్తిగా నశించింది. ఆమె జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుని వచ్చి, ఆమె ఏడుస్తున్నా బలవంతంగా అనుభవించాడు.

అనంతరం భయపడి గుర్రమెక్కి పారిపోయాడు.ఆమె తలవంచుకుని ఏడుస్తూ, కేకలు వేస్తూ తండ్రి ఆశ్రమాన్ని చేరుకుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొన్నాడు. ఆ రాజు మీద మిక్కిలి కోపం వచ్చింది.

ఆ క్రోధావేశమున కన్నుల నిప్పులు రాలుచుండగా,

“ఏ క్రూరకర్ముడు, నీచుడు, నికృష్టుడూ, కాముకుడూ అయిన రాజు ఇట్టి దుష్కార్యమొనర్చినాడో వాని రాజ్యము నశించు గాక!  వాని రాజ్యమందు పశు పక్ష్యాదులు సైతం నివసించుకుండు గాక! ఏడు దినములు ఏకధాటిగా వర్షము కురియు గాక! అచ్చట వృక్షములు కూడా మొలచకుండుగాక.” అని శపించాడు.

తరువాత కూతురి వంక తిరిగి “నీవు ఇచటనే తపమాచరించి విశుద్ధవు గమ్ము!” అని చెప్పి ఇతర మునులతో సహా వేరొక ప్రాంతమునకు వెళ్ళిపోయాడు.

ఆయన శాపమునకు తగినట్లే దండకుని రాజ్యములో ఏడు దినములు, ఏడు రాత్రులు కుండపోత వర్షం కురిసింది. అతని రాజ్యం, మంత్రులూ, సైన్యం, కోశం, సర్వం నశించింది. ఆ రాజ్యం ఎడారి వనమైపోయింది. చాలా కాలందాకా అక్కడ పక్షులు కూడా నివసించలేదు. అదే  దండకారణ్యము.

చాలా కాలం తర్వాత శ్రీరాముని దర్శనా లాలసతో కొంతమంది మునులు వచ్చి అక్కడ కుటీరాలు నిర్మించుకున్నారు. చెట్లు కూడా  మొలిచాయి. శ్రీరామచంద్రుడు అవతారము ధరించి సీతా సమేతంగా అక్కడికి వచ్చినపుడు ఆ ప్రదేశానికి శాప విముక్తి కలిగింది.

ఇదీ కామానికి లోబడి సర్వనాశమైన దండకుని కథ!!

నారద తుంబురుల కథ

ఒకనాడు నారద తుంబురులు కలిసి వైకుంఠానికి వెళ్ళారు. తుంబురుడు గొప్ప గాయకుడు. తన గానామృతం తో విష్ణుమూర్తిని కీర్తించాడు. విష్ణుమూర్తి సంతసించి తుంబురుని మంచి వస్త్రాభరణాలతో సత్కరించాడు. నారదుడికి తుంబురుడిపై ఈర్ష్య కలిగింది.

“తుంబురుడే గొప్ప గాయకుడా? నేను కూడా అలా పాడటం నేర్చుకుని విష్ణుమూర్తి దగ్గర సత్కారం పొందుతాను.” అనుకున్నాడు.

అలా నారదుడు కొన్నాళ్ళు సంగీతాన్ని అభ్యసించి విష్ణుమూర్తి దగ్గర గానం చేశాడు. కానీ ఆ గానం తుంబురునిలా శ్రీహరిని సంతృప్తి పరచలేకపోయింది. అయినా నారదుడు తన పట్టు విడువలేదు. ఎలాగైనా తుంబురుని కన్నా బాగా పాడి విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు.

శివుడు అత్యుత్తమ గాయకుడు కాబట్టి ఆయన అనుగ్రహం సంపాదించి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈసారి కూడా శ్రీహరి ఆయన గానానికి సంతృప్తి చెందలేదు.

అయినా సరే నారదుడు తన సాధన మానలేదు. ఎన్నో సంగీతపరికరాలు పాడైపోయాయి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా విష్ణుమూర్తిని తన గానంతో ఆకట్టుకోలేక పోతున్నాడు. చివరికి తానిక విష్ణుభగవానుని సంతృప్తి పరచలేనని అర్థమై ఆఖరి అవకాశంగా తుంబురుల వారి దగ్గరకు వెళ్ళి తన్ను శిష్యుడిగా చేర్చుకోమన్నాడు.

తుంబురుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆయన వద్ద శిష్యరికంలో విష్ణువును ఆకట్టుకునేలా ఎలా పాడాలో నేర్చుకున్నాడు. తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్ళి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ నారాయణుని కీర్తించాడు.

ఆ గానానికి ప్రీతి చెందిన విష్ణువు నారదుని కూడా తుంబురుని లాగే సన్మానించి

“ఈ రోజు నీవు నన్ను తుంబురుని కంటే ఆనందింప జేశావు.” అంటూ మెచ్చుకున్నాడు. నారదుడు పరమానంద భరితుడయ్యాడు.

కాబట్టి ఈర్ష్య పడితే ప్రయోజనం లేదు. మనకన్నా ప్రతిభావంతుల దగ్గర నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటేనే విజయం సిద్ధిస్తుంది.