నాన్‌స్టాప్ కుమ్ముడే….

ఈ మధ్య ఈటీవీలో సందు దొరికితే చాలు “నాన్‌స్టాప్” కుమ్ముడు షురూ జేస్తాండు.

“నీకిష్టం లేకపోతే ఆ టీవీ ఎందుకు జూడాలే ఈ టపా ఎందుకు రాయాలే” అనద్దు.

అలవాటు పడ్డ ప్రాణం… పాడుతా తీయగా లాంటి కొన్ని ప్రాగ్రాముల కోసం చూడకుండా ఉండలేను. మధ్య మధ్యలో వచ్చే ఇలాంటి ప్రకటనలు వద్దనుకున్నా కంటబడతాయి. ఈ సినిమా జూసి హీరో ఎవరో విలన్ ఎవరో చెబితే కారు బహుమానం ఇస్తారంట…మనం చూసి చెప్పేది పక్కన బెడ్తే అసలు సినిమా దీసిన దర్శకుడికైనా, ఆ మాటకొస్తే ఆ సినిమాకు పని చేసిన బృందానికంతటికీ ఎవరికైనా తెలుసా అని!

ఇప్పుడు ఒక చిన్న పోటీ…

  • రచన, దర్శకత్వం, మాటలు, పాటలు వగైరా వగైరా… నాలుగు చేతులా నిర్వచించగల సవ్యసాచి మన సుమన్
  • తన క్రియేటివ్ బుర్రతో మన బుర్రలో గందరగోళం సృష్టించగల ప్రభాకర్..
  • చాలా సినిమాలకు నృత్యదర్శకుడు, ఆణిముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలతో గౌరవంగా బతుకుతున్న సుందరం మాస్టార్ని “బొంగరం” మాస్టారు గా చేశాడు. పార్టిసిపెంట్ల మధ్య గొడవలు పెట్టి వినోదం చూసే అగ్గిపుల్ల సామి మన ఓంకార్…

వీళ్ళ ముగ్గర్లో ఎవరు గొప్ప మీరే తేల్చాలి…

పడి లేచిన కెరటం కర్నూలు

కర్నూలులో నేను గడిపిన కొద్ది సమయంలో నేను గమనించిన, అక్కడి వాళ్ళ మాటల ద్వారా గ్రహించిన కొన్ని విషయాలు.

అందరి కృషి వల్లా చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్జీవోలు లేనిదే కర్నూలు ఇంత త్వరగా కోలుకోవడానికి సాధ్యం కాదని కొంతమంది చెప్పడం విన్నాను. పట్టణమంతటా అక్కడక్కడా నీళ్ళు ఎంత వరకు వచ్చాయో కొన్ని గుర్తులు పెట్టి ఉన్నారు. ఈ గుర్తుల ప్రకారం నిజమైన బాధితులకు నష్ట పరిహారం చెల్లించడానికి కాబోలు. మేము వెళ్ళిన జూనియర్ కళాశాల అధ్యాపకులు మధుసూధన్ ప్రత్యేక విధుల మీద సహాయ కార్యక్రమాల పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కొన్ని  పేద కుటుంబాలు ఇరవై వేల రూపాయల ధనం, ఓ ముప్ఫై బియ్యం బస్తాలు వరకు సమకూర్చుకున్నారు. కొద్ది మందైతే  మరో సారి వరదలొచ్చినా బాగుణ్ణు అనుకుంటున్నారు. ఎందుకంటే వరదల్లో కొట్టుకుపోవడానికి వాళ్ళ దగ్గర పెద్ద విలువైన వస్తువులేమీ ఉండవు. రెండో సారి మళ్ళీ డబ్బులు వస్తాయని వారి ఆశ. ఎటొచ్చీ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నది మధ్యతరగతి ప్రజలే. సహాయం కోసం అర్థించాలంటే అభిమానం అడ్డొస్తుంది మరి. ఒక దృశ్యం ప్రత్యక్షంగా నేను టీవీలో చూశాను కూడా.

ఒక దగ్గర అందరికీ అన్నం పొట్లాలు పంచిపెడుతున్నారు. ఆకలి గొన్నవారు వరుసలో నిల్చుకొని తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకాయన మాత్రం కళ్ళ నిండా నీళ్ళతో నెమ్మదిగా కదులు తున్నాడు. ఒక టీవీ వారు కెమెరా తో ఆయన్ను పలకరించారు. దాంతో ఆయన మాట్లాడిన మాటలు.

“మా ఇంట్లో కనీసం రోజుకి ఒకరైనా అతిథి వచ్చి భోంచేసి వెళుతుండే వారు. ఈ రోజు నేనే ఇక్కడ ఇలా…” దు:ఖంతో గొంతు పూడుకుపోయి ఆయనకిక నోట మాట రాలేదు. ఒక విధంగా ఆయన మధ్యతరగతి ప్రతినిథిలా కనిపించాడు నాకు.

కాకపోతే నాకు బాధ కలిగించిన అంశం ఒకటుంది. వరద బాధితుల కోసం సమకూర్చిన నిధులను అక్కడ వరదకు గురికాని ప్రదేశాలకు చెందిన వారు కూడా స్వీకరించడం. కనీసం పక్కన ఉన్న వారిపై కూడా ఆ మాత్రం జాలి లేకపోతే ఎలా? ఇలా సమస్యలు రాకూడదని వైయస్ జగన్ వర్గీయులు ముందుగా బాధితులకు కలర్ ఫోటోలతో కూడిన వెయ్యి కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డులను తీసుకెళితే వారికి డబ్బు అందజేయాలన్నది వారి ఆలోచన. కొద్ది సేపటి తర్వాత వారికి ఒక అనూహ్యమైన విషయం తెలిసింది. ఏంటంటే ఆ కార్డులను కలర్ జెరాక్స్ సాయంతో నకిలీలు తయారు చేస్తున్నారని. తమ అధికారాన్ని ఉపయోగించి పట్టణంలో ఉన్న కలర్ జిరాక్స్ అంగళ్ళను మూయించ గలిగారు. తీరా పంపిణీ దగ్గరికి వచ్చే సరికి మూడు వేల మంది తమ కార్డులతో ప్రత్యక్షమయ్యారు. డబ్బెవరికి చేదు? కాకపోతే తామలా చేయడం వల్ల నిజమైన లబ్దిదారులకు సాయం అందకుండా పోతుందని గమనిస్తే చాలు.

ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి????

దీన్ని గురించి వినగానే మా రూమ్మేట్ అన్నాడు. “ఇప్పటి దాకా నోబెల్ బహుమతి గ్రహీతలు దానికే వన్నె తెచ్చారు. ఇప్పుడు ఒబామా నోబెల్ బహుమతి పొందడం ద్వారా అవార్డ్ ప్రతిష్ట దిగజారింది” అని.
అంతర్జాతీయ వార్తలు బాగానే ఫాలో అవుతున్నాను. ఒబామా ప్రపంచ శాంతి కోసం ఏం పొడిచాడన్నది మాత్రం ఎంత ఆలోచించినా తట్టడం లేదు. 🙂
అయినా ఎవరికి ఏ అవార్డ్ వస్తే నాకేంటి? ఊరకుంటే పోలా.

అంథుడి కోరిక

ఒక గ్రామంలో ఒక అంథుడు నివసించేవాడు. కటిక దారిద్ర్యంతో బాధపడేవాడు. పెళ్ళైంది కానీ పిల్లల్లేరు. ఇలా ఒక దానిని మించి ఒకటి కష్టాలతో విసిగి వేసారి పోయి చివరికి దేవుణ్ణి తన కష్టాలు తీర్చమని వేడుకున్నాడు.
అతని దీనస్థితి గురించి తెలుసుకుని దేవుడు అతని ఎదుట ప్రత్యక్షమైనాడు.
“నీ బాధలు తీర్చడానికే వచ్చాను. ఏం కావాలో కోరుకో! అయితే ఒకే ఒక షరతు. నువ్వు కేవలం ఒక్క వరం మాత్రమే కోరుకోవాల్సి ఉంటుంది” అన్నాడు.

ఆ అంథుడు బాగా ఆలోచించి ఈ విధంగా కోరుకున్నాడు.
” నా కుమారుడు బంగారు ఊయలలో ఊగుతుంటే చూడాలని ఉంది స్వామీ” అన్నాడు.
“తథాస్తు” అని మాయమయ్యాడు భగవంతుడు.
ఒక్క కోరిక తో ఆ అంథుడు ఎన్ని వరాలు పొందాడో చెప్పుకోండి చూద్దాం?

ఇంతేనా జీవితం….

నిన్నటి దాకా చీకూ చింతా లేని జీవనం
నేడు కట్టుబట్టలతో పూట గడిస్తే గగనం
ఆ దృశ్యాలు హృదయ విదారకాలు
వారి బాధలు వర్ణ నాతీతాలు
నిజంగా వారిలో పరకాయ ప్రవేశం చేస్తే గానీ అవి అర్థం కావేమో
అంతా జరిగిన పోయిన తర్వాత ఎవరిని నిందించీ ప్రయోజనం లేదు
సాధ్యమైనంత తొందరగా పరిస్థితులను చక్కదిద్దడానికి కృషి చేయడం తప్ప
వరద బాధితులకు మీకు వీలైనంతలో సాయం చేయండి

ముఖ్యమంత్రి కనపడుట లేదు

కర్నూలు నుంచి చిత్తూరుకు వెళుతున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ సాంకేతిక కారణాల వల్ల కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం వరకూ వార్తల్లో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయిందని చెబుతున్నా ఖచ్చితమైన సమాచారం తెలియరావడం లేదు. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం నేత చిరంజీవి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా తమ సంఘీభావం ప్రకటించారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
నాకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి ఈ విపత్తు నుండి క్షేమంగా బయటపడాలని మనసారా కోరుకుంటున్నాను.

ఓటమి విజయానికి తొలిమెట్టు

ఒకసారి థామస్ అల్వా ఎడిసన్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక విలేఖరి వచ్చాడు.
“సార్ మీరు బల్బును కనిపెట్టడానికి వెయ్యి సార్లు ప్రయత్నం చేశారు కదా? మీకెప్పుడూ విసుగు రాలేదా?” అని అడిగాడు.
అప్పుడాయన “విసుగెందుకు? నేను విఫలమైన 999 ప్రయత్నాల్లో బల్బును ఎలా తయారు చేయకూడదో నేర్చుకున్నాను. ” అన్నాడు.
ఎంత ఆశావహ థృక్పథం తో కూడిన మాటలు!
నన్ను బాగా విసిగించే సమస్య ఏదైనా వస్తే నేను ఈ మాటలు తలుచుకుంటూ ఉంటాను.