నా చదువు సంగతులు – 7

ఒకసారి ప్రతిభ అనే సంస్థ రాష్ట్రవ్యాప్తంగా జనరల్ నాలెడ్జి పోటీలు నిర్వహిస్తుందని మా వెంకట్రామయ్య సార్ కి తెలిసింది. మండల స్థాయి పోటీల్లో పాల్గొనడం అందులో మొదటి మెట్టు. అందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారిని జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తారు. మా సార్ మళ్ళీ శ్రద్ధ తీసుకుని మా నలుగుర్నీ ఈ పోటీకి తయారు చేశారు. పరీక్ష శ్రీకాళహస్తిలో బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ పరీక్షలో నాకు మొదటి స్థానం లభించింది. మరో గ్రామమైన కాపుగున్నేరి విద్యార్థులకి రెండు, మూడు  స్థానాలు లభించాయి. పరీక్ష రాసి నేను నేరుగా ఇంటికి వచ్చేసినా మా సార్ మాత్రం ఫలితాలు వెలువడే దాకా అక్కడే ఉన్నారు. అంతే కాదు, అక్కడ కూడా రాజకీయాలు జరిగి నా మార్కుల్లో ఏదో అవకతవకలు జరిగితే పట్టుబట్టి నా పేపరు రీ ఎవాల్యుయేషన్ చేయించి నా ప్రతిభను నలుగురికి తెలిసేలా చేశారు. నా మీద ఎంత నమ్మకముంటే అలా చేశారో మరి. అక్కడ నాకు కొంత నగదు, ఒక డిక్షనరీ బహుమానంగా ఇస్తే దాన్ని సైలెంటుగా మా ఇంటికి తెచ్చి ఇవ్వకుండా మరుసటి రోజు బడిలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉండే పెద్దల్నంతా పిలిచి సర్పంచి సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పించాడు. అందరూ పెద్దలు పిల్లలందరినీ ఉద్దేశించి అందరూ ఈ అబ్బాయి లాగా చదివి ఊరి పేరు నిలబెట్టాలి అంటుంటే ఆ రోజు మొదటిసారిగా మా ఇంట్లో వాళ్ళ కళ్ళలో ఆనందబాష్పాలు చూశాను. ఫలానా ఆయన మనవడు అని మా తాత పేరు నిలబెట్టినందుకు నాకు మొదటి సారిగా గర్వంగా అనిపించింది.

జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే అందుకు కావలసిన పుస్తకాలు అన్నీ లిస్టు రాసిచ్చాడు. మా నాన్నకు చెబితే అర్థం చేసుకోడని మాతాతకు చెప్పి ఆ పుస్తకాలన్నీ తెప్పించి పరీక్షకు సిద్ధం చేశాడు. ఈ పరీక్ష కడపలో జరిగింది. అప్పటి దాకా నేనుగానీ, మా ఇంట్లో వాళ్ళు గానీ ఎక్కడా పెద్దగా బయటకు వెళ్ళలేదు. అందుకని ఆయనే  స్వయంగా నన్ను కడపకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు. కడపలో ఉదయం పది గంటలకు పరీక్ష. శ్రీకాళహస్తి నుంచి నేరుగా వెళితే కలుసుకోలేమని, ముందు రోజు రాత్రి తిరుపతిలో సార్ కి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి మరుసటి రోజు ఉదయమే కడపకు ప్రయాణమయ్యాం. తెల్లవారు జామునే అయినా బస్సులో విపరీతమైన రద్దీ. అందరూ కూర్చోవడానికి ఖాళీ లేదు. మూడు గంటల సేపు ప్రయాణంలో సార్ ఒళ్ళోనే కూర్చుని ప్రయాణించాను. సొంత బిడ్డలా చూసుకున్నాడు. ఆ పరీక్షలో నేను సెలెక్టు కాలేదు కానీ నా మీద ఆయన చూపించిన అభిమానం మాత్రం జన్మలో మరిచిపోలేను.

నా చదువు సంగతులు – 2

నేను రెండో తరగతికి వచ్చేటప్పటికి ప్రభుత్వం వారికి మా బడి మీద దయగలిగి ఊరు మొదట్లో ఒక భవనాన్ని నిర్మించింది. ఒక పొడుగాటి గది, ముందు వరండా. రెండింటిలో ఆ వైపు ఈ వైపు కలిపి నాలుగు తరగతులు కూర్చోవచ్చు. మనకి కొత్త బడి వచ్చిందోచ్ అంటూ పిల్లలందరికీ ఎంత సంతోషమో. బడి కడుతున్నప్పుడే వెళ్ళి ఎలా కడుతున్నారో చూసొచ్చేవాళ్ళం.

అవతలి వైపు ఉన్న పాత భవనం నేను చదివిన మొట్టమొదటి బడి.

అప్పటికి గురవయ్య సారు రిటైరైపోయి ఆయన స్థానంలో సుబ్రహ్మణ్యం సారు (రేణిగుంట దగ్గర కరకంబాడి వాస్తవ్యులు) వచ్చారు. ఆయనకి ఎప్పుడూ గడ్డం ఉండటంతో అంతా ఆయన్ను గడ్డాం అయ్యోరు అని పిలుచుకునే వాళ్ళు పిల్లలంతా. ఆయనంటే అందరికీ భయం. కోపం వస్తే గట్టిగా అరిచేవాడు. సులగ (సన్నటి బెత్తం, గాలిలే విదిలిస్తే జుయ్ మంటూ శబ్దం వచ్చేది. చర్మం తాకితే ఎర్రగా కందిపోయి వాత పడేది) తోగానీ ఫేము బెత్తంతోకానీ కొట్టేవాడు. కొంతమంది ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బెత్తాలు పట్టుకుని విరిచేసే వాళ్ళు. లేదా కొంతమంది తోలుమందం వాళ్ళ ధాటికి ఆ బెత్తాలే విరిగిపోయేవి. విచిత్రమేమిటంటే ఈ బెత్తాలు కూడా పిల్లలే తెచ్చిచ్చేవారు.

రోజూ ఏడవకుండా బడికి వెళ్ళినా, ఆయన చేతిలో అరుదుగా ఎప్పుడో ఒకటీ రెండు సార్లు దెబ్బలు తిన్నా నాక్కూడా ఏ మూలో ఆయనంటే భయం ఉండేది. భయం కలగాలంటే దెబ్బలే తినక్కర్లేదు పక్కన వాళ్ళని కొడుతున్నప్పుడు చూసినా చాలు. ఆయన రోజూ నాచేత కొన్ని తెలుగు పదాలు (అ- అమ్మ, ఆ-ఆవు లాంటివి), ఎక్కాలు వల్లె వేయించి పిల్లలతో చెప్పించేవాడు. బడి అయిపోయాక గంట సౌండు వింటే ఆ ఆనందమే వేరు. ఆ రోజుకింక ఆటలే ఆటలు కదా మరి. బడికి ఉత్తరం దిక్కున చెరువు. దక్షిణం దిక్కున నేరేడు చెట్లు. పండ్లు కాసే కాలం వచ్చిందంటే పండగే.

నా చదువు సంగతులు – 1

చేమూరు మా సొంతూరు. నేను మూడో తరగతి దాకా అక్కడే చదివాను. అక్కడ పేరుకైతే ఐదో తరగతి దాకా బడి కానీ చదివే పిల్లలు అంతంత మాత్రమే. బడికి కనీసం గుడిసె కూడా లేదు. మా ఇంటి పక్కనే పెద్ద చింతచెట్టు. అదే మా బడి. మా ఇద్దరు అక్కలు కూడా అక్కడే చదివేవాళ్ళు. ఆ చింతచెట్టు కింద ఓ బల్ల, ఓ కుర్చీ వేసుకుని మా *గురవయ్య అయ్యోరు* (పంతులు) కూర్చునేవాడు. ఇంకొక అయ్యోరు కూడా ఉండే వాడు. పేరు గుర్తు లేదు. ఎప్పుడూ ముక్కుపొడి పీలుస్తుండటంచో అంతా ఆయన్ను ముక్కుపొడి అయ్యోరు అనేవాళ్ళు. పిల్లలంతా నేల మీద కూర్చునే వారు.

నాకు మూడేళ్ళ వయసులో అనుకుంటా పొద్దున్నే చద్దన్నం తిని, పాడైపోయిన బ్యాటరీలలో ఉండే చక్రాలతో చేసిన బండికి తాడు గట్టి రయ్యిన లాక్కుంటా మా చింతచెట్టు బడి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి అయ్యోరు ఇంకా రాలేదు. బెంచీ ఖాళీగా ఉందని మీదికెక్కి కూర్చుని ఆడుకుంటున్నా. కొద్ది సేపటి తర్వాత అయ్యోరొచ్చాడు. పిల్లలంతా లేచి నిలబడి గుడ్మాణింగ్ సా……ర్ అంటూ దీర్ఘం తీశారు. ఆ దీర్ఘం ఆ పక్కనే ఉన్న మా దిబ్బదాకా పాకింది. అటు వైపు తిరుక్కుని కూర్చున్న నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయ్యోరు నేరుగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

ఆయన నా వైపే చూస్తుంటే నేనూ ఆయన వైపు చూస్తూ కూర్చున్నా.
“ఏమిరా పెద్దాయన (మా నాన్న ఇంట్లో పెద్దకొడుకు) కొడుకువా? ” అడిగాడాయన.
నేనేం జవాబు చెప్పలేదు.
పిల్లలో కూర్చున్న మా అక్కలు “అవును సా… మా తమ్ముడే” అన్నారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
ఆయన నన్ను కిందకి దిగమన్నాడు. దిగాను.
ఐదు గుంజీలు తీయ్ అన్నాడు.
గబా గబా గుంజీలు తీసేసి బండి తీసుకుని ఇంటికి పరుగే పరుగు.
అమ్మ దగ్గరికి వెళ్ళి ఆగాను.
ఎందుకలా పరుగెడతున్నావని అడిగింది. జరిగింది చెప్పా. అమ్మ చిన్నగా నవ్వి మరి ఆయన చదువులు నేర్పే గురువు** కదా. ఆయనొచ్చిప్పుడు అలా కూర్చో కూడదు. లేచి నమస్కారం చేయాలి అని చెప్పింది. అది గురువుల పట్ల మా అమ్మ నేర్పిన మొట్టమొదటి సంస్కారం. నేనిప్పటికీ మరిచిపోలేదు.

**అప్పటికే నేను బట్టీ పట్టిన పాటల్లో కింది పాట ఒకటి. ఇందులో వాక్యమే అమ్మ ఉదహరించింది.
అమ్మకు జేజే
నాన్నకు జేజే
చదువులు నేర్పే గురువుకు జేజే

ఇంకా ఉంది….

జ్ఞానజ్యోతి

జెన్ కథలు చదివేందుకు చిన్నవిగా ఉన్నా అనేక జీవిత సత్యాలను బోధిస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతాయి. ఉదాహరణకి ఈ క్రింది కథ చదవండి.
******************
ఒకానొక కాలంలో జపాన్ దేశంలో ఒక అంధుడు ఒక రాత్రి సమయాన తన స్నేహితుడ్ని కలుసుకోవడానికి వెళ్ళాలనుకున్నాడు. అతనికి చుట్టుపక్కల వాళ్ళు ఒక లాంతరు ఇచ్చి పట్టుకెళ్ళమన్నారు.
“నాకు చీకటి, వెలుతురు ఒకటే అయినప్పుడు ఈ లాంతరెందుకు?”
“అయినా ఫర్వాలేదు. నీకు కనిపించకపోయినా ఈ చీకట్లో నీకు ఎదురొచ్చే వాళ్ళకి కనిపించి పక్కకు తప్పుకుంటారు” అన్నారు వాళ్ళు.
సరే అని ఆ లాంతరు తీసుకుని బయలుదేరాడు. చాలా దూరం నడిచాక ఓ వ్యక్తి వచ్చి అంధుణ్ణి ఢీకొనబోయాడు.
“ఎక్కడికి మీద పడబోతున్నావు. నా చేతిలో లాంతరు కనిపించడం లేదా?”
“మీ చేతిలో లాంతరు వెలగడం లేదు.”
*****************
ఇదీ కథ. ఇందులో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఏదైనా పొరబాటు జరిగినపుడు సరాసరి ఎదుటి వారి మీద నిందలు వేయకుండా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది అని.


మరి మీకెలా అర్థమయింది?