నా చదువు సంగతులు – 2

నేను రెండో తరగతికి వచ్చేటప్పటికి ప్రభుత్వం వారికి మా బడి మీద దయగలిగి ఊరు మొదట్లో ఒక భవనాన్ని నిర్మించింది. ఒక పొడుగాటి గది, ముందు వరండా. రెండింటిలో ఆ వైపు ఈ వైపు కలిపి నాలుగు తరగతులు కూర్చోవచ్చు. మనకి కొత్త బడి వచ్చిందోచ్ అంటూ పిల్లలందరికీ ఎంత సంతోషమో. బడి కడుతున్నప్పుడే వెళ్ళి ఎలా కడుతున్నారో చూసొచ్చేవాళ్ళం.

అవతలి వైపు ఉన్న పాత భవనం నేను చదివిన మొట్టమొదటి బడి.

అప్పటికి గురవయ్య సారు రిటైరైపోయి ఆయన స్థానంలో సుబ్రహ్మణ్యం సారు (రేణిగుంట దగ్గర కరకంబాడి వాస్తవ్యులు) వచ్చారు. ఆయనకి ఎప్పుడూ గడ్డం ఉండటంతో అంతా ఆయన్ను గడ్డాం అయ్యోరు అని పిలుచుకునే వాళ్ళు పిల్లలంతా. ఆయనంటే అందరికీ భయం. కోపం వస్తే గట్టిగా అరిచేవాడు. సులగ (సన్నటి బెత్తం, గాలిలే విదిలిస్తే జుయ్ మంటూ శబ్దం వచ్చేది. చర్మం తాకితే ఎర్రగా కందిపోయి వాత పడేది) తోగానీ ఫేము బెత్తంతోకానీ కొట్టేవాడు. కొంతమంది ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బెత్తాలు పట్టుకుని విరిచేసే వాళ్ళు. లేదా కొంతమంది తోలుమందం వాళ్ళ ధాటికి ఆ బెత్తాలే విరిగిపోయేవి. విచిత్రమేమిటంటే ఈ బెత్తాలు కూడా పిల్లలే తెచ్చిచ్చేవారు.

రోజూ ఏడవకుండా బడికి వెళ్ళినా, ఆయన చేతిలో అరుదుగా ఎప్పుడో ఒకటీ రెండు సార్లు దెబ్బలు తిన్నా నాక్కూడా ఏ మూలో ఆయనంటే భయం ఉండేది. భయం కలగాలంటే దెబ్బలే తినక్కర్లేదు పక్కన వాళ్ళని కొడుతున్నప్పుడు చూసినా చాలు. ఆయన రోజూ నాచేత కొన్ని తెలుగు పదాలు (అ- అమ్మ, ఆ-ఆవు లాంటివి), ఎక్కాలు వల్లె వేయించి పిల్లలతో చెప్పించేవాడు. బడి అయిపోయాక గంట సౌండు వింటే ఆ ఆనందమే వేరు. ఆ రోజుకింక ఆటలే ఆటలు కదా మరి. బడికి ఉత్తరం దిక్కున చెరువు. దక్షిణం దిక్కున నేరేడు చెట్లు. పండ్లు కాసే కాలం వచ్చిందంటే పండగే.