భగవంతుని ముందు మనమెంత?

స్వామీ వివేకానంద తన దేశ పర్యటనలో భాగంగా తన బృందంతో కలిసి శ్రీనగర్ సందర్శించారు. ఆయన మనసు ఉన్నట్టుండి కాళికా మాత వైపు మళ్ళింది. అప్పటికప్పుడే అమ్మవారి మీద ఓ పద్యం రాశాడు. తరువాత దగ్గర్లోనే ఉన్న క్షీరభవాని ఆలయానికి వెళ్ళాలనుకున్నాడు. ఈ ఆలయం ముస్లింల దాడిలో చాలా వరకు పాడైపోయింది. అక్కడికి వెళ్ళి ఆ ఆలయం శిథిలాల్ని చూస్తూ చాలా బాధపడి తనలో తానే ఇలా అనుకున్నాడు.

“ఇంత ఘోరం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు కనీసం ప్రతిఘటించకుండా ఎలా ఉండగలిగారు? నేనే గనుక ఇక్కడ ఉండి ఉంటే ఇలాంటి ఘోరాన్ని ఖచ్చితంగా జరగనిచ్చుండే వాడిని కాదు. నా ప్రాణాలర్పించైనా సరే ఆ ముష్కర మూకలను అడ్డుకుని ఉండేవాడిని”

వెంటనే ఆయనకు అమ్మవారి అశరీర వాణి ఇలా వినిపించింది.

“ఎవరో అజ్ఞానులు, నామీద నమ్మకం లేని వాళ్ళు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అయితే ఏమైంది? నీకు అంత ఖేదం ఎందుకు?”

“నువ్వు నన్ను రక్షిస్తున్నావా? లేక నేను నిన్ను రక్షిస్తున్నానా? పిచ్చివాడా! నేను కోరుకుంటే అద్భుతమైన ఆలయాలు లెక్కలేనన్ని నిర్మించుకోగలను. నేను తలచుకుంటే ఇప్పటికిప్పుడే ఇక్కడ ఏడంతస్తుల స్వర్ణ దేవాలయాన్ని నెలకొల్పగలను.”

ఆయన అక్కడ నుంచి తిరిగి రాగానే తన శిష్యులతో ఇలా అన్నాడు. ” ఆ క్షణంలో నా దేశభక్తి అంతా ఎటుపోయిందో తెలియదు. అసలు సర్వం మరిచిపోయాను. ఆమె ముందు నేనెంత? కేవలం ఒక పసి బాలుడను. అంతే!”

ఇది స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటన. ఇది చదువుతుంటే ఈ మధ్య చిన్నజీయర్ స్వామి తిరుమల ఆలయాన్ని క్లబ్బుతో పోల్చి చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి. ఆధ్యాత్మిక సాధన చేస్తున్న ఆయనలాంటి గురువులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా అనిపించింది అప్పట్లో. దానికి ఇక్కడ సమాధానం దొరికింది.

5 thoughts on “భగవంతుని ముందు మనమెంత?

 1. దేవుడు తన జనాన్ని కాపాడు కోవడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు అలాంటి వాళ్ళలో చిన్న జీయర్ స్వామి ఒకరు
  అయినా వివేకానందుడు నమ్మకం లేని వారి గురించి మాట్లాడాడు, జియార్ స్వామి నేను స్వామి కైంకర్యం లో తరిస్తాను అని అబద్ధాలు ఆడుతున్న వాళ్ళ గురించి మాట్లాడాడు.
  మీరు దాన్ని దీనితో ఎందుకు పోల్చారో నాకైతే తెలియదు.
  అసలు ముగింపు కూడా పొంతన లేదు.
  దయ చేసి వివరించండి.

  • నేను ఈ రెండు సంఘటనలనూ ఏ విధంగానూ పోల్చలేదు. అలాగే చిన్నజీయర్ స్వామి మాట్లాడింది తప్పా ఒప్పా అని కూడా నిర్ణయించలేదు. నిర్ణయించడానికి నేనెవరు?
   నేను చెప్పిన సంఘటనలో అంతరార్థం ఏమిటంటే భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా… ఆయన ఆలయం భ్రష్టు పట్టిపోతుంటే అందుకు కారణమైన వారిని ఆయనే వెళ్ళగొడతాడు కదా అని చిన్నజీయర్ స్వామి సరిపెట్టుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాను అంతే…

 2. ఈ విషయం చెప్పడానికి మీరు బ్లాగే ఎందుకు రాయాలి?భగవదేచ్చ వుంటే పది మందికి అదే తెలుస్తుంది కదా అని ఎందుకు వూరకుండలేకపోయారు?
  చిన్న జియర్ స్వామి కర్మ కూడా భగవద్ ప్రేరితమని ఎందుకనుకోకూడదు?

వ్యాఖ్యలను మూసివేసారు.