బెంగుళూరు జీవితం కొన్ని అనుభవాలు

బెంగుళూరుకు వచ్చి దాదాపు మూడు నెలలవుతోంది. నాకు ఎదురైన అనుభవాలతో ఓ టపా వేద్దామంటే ఇప్పటికి కుదిరింది. భాష చాలా వరకు సమస్య కాలేదు. అచ్చ కన్నడిగుడైనా తెలుగులో సహాయం అడీగితే తెలిసీ తెలియని తెలుగులో అయినా సమాధానం చెప్తారు. హైదరాబాదులో ఆటో డ్రైవర్లు కొంతమంది తెలుగు తెలిసినా హిందీ లోనే మాట్లాడేవారు కొన్ని చోట్ల. కానీ ఆటో చార్జీలు బాగా ఎక్కువ. షేరింగ్ ఆటోలు ఎక్కడా కనిపించవు. బెంగుళూరు కన్నడ దేశమే అయినా అందులో ప్రాంతీయులు కేవలం 24% మాత్రమేనట. మిగిలిన వారిలో 20% తమిళులు, 16% తెలుగు వాళ్ళు, 12% మలయాళీలు, 12% మిగతా భారతీయులు, 9% యూరోపియన్లు ఉన్నారట.

హైదరాబాదు నుంచి ఇక్కడికి రాగానే తేడా తెలిసింది అక్కడికన్నా కొంచెం ఇరుకైన రోడ్లు. కానీ ట్రాఫిక్ లో వాహన చోదకులకు కొంచెం క్రమశిక్షణ ఉందిక్కడ. కొద్దిసేపాగితే ఎంతో కొంత ముందుకు సాగుతుందని కొద్ది ఆశ ఉంటుంది. హైదరాబాదు లో అలా కాదు. ఒక్కోసారి ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే వాహనం దిగి నడిచి వెళ్ళిపోతే తొందరగా గమ్యస్థానం చేరుకోవచ్చు.

బస్సుల్లో రద్దీ అక్కడా ఇక్కడా దాదాపు ఒకటే కాకపోతే ఇక్కడ ఏసీ బస్సులు చాలా ఎక్కువ. బస్సుల ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువే. దగ్గర స్టాప్ లకైతే కండక్టర్లు చిల్లర తీసుకుని టిక్కెట్టివ్వకుండా నింపాదిగా వెళ్ళిపోతుంటారు. ఈ విషయంలో హైదరాబాదు కండక్టర్లు చాలా నిజాయితీపరులేమో. హైదరబాదులో నేనున్న మూడేళ్ళలో అలాంటి అనుభవం నాకెప్పుడూ ఎదురు కాలేదు.

ఇక పోతే ఈ మధ్యనే ఓ మెయిల్లో చదివాను. బెంగుళూరు లో మూడు విషయాలకు బాగా పేరు గాంచిందట. ఒకటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, రెండు అమ్మాయిలు, మూడు కుక్కలు. అలాంటిదే మా స్నేహితుడు కూడా మరో విషయం చెప్పాడు. ఇక్కడ ఓ రాయి పైకి విసిరితే అది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీదన్నా పడుతుందంట లేదా ఒక కుక్క మీదన్నా పడుతుందంట!.

ఇంటి అద్దెలు హైదరాబాదు కన్నా కొంచెం ఎక్కువే. నాకు మా కొత్త ఆఫీసు సహోద్యోగుల సహాయంతో కాస్త తక్కువ అద్దెకే ఇల్లు దొరికింది. ఆఫీసుకు చాలా దగ్గర. ఎంత దగ్గరంటే రోజూ మధ్యాహ్నం ఇంటికెళ్ళి భోంచేసి వస్తుంటాను. బెంగుళూరు రాగానే ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోవాల్సింది ఓ గొడుగు. వాన మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. వాన వస్తుందని బయటికి వెళ్ళడం వాయిదా వేసుకున్నారంటే అసలు బయటికి వెళ్ళలేం. మెట్రో పనుల వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ మందకొడిగా సాగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల రోడ్లంతా బురదమయం.

ఇకపోతే ఈ ఆదివారం ఈనాడు పుస్తకంలో చదివాను. మన హైదరాబాదులో మెట్రో కేవలం నాలుగేళ్ళలోనే పూర్తి చేస్తామని ఎల్ అండ్ టీ వాళ్ళు అన్నారట. ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. ఇక్కడ నాలుగేళ్ళ ముందే ప్రారంభించినా కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే సాధ్యమైందట. అదే జరిగితే బెంగుళూరుకన్నా హైదరాబాదు ప్రజా రవాణా వ్యవస్థ ఖచ్చితంగా మెరుగవుతుంది.

షాపింగ్ విషయానికొస్తే మన హైదరాబాదులోని కోఠీ, సుల్తాన్ బజార్, బేగంబజార్ ను పోలిన ప్రదేశం ఒకటుంది. అదే శివాజీ నగర్ కు దగ్గర్లో ఉన్న కమర్షియల్ స్ట్రీట్. గత శనివారం అక్కడికి వెళ్ళినప్పుడైతే అచ్చం హైదరాబాదులో తిరుగాడుతున్నట్లే అనిపించింది.

9 thoughts on “బెంగుళూరు జీవితం కొన్ని అనుభవాలు

 1. “వాహన చోదకులకు కొంచెం క్రమశిక్షణ ఉందిక్కడ”

  చాలా కరెక్టండీ. HYDeeలోని జనాలని బెంగుళూరు రోడ్లమీడ వదిలేస్తే అది నరకానికి దగ్గరి అనుభవాన్నిస్తుంది అంటుంటాను నేను.

  “దగ్గర స్టాప్ లకైతే కండక్టర్లు చిల్లర తీసుకుని టిక్కెట్టివ్వకుండా నింపాదిగా వెళ్ళిపోతుంటారు.”

  ఇది పూర్తిగా నిజం కాదండోయ్. టికెట్టు పదకొండు రూపాయలనుకోండి, ఆ రూపాయి తిరిగిచ్చేసి మనకో రూపాయ్ ఆదాచేస్తాడన్నమాట. ఈ విషయంలో నేనుకొంచెం బాగా గొడవలుపడేవాణ్ణి. సేవ్ చేసింది చాలుగానీ టికెట్టివ్వు అనడిగేవాణ్ణి. చిల్లరలేదంటే దిగాల్సిన స్టపుతరువాతి స్టాపుకి టికెట్టుతీసుకున్న సంఘటనలూ వున్నాయ్.

  ” మన హైదరాబాదులోని కోఠీ, సుల్తాన్ బజార్, బేగంబజార్ ను పోలిన ప్రదేశం ఒకటుంది”

  నో… నో… హైడీ హైడీ యే బెంగుళూరు బెంగుళూరే. ఏదిఏమైనా ఎన్ని హంగులు కూర్చుకున్నా హైడీ అందం బెంగుళూరుకెప్పుడూ రాదు.

  • అవును టిక్కెట్టు ఇవ్వనప్పుడు ఒక రూపాయి తక్కువ తీసుకుంటాడు. నాకు చార్జీ ఎంతో తెలవక అలా అన్నాను.

   షాపింగ్ విషయంలో మాత్రం హైదరాబాదు లో ఉన్నన్ని ఆప్షన్స్ ఇక్కడ లేవు లెండి. అందుకనే దానిని పోలిన ప్రదేశాలు అన్నాను.

   ఇంక తిండి విషయం లో మాత్రం హైదరాబాదు తో పోలికే లేదు. ఇక్కడ హై క్లాస్ రెస్టారెంట్ లో చేసే బిరియాని హైదరాబాదు తోపుడు బండ్ల మీద కూడా దొరుకుతుంది. 🙂

 2. ఫుడ్ విషయం లో, మీరు శాఖాహారులైతే, నమ్మ బెంగళూరు, హైడ్రాబ్యాడ్ కన్నా చాల బెటర్. మేకాహారులైతే, హైడీ నే బెటర్. మీరు కమర్షియల్ స్ట్రీట్ మాత్రమే చూశారనుకుంటా. జయనగర్, etc. ప్రాంతాలకు వెళ్ళినట్టు లేరు. ఇప్పుడు కళామందిర్, etc ఆంధ్రా షాప్స్ కూడా వచ్చేశాయి.

 3. చాలా రోజుల తరువాత మీ బ్లాగ్ ఒపెన్ చేసా..కొత్త టపాలు పలకరించాయి…
  బెంగళూరు జీవితానికి అడ్జస్ట్ అయ్యారన్నమాట…సుస్వాగత నమ్మ బెంగళూరిగె..

వ్యాఖ్యలను మూసివేసారు.