అన్నం పరబ్రహ్మ స్వరూపం

నేను ఏడో తరగతికొచ్చేదాకా మా అవ్వ (అమ్మమ్మ) అన్నం కలిపి చేతిలో పెట్టేది.
“నాకింకొద్దన్నం” అని మారాం చేసినప్పుడల్లా మా అవ్వ, “తప్పు నాయనా అలా అనకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని వృధా చేయకూడదు. మనం వడ్డించుకునేటప్పుడే కావాల్సినంత వడ్డించుకోవాలి గానీ మిగిల్చి పారేయకుడదు.” అని ఎలాగోలా సర్ది చెప్పేసి ఆ మాట, ఈ మాట చెబుతూ లోనికి పంపించేసేది.
ఇంక మా నాయనమ్మ ఇంట్లో ఎవరైనా ఎక్కువ వడ్డించుకుని పూర్తి చేయడానికి అవస్త పడుతుంటే
“నీకు కళ్ళు కావాలంటాయి. కడుపు వద్దంటుంది” అని నవ్వుతూ ఎగతాళి చేస్తుంటుంది.


అప్పట్లో అలా చెప్పడం వల్ల ఇప్పటికీ నాకు అన్నం వదిలేయాలంటే మనసొప్పదు. ఇంటిదగ్గర ఉన్నప్పుడు తప్పనిసరి వదిలేయాల్సి వస్తే మా కుక్కకి గానీ, మా బర్రెలు తాగే కుడితిలోగానే పోసేసేవాళ్ళం . కానీ ఇల్లు వదిలి వచ్చింతర్వాత అలా పారేయాల్సినప్పుడల్లా మనస్సు చివుక్కుమంటూ ఉంటుంది. అందుకే నాకు పెద్ద పెద్ద విందులకు వెళ్ళాలంటే ఇదే బాధగా ఉంటుంది. ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ మధ్య మా మిత్రుడొకరు పంపించిన ఈ మెయిల్ చదివి. దాని సారాంశాం క్లుప్తంగా ఇదీ!

* * *

జర్మనీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలిసిందే. పెద్ద పెద్ద కార్ బ్రాండ్ లైన బెంజ్, వోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ జర్మనీకి చెందినవే. అలాంటి దేశంలో ప్రజలు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారని చాలామంది అభిప్రాయం. కానీ ఉద్యోగం కోసం మొదటి సారిగా జర్మనీలోని హాంబర్గ్ వెళ్ళిన ఒక యువకుడి మనోగతం ఇది.

మొదటి రోజు ఆఫీసుకు వెళ్ళినపుడు మా ఆఫీసులో పనిచేసే సహోద్యోగులంతా కలిసి ఒక రెస్టారెంట్ లో స్వాగతం విందు ఏర్పాటు చేశారు.


మేము రెస్టారెంట్ లో అడుగు పెట్టగానే అక్కడ చాలా టేబుళ్ళు ఖాళీగా కనిపించాయి. ఒక మూలగా ఉన్న టేబుల్ మీద ఒక యువ జంట కూర్చుని భోంచేస్తున్నారు. వాళ్ళ ముందు కేవలం రెండు వంటకాలు, రెండు క్యాన్ల బీరు ఉన్నాయి. గర్ల్‌ఫ్రెండ్ ను రెస్టారెంట్ కు తీసుకువచ్చి ఇంత పిసినారితనం చూపిస్తారా ఎవరైనా అనుకున్నాను.


ఇంకో టేబుల్ మీద కొంతమంది ముసలివాళ్ళు కూర్చుని భోంచేస్తున్నారు. ఒక వంటకం వడ్డించగానే దాన్ని కొద్దిగా కూడా మిగల్చకుండా పూర్తిగా తింటున్నారు.


తరువాత మాకు రాబోయే వంటకాల కోసం ఎదురుచూస్తూ మేము వాళ్ళ మీద పెద్దగా దృష్టి సారించలేదు.  మాకు బాగా ఆకలిగా ఉండటంతో మా సహోద్యోగి ఇంకా ఎక్కువగా ఆర్డర్ ఇచ్చాడు.


రెస్టారెంట్ అంతా నిశ్శబ్ధంగా ఉంది. మేం ఆర్డరిచ్చిన వంటకాలు తొందరగానే వచ్చేశాయి. మాకు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉండటం చేత తినడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాం. మేం భోజనం దగ్గరనుంచి లేచేసరికి సుమారు మూడోవంతు వంటకాలు మిగిలిపోయాయి.


ఇంక మేం రెస్టారెంట్ వదిలి వెళతామనగా మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలి వాళ్ళు మా గురించే రెస్టారెంట్ యజమానితో మాట్లాతున్నట్లనిపించింది. మేం వెళ్ళి వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడేసరికి మేం అలా ఆహార పదార్థాలు వదిలేయడం వారికి ఇష్టంలేదన్నట్లుగా చెప్పారు. మనం ఎంత తింటే వీళ్ళకెందుకు అని మనసులో అనుకున్నాం.


మా సహోద్యోగి ఒకరు మధ్యలో కలుగజేసుకుని “మేం తిన్న ఆహారానికి మేం ఖర్చు పెట్టుకున్నాం. మేం ఎంత వదిలేస్తే మీకెందుకు?” అని అడిగాడు వాళ్ళని.


మా మాటలతో వాళ్ళకి కోపం వచ్చినట్లుంది. వాళ్లలో ఒకరు మొబైల్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశారు. కొంత సేపటి తర్వాత సోషియల్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఓ యూనిఫాం వేసుకున్న వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళని అడిగి జరిగిన సంగతి తెలుసుకుని 50 యూరోలు జరిమానా విధించాడు.


మేమంతా నిశ్శబ్ధంగా ఉండిపోయాం. మా జర్మన్ సహోద్యోగి తన జేబులోంచి 50 యూరోల నోటు తీసి అతనికి అందించి పలుమార్లు క్షమాపణ అడిగాడు.


అతను వెళుతూ వెళుతూ ధృడమైన కంఠ స్వరంతో  

మేరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు

అని చెప్పి చక చకా వెళ్ళిపోయాడు.

మా ముఖాలు అవమానంతో ఎర్రబడ్డాయి. వాళ్ళ ఆలోచనను మనసులోనే అభినందించాం. దానికి తగ్గట్టే మమ్మల్ని మేం మార్చుకోవాలనుకున్నాం. గొప్పలకుపోయి పెద్ద పెద్ద మొత్తాల్లో ఆహారపదార్థాలను ఆర్డర్ చేయించుకుని చాలా వరకు తినకుండా వదిలేస్తూ ఉంటాం. ఈ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం.

25 thoughts on “అన్నం పరబ్రహ్మ స్వరూపం

 1. మీ టపా లో ఆవేదన అర్థవంతం. ఆకలితో అలమటించే అన్నార్తులు మనచుట్టూ ఉన్నారని తల్చుకుంటే నిర్లక్ష్యంగా ఆహారం వృథా చేయం!

 2. “మేరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు”…నిజమే ఇంతవరకూ ఆలోచించనే లేదు. ఆలోచించేలా చేసే చాలా మంచి టపా.

 3. చాలా బాగా చెప్పారు. ఇలాంటి విధానాలూ, క్రమశిక్షణా మన దేశంలో ఎప్పటికొస్తాయో? ఒకరిని చూసి ఒకరు పెళ్ళిళ్ళూ, విందులూ, వినోదాల పేరిట ఆహారాన్ని వృధా చెయ్యడం ఎప్పటికి మానేస్తారో అనిపిస్తుంది. ఆ మాటకొస్తే ఒక్క ఆహరమే కాదు ఏ వరులైనా కావలసినంతవరకే వాడుకోవాలి అన్న ప్రాధమిక సూత్రం అందరూ తెలుసుకు ఆచరించడం మన కనీస ధర్మం. మంచి టపా రాసినండుకు మీకు అభినందనలు.

 4. @వేణు గారు, @రాజన్ గారు, @సుభద్ర గారు, @కొత్త పాళీ గారు
  ఇలా ప్రచురించానో లేదో అలా వచ్చేశాయి (గుండెలోతుల్లోంచి నిజంగా 🙂 ) వ్యాఖ్యలు. అది చాలు ఈ విషయం మీకు చేరింది అని చెప్పటానికి.
  మీ ప్రోత్సాహ పూర్వక వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

 5. Hi,

  If you have a function at home and food gets
  wasted.
  Don’t hesitate to call *1098* – *child helpline*. (Only from BSNL land line and only for Hyderabad region. I haven’t checked this number now. Long time back this number worked. )
  They will come and Collect the food.

  • అవును ఈ నంబర్ గురించి నాకోసారి ఈ మెయిల్ కూడా వచ్చింది. ఈ సేవ ఎప్పుడూకొనసాగితే బాగుణ్ణు.

 6. చాలా బావుంది. నాకూ ఎప్పుడూ అన్నం పారేయడం అస్సలు ఇష్టం ఉందదు. ఎంత కావాలో అంతే వడ్దించుకోమని చెబుతుంటాను అందరికీ.

  “మీరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు:…..ఈ మాటలు ఎంత నిజం! చాలా బాగా చెప్పారు రవి.

  • ధన్యవాదాలు…
   ఈ వృధా చేసే గుణం మనకు ఇటీవలే ఎక్కువైందని అనుకుంటున్నా. అందుకే అందరికీ ఓసారి గుర్తు చేద్దామని ఈ టపా…

 7. నిజమేనండి .. ఇప్పుడు వదిలెయ్యడం ఒక ఫేషన్ అమ్మాయిల్లో ..

  మా ఫ్రెండ్స్ లో చూస్తా కదా .. ఎవరు ఎంత తక్కువ తింటే అంత గ్రేట్ అన్నమాట .. నాకు ఎంతలాగ ఉంటుందో ..

  ఇక్కడ అన్నం మిగ్లింది పడేయ్యలెం .. అలా అని ప్రతీసారి కొలతగా కూడా వండలెం కదా .. నేనైతే కొంచెం అన్నం మిగ్లిపోతే మల్లి అదే కుకర్ లో ఆ అన్నం తో పాటే మల్లి పెట్టేస్తా .. అప్పుడు చద్దన్నం తిన్నట్టు ఉండదు .. పదేయల్సిన అవసరము రాదు ..

  హం ఏంటో … కాని వాళ్ళు చెప్పింది నాకు చాల నచ్చింది .. వనరులు సమాజానివి.. తిండి లేకుండా ఎంత మంది బాధ పడుతున్నారో .. 😦 తలుచుకుంటేనే బాధేస్తుంది ..

  • నిజానికి ఇది తిండి విషయంలో చెప్పినా నీరు, సహజ వనరులు మొదలైన అన్ని విషయాల్లో వర్తిస్తుంది.. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు కావ్య గారూ…

 8. నిజమే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆంటారు. మా ఫ్రెండు వాళ్ళ నాన్న ప్రతిరోజూ ఒక కుక్కకు అన్నం పెట్టే వాళ్ళు. తద్దినం రోజున ఆవుకు తప్పనిసరిగా అన్నం పెట్టాల్సిందే..ఆవు దొరకకపోతే నాలుగు వీదులు తిరిగి పిలుచుకు వచ్చే వారు. ప్రతి రోజూ మమ్మల్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక పేజీ వెనక ముందూ రాయమనేవారు. ప్రతిరోజూ ఆయన పిల్లలు అందరూ భోజనానికి ముందుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాసిన స్లిప్ లను ఆయనకు ఇచ్చేవారు.మేమూ వారితో సరదాగా రాసేవారం.ఆ కాగితాలు అన్నీ ఆయన భద్రాచలం పంపేవారు.మాకు చిన్న చిన్న పజిల్సూ లెక్కలూ ఎన్నో చెప్పే వారు.ఏ నాడు ఆవిలువలు ఏవీ? చెబుదామన్నా వినేవారు ఎవరు..?

  • చూడండి మన పెద్దవాళ్ళు తిండి మిగిలిపోయినపుడు దాన్ని వృధా చేయకుండా పెంపుడు జంతువులకు పెట్టేవాళ్ళు. ఇప్పుడీ నగర జీవితంలో ఆ అవకాశం లేనందున చాలా వృధా అవుతోంది.

 9. నేను ఒక సరి విందుకు వెళ్లినప్పుడు అక్కడ చాలా ఆహారం మిగిలి పోయింది హోటల్ వాళ్ళు దానిని చెత్త కుంది లో పారభోస్తునారు చూసి చాలా భాధ కలిగింది ఏమిచేయలేక పోయాను, హోటల్స్ లో చాల ఆహారం వృధా చేస్తుంటారు అవి చూస్తుంటే చాల భాధ కలుగుతుంది, దీనికి సరైన పరిష్కారం దొరకటం లేదు.

  • కొంత మంది హోటళ్ళ వారు అలా వృధా అయిన ఆహారంతో(ప్లేట్లలో మిగిలిపోయినవి) సేంద్రియ ఎరువులు తయారు చేస్తుంటారు.

 10. Very inspiring post. even in pakistan, they are not allowed to serve more than one item in weddings/celebrations(information coutecy Saniya’s wedding). I wonder when Indians will learn these things.

  • ఓ అవునా సానియా పెళ్ళిలో కూడా మితంగానే వడ్డించారా… ఆశ్చర్యంగా ఉంది. మన సెలెబ్రిటీలు కూడా ఆవిధంగా ఆలోచిస్తే బాగుంటుందేమో…

 11. “మేరెంత తినగలరో అంతకే ఆర్డర్ ఇవ్వండి. డబ్బు మీదే కావచ్చు. కానీ వనరులు సమాజం మొత్తానివి. ప్రపంచంలో చాలా మంది వనరుల కొరతతో బాధ పడుతున్నారు. నిష్కారణంగా వనరులు వృధా చేయడం మంచిది కాదు”.. yee maatalanu ardham chesukuni aacharisthe aakali chaavulanu tharimikottochchu!

వ్యాఖ్యలను మూసివేసారు.