ఇద్దరు స్ఫూర్తి ప్రధాతలు

ఇటీవల ఆన్‌లైన్ లో కొన్ని కథనాలు చదువుతుంటే నాకు ఆసక్తి కలిగించిన ఇద్దరు స్పూర్తి ప్రధాతల గురించి రాద్దామనే ఈ టపా…

ఒకరేమో దుగ్గిరాల పూర్ణచంద్రారావు అలియాస్ చందూ. కేవలం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సంవత్సరానికి లక్ష డాలర్లు దాకా సంపాదించవచ్చని ఇతన్ని చూసిన తర్వాతే తెలిసింది. ఏదైనా దిగితే కానీ లోతు తెలియదంటారు. ఇంతకు ముందు ఎక్సెల్ ను చూసి “ఆ ఏముంది ఇందులో?  టేబుల్స్ గట్రా చేస్తారు. అంతే కదా!” అనుకునే వాణ్ణి. కానీ ఇతన్ని గురించి చదివాక ఎక్సెల్ తో ఇంత సంపాదించచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇతను ఎక్సెల్ లోతుపాతుల్ని చవిచూసి తన బ్లాగు ద్వారా చిట్కాలను ప్రపంచానికి అందజేస్తుంటాడు. అంతే కాకుండా తను నేర్చుకున్న చిట్కాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకం కూడా రాశాడు. ఎక్సెల్ కు సంబంధించి కొన్ని సాఫ్ట్‌వేర్లు తయారు చేసి కూడా అమ్ముతూ ఉంటాడు. ఒక విషయం గురించి బాగా పరిశోధన చేస్తే అందులోనే బోలెడన్ని అవకాశాలు సృష్టించుకోవచ్చని ఇతన్ని చూసి బాగా అర్థమయ్యింది నాకు. ఆంధ్రా యూనివర్సిటీ లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఎమ్ ఇండోర్ నుంచి ఎంబీయే పూర్తి చేసిన ఇతను కొంతకాలం పాటు టీసీయెస్ లో కూడా పనిచేశాడు. తరువాత పూర్తి సమయాన్ని ఈ వ్యాపకం పై వెచ్చించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి తమ స్వంత ఊరైన విశాఖపట్టణం నుంచే తన కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటాడు, భార్యతో సహా!. ఇంతకన్నా కావాల్సిందేముంది చెప్పండీ? ( అరుణపప్పు గారి బ్లాగు నుంచి…)

ఇక రెండో అబ్బాయి బీహారు కు చెందిన కౌశలేంద్ర. కూరగాయలకు బీహార్ ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది అతని లక్ష్యం. ఎంబీయే విద్యకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐఐఎం అహ్మదాబాదు లో 2007 సంవత్సరానికి ప్రథమ స్థానంలో నిలిచినవాడు. తన సహోధ్యాయిల్లాగా కోట్లు సంపాదించే కార్పొరేట్ ఉద్యోగాన్ని కోరుకోలేదు. బీహార్ అభ్యున్నతికి పాటుపడాలనుకున్నాడు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన కౌశలేంద్ర ఎంబీయే పూర్తి చేసిన వెంటనే క్షేత్ర పరిశోధన కోసం విస్తృతంగా పర్యటించాడు. ఎందరో రైతుల్ని కలిసి వ్యవసాయంలో మెలకువల్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకున్నాడు. తరువాత కౌసల్య ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఏసీ బండ్ల ద్వారా కూరగాయలు అమ్మే విధానం. ఈ విధానం ద్వారా కూరగాయలు ఎక్కువకాలంపాటు పాడవకుండా ఉండి నష్టాన్ని నిలువరిస్తాయి. ప్రస్తుతం ప్రీపెయిడ్ కార్డుల ద్వారా కూరగాయల్ని కొనే వ్యవస్థను అభివృద్ధి పరిచే పనిలో ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నంలో అతను ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాడట. ఉదాహరణకు బ్యాంకులో జమ చేసిన చెక్కు మూడు నెలలకు కూడా జమ కాకపోవడం, ఏసీ బండ్ల కోసం ఋణాలు మంజూరు చేసినా డబ్బు సరిగా విడుదల చేయకపోవడం మొదలైనవి. విద్యావంతుడైన తన పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అని వాపోతున్నాడు. గంగానదీ పరీవాహక ప్రాంతంలోని సారవంతమైన నేలలో పండే కూరగాయల్ని సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటే రాష్ట్రం మరింత వృద్ధి సాధించగలదన్నది అతని నమ్మకం. పండించిన రైతుకే నేరుగా లాభం చెందాలన్న ఉద్దేశ్యంతో అతను నేరుగా ఉత్పత్తిదారులతోనే లావాదేవీలు నడుపుతూ ఉంటాడు. తన వ్యవస్థను విస్తరించడానికి వ్యవసాయ శిక్షణా సంస్థ సహకారం కూడా తీసుకుని ముందుకు సాగిపోతున్నాడు. తొందర్లోనే అతని లక్ష్యాన్ని సాధించాలని మనందరం ఆశీర్వదిద్దాం. (సిలికాన్‌ఇండియా.కామ్ సౌజన్యంతో)