బండి సవారీ

అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. దసరా సెలవులిచ్చారు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే బలే కుశాల నాకు.

సరిగ్గ అప్పుడే వానాకాలం. వానాకాలమొస్తే మా ఊరికి బస్సులుండవు. ఎందుకంటే మా ఊరికీ కాళహస్తికీ మధ్య ఓ చిన్న ఏరు అడ్డం. వానలకి అది రోడ్డు మీదకి పొంగి పొర్లుతుంది. బస్సులు సెలవు తీసుకుంటాయి. వానలు తగ్గినా దానిమీద కట్టుండే చిన్న వంతెన (సప్పెట అంటారు) కొట్టుకు పోతుంది. దాన్ని తిరిగి బాగు చేసేదాకా మాకు బస్సులుండవు.

మరి అమ్మమ్మోళ్ళ ఊరికి పోవాలంటే కాలినడకే గతి. చెట్లెంబట, పుట్లెంబట అడ్డం దొక్కోని పోవడమే. కొద్ది దూరం రోడ్డు మీద వెళితే బండి బాట మాత్రం ఉండేది.

అదృష్టవశాత్తూ అప్పుడే మా చిన్నాన్న, మా మామతో కలిసి  మా అమ్మమ్మ వాళ్ళకి తుమ్మ కట్టెలు (వంటకి వాడేందుకు) ఎడ్ల బండి మీద వేసుకుని వెళుతున్నాడు.

మా అమ్మేమో బండి మీద ప్రయాణం వద్దనింది. నేను మాత్రం వెళ్లాల్సిందేనంటూ మారాం చేశాను. అమ్మ ఒప్పుకోక తప్పింది కాదు.

ప్రయాణం మొదలైంది. బండి నిండా ఎత్తుగా కట్టెలు పేర్చారు. కట్టెల పైన  ఓ తుండుగుడ్డ పరిచి నన్నక్కడ కూర్చోబెట్టారు.

మా చిన్నాన్న బండి నొగ  మీద కూర్చుంటే మా మామ బండి వెనకాలే నడుస్తూ వస్తున్నాడు. ఉదయపు నీరెండలో నెమ్మదిగా సాగుతోంది మా ప్రయాణం. కట్టెల బరువుకు మెత్తటి బండి బాటలో నింపాదిగా అడుగులు వేస్తూ కదులుతున్నాయి ఎద్దులు.

కొద్ది దూరం వెళ్ళగానే బండి తారు రోడ్డు మీదకు ఎక్కింది. లాగడం సులభం కావడంతో ఎద్దులు నెమ్మదిగా వేగం పుంజుకున్నాయి.

మరి కొంచెం దూరం వెళ్ళగానే తారు రోడ్డు దిగి మళ్ళీ బండి బాటలోకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి దాకా సులభంగా లాక్కొచ్చేస్తున్న ఎద్దులు మళ్ళీ గతుకుల బండి బాటలోకి దిగాలనేసరికి మొరాయించడం మొదలు పెట్టాయి.

“ప ప్పా… డిర్ర్ ” గట్టిగా అదిలించాడు మా చిన్నాన్న. ఉహూ కదల్లేదు. ముల్లుగర్ర తో పొడిచాడు. కొంచెం చలనం వచ్చింది. ఎలపటి ఎద్దుని మా చిన్నాన్న, దాపటి ఎద్దుని మా మామ తోక పట్టి గట్టిగా మెలేశారు.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా పక్కకు తిరిగాయి ఎద్దులు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే బండి నెమ్మదిగా వాలి తిరగబడింది! ఎద్దులు పక్కకు తప్పుకున్నాయి.

ముందు నేను, నా పైన కట్టెల మోపులు, దాని పైన బండి! మా చిన్నాన్న కి, మామ కి ఏం చేయాలో పాలుపోలేదు.

ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి నా తల భాగం, భుజాలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. చెరో చెయ్యి పట్టుకుని నెమ్మదిగా బయటికి లాగారు.

చిన్నతనంలో సహజంగా కనిపించే భయం నా మొహంలో ఏ మాత్రం  కనిపించలేదు. అంతకంటే విచిత్రమైన విషయం నా ఒంటిమీద ఎక్కడా ఒక్క గాయం కానీ, రక్తం కానీ కనిపించలేదు. శరీరం లో ఏ భాగంలో కూడా చిన్న నొప్పి కూడా తెలియలేదు.

“హమ్మయ్య ఏ దేవుడో మనందుణ్యాడు బో…” వాళ్ళిద్దరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంక నన్ను పక్కన కూర్చోమని ఒక అర్ధ గంటలో వాళ్ళిద్దరూ కొన్ని మోపులు దీసి పక్కనేసి బండి పై కెత్తి మళ్ళీ నింపేసినారు.

ఆ సంఘటన వల్ల షాక్ తోననుకుంటా మిగతా ప్రయాణమంతా మేం పెద్దగా మాట్లాడుకోనేలేదు. పైకి కనిపించలేదు గానీ వాళ్ళిద్దరూ లోలోన చాలా భయపడిపోయారు. ఎందుకంటే మా అమ్మనాన్నలకి నేను లేక లేక కలిగిన కొడుకుని. ఏమన్నా అయ్యుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అని తెగ ఆలోచనలో పడిపోయామని నాకు తరువాత చెప్పారు. ఈ సంఘటన చాలా రోజుల వరకు మా ముగ్గురి మధ్యనే ఉండిపోయింది.

తర్వాత ఒక రోజు నేనే అందరికీ చెప్పేశాను. ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

మా అమ్మ, అమ్మమ్మ మాత్రం “మనం నమ్ముకున్న దైవం మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది నాయనా, కాబట్టి ఎప్పుడు నీకు కష్టకాలం వచ్చినా భగవంతుణ్ణి తలుచుకో. నీకు ప్రశాంతత చేకూరుతుంది” అనే జీవిత సత్యాన్ని తెలియజేశారు.

2 thoughts on “బండి సవారీ

 1. అమ్మ, అమ్మమ్మ చెప్పింది అక్షరాలా నిజం
  నమ్మిన దైవం ఎప్పుడూ వెంట వుండి కాపాడుతాడు
  మహిమ లంటే ఏదో అదృశ్యం కావటం, సృస్టించ బడటం కాదు,
  కనపడని శక్తీ నిత్యం పక్కనుండి మనని నడిపిస్తుంది
  దైవం, తల్లీ, తండ్రి, గురువూ, ఏదో రూపం లో మన వెంటే ఉంటాయి

 2. మహిమ లంటే ఏదో అదృశ్యం కావటం, సృస్టించ బడటం కాదు,
  కనపడని శక్తీ నిత్యం పక్కనుండి మనని నడిపిస్తుంది- నిజం

వ్యాఖ్యలను మూసివేసారు.