కథా సరిత్సాగరం

కథా సరిత్సాగరం

కథలు… ముఖ్యంగా ప్రాచీన జానపద కథలంటే ఇష్టపడేవారికి ఓ శుభవార్త! భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి.

నవరసభరితమైన ఈ కథల్ని సరళ తెలుగు భాషలో నవ్య తెలుగు వారపత్రిక లో ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. ఆ పత్రికలో రచయిత(త్రి) అనీలజ అని పేర్కొన్నారు. వారి అసలు పేరు ఎవరికైనా తెలిసుంటే చెప్పండి.

1920 ప్రాంతాల్లో సీ హెచ్ టౌనీ, ఎన్.ఎం పెంజర్ అనే ఇరువురు ఆంగ్ల రచయితలు కలిసి సోమదేవుడు రాసిన సంస్కృత రచనలను పది భాగాల్లో ఆంగ్లం లోకి అనువాదం చేశారు. ఆ పుస్తకాల పీడీఎఫ్ లు ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఉచితంగా లభ్యమౌతున్నాయి. ఈ పది పుస్తకాల లంకెల కోసం ఈ ఆంగ్ల వికీ పేజీ లోని References విభాగంలో చూడండి.

మరి ఇంకెందుకాలస్యం?…. జానపద కథా జగత్తులో విహరించండి!!

4 thoughts on “కథా సరిత్సాగరం

  1. కథా సరిత్సాగరం నవ్య వార పత్రికలో సరళ వ్యావహారికంలో వ్రాస్తున్న అనీలజ అంటే, ఆ పత్రికా సంపాదకులు శ్రీ ఎన్.జగన్నాథ శర్మ గారు.
    అనీలజ వారి కలం పేరు.

వ్యాఖ్యలను మూసివేసారు.