హైసరబన్నాలు

చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథ

ఓ పల్లెటూరి అబ్బాయి ఓ సారి భార్యను ఇంటి దగ్గరే వదిలేసి అత్తగారింటికి వెళ్ళాడు.

చాలాకాలం తర్వాత ఇంటికి వచ్చిన అల్లుడికి ఏమైనా చేసి పెడదామని అత్తగారు కుడుములు చేసింది. అంతకు ముందు అతను ఎప్పుడూ తినలేదేమో అవి ఆ అల్లుడికి తెగ నచ్చేశాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను కూడా అవి చేసి పెట్టమని అడుగుదామనుకున్నాడు.

“అత్తా! ఇవి భలే ఉన్నాయి. నేను ఇంటికి పోయిన తర్వాత మీ కూతుర్ని అడిగి ఇలాంటివే చేయించుకుంటాను. వీటినేవంటారు?” అనడిగాడు.

“వీటిని కుడుములంటారు నాయనా” అని చెప్పిందా అత్త.

అతనికి కొంచెం మతిమరుపు. ఆ పేరు ఎక్కడ మరిచిపోతామో అని.. దారంతా ‘కుడుములు కుడుములు..’ అని తలుచుకుంటూ పోతున్నాడు.

మధ్యలో ఒక చిన్న కాలువ అడ్డం వచ్చింది. దాన్ని ఊపు మీద దూకడానికి “హైసర బన్నా” అన్నాడు.

అంతే మరుక్షణం కుడుములు అనే పదం మరిచిపోయి ‘హైసరబన్నా, హైసరబన్నా‘ అనుకుంటూ ఇంటికి చేరాడు.

ఇంటికి రాగానే భార్యను పిలిచి,

“నేను మీ ఇంటికి వెళ్ళినపుడు మీ అమ్మ హైసరబన్నాలు చేసిపెట్టింది ఎంత రుచిగా ఉన్నాయో! నువ్వు నాకు ఇప్పుడు అవి చేసిపెట్టాలి” అన్నాడు.

హైసరబన్నాలా? అయేంటో నాకు తెలీదయ్యో..” అంది భార్య.

“మీ అమ్మ చేసిపెట్టింది కదే! నీకు తెలీదా? ఏమో నాకు ఇప్పుడు హైసరబన్నాలు చేసిపెట్టాల్సిందే” అంటూ పట్టుబట్టాడు.

“అవేంటో నాకు తెలీదు” మొర్రో అంటున్నా వినలేదు.

మాట వినకపోయే సరికి చిర్రెత్తుకొచ్చి దుడ్డుకర్ర తీసుకుని ఆమె మీదకు రాబోయాడు.

చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళంతా గుమిగూడి అతన్ని పట్టుకొని “ఓరి సచ్చినోడా! ఆ కర్రతో కొడితే అది ఉండాల్నా పోవాల్నా.. ఒళ్ళంతా కుడుముల్లాగా వాచిపోతాదిరా” అన్ని అమ్మలక్కలంతా చీవాట్లు పెట్టడం మొదలెట్టారు.

అప్పుడు వెలిగింది మనవాడికి…. ” ఆ…. అయే నేం జేసి పెట్టమంది… కుడుములు కుడుములు” అన్నాడు.

“ఈ మాట ముందుగానే సెప్పుంటే నేనెందుకు చేసిపెట్టను ఓ యక్కల్లో…” అని భోరుమందా భార్య.


ప్రకటనలు

5 thoughts on “హైసరబన్నాలు

వ్యాఖ్యలను మూసివేసారు.