పెళ్ళి ముచ్చట్లు

పెళ్ళి చేసుకుని తిరిగొచ్చి ఆరు రోజులౌతుంది. టపా రాయడానికి ఇప్పుడు తీరిక చేసుకుంటున్నా.

వెళుతూ వెళుతూ ఆహ్వానం టపా రాసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఓ నెల పాటు బ్లాగు వైపు చూడనే లేదు.

ముందుగా ఆ టపాలో శుభాకాంక్షలందజేసిన ఆత్మీయ మిత్రులు  రిషి, యజ్ఞవల్క, యనమండ్ర, మాలా కుమార్, సునీత, దుర్గేశ్వర, రంజని, జాన్ హైడ్, సుజాత, హరే కృష్ణ, వల్లభ, తెలుగిల్లు, శ్రావ్య వట్టికూటి, నేస్తం, క్రిష్ణ, అనుపమ, శీను, క్రిష్ణమోహన్, స్నిగ్ధ, సుధాకర బాబు, నెలబాలుడు గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ అందరి ఆశీస్సులతో పెళ్ళి బాగా జరిగింది. ముహూర్తం సమయం 10-11 మధ్యనే కావడంతో కార్యక్రమాలన్నీ హడావిడిగా జరిపించేశాడు మా పంతులు. తీరా నన్ను పెళ్ళికొడుకుని చేసే సమయానికి నేను పట్టుబట్టి మరీ తెప్పించుకున్న పట్టుపంచ ధోవతి లాగా కట్టే వాళ్ళే కరువయ్యారు. ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు కదా ఎవరో ఒకరు కడతార్లే అనుకున్నా. చివరికి అడ్డ పంచె లాగా కట్టుకోవడానికి ఉద్యుక్తుడనవుతుండగా పక్కనే ఉన్న ఒక షాపు నుంచి ఒకాయన దేవుడు పంపించినట్లు వచ్చి ధోవతి కట్టేసి వెళ్ళిపోయాడు.

దాదాపు రాత్రి ఒంటి గంటయ్యే సమయానికి కార్యక్రమాలన్నీ పూర్తైపోయాయి. అప్పుడు గుడికి వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుందామంటే గుడి మూసేసి ఉంది. గుడి ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు. అప్పటి దాకా మేలుకుని ఉండి పెళ్ళిబట్టలతో గుడికెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదని పంతులుగారు సలహా ఇచ్చారు.

ఇక అప్పుడు మొదలయ్యాయి మా కష్టాలు. ఓ వైపు పెళ్ళి కొచ్చిన బంధువులంతా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వెళ్ళిపోయారు. చివరికి మేమిద్దరమే మిగిలాం. ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఎలాగోలా కునుకు తీయకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి అప్పటి దాకా ఆమోదించిన వర్షం ఒక్కసారిగా ప్రారంభమైంది. కొత్త దంపతులు వర్షంలో తడవకూడదని చెప్పారు. మళ్ళీ ఓ గంటసేపు వర్షం తగ్గేదాకా అలాగే ఎదురు చూశాం. ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఇంటికి వెళ్ళాం. స్నానం చేసి బెడ్ మీద పడితే ఎలా నిద్ర పట్టిందో కూడా గుర్తు లేదు.

నిరుడు మా గృహ ప్రవేశం జరిగినప్పటి నుంచీ వాయిదా పడుతూ వస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతం మా నవదంపతుల చేతుల మీదుగా జరగాలని ఉందేమో, మరుసటి ఆదివారం కుదరడంతో జరిపించేశాం.  ఇక ఆ తర్వాత విందులూ, వినోదాలూ మామూలే కదా… అలా జరిగిపోయింది.

ప్రకటనలు

25 thoughts on “పెళ్ళి ముచ్చట్లు

 1. “ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు కదా ఎవరో ఒకరు కడతార్లే అనుకున్నా.”

  రవిచంద్ర, ఇది నన్నేనా! కాస్త క్షమించెయ్ బాబూ!……ఆహ్వానం టపాలో సుజాత గారు కామెంటినట్టు వచ్చి బాగా సందడి చేద్దాం అనుకున్నాం….ప్చ్..ఏం చేస్తాం..రాలేకపోవటం నిజంగా మా bad luck…..ఎలాగైతేనేం…పట్టుబట్టి, పంచెకట్టి మన తెలుగు గౌరవం నిలబెట్టావు……మీ వైవాహిక జీవితం మరిన్ని అచ్చ తెలుగు అందాలతో శోభాయమానంగా ఉండాలని కోరుకుంటూ…

  • మిమ్మల్ని కాదు లెండి… మామూలుగా పెద్దవాళ్ళకి తెలిసుంటుంది అనుకున్నా. లేకపోతే పంతులు గారైనా కడతారనుకున్నా. కానీ ఎలాగైతేనేం ఎవరో ఒకరు కట్టారు కదా. కానీ ఆ ఆలోచన ఇచ్చినందుకు మాత్రం మీకు ధన్యవాదాలు. అందరూ చాలా బాగుందన్నారు.
   రాకపోవడం నా బ్యాడ్ లక్ కూడా. సర్లెండి…మీ అభిమానం ఉంటే చాలు

 2. నీలిమ చక్కగా ఉంది!

  నిజంగానే కౌటిల్య, సతీష్ ఉంటే మీ కార్యక్రమం మరింత హుషారుగా ఉండేదేమో!

  అన్నట్లు పెళ్ళి స్వీట్లు బాగున్నాయి. :-))

  • నిజమే వాళ్ళు వచ్చుంటే పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణసంకటం లాగా ఉండేది నా పని 🙂
   మీకు కజ్జికాయలు ఇష్టమని ముందే తెలిసుంటే మరికొన్ని పట్టుకొచ్చుండేవాణ్ణి 🙂

 3. పంచెకట్టి తెలుగు గౌరవం నిలబెట్టారు! ఇది చాలా కరెక్ట్.
  బాగుంది మీ పెళ్ళి అనుభవం .. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్ధం ముహూర్తరాత్రి జాగారం చేశారన్న మాట. బాగుంది 🙂
  శుభాశీస్సులు.

  • అవును అలా జాగారం చేసింది మాత్రం మాకు కలకాలం గుర్తుండిపోతుందండీ…
   మీ ఆశీస్సులు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.

 4. శుభాకాంక్షలండీ రవి చంద్ర గారూ,ఒకటే ఫోటోతో సరిపెట్టేసారు మరికొన్ని పెళ్ళి ఫోటోలు పెడితే మేమందరం చూసి ఆనందిస్తాము కదా! బాగుందండీ మీ జంట 🙂

 5. @జయ, @వేణూ శ్రీకాంత్, @రాణి,@ శ్రీవాసుకి, @Krishna Mohan, @lekhari, @శ్రేయోభిలాషి

  మీ అందరి అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.