ప్రయాణంలో పదనిసలు

గతవారం నా నిశ్చితార్థం కోసం మా ఇంటికెళ్ళాను. తిరిగొచ్చేటపుడు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. రైలు రావడానికి ఇంకా అర గంట సమయముంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. అప్పుడు గుర్తొచ్చింది శుక్రవారం నిశ్చితార్థం ఫంక్షన్ లో తన దగ్గర తీసుకున్న ఫోన్ నంబర్ గురించి. రెండు రోజులైనా ఫోన్ చేయలేదు. ఏమనుకుంటూ ఉంటుందో ఏమో!

ఫంక్షన్ నుంచి వచ్చిన వెంటనే ముందు రోజు ప్రయాణం వల్ల నిద్ర ముంచుకొచ్చేస్తుండటంతో పడుకుండిపోయాను. మరుసటి రోజు తీరిగ్గా ఫోన్ చేద్దామనుకుంటుంటే మా చిన్నాన్న పొలంలో పని చేస్తుంటే పాము కరిచిందని తెలియడంతో ఆ హడావుడిలో పడి ఫోన్ చేయడమే మరిచిపోయాను.

ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నా.

“హ్మ్మ్ ఇప్పటికి గుర్తొచ్చిందన్న మాట…” అటు వైపు నుంచి సమాధానం..

“అసలేం జరిగిందంటే…” నా వైపు నుంచి వివరణ… ఇదే మొదలు… ఇంక అది అనంతంగా సాగిపోతుందనుకుంటా… 🙂

కాబోయే జీవిత భాగస్వామితో మొదటి సారిగా మాట్లాడుతుంటే బాహ్య ప్రపంచంతో సంబంధం ఉంటుందా ఎవరికైనా? నాక్కూడా అంతే…:)

అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ బెంచీ దగ్గరకొచ్చి కూర్చున్నాను. దానికి  ఓ పక్క ఎవరో ఫుల్లుగా లాగించి పడుకుని నిద్రపోతున్నారు. నేను నా పాటికి మాట్లాడుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఏవో కలవరింతలు వినిపిస్తున్నాయి.

“ఏవేయ్ అంకమ్మా…కొంచెం నీళ్ళియ్యే.. ఒక్కసారి నిన్ను కోప్పడినంత మాత్రాన నా మీద అంత కోపమా! నువ్వు నాతో మాట్లాడకపోతే సచ్చిపోతానే… నేనేం తప్పు జేశానే…” ఇలా మత్తులో ఏదేదో మాటలు.

సరే అవేవీ పట్టించుకోకుండా కాసేపు నా పనిలో నేనున్నాను. కొద్ది సేపటి తర్వాత దగ్గరికెళితే కళ్ళు మూసుకుని నా వైపు చూడకుండానే

“దాహం… దాహం… కొంచెం నీళ్ళివ్వండి సార్… ఇప్పటి దాకా ఒక వందమందిని అడిగుంటాను. ఒక్కరు కూడా ఇవ్వలేదు. ” అని అడుగుతున్నాడు.

నా దగ్గర అప్పటికి వాటర్ బాటిల్ లేదు. రైల్లోకెక్కింతర్వాత కొనుక్కుందాం లే అనుకున్నాను.

” పక్కనే కొళాయి ఉంది. లేచి మొహం కడుక్కుని నీళ్ళు తాగు” అన్నాన్నేను.

“లేవలేను సార్. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీరసంగా ఉంది. దయచేసి నీళ్ళుంటే ఇవ్వండి సార్ పుణ్యముంటుంది”  అన్నాడు.

“నువ్వు లేవలేకపోతే నేను పట్టుకుంటా లెయ్యి” అన్నా. ఉహూ! అసలు కదలడం లేదు.

నీళ్ళ కోసం అటూ ఇటూ చూస్తున్నా. ఓ మధ్య వయస్కుడు చేతిలో వాటర్ బాటిల్ అందులో అడుగున కొద్దిగా నీళ్ళు కనిపించాయి.

అతని దగ్గరికెళ్ళి ” ఏవండీ అక్కడ ఒకతను తాగి పడిపోయి ఉన్నాడు. దాహం దాహం అంటూ కలవరిస్తున్నాడు. నా దగ్గర ఇప్పుడు వాటర్ బాటిల్ లేదు. మీ దగ్గరున్న నీళ్ళు కొంచెం అతనికిస్తారా?” అనడిగాను.

అతను నా వైపు విచిత్రంగా ఓ చూపు చూసి “సరే నేనిప్పుడు వాటర్ బాటిల్ ఇస్తాను. మళ్ళీ నాకు కొత్త బాటిల్ తెచ్చిస్తావా?” అనడిగాడు

నేను మొహమాటపడుతుండగానే “చూడు బాబూ! తాగుబోతుల గురించి ఎప్పుడూ జాలిపడొద్దు. అసలు వాడిని అంతలా ఎవరు తాగమన్నారు? అలా కిందపడి ఎవరు దొర్లమన్నారు?”

ఇంకా అతని మాటలు వినదలుచుకోలేదు. చుట్టూ చూస్తే కొంచెం దూరంలో ఒకతను నీళ్ళ బాటిళ్ళు అమ్ముకుంటూ వస్తున్నాడు. తొందరగా అక్కడికెళ్ళి బాటిల్ తీసుకుని వస్తున్నా.

ఇంతలోనే అక్కడే ఉన్న యాత్రికులెవరో నీళ్ళిచ్చినట్టున్నారు. ఆబగా తాగేస్తున్నాడతను. ఎంత దప్పికగా ఉన్నాడో ఏమో రెండు లీటర్ల బాటిల్ చేతికిస్తే సగానికి పైగా ఖాళీ చేసేశాడు.

నాకు ముందు బాటిల్ ఇవ్వడానికి నిరాకరించిన అతనే మళ్ళీ కల్పించుకుని “అనవసరంగా వాళ్ళకెందుకండీ ఇంపార్టెన్స్ ఇవ్వడం.” అంటున్నాడు.

నేనిక ఉండబట్టలేక “అతను ఎలాంటి వాడైనా కావచ్చు. ఇలా తాగేసి పడిపోయి నీళ్ళు ఇచ్చే దిక్కులేక చనిపోయిన సందర్భాలు కొన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. తెలిసి కూడా అలా వదిలేస్తే పాపం కదండీ! మానవత్వం కొద్దీ అయినా సహాయం చేయాలి గదా!” అన్నాను.

దాంతో అతను కొంచెం సర్దుకుని “నిజమే సహాయం చేయూలన్న మీ ఆలోచన కరెక్టే కానీ ఇలాంటి వాళ్ళకు సహాయం చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు” అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు.

నేను నెమ్మదిగా అతని వైపు నడిచి “ఏంటయ్యా దాహం తీరిందా? ఇంకా కావాలా? ” అన్నాను.

“ఇంక చాలు… చాలా ట్యాంక్స్ సర్ ” అన్నాడు ఇంకా మత్తులోనే.

” నాకు ట్యాంక్స్ తరువాత… ఇక నుంచైనా నీ ట్యాంక్ నిండా పట్టించకుండా కొంచెం తక్కువగా తాగు” అని చెప్పేసి చక్కా వచ్చేశాను.