22 ఏళ్లకే ఐఐటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్

తులసి
తులసి

తథాగత్ అవతార్ తులసి… చాలా కాలం క్రితం మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. పన్నెండేళ్ళకే ఎమ్మెస్సీ పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. 2003 లో టైమ్ మ్యాగజీన్ అతనికి ఆసియాలోని గిఫ్టెడ్ యంగ్‌స్టర్స్ లో ఒకడిగా స్థానం కల్పించింది. సైన్స్ మేగజీన్ సూపర్‌టీన్ గా కీర్తించింది. ఇంకా ది టైమ్స్, దేశీవాళీ పత్రికలైన ఔట్‌లుక్, ది వీక్ మొదలైన అన్ని ప్రముఖ పత్రికలూ ఇతన్ని గురించి ప్రస్తావించాయి.

ఇప్పుడు అతని వయసు 22 ఏళ్ళు. కొద్ది రోజుల్లో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరబోతున్నాడు. బీహార్ రాజధాని పాట్నాలో జన్మించిన ఈ బాలమేధావి తొమ్మిదేళ్ళకే ఉన్నత పాఠశాల చదువునూ, పదేళ్ళకే బీయస్సీ డిగ్రీని, పన్నెండేళ్ళకే ఎమ్మెస్సీని పూర్తి చేసేశాడు.

తరువాత 21 ఏళ్ళకు బెంగుళూరు లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ లో పీహెచ్‌డీ పట్టా సంపాదించాడు. పీహెచ్‌డీ పూర్తయిన తరువాత ఐఐటీ ముంబై తో పాటు కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన వాటర్లూ విశ్వవిద్యాలయం, భోపాల్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అవకాశం లభించినా అతను ఐఐటీ ముంబై నే ఎంచుకున్నాడు.

భవిష్యత్తులో డాక్టర్ తులసి మరిన్ని పరిశోధనలు చేసి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.

ప్రకటనలు

7 thoughts on “22 ఏళ్లకే ఐఐటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్

  1. అవును ఇది వరకు నేను కూడా స్వాతిలో అనుకొంటా చదివా ఇతని గురించి. తర్వాత ఏమైపోయాడా అనుకున్నా ఇదిగో మళ్ళీ మీ ద్వారా తెలిసింది. అతను అపర మేధావి కదా.

    • మధ్యలో 2001 లో ఒకసారి ఓ విదేశీ అధ్యాపక బృందం ఇతన్ని నకిలీ మేధావి అని అవహేళన చేసింది. అప్పటి నుంచి మీడియాలో పెద్దగా కనిపించలేదు. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ పోయాడు. ఈనెలలోనే ఉద్యోగంలో చేరుతున్నాడు కాబట్టి వార్తా పత్రికలు ఈ సమాచారం సేకరించినట్లున్నాయి.

  2. నిన్న రాత్రి సీ.ఎన్.ఎన్. ఐ.బీ.ఎన్ లో ప్రత్యేక కార్యక్రమం ప్రసారంచేసారు. నిజంగానే మహా మేధావి. శుభాభినందనలు.

  3. భారతీయులమందరం గర్వించవలసిన వ్యక్తి. ఇంకా చిన్నవాడు కనుక భగవంతుడు తనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలివ్వాలని ప్రార్ధిస్తున్నాను.

వ్యాఖ్యలను మూసివేసారు.