విచక్షణా జ్ఞానం

శ్రీ రామకృష్ణులు
శ్రీ రామకృష్ణులు

ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో చాలామంది శిష్యులుండేవారు. ఒక రోజు ఆయన వారికి ,

“భగవంతుడు అన్ని జీవరాశులలో ఉన్నాడు. అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి”  అని బోధించాడు.

ఒక రోజు అగ్నిహోత్రానికి సమిధలు సేకరించడానికి ఓ శిష్యుడు అడవికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతడికి,

“అడ్డం తొలుగు! ప్రక్కకు తప్పుకో! మదపుటేనుగు వస్తున్నది!” అనే కేక వినపడింది. ఆ కేక విని అందరూ పారిపోతున్నారు. కానీ ఆ శిష్యుడు మాత్రం “ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా! నేను ఇక్కడి నుండి ఎందుకు పారిపోవాలి?” అనుకున్నాడు.

అక్కడే నిలబడి తలవంచి ఏనుగుకు నమస్కరిస్తూ కీర్తించడం మొదలుపెట్టాడు.

మావటి వాడు “పారిపో! పారిపో!” అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయినా ఆ శిష్యుడు ఇసుమంతైనా చలించలేదు.

ఆ ఏనుగు సరాసరి ఆ శిష్యుడి దగ్గరకు వచ్చి తొండంతో చుట్టి ఓ పక్కకు విసిరేసింది. అతనికి దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. గురువు గారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులను అక్కడికి వెంటబెట్టుకుని వచ్చి ఆశ్రమానికి చేరవేశారు. చికిత్స చేసిన కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది.

శిష్యుల్లో ఒకరు “ఏమయ్యా! ఏనుగు వస్తుందని తెలిసినా ఎందుకు పక్కకు తొలగలేదు?” అని ప్రశ్నించాడు. దానికి అతడు, “మన గురువు గారే చెప్పారు కదా అన్ని జీవుల్లో భగవంతుడున్నాడని చెప్పింది. అందుకే ఏనుగు రూపంలో దేవుడే కదా వస్తున్నాడని భావించి పక్కకు తప్పుకోలేదు” అన్నాడు.

వెంటనే గురువు గారు అందుకుని “నిజమే నాయనా, ఏనుగు-దేవుడు రావడం యథార్థమే. కానీ మావటి-దేవుడు పారిపొమ్మన్నాడు కదా! అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ మావటి వాని మాటలు ఎందుకు పెడచెవిన పెట్టావు?” అన్నాడు.

యువకుడైన వివేకానందునికి “ప్రాపంచికులతో ఎలా మెలగాలి?” అనే విషయాన్ని వివరిస్తూ  రామకృష్ణుల వారు ఈ కథను చెప్పారు. దీని వెనుక ఉన్న అర్థం మనం సన్మార్గులతో ఎక్కువగా సాంగత్యం చేసి, వారి మాటలకు ఎక్కువగా విలువనివ్వాలనే.

రామకృష్ణ పరమహంస కథామృతం లో నాకు బాగా నచ్చిన కథ ఇది. ఎందుకంటే జీవితంలో ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు ఈ విధంగా ఆలోచిస్తే సరైన పరిష్కారం లభిస్తుందని నా భావన.

ప్రకటనలు

7 thoughts on “విచక్షణా జ్ఞానం

  1. మనస్సే అనిత్యమైన భవ బంధాలకు, శాశ్వాతానంద దాయకమైన మోక్షానికి కారణం. ‘మైండ్‌ ఈజ్‌ ఎ బండిల్‌ ఆఫ్‌ డిజైర్స్‌’. వస్త్రం నుండి పడుగు పేకలనే దారములను ఒక్కొక్కటే తీసివేస్తే వస్త్రమే అదృశ్య మవు తుంది. అదే విధంగా డిజైర్స్‌ని ఒక్కొక్కటిగా తీసివేస్తే మనస్సే నశిస్తుంది. అట్టి మానవుడు అమనస్క స్థితి పొందుతాడు. కానీ, మానవునికి కావలసింది మనో నాశనం కాదు, మనోలయం. ఆత్మతో మనోలయ ప్రాప్తిని పొందాలి.

వ్యాఖ్యలను మూసివేసారు.