ఇన్‌స్టంట్ ఆఫర్

ఈ ఆదివారం ఓ రెండు ప్యాంట్లు కొనుక్కుందామని బంజారాహిల్స్ లో ఉన్న బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అలా చూస్తుండగా ఇండిగో నేషన్ వారిది “రెండు కొంటే రెండు ఉచితం” అనే ఆఫర్ కంటపడింది. ఎలా ఉన్నాయో చూద్దామని దగ్గరికెళితే బానే ఉన్నాయి. సరే అని అక్కడే ఉన్న సేల్స్ బాయ్ సహకారంతో ఓ నాలుగు ప్యాంట్లు ఎంచుకుని డబ్బులు కట్టడం కోసం వరుసలో నిల్చున్నాను.

కాసేపటి తర్వాత నాకు ప్యాంట్లు ఎంపిక చేసిచ్చిన అబ్బాయి మెల్లగా నా దగ్గరికి వచ్చి,

“సార్ ఒక్క అయిదు నిమిషాలు ఆగండి. అప్పుడు ఓ గంట పాటు రెండు కొంటే మూడు ఉచితం ఆఫర్ ఉంది” అని సమాచారం నా చెవిలో వేశాడు.

అలా ఐదో ప్యాంటు తీసుకోవడానికి వెళ్లానో లేదో అప్పుడే ప్రకటన వినిపిస్తోంది

“రండి బాబూ రండి ఇండిగో నేషన్. రెండు కొంటే మూడు ఉచితం. ఆఫర్ ఒక గంట సేపు మాత్రమే” అని (వాడు ఇంగ్లీషులోనే చెప్పాడు. దానికి ఇది నా సొంత కవిత్వమన్న మాట 🙂 )

నాకు భలే కుశాలనిపించింది. సేల్స్ బాయ్స్ లో ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని. పాపం ఆ అబ్బాయికి సరిగా జీతం ఇవ్వడం లేదో ఏమో ఇలా కసి దీర్చుకుంటున్నాడు. 🙂

ప్రకటనలు