కాంచితి అమరావతీ నగర అపురూప శిల్పాలు…

మిత్రుల సమాగమం
మిత్రుల సమాగమం

అమరావతి శిల్పం
అమరావతి శిల్పం

గత శుక్రవారం మా స్నేహితుడు కొండారెడ్డి పెళ్ళి. వినుకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కర్ నగర్ అనే చిన్న పల్లెటూర్లో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్ళి. మా ఎంటెక్ క్లాస్ మేట్స్ రవికుమార్, మురళి, వేణు, ప్రతాప్, ప్రభాకర్, జూనియర్ ప్రవీణ్ వచ్చారు. ఇక సందడే సందడి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత  కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు. భలే సరదాగా గడిచిపోయింది. ముహూర్తం రాత్రి 2 గంటలకు కావడంతో అప్పటి దాకా మేలుకుని ఊరంతా తిరుగుతూనే గడిపాం.

శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఓ కునుకు తీసి అమరావతి చూడడానికి బయలు దేరాం. వినుకొండ నుండి అమరావతి చేరేసరికి సాయంత్రం నాలుగైంది. అమరావతి లో భోజనం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ లో ఉప్పు చప్పని కూరలు తిని మొహం మొత్తేసిన చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టనిపించింది. తర్వాత మ్యూజియం చూడ్డానికి వెళ్ళేసరికి సమయం నాలుగన్నరైంది. ఓ అర్ధగంటలో అన్నీ మ్యూజియం మూసేస్తామన్నారు. కానీ లోపల గంట సేపటి దాకా గడిపాం.

లోపల శిల్పాలు సుమారు 2000 ఏళ్ళ కాలం నాటివి. వాటిని చెక్కడానికి వాడిన రాయి ఇప్పటిదాకా నేనెక్కడా చూడలేదు. బౌద్ధ సాంప్రదాయంలోని అనేక చిహ్నాలైన త్రిపీఠకాలు, బుద్ధుడి జీవిత విశేషాలు మొదలైనవాటిని శిల్పాల్లాగా మలచి ఉన్నారు. చిన్నప్పుడు తరగతి పుస్తకాల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసి,చదివిన అపురూప శిల్పాలను కళ్ళారా చూసినప్పుడు కలిగిన ఆ అనుభూతే వేరు.

తర్వాత పక్కనే ఉన్న మహా స్థూపాన్ని చూడ్డానికి వెళ్ళాం. దీన్ని కట్టడానికి వాడిన ఇటుకలు చాలా పెద్దవి, బలమైనవి కూడా. చాలా వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చుట్టూ పేర్చి ఉన్న శిలలపై అక్కడకక్కడా శాసనాలు చెక్కించి ఉన్నారు. ముందుగా కొంచెం అమరావతి గురించి రీసెర్చి చేసుకుని వెళ్ళాను కాబట్టి నేనే అక్కడక్కడా మా వాళ్ళకి గైడునయ్యాను :). తర్వాత కృష్ణానదీ ఒడ్డునే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.ఇక్కడ  శివలింగం మామూలు విగ్రహాలకన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. కొండవీడు కోట కూడా చూద్దామనుకున్నాం కానీ సమయం చాల్లేదు. మళ్ళీ ఎపుడైనా వెళ్ళినప్పుడు చూడాలి.

సామాజిక ‘వేదం’

నేను ఇటీవల చూసిన మంచి సినిమా, నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా వేదం. నిజానికి  నేను పదిరోజుల క్రితమే చూసినా రాయడానికి ఇన్ని రోజులకు కుదిరింది. ఈ సినిమా గురించి నాకు తోచిన నాలుగు మాటలు…

Spoiler Alert: ఒక వేళ మీరు ముందుగా కథ తెలుసుకోకుండా సినిమా చూడదలుచుకుంటే కింది భాగం చదవద్దు.

ఈ సినిమా నిజానికి ఒక కథ మీద ఆధారపడి తీసింది కాదు. ఐదు కథలు సమాంతరంగా నడుస్తూ ఒక చోట కలుస్తాయి. నాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను  తనదైన శైలిలో తెరకెక్కించాడు క్రిష్.  సినిమాలో నాకు అక్కడక్కడా కొన్ని  సన్నివేశాలున్నాయి అద్భుతంగా అనిపించాయి. ఉదాహరణకు కిడ్నీ అమ్మేసి  సంపాదించుకున్న డబ్బుల్ని రాములు దగ్గర్నుంచి అల్లు అర్జున్ లాక్కునే సీన్, వెంటనే వచ్చే సీన్ లో హీరోయిన్ ‘న్యూ ఇయర్ పార్టీకి పాసెస్ తీసుకున్నావా?’ అని అడిగితే చేతులో డబ్బులుంచుకుని ‘నా దగ్గర డబ్బుల్లేవనడం’ అనే సన్నివేశం నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశాలు.

వేశ్య పాత్రలో నటించిన అనుష్క నటన కూడా నాకు  బాగా నచ్చింది. ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో వేశ్య పాత్రలను ఆటవస్తువులుగా చూపిస్తే ఇందులో క్రిష్ వాళ్ళను ఓ సమాజంలో భాగంగా చూపిస్తూ వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం.

కానీ సినిమా సుఖాంతం కాకపోతే తెలుగు ప్రేక్షకులు సరిగా ఆదరించరని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకుల ధోరణిని మార్చే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.నాకు ముగింపు ఏ మాత్రం అసంతృప్తిని కలిగించలేదు. నాకే కాదు థియేటర్లోని మిగతా ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయినట్లు అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ చివర్లో చనిపోతూ సినిమాలో తన ఊతపదమైన ‘దీనమ్మ జీవితం’ అనగానే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున నవ్వులు విరబూశాయి. దీంతో దర్శకుడి కృషి ఫలించినట్లే అని చెప్పవచ్చు.

ఒకేసారి అన్ని కథలు కలగాపులగంగా నడుస్తుంటే సగటు ప్రేక్షకుడికి కొంచెం కన్ఫ్యూషన్ కలిగించక మానదు. కానీ ఈ రకం సినిమాలు ప్రయోగాత్మకంగా భావించాలి. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. మిమ్మల్నీ నిరాశపరచదని భావిస్తున్నాను.

అశాశ్వతం

ఇక్క్యూ అనే జెన్ గురువు చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు. అతను విద్యాభ్యాసం చేసే సమయంలో గురువు దగ్గర ఒక విలువైన టీకప్పు ఉండేది. అది చాలా పురాతనమైనది, విలువైనది. అది ఒకసారి పొరపాటున ఇక్క్యూ చేతిలోంచి జారిపడి పగిలిపోయింది. అతను ఆందోళనలో పడిపోయాడు. గురువు సమీపిస్తున్నాడనగా ఆ ముక్కలను తీసుకుని వెనక దాచుకుని
గురువును ఇలా అడిగాడు “మనుషులు ఎందుకు చనిపోవాలి?”
“అది చాలా సహజం. పుట్టిన ప్రతిదీ ఒక నిర్ణీత సమయం తరువాత మరణించక తప్పదు” అన్నాడా గురువు.

అప్పుడు అతను వెనుక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ “మీ టీకప్పుకు కూడా ఆ నిర్ణీత సమయం దాటిపోయింది” అన్నాడు.

గురువు నవ్వుతూ అతని భుజం తట్టాడు.