నైవేలి విశేషాలు

నైవేలి
నైవేలి విహంగ వీక్షణం

గత శనివారం ఓ వ్యక్తిగత పని మీద తమిళనాడులోని నైవేలి వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై నుంచి దక్షిణంగా సుమారు 200 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ లిగ్నైట్ విస్తారంగా దొరుకుతుంది. లిగ్నైట్ అంటే పూర్తి స్థాయి బొగ్గుగా మారకుముందు రూపమన్న మాట. ఇందులో బొగ్గు కన్నా తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగభాగం (సుమారు 2500 మెగావాట్లు) ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందట.

1935 లో జంబులింగ మొదలియార్ అనే ఆసామి తన పొలంలో బోర్ వేస్తుండగా నల్లటి రాళ్ళు బయట పడ్డాయి. దాన్ని పరీక్ష కోసం పంపించగా ఆ ప్రాంతం యొక్క భూగర్భంలో విస్తారమైన లిగ్నైట్ నిల్వలు ఉన్నట్లు తెలియవచ్చింది. 1956 లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే పేరుతో  భారత ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పనులు ప్రారంభించింది. 1962  నుంచి అక్కడ మైనింగ్ ప్రారంభమైంది.

నటరాజ స్వామి
నటరాజ స్వామి

ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలతో చక్కటి టౌన్ షిప్ నిర్మించి ఇచ్చింది. సుమారు 55 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తారమైన వృక్షసంపదతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా తమిళనాడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. బొగ్గును వెలికితేసే కార్యక్రమంలో భాగంగా కుప్పలుగా పోసిన ఫ్లై యాష్, మట్టి పెద్ద పర్వతాల్లాగా కనిపిస్తాయి. అవి పర్యావరణానికి అంతగా మంచిది కాదనడంతో ఇటీవలే వాటి మీద చెట్లను పెంచడం ప్రారంభిస్తున్నారు.

ఆవరణలో నాలుగు దేవాలయాలు, రెండు చర్చిలు, మసీదు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్దదైన, పన్నెండు అడుగుల ఎత్తైన పంచలోహ నటరాజ స్వామి విగ్రహం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంకా నేను చూడాలనుకున్న చిదంబరం, తంజావూరు కూడా ఇక్కడకు దగ్గరే. ఇంకెప్పుడైనా వెళ్ళినపుడు చూడాలి.