గోల్కొండ కోట సౌండ్ అండ్ లైట్ షో

గోల్కొండ కోటను ఎవరైనా సందర్శించాలని ఉంటే అక్కడ తప్పక  చూడవలసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు నిర్వహించే సౌండ్ అండ్ లైట్ షో. అందులో గోల్కొండ చరిత్రను ఒక నాటక రూపకంలో వివరిస్తారు.  కథను అమితాబ్ బచ్చన్ తన ధీరగంభీరమైన స్వరంతో వినిపిస్తాడు. మధ్యలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు, సంభాషణల రూపంలో ఉంటాయి.  ఒక్కో సన్నివేశానికి సంభందించిన  సంభాషణలు కోటలో ఎక్కడ జరుగుతాయో అక్కడ లైట్లు వెలుగుతాయి. సంభాషణలు అక్కడి నుంచే వినిపిస్తున్నట్లుండి ఆ సన్నివేశం మన కళ్ళెదురుగా జరుగుతున్నట్లుగా ఉంటుంది.

ముఖ్యంగా రామదాసు ఘట్టం వచ్చినపుడు ఆయన్ను దాచి ఉంచినట్లుగా భావిస్తున్న చెరసాల నుంచి భావగర్భిత మైన బాలమురళీకృష్ణ గాత్రంలో “ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా పలుకవే రామచంద్రా…”  అనే పాట వినగానే నిజంగానే అక్కడ రామదాసు ఉన్నట్లు, పాట పాడినట్లు అనిపించి ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్లయింది నాకు. ఇంకా కులీ కుతుబ్ షా, భాగ్ మతీ దేవి ల మధ్య జరిగే ప్రేమ ఘట్టాలు, ఔరంగజేబు దండయాత్ర సమయంలో కోటను రక్షించడానికి రాజ కుటుంబం పడే తాపత్రయం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ నాటకాన్ని వింటే ఎప్పుడో చిన్నప్పుడు విన్న రేడియో నాటకాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా నవాబుల కాలంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది.

పైన నేను చెప్పిన విశేషాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే  సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదర్శనను మాత్రం తప్పక చూడండి.

11 thoughts on “గోల్కొండ కోట సౌండ్ అండ్ లైట్ షో

 1. అవును షో చాలా బాగుంటుంది కానీ ఎటొచ్చీ ఆ దోమలతోనే ఇబ్బంది.షో జరుగుతున్నంతసేపూ నరకం అనుభవించా నేను వెళ్ళినప్పుడు.

  • అన్ని దోమలున్నాయా? ఓపెన్ ప్లేస్ కాబట్టి ఉండి వుండచ్చు. కానీ మేం వెళ్ళినపుడు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందుకనే ఎంజాయ్ చెయ్యగలిగాను.

 2. అవును షో చాలా బాగుంటుంది. కానీ నేను తెలుగులో చూడలేదు. ఇంగ్లీషులో చూసాను. అమితాబ్ బచ్చన్ వాయిస్ చాలా బాగుంటుంది. తెలుగులో ఎవరు మాట్లాడారు?

  • సౌమ్య గారూ, ప్రత్యేకంగా తెలుగులో ఉండదు. ప్రత్యేకంగా వాళ్ళు ఆదరించిన తెలుగు కళలైన కూచిపూడి, కొన్ని సాహిత్య ప్రక్రియల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొన్ని తెలుగు మాటలు, పాటలు వినిపిస్తాయి. అవి ఎవరు చెప్పారో తెలియదు.

   • ఓ అయితే ఇది చాలా రోజులుగా ఉన్నదన్నమాట. నేను ఇటీవలే ప్రారంభించిందనుకున్నాను.

 3. మంచి సమాచారం ఇచ్చారు. బాగున్నది. మీరు చిన్నాప్పుడు రేడియో నాటకాలు విన్నట్టుగా ఉన్నది అని వ్రాసారు. మీ దగ్గర రేడియో నాటకాలు రికార్డింగులు ఏమన్నా ఉన్నాయా. ఎందుకు అంటే నేను రేడియో నాటికలు, నాటకాలు, ఇతర కార్యక్రమాలను సేకరిస్తున్నాను (ముఖ్యంగా ఆకాసవాని విజయవాడ కేద్రం నుండి ప్రసారమైనవి).

  • ధన్యవాదాలు శివ గారూ .
   రేడియో నాటకాలంటే చిన్నప్పుడు చాలా ఆసక్తిగా వినేవాణ్ణి. కానీ రికార్డింగులేమీ లేవు.

వ్యాఖ్యలను మూసివేసారు.