కాంచితి అమరావతీ నగర అపురూప శిల్పాలు…

మిత్రుల సమాగమం
మిత్రుల సమాగమం

అమరావతి శిల్పం
అమరావతి శిల్పం

గత శుక్రవారం మా స్నేహితుడు కొండారెడ్డి పెళ్ళి. వినుకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కర్ నగర్ అనే చిన్న పల్లెటూర్లో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్ళి. మా ఎంటెక్ క్లాస్ మేట్స్ రవికుమార్, మురళి, వేణు, ప్రతాప్, ప్రభాకర్, జూనియర్ ప్రవీణ్ వచ్చారు. ఇక సందడే సందడి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత  కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు. భలే సరదాగా గడిచిపోయింది. ముహూర్తం రాత్రి 2 గంటలకు కావడంతో అప్పటి దాకా మేలుకుని ఊరంతా తిరుగుతూనే గడిపాం.

శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఓ కునుకు తీసి అమరావతి చూడడానికి బయలు దేరాం. వినుకొండ నుండి అమరావతి చేరేసరికి సాయంత్రం నాలుగైంది. అమరావతి లో భోజనం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ లో ఉప్పు చప్పని కూరలు తిని మొహం మొత్తేసిన చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టనిపించింది. తర్వాత మ్యూజియం చూడ్డానికి వెళ్ళేసరికి సమయం నాలుగన్నరైంది. ఓ అర్ధగంటలో అన్నీ మ్యూజియం మూసేస్తామన్నారు. కానీ లోపల గంట సేపటి దాకా గడిపాం.

లోపల శిల్పాలు సుమారు 2000 ఏళ్ళ కాలం నాటివి. వాటిని చెక్కడానికి వాడిన రాయి ఇప్పటిదాకా నేనెక్కడా చూడలేదు. బౌద్ధ సాంప్రదాయంలోని అనేక చిహ్నాలైన త్రిపీఠకాలు, బుద్ధుడి జీవిత విశేషాలు మొదలైనవాటిని శిల్పాల్లాగా మలచి ఉన్నారు. చిన్నప్పుడు తరగతి పుస్తకాల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసి,చదివిన అపురూప శిల్పాలను కళ్ళారా చూసినప్పుడు కలిగిన ఆ అనుభూతే వేరు.

తర్వాత పక్కనే ఉన్న మహా స్థూపాన్ని చూడ్డానికి వెళ్ళాం. దీన్ని కట్టడానికి వాడిన ఇటుకలు చాలా పెద్దవి, బలమైనవి కూడా. చాలా వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చుట్టూ పేర్చి ఉన్న శిలలపై అక్కడకక్కడా శాసనాలు చెక్కించి ఉన్నారు. ముందుగా కొంచెం అమరావతి గురించి రీసెర్చి చేసుకుని వెళ్ళాను కాబట్టి నేనే అక్కడక్కడా మా వాళ్ళకి గైడునయ్యాను :). తర్వాత కృష్ణానదీ ఒడ్డునే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.ఇక్కడ  శివలింగం మామూలు విగ్రహాలకన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. కొండవీడు కోట కూడా చూద్దామనుకున్నాం కానీ సమయం చాల్లేదు. మళ్ళీ ఎపుడైనా వెళ్ళినప్పుడు చూడాలి.

7 thoughts on “కాంచితి అమరావతీ నగర అపురూప శిల్పాలు…

 1. బాగుంది మీ యాత్ర. అనుకోని దర్శనమన్నమాట. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు చూశాను అమరావతి. ఇప్పుడు చాలా మారిపోయింటుంది. అవును ఇంతకీ అక్కడ మీరు ఓ సాంగ్ సింగారా అదే శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు….

 2. నన్ను గైడ్ గా పిలిస్తే బావుండేది! చిన్నపుడు ఎక్కడికన్నా వెళదాం అనగానే అమరావతీ, కొండవీడు, మంగళగిరి! ఈ మూడే!

  ఎన్ని సార్లు చూశామో లెక్కే లేదు. గుళ్ళు ఇంత పెద్దగా కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయింది ఇక్కడే!

  కృష్ణా నది అందాలు అమరావతిలో చెప్పనలవి కాదు!

  దేవాయం,సప్తపది సినిమాలు ఇక్కడే తీశారని తెలిసి అదో గొప్ప మాకు! అంత గొప్ప సినిమాలు(?) తీసిన వూర్ని చూడ్డానికొచ్చామని!

  గుంటూరు జిల్లాలో భోజనం ఎక్కడైనా అద్భుతంగా ఉంటుందండీ 🙂

  • అయ్యో!! కనీసం మీకు ఫోన్ అయినా మెయిల్ అయినా చేసి వెళ్ళి ఉండాల్సింది. మీరు ముందుగా కొన్ని విశేషాలు చెప్పుండే వారు. అంతా బిజీ బిజీగా వెళ్ళిపోయాం. అయినా పర్లేదు లెండి, వచ్చే నెల్లో మేం సూర్య లంక బీచ్ కు వెళుతున్నాం. అప్పుడు మంగళగిరి చూడాలనుకుంటున్నాం. ఈ లోపు ఆ విశేషాలేవో మీతో మాట్లాడాలి. 🙂
   #కృష్ణా నది అందాలు: ఇప్పుడు నీళ్ళు లేవు కానీ నిండుగా నీళ్ళుంటే మాత్రం అద్భుతమైన దృశ్యమే నండీ.. లాంచీ కూడా ఎక్కుండచ్చు. మళ్ళెప్పుడైనా ప్రయత్నిస్తాం.
   #గుంటూరు భోజనం: నిజమే గుంటూరులో తిన్నాం, అమరావతిలో తిన్నాం, వినుకొండలో తిన్నాం. ఎక్కడైనా దేనికదే సాటి. 🙂

 3. Most of Amaravathi findings are available in Egmore, Checnnai museum. Eventhough I felt happy and proud when I saw them, but I felt bad being in Hyderabad or in Amaravathi museums itself.

  • అవునండీ…మీరు గుంటూరు జిల్లా అని తెలుసుకానీ ఆ ప్రాంతం సరిగా తెలియకపోవడం వల్ల మేం మీకు దగ్గరగా వచ్చామని తెలియలేదు. 😦

వ్యాఖ్యలను మూసివేసారు.