అంతా మార్కుల మయం

ఈ వారాంతం శ్రీకాళహస్తి కెళ్ళినపుడు తెలుసుకున్న విశేషాలు కొన్ని మీతో పంచుకోవాలనే ఈ టపా.

ఎక్కడ చూసినా కర పత్రాలు, వాటి నిండా ర్యాంకులు, మార్కులు. ఈ సారి పట్టణంలో కొత్తగా నాలుగు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభమౌతున్నాయట.

నేను ఇంటర్ చదివేటపుడు మాకు మ్యాథమేటిక్స్ బోధిస్తూ ఉండి, ప్రస్తుతం ఓ కార్పొరేట్ కళాశాలలో పనిచేసే మా పూర్వ అధ్యాపకులు నాకో ఆసక్తికరమైన సంఘటన తెలియజేశారు.

నెల్లూరు కు సమీపంలో ఉన్న నరసింహ స్వామి కొండ ప్రాంతం. అక్కడ ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన ఐఐటీ కోచింగ్ సెంటర్ ఉంది.

ఓ ఉదయం అక్కడికి ఓ తండ్రి తన కొడుకుని చేర్చాలని వెంటబెట్టుకొచ్చాడు. అక్కడున్న ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నాడు.

“సార్, మా అబ్బాయికి పదో తరగతిలో 536 మార్కులొచ్చాయి. ఐఐటీ కోచింగ్ లో చేరుద్దామని, మీ దగ్గరైతే బాగా చెబుతారని విని తీసుకొచ్చాను సార్.”

“దాందేముంది? అలాగే చేర్చండి. ఫీజు సంవత్సరానికి 60,000. అది కట్టేసి అడ్మిషన్ తీసుకోండి” అన్నాడు చాలా మామూలుగా.

“అంత కట్టలేను సార్. 30,000 అయితే కట్టగలను. కానీ మా అబ్బాయి లెక్కలు బాగా చేస్తాడు సార్. అందరూ మీ దగ్గరికి పొమ్మని సలహా ఇచ్చినారు. అందుకనే వచ్చాం. ఎలాగోలా సర్దుకోండి సార్ ” ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి.

అయినా ప్రిన్సిపల్ మనస్సు కరగలేదు. “మేమేం చెయ్యలేమయ్యా. ఫీజు అంతా కట్టేపనైతే చేర్చండి. లేకపోతే వేరే కాలేజీలో చేర్చుకోండి” అన్నాడు కరుగ్గా.

అయినా సరే ఆ తండ్రి తన పట్టు విడవలేదు. “ఎలాగోలా సర్దుకోండి సార్. మా అబ్బాయి నిజంగా లెక్కలు బాగా చేస్తాడు సర్ ” అడుక్కుంటూనే ఉన్నాడు.

కాసేపటి తర్వాత “సరేనయ్యా! నువ్వింతగా అడుక్కుంటున్నావు కాబట్టి మీ అబ్బాయికి మేమో పరీక్ష పెడతాం. అందులో గనక మంచి మార్కులు వస్తే మీరు చెప్పిన ఫీజు కట్టించుకుని చేర్చుకుంటాం” అన్నాడు.

ఆ తండ్రి మొహం ఆనందంతో వెలిగిపోయింది. “అలాగే సార్. మా అబ్బాయి రాస్తాడు” అన్నాడు సంతోషంగా…

ఆ అబ్బాయి మాత్రం ఏ భావం లేకుండా అమాయకంగా ఉన్నాడు.

వెంటనే ఆ అబ్బాయికి 120 మార్కులకు ఓ పేపరిచ్చి ఓ గంటసేపు రాయమన్నారు. ఆ అబ్బాయి పెద్దగా కష్టపడకుండానే పూర్తి చేసేశాడు. పేపర్ దిద్దితే 116 మార్కులు వచ్చాయి.

కాలేజీ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు.  ఆ అబ్బాయిని ఓ గంట సేపు విశ్రాంతి తీసుకోమని మళ్ళీ రెండో సారి పరీక్ష పెట్టారు. ఈ సారి అబ్బాయికి 112 మార్కులొచ్చాయి.

అయినా సరే వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఆ అబ్బాయికి అలా కొద్ది విరామంతో అయిదు సార్లు టెస్టులు పెట్టారు. ఆ అయిదు పరీక్షల్లో ఆ అబ్బాయి సగటు 115 మార్కులు.

ఇక లాభం లేదనుకుని ఆ ప్రిన్సిపాల్ తమ బాస్ కు ఫోన్ చేశాడు.

“ఏంటయ్యా! అంత మంచి స్టూడెంట్ విషయం లో ఇంత దూరంలో ఆలోచిస్తారా. ఫీజు కట్టేను కట్టకపొయ్యేను. ముందుగా ఆ అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చి లాగెయ్యండి” అని ఫోన్ లోనే చీవాట్లు పెట్టాడా బాస్.

అదీ సంగతి. కార్పొరేట్ కళాశాలలకు పేరు తెచ్చేది ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులే…

10 thoughts on “అంతా మార్కుల మయం

 1. చిన్నప్పుడు నాకు ఇంగ్లిష్, సైన్స్ & సోషల్ స్టడీస్ లో 90% మార్కులు వచ్చేవి. గణితంలో మాత్రం అంత మార్కులు వచ్చేవి కావు. చదివినది గుర్తుండడం అనేది సబ్జెక్ట్ మీద ఆసక్తి బట్టి ఉంటుంది.

  • గణితంలో కేవలం చదివింది గుర్తుంచుకుంటే సరిపోదు. కొంచెం బుర్ర ఉపయోగించాలి.

 2. నేను పదో కలాసు సదూకున్న రోజుల్లో నాలుగొందల చిల్లర మార్కులొస్తే పెద్ద గొప్ప! నాకు 467 మార్కులొస్తే స్కూలు ఫస్టు!

  నేను చదూకుంది మునిసిపల్ హై స్కూల్లో లెండి. ఏ భాష్యంలోనో, చైతన్యాలోనో, కేశవరెడ్డిలోనొ అయితే నన్నూ రుబ్బేసి నాకూ ఆరొందల పది మార్కులు తెప్పించేసి ఉందురు!

  అయినా ప్రైవేట్ స్కూళ్ళలో ఇప్పుడు తొమ్మిదో క్లాసులో తొమ్మిదో క్లాసు సిలబస్ కాదు చెప్పేది, పదో క్లాసుదే! అందువల్ల రెండేళ్ళు ఒకటే క్లాసు సిలబస్ చదివిన వాళ్ళు ఆ ఐదొందలు తెచ్చుకోలేకపోతే ఎలా?

  తెలివైన విద్యార్థుల్ని శంకించడం కాదు, ఈ కార్పొరేట్ స్కూళ్ళ పని తీరు పట్ల ఆశ్చర్యం!

  • స్కూలు ఫస్ట్ ఎవరికైనా వస్తుంది
   మార్కులు ముఖ్యం కాదు మార్తాండ లా అపర జ్ఞానాన్ని సంపాదించడం జరిగిందా లేదా అనేదే ముఖ్యం 🙂

  • సుజాత గారూ, నేను చదూకున్నది ప్రభుత్వ పాఠశాల్లోనే..
   కార్పొరేట్ కళాశాలల్లో కేవలం మార్కులే ధ్యేయంగా విద్యార్థులను యంత్రాల్లా మారుస్తున్నారు తప్ప నిజమైన మనుషులుగా మార్చడం లేదన్నదే నా బాధ.

 3. చిన్నప్పుడు నాకు ఇంగ్లిష్, సైన్స్ & సోషల్ స్టడీస్ లో 90% మార్కులు వచ్చేవి. గణితంలో మాత్రం అంత మార్కులు వచ్చేవి కావు

  అందుకే వందకి రెండొందలు ఇస్తున్నాడు నీ కధలో హీరో

 4. మాకంత అదృష్టం లేదులెండి. హాయిగా చక్కని ప్రభుత్వ పాఠశాలలో చదివాము. 10వ తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చింది. మాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన అబ్బాయి పేరు హెడ్మాస్టర్ గది ప్రక్కనున్న బోర్డ్ మీద వ్రాసారు అదే మాకు గొప్ప. 7వ తరగతిలో స్కూల్ సెకండ్ వస్తే ఆగస్ట్ 15న వెండి పతకం మెడలో వేసి ఇంటి దగ్గర చూపించి మర్నాడు తెచ్చేయమన్నారు. అందుకే ఈ రోజుకి ఆ విషయం చాలామందికి చెప్పుకోలేదు. అడిగితే చూపించడానికి పతకం లేదుగదా. చదివినంత కాలం ఒత్తిడి లేకుందా ఆటపాటలతో చదువు సాగింది. కాని ఈ తరహా చదువు ఇప్పటి పిల్లలకి ముఖ్యంగా నా మూడేళ్ళ కూతురికి ముందు ముందు ఉంటుందా అన్నదే ప్రశ్న.
  అవును చిన్న అనుమానం మార్తాండలాగా నేను ఏదేదో వ్రాసేయలేదు గదా.

  • మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
   కార్పొరేట్ కాలేజీల వాళ్ళు మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి అని గొప్పగా ప్రకటనలిస్తుంటారు కదా.. అది టపాలో ఉదహరించిన విద్యార్థుల వల్లనే సాధ్యం అని చెప్పడం నా ఉద్దేశ్యం.
   ఇక మీ పాప విషయనికొస్తే స్కూల్లో ఎలాగైనా చెప్పనీయండి, అమ్మాయిని మంచి మనిషిగా తీర్చిదిద్దడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది.

 5. munde baaga chadive vidyarthulani vala vesi patti, valla dwara ranks sampadinchi, tarvata adi valla coaching ghanata ani cheppukovatam ee corporate vidya samsthalaki mamoolee… idila vundaga pedda fees kattinchesukuni edo oka rakam ga sagatu vidyarthula nunchi goppa marks rabattatam kooda oka bhagame… verasi, vidyarthulaki cheppukovataniki textbooks lo chadivinavi tappa, jeevitham lo anubhavinchinavi emi vundavu… stress out ayipoyi, machines laga tayaru avutunnaru tappa, manushullaga kadu 😦 maa cousins ni chooste ee vishayam ga chala badha vestundi…

వ్యాఖ్యలను మూసివేసారు.