అంతా మార్కుల మయం

ఈ వారాంతం శ్రీకాళహస్తి కెళ్ళినపుడు తెలుసుకున్న విశేషాలు కొన్ని మీతో పంచుకోవాలనే ఈ టపా.

ఎక్కడ చూసినా కర పత్రాలు, వాటి నిండా ర్యాంకులు, మార్కులు. ఈ సారి పట్టణంలో కొత్తగా నాలుగు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభమౌతున్నాయట.

నేను ఇంటర్ చదివేటపుడు మాకు మ్యాథమేటిక్స్ బోధిస్తూ ఉండి, ప్రస్తుతం ఓ కార్పొరేట్ కళాశాలలో పనిచేసే మా పూర్వ అధ్యాపకులు నాకో ఆసక్తికరమైన సంఘటన తెలియజేశారు.

నెల్లూరు కు సమీపంలో ఉన్న నరసింహ స్వామి కొండ ప్రాంతం. అక్కడ ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన ఐఐటీ కోచింగ్ సెంటర్ ఉంది.

ఓ ఉదయం అక్కడికి ఓ తండ్రి తన కొడుకుని చేర్చాలని వెంటబెట్టుకొచ్చాడు. అక్కడున్న ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నాడు.

“సార్, మా అబ్బాయికి పదో తరగతిలో 536 మార్కులొచ్చాయి. ఐఐటీ కోచింగ్ లో చేరుద్దామని, మీ దగ్గరైతే బాగా చెబుతారని విని తీసుకొచ్చాను సార్.”

“దాందేముంది? అలాగే చేర్చండి. ఫీజు సంవత్సరానికి 60,000. అది కట్టేసి అడ్మిషన్ తీసుకోండి” అన్నాడు చాలా మామూలుగా.

“అంత కట్టలేను సార్. 30,000 అయితే కట్టగలను. కానీ మా అబ్బాయి లెక్కలు బాగా చేస్తాడు సార్. అందరూ మీ దగ్గరికి పొమ్మని సలహా ఇచ్చినారు. అందుకనే వచ్చాం. ఎలాగోలా సర్దుకోండి సార్ ” ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి.

అయినా ప్రిన్సిపల్ మనస్సు కరగలేదు. “మేమేం చెయ్యలేమయ్యా. ఫీజు అంతా కట్టేపనైతే చేర్చండి. లేకపోతే వేరే కాలేజీలో చేర్చుకోండి” అన్నాడు కరుగ్గా.

అయినా సరే ఆ తండ్రి తన పట్టు విడవలేదు. “ఎలాగోలా సర్దుకోండి సార్. మా అబ్బాయి నిజంగా లెక్కలు బాగా చేస్తాడు సర్ ” అడుక్కుంటూనే ఉన్నాడు.

కాసేపటి తర్వాత “సరేనయ్యా! నువ్వింతగా అడుక్కుంటున్నావు కాబట్టి మీ అబ్బాయికి మేమో పరీక్ష పెడతాం. అందులో గనక మంచి మార్కులు వస్తే మీరు చెప్పిన ఫీజు కట్టించుకుని చేర్చుకుంటాం” అన్నాడు.

ఆ తండ్రి మొహం ఆనందంతో వెలిగిపోయింది. “అలాగే సార్. మా అబ్బాయి రాస్తాడు” అన్నాడు సంతోషంగా…

ఆ అబ్బాయి మాత్రం ఏ భావం లేకుండా అమాయకంగా ఉన్నాడు.

వెంటనే ఆ అబ్బాయికి 120 మార్కులకు ఓ పేపరిచ్చి ఓ గంటసేపు రాయమన్నారు. ఆ అబ్బాయి పెద్దగా కష్టపడకుండానే పూర్తి చేసేశాడు. పేపర్ దిద్దితే 116 మార్కులు వచ్చాయి.

కాలేజీ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు.  ఆ అబ్బాయిని ఓ గంట సేపు విశ్రాంతి తీసుకోమని మళ్ళీ రెండో సారి పరీక్ష పెట్టారు. ఈ సారి అబ్బాయికి 112 మార్కులొచ్చాయి.

అయినా సరే వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఆ అబ్బాయికి అలా కొద్ది విరామంతో అయిదు సార్లు టెస్టులు పెట్టారు. ఆ అయిదు పరీక్షల్లో ఆ అబ్బాయి సగటు 115 మార్కులు.

ఇక లాభం లేదనుకుని ఆ ప్రిన్సిపాల్ తమ బాస్ కు ఫోన్ చేశాడు.

“ఏంటయ్యా! అంత మంచి స్టూడెంట్ విషయం లో ఇంత దూరంలో ఆలోచిస్తారా. ఫీజు కట్టేను కట్టకపొయ్యేను. ముందుగా ఆ అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చి లాగెయ్యండి” అని ఫోన్ లోనే చీవాట్లు పెట్టాడా బాస్.

అదీ సంగతి. కార్పొరేట్ కళాశాలలకు పేరు తెచ్చేది ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులే…