మనకా సత్తా ఉందా?

శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోయిన నేపథ్యంలో కొంతమంది నాయకులు భిక్షమెత్తైనా సరే గోపురాన్ని తిరిగి నిర్మిస్తామని ఆవేశంగా ప్రతిజ్ఞలు చేసేశారు. వాటి సంగతలా ఉంచితే ఇంజనీరింగ్ లో మన పూర్వీకుల కన్నా బాగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న మనకు నిజానికి మన పూర్వీకుల కట్టడాలను యధాతథంగా పునరుద్ధరించే సత్తా ఉందా? అంటే నాకు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

నేను వరంగల్ లో ఎంటెక్ చదివేటప్పుడు వేయిస్థంభాల గుడిని చాలా సార్లు సందర్శించాను. అది ఒకే డిజైన్ కలిగిన రెండు ఆలయాలు ఎదురెదురుగా ఉన్నట్లు నిర్మించబడి ఉంటుంది. ఒక్కో ఆలయం గోడలపై ఐదువందల స్థంభాలు చెక్కబడి ఉన్నాయి. కానీ వాటిలో ఒక భాగం నేను మొదట్లో అక్కడికి వెళ్ళినప్పుడే (2006 లో) శిథిలావస్థకు చేరుకున్నది. పురావస్తు శాఖ వారు ఎన్‌ఐటీ వరంగల్ లోని కొంత మంది సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల సాయంతో ఆలయంలోని రాతి స్థంభాలకు ఏదో నంబర్లు వేసి కూల్చివేశారు. ఈ పనిలో చాలా రాతి స్థంభాలు దెబ్బతిన్నాయి కూడా.

ఇప్పటికి నాలుగేళ్ళు అవుతున్నా ఆలయ పునర్నిర్మాణాభివృద్ధిలో అతీ గతీ లేదు. దీన్ని మన పాలకుల నిర్లక్ష్యంగా అర్థం చేసుకోవాలో లేక మన ఇంజనీర్ల అసమర్థతగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితిలో పర్యవేక్షణా లోపం వలన శ్రీకాళహస్తి గోపురం లాంటి మనకున్న అనేక ప్రాచీన కట్టడాలు కాలక్రమేణా చరిత్రలో కలిసిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదనిపిస్తున్నది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దృష్టి సారిస్తే తప్ప ప్రాచీనమైన దేవాలయాలను కాపాడుకోలేం.