అయ్యో కూలిపోయింది…

శ్రీకాళహస్తి రాజగోపురం
శ్రీకాళహస్తి రాజగోపురం

మా ఊరు శ్రీకాళహస్తికే తలమానికంగా నిలిచిన రాజగోపురం నిట్ట నిలువునా కూలిపోయింది. 1516 సంవత్సరంలో గజపతులపై విజయానంతరం  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని విజయోత్సవ చిహ్నంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ గోపురాన్ని  నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఏడు అంతస్తులతో 135 అడుగుల ఎత్తు గలిగిన ఈ గాలిగోపురం ఉన్న పళంగా కూలిపోవడానికి మాత్రం ఖచ్చితమైన కారణాలు తెలియరావడం లేదు. గోపురంలో చీలికలు ఏర్పడ్డట్టు కొన్ని రోజుల ముందే కొన్ని టీవీ చానళ్ళు కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు అప్రమత్తమై ఆర్కియాలజీ నిపుణుల్ని పిలిపించారు. వారు ఆ చీలికలను పరిశీలించి గోపురం చుట్టూ 150 మీటర్ల దూరం వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు. చుట్టు పక్కలా ఉన్న ప్రజల్ని తమ నివాసాల్ని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

గోపురంలో ఇంతకు ముందే పగుళ్ళున్నప్పటికీ ఇటీవల సంభవించిన లైలా తుఫాను ధాటికి సమస్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా గోపురంపై పక్షులు నివాసముండటం వల్ల వాటి రెట్టల వల్ల గోపుర పై భాగంలో అక్కడక్కడా చెట్లు మొలుస్తాయి. వాటిని ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల సమయంలో తొలగిస్తుంటారు. వీటి వల్ల కూడా చీలికలు వచ్చి ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు.

అలవాటు ప్రకారం ప్రతిపక్ష నాయకులు అధికారులపై, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నా నిర్మాణం 450 సంవత్సరాల క్రితంది కావటం, మట్టితో నిర్మించడం, తుఫాను ప్రభావం మొదలైన ఎన్నో కారణాలున్నాయి. టీవీలు ప్రసారం చేసిన కథనాలకు వెంటనే స్పందించిన అధికార గణం, ఆలయ అధికారుల అప్రమత్తత వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడ గలిగాయన్నది నిర్వివాదాంశం.

మరి ఉన్న చోటనే మళ్ళీ గాలిగోపురం నిర్మిస్తారో, లేక అలానే వదిలేస్తారో ఆ శ్రీకాళహస్తీశ్వరునికే తెలియాలి.

8 thoughts on “అయ్యో కూలిపోయింది…

 1. పిడుగులు పడకుండా యాంటెనా లాంటి ఏర్పాట్లు చెయ్యని ఆనాటి ఆలయకార్యనిర్వాహక సభ్యుల్ని ఇప్పుడు కోర్టుకీడ్చి శిక్షపడేలా చెయ్యాలి.మన సాంస్కృతిక సంపదను నాశనం చేశారు.

 2. పునర్నిమిస్తారులెండి ఎందుకంటే దాంట్లో కూడా తినొచ్చు కదా!

 3. అవును రవీ, ఎంతో బాధ వేసింది ఈ వార్త టీవీలో చూడగానే!పురాతన కట్టడాలు కూలిపోవడం సహజమే అయినా నివారణ చర్యలు తీసుకునే అవకాశముండీ తీసుకోకపోవడం,అందువల్ల అది కూలిపోవడం అన్యాయం కదా! ఏం చెయ్యాలి వీళ్లని?

  విజయమోహన్ గారు చెప్పినట్లు కేవలం గడ్డి తినడానికే మళ్ళీ దాన్ని పునర్మించినా ఆశ్చర్యం లేదు.

  రాయలు నిర్మించాడన్న కారణంగానో, కాళ హస్తీశ్వరుడి స్వాగత ద్వారమనో ఆ గోపురంతో మనకున్న అనుబంధానికి విలువ కట్టగలమా?

  మళ్ళీ పునర్నిర్మిస్తే మాత్రం అది ఈ గోపురానికి సమానమవుతుందా?

 4. కూలిపోవటానికి కారణం మన వ్యవస్థ బూజు పట్టుకు పోవటమే అనిపిస్తుంది

 5. వినగానే బాధ కలిగింది. పురాత కట్టడాల రక్షణ పట్ల మనవాళ్ళకి తగినంత శ్రద్ధ లేదు. కనీసం 5,6 సంవత్సరాల క్రిందటే జాగ్రత్త పడుంటే బాగుండేది. ఈశ్వరేచ్ఛ ఎలా వుందో.

 6. ee vartha vinagane entha badha paddano cheppalenu… gullu gopurala toh mana sambandham ee bada dongalaku artham avutunda? ippatikaina kallu terachi mana pracheena kattadalanu, samskrutika chihnalanu kapade prayatnam chestara?

వ్యాఖ్యలను మూసివేసారు.