కొంటె ప్రశ్నలు – తుంటరి సమాధానాలు

నేను ఐదారు తరగతుల్లో ఉన్నప్పటి సంగతి. పిల్లకాయలం అందరం రోజూ ఉదయం చెరువులోకి వెళ్ళి తిరిగొస్తూ దారి మధ్యలో పేపర్ చదవడం కోసం ఒక రైస్‌మిల్లు దగ్గర ఆగేవాళ్ళం. పేపర్ అంటే మాకు కేవలం ఆటల పేజీనే… క్రికెట్ అంటే అంత పిచ్చి మాకు.

అక్కడ మాలాంటి వాళ్ళను ఆటపట్టించడం కోసం ఒకాయన కూచొని ఉండేవాడు. ఆయన భలే సరదా మనిషి. మేం వెళ్ళి పేపర్ దగ్గర కూర్చోగానే మమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగేవాడు.అవి ఎలా ఉండేవంటే

“ఒరేయ్… మీరు చదువుకున్న వాళ్ళైతే నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండ్రా”

“రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?”

“ఆ మాత్రం మాకు తెలీదా… రాయి బరువు గా ఉండటం వల్ల మునిగిపోతుంది” అనేవాళ్ళం.

“ఓస్ ఇంతేనా మీకు తెలిసింది? చేప బరువుగా ఉంది కదా మునిగిపోతుందా? కాదు కదా. రాయి మునిగిపోయింది ఈత రాకపోవడం వల్ల” అని తేల్చేవాడు.

హ్మ్మ్ సరే.. ఇంకో ప్రశ్న అడుగుతాను దీనికైనా సరైన సమాధానం చెప్పండి చూద్దాం.

“చెరువులో నీళ్ళు ఎట్టా ఉంటాయి?”

దానికి మేము తెల్లగా ఉంటాయని ఒకడు, బురదగా ఉంటాయని ఒకడు ఇలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళం చెప్పేవాళ్ళం.

ఆయన మాత్రం “ఓర్నీ ఇంతేనా మీకు తెలిసింది. చెరువులో నీళ్ళు గట్టు వేస్తే ఉంటాయి” అనే వాడు.

సరే ఇంకో ప్రశ్న “దారిన పోయే మనిషి ఎట్టుంటాడు?”

మేం ఏం చెప్పినా దానికి కౌంటర్ ఏస్తాడని మేం గమ్మునే ఉండిపోతే…

“మీ అయ్యోర్లు మీకు ఏం పాఠాలు జెప్తాఉండారో ఏమో… ఒక్క ప్రశ్నక్కూడా కరట్టుగా జవాబు చెప్పలేకుండా ఉన్నారు. నేం జెప్తా జూడు”

“దారిన పోయేవాణ్ణి ఉండమంటే ఉంటాడు. ఇది కూడా తెలీదు. ఏం జదవతుండార్రా మీరు!”

అలాంటిదే ఇంకో ప్రశ్న అడిగేవాడు.

“ఒక రైలు పది గంటలకు కాళాస్తిర్లో బయల్దేరింది. పన్నెండు గంటలప్పుడు అది ఎక్కడ వెళుతుంటుంది?”

మేం మధ్యలో ఉండే ఊర్లు పేర్లు ఏదేదో చెప్పేవాళ్ళం. ఆయన మాత్రం “దానిగ్గూడా అంత ఆలోచిస్తుండారేంది మీరు? దానికోసం అంత ఆలోచించ బళ్ళే…
పన్నెండు గంటలప్పుడు అది పట్టాల మీద బోతా ఉంటది” అనేవాడు.

మళ్ళీ ఎప్పుడు కనిపించినా ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడు. ఒక్కోసారి మళ్ళీ “రాయి నీళ్ళలో వేస్తే ఎందుకు మునిగిపోతుంది?” అని అడిగేవాడు.

అప్పుడు గానీ ముందుగా ఆయన సమాధానం గుర్తు బెట్టుకుని “రాయికి ఈత రాక మునిగిపోయింది” అన్నామనుకో ఇంకా గట్టిగా నవ్వేసేవాడు

“ఒరే పిచ్చోడా! రాయికి ఏడైనా ఈతొస్తుందటరా…” అనేవాడు.

ఇంక ఈయన్తో మనకెందుకులే అని మా పిల్ల గ్యాంగంతా సాధ్యమైనంతవరకు తప్పించుకుని తిరిగేవాళ్ళం.

8 thoughts on “కొంటె ప్రశ్నలు – తుంటరి సమాధానాలు

వ్యాఖ్యలను మూసివేసారు.