చెంప దెబ్బలు

ఈ మధ్య ఊరికెళ్ళినపుడు కాళహస్తి నుంచి మా ఊరెళ్ళడానికి ఎర్రబస్సెక్కాను. అప్పటికే బస్సంతా నిండిపోయి ఉండటంతో ఒక సీటు పక్కగా నిల్చున్నాను. బస్సు బయలుదేరింది.

క్రిక్కిరిసిన బస్సులో ఉక్కపోతకు చొక్కా ముందుకు లాగి ఉఫ్ఫూ ఉఫ్ఫూ అని ఊదుకుంటున్నా.

పక్క సీట్లో ఓ అమ్మాయి ఓ పిల్లాడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూంది. పక్కన ఆమె భర్తనుకుంటా, కూర్చుని కొడుకునే మురిపెంగా చూస్తున్నాడు.

ఆమెను చూడగానే నా మెదడు పాదరసంలా పనిచేసి ఒక పేరును బయటకులాగింది.

వెంటనే ” ఏం సుజాతా, నన్ను గుర్తు పట్టలేదా!” అడిగాను.

ఆ అమ్మాయి క్షణం ఆలోచించి ఆశ్చర్యం నిండిన మొహంతో “ఓ రవిచంద్రా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఇంతకాలమైనా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంది

ఓ చిరునవ్వు నవ్వాను.

“ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. ఇన్నాళ్ళకిలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? అమ్మా, అక్కా, అవ్వ, తాత వాళ్ళంతా బాగున్నారా?” అని ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించింది.

“అందరూ బాగున్నారు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నా. మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా?” అని అడిగాను.

“బాగున్నారు” అనేసి వాళ్లాయన నా గురించి అడిగేసరికి ఏదో చెబుతోంది. ఆయన నవ్వుతూ నా వంక చూస్తున్నాడు. నా మనసు మాత్రం ఆరో తరగతి క్లాస్ రూం లోకి వెళ్ళిపోయింది.

********************************************************************************

మా తెలుగు మాస్టారు మునిక్రిష్ణారెడ్డి గారు  ఒక్కోకర్ని లేపి జిహ్వ చాపల్యం అనే పదానికి అర్థం అడుగుతున్నారు.

ఎవరూ చెప్పలేకపోతున్నారు. చివరికి నా వంతు వచ్చింది.

“జిహ్వ చాపల్యం అంటే ఏదైనా రుచి చూడాలనే కోరిక సార్” అన్నాను.

“వెరీ గుడ్. ఇప్పుడు లేచి ఉన్నవాళ్ళందరికీ చెంప దెబ్బలెయ్” అన్నాడు.

మొదటి వాడి దగ్గరికెళ్ళి వాడి బుగ్గలకు గంధం రాసినట్టు అలా రెండు దెబ్బలేశాను. గట్టిగా వేస్తే ఎలాంటి సమస్యలొస్తాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి అవిక్కడ చెప్పుకోవడం అనవసరం. 🙂

దాంతో మా మాస్టారు “ఇదిగో రవీ, చెంపదెబ్బలంటే అలా వెయ్యకూడదు. వేశావంటే చెంప చెళ్ళుమనాలి. నువ్వు గానీ ఇప్పుడు వేసినట్టు వేశావంటే ముందు నీకు పడతాయి దెబ్బలు” అన్నాడు.

“దేవుడా! చివరికి నా ప్రాణం మీదకే వచ్చిందా,” అనుకుంటూ రెండో వాడి నుంచి చెళ్ చెళ్ మంటూ దెబ్బలేసుకుంటూ వెళ్ళిపోయాను.

దెబ్బలు తిన్న వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.

తిరిగి వచ్చి నిశ్శబ్దంగా నా సంచీ పక్కన కూర్చున్నాను. మిగతా క్లాసంతా మాస్టారు పాఠం చెబుతుంటే గంభీరంగా జరిగిపోయింది. క్లాసు పూర్తయింతర్వాత మాస్టారు వెళ్ళిపోయాడు.

క్లాసు ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా ఓ ఏడుపు వినిపిస్తోంది.

వెనక్కి తిరిగి చూశాను. నా చేత దెబ్బలు తిన్న ఒకమ్మాయి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఉంది. మా క్లాస్‌మేట్సంతా నా వైపు ఉరిమి చూస్తున్నారు. నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాను.

“గట్టిగా తగిలిందా!… సారీ” అన్నాను.

ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అసలు విషయం చెప్పారు. ఆ అమ్మాయికి నిన్నటి నుంచి పక్క పన్ను నొప్పిగా ఉందట. నేను కొట్టిన దెబ్బకి ఆ నొప్పి ఇంకా ఎక్కువయ్యిందేమో పాపం. ఇంక ఏడవక ఏం చేస్తుంది?

ఇక నేను దగ్గరికెళ్ళి బ్రతిమాలడం మొదలు పెట్టాను. “నిజంగా సారీ తెలియక కొట్టాను. ఇంకెప్పుడూ గట్టిగా కొట్టను. ఐనా నీకు నొప్పి ఉన్న సంగతి సార్ తో చెప్పుంటే ఇంత దాకా వచ్చేదా!” అని ఏదో నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఎలాగోలా ఏడుపు మానిపించగలిగాను.

అప్పట్నుంచీ అమ్మాయిలకు చెంపదెబ్బలెయ్యాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవాణ్ణి.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు కదూ… పైన నాకు బస్సులో కనబడ్డ సుజాత.

ప్రకటనలు

11 thoughts on “చెంప దెబ్బలు

 1. బాగుంది మీ ఆటోగ్రాఫ్ తీపి జ్ఞాపకం. ఆ అమ్మాయి వాళ్ళాయన దగ్గరున్నాడు కాబట్టి ధైర్యం చేసి మీకు కూడా ఒకటిచ్చుంటే ఏంటి మరి. పైగా ఆరో తరగతిలో దెబ్బ. బారువడ్డీ, చక్రవడ్డీ అన్నీ కలగలిపి. కాని ఎర్ర బస్సు ప్రయాణాలు బాగుంటాయి కదా. అప్పుడప్పుడు మనం మరిచిపోయిన వ్యక్తులు ఆకస్మాత్తుగా కలుస్తుంటారు. ఈ చిన్ననాటి జ్ఞాపకాలు నాకు నిత్య అనుభవాలు.

  • శ్రీనివాస్ గారూ,

   నాకు ఈ విషయం గుర్తుంది కానీ, ఆ అమ్మాయికి గుర్తుందో లేదో.. గుర్తుంటే మాత్రం తిరిగి కొట్టకపోయినా తప్పకుండా గుర్తు చేసుండేది.
   అందుకనే ఎర్రబస్సు ప్రయాణం అంటే అంత ఇష్టం నాకు. ఆ బస్సులో ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్లతో సహా అందరితో మాటలు కలపచ్చు. మాట్లాడే లోపే మా ఊరొచ్చేస్తుంది.

 2. ఇండియా లాంటి సెమీ ఫ్యూడల్ దేశం లో ఇలాంటివి జరగడం లో వింతేమీ లేదు. అందుకే మావో గ్రహణం రోజు బిర్యానీ తినమన్నాడు. 😉 😛 😛

  • you rock…కొంత కాలంపోతే కామెంటు రాయడంలో ప్రనా ని మించిపోయేట్లున్నారు 🙂

 3. కాదేదీ బ్లాగు పోస్తుకనర్హం అని నిరూపిస్తున్నారు..
  యిలాగే పద౦డి ము౦దుకు..
  పద౦డి రాసుకు…

  • నేను బ్లాగుల్లోకి వచ్చింది అందుకేనండీ… నలుగురితో ఆహ్లాదంగా నాలుగు కబుర్లు పంచుకుందామనే…

 4. అలా ఒక్కసారి నా బాల్యం లోకి తీసుకెళ్ళిపోయారు.ఆ అమ్మయి గనుక వాళ్ళ ఆయనకి చెప్పి ఉంటే మీ ఊరే కాబట్టి ఎప్పుడో మీకు వడ్డీ తో సహా ఇచ్చేస్తాడేమో జాగ్రత్త 🙂

  చెంపదెబ్బల సెషన్ మజా యే వేరు లెండి,

 5. baga rasaru 🙂 patha friends ni anukokunda kalavatam entha baguntundo … naku evvaru ala kalava ledu ippativaraku :((( annatlu chinnappudu 4 va taragathi chadive rojullo nenu kooda 5va taragathi vaariki ilaage chempa debbalu veyalsi vachindi… seniors ni kottinanduku entha bhayapaddano tarvata 🙂 kani valla class ke double promote ayipoyanu next year lo 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.