ముక్కు గిల్లే ఆట

చిన్నప్పుడు ముక్కుగిల్లే ఆట అని ఒక ఆట ఆడేవాళ్ళం.దీన్ని మిగతా ఊర్లలో ఆడతారో లేదో, ఆడితే ఏ పేరుతో పిలుస్తారో నాకు తెలియదు. ఇందులో ముందుగా ఆడేవాళ్ళు రెండు జట్లుగా విడిపోతారు. రెండు జట్లు ఎదురెదురుగా కూర్చుంటారు. ఉదాహరణకు A, B అని రెండు జట్లు ఉన్నాయనుకుందాం.

A జట్టు లో ఒకడు లేచి వెళ్ళి  B జట్టులో ఒకరికి కళ్ళు మూస్తాడు. A జట్టు లోనుంచి మరొకరు లేచి వెళ్ళి కళ్ళు మూయబడిన వాడి ముక్కు గిల్లి రావాలి.

వాడు వచ్చి కూర్చున్నాక గిల్లించుకున్న వాడు గిల్లిన వాడు ఎవరో కనిపెట్టాలి.మిగతా వాళ్ళెవరూ అతనికి క్లూస్ ఇవ్వకూడదు. ఇదీ ఆట.

సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కన్నా కొంచెం సున్నితంగా గిల్లుతారు. కానీ అవతలి వాళ్ళను తికమక పెట్టడానికి దీనికి ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తుంటారు.

ఇక ఇందులో మజా ఏంటంటే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆడతారు. ఆడపిల్లలకేమో చేతులకు గాజులు, కాళ్ళకు గొలుసులు ఉంటాయి. నడిచేటప్పుడు శబ్దం చేస్తుంటాయి కాబట్టి సులభంగా కనిపెట్టేయచ్చనుకుంటారు. కానీ జట్టులో ఉండే మిగతావాళ్ళు అబ్బాయిలు నడిచి వెళుతున్నాగానీ గాజుల శబ్దం చేయడం, గొలుసుల శబ్దం చేయడం వంటి కొంటె పనులు చేస్తుంటారు. కాబట్టి కనిపెట్టడం అంత వీజీ కాదు.

ఇంకొక కొసమెరుపు ఏంటంటే మన విరోధులెవరైనా అవతలి జట్టు లో ఉన్నారంటే వాళ్ళ పని అయిపొయినట్టే… వాళ్ళ ముక్కు ఎర్రగా కదిపోయేది పాపం. అంత గట్టిగా గిల్లేసే వాళ్ళం. 🙂