చౌర్యపు చిట్కా

ఒక ఊర్లో ఒక దొంగ ఉండేవాడు. ఒకసారి అతని కొడుకు తన తండ్రి వృద్ధుడైపోతున్నాడని భావించి తనకు వృత్తిలో కొన్ని చిట్కాలు నేర్పించమన్నాడు.

తండ్రి మౌనంగా ఉండిపోయాడు. ఆరోజు రాత్రి కొడుకుని తనతోపాటు కన్నం వేయడానికి తీసుకెళ్ళాడు.

ఒక్కసారి లోపలికెళ్ళగానే ఒక అల్మారా తెరిచి కొడుకుని అందులోకి దూరి ఏముందో కనుక్కోరమ్మన్నాడు. కొడుకు అలా లోపలికి వెళ్ళగానే అల్మారా తలుపు దభీమని అందరికీ వినిపించేటట్టుగా మూసేశాడు. తను మాత్రం నెమ్మదిగా అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

అల్మారా లోపల దాక్కున్న కొడుక్కి కోపంతో ముచ్చెమటలు పడుతున్నాయి, ఏం చేయాలో తోచడం లేదు, ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు.

అలా ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. ఉన్నట్టుండి పిల్లిలా అరిచాడు. దాంతో ఆ ఇంట్లో పని చేసే సేవకుడొకడు ఒక కొవ్వొత్తి వెలిగించుకుని వచ్చి అల్మారా తలుపు తెరిచాడు. తలుపు తెరుచుకున్న వెంటనే ఒక్క ఉదుటున అక్కడి నుంచి దూకి పారిపోసాగాడు. దొంగ దొంగ అంటూ అందరూ అతన్ని వెంబడించసాగారు. అతను కొద్ది దూరం పరిగెత్తాక దారి పక్కనే ఒక బావి కనిపించింది. వెంటనే ఒక పెద్ద బండరాయి తీసుకుని అందులో వేసి పక్కనే చీకట్లో దాక్కున్నాడు.

అతన్ని వెతుకుతూ వస్తున్నవాళ్ళు అతను బావిలోనే మునిగిపోయుంటాడని అక్కడే వెతుకులాడుతున్నారు. అదే అదనుగా భావించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఆ ఇంటిని దోచుకున్నాడు.
ఇంటికి రాగానే తన కోపమంతా ఎగిరిపోయింది. తండ్రితో ఏదో చెప్పబోయాడు. తండ్రి అతన్ని ఆపి
“కథంతా అవసరం లేదు. నువ్వొచ్చేశావు కదా చాలు. నేను నేర్పాల్సింది నేర్పేశాను” అన్నాడు.