ఏమో స్వామి

నేను ముచ్చివోలు లో ఉండగా అప్పుడప్పుడూ మా ఊరికి ఓ విచిత్రమైన సాధువు వచ్చేవాడు. ఆయన ఎప్పుడూ ఒక్క చోట ఉండేవాడు కాదు. ఎంత దూరమైనా కాలినడకనే రోడ్ల వెంబడి తిరుగుతుండే వాడు. ఆయన్ను గదిలో వేసి బంధించి తాళం వేసినా, వేసిన తాళం వేసినట్టు ఉండగానే బయటకు వచ్చేస్తాడని విన్నాను. తైల సంస్కారం లేని జుట్టు, బాగా పొడుగ్గా పెరిగిన గోళ్ళు, ఎప్పుడు స్నానం చేశాడో తెలియని శరీరం… ఇదీ ఆయన రూపం.

ఎంత ఎండకైనా, వానకైనా మొలకు చుట్టుకున్న బట్టతో, మిట్ట మధ్యాహ్నం ఎండకు కూడా కాళ్ళకు చెప్పుల్లేకుండా తిరుగుతూనే ఉంటాడు. ఆయన మొహంలో అదో రకమైన తేజస్సు కనిపిస్తుండేది. ఆయన రోడ్లో వెళుతుంటే కచ్చితంగా అందరి కళ్ళూ ఆయనపైనే కేంద్రీకృతమయ్యేవి. కానీ ఎంతమంది ఎన్ని ప్రశ్నలడిగినా ఆయన నోరు తెరిస్తే మాట్లాడేది ఒకే ఒక మాట. ఏమో స్వామీ అని. ఏ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం. అందుకనే ఆయన్ను ఏమో స్వామి అనే పిలిచే వాళ్ళం.

ఎవరైనా పిలిచి భోజనం పెడితే మాత్రం తినేసి వెళ్ళిపోయేవాడు. ఒక సారి మా ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టాము. మా అమ్మమ్మ నన్ను ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోమంది. నేను దగ్గరకు వెళ్ళగానే తల మీద చేయిపెట్టి వెళ్ళిపోయాడు అంతే. నా చదువు కోసం శ్రీకాళహస్తికి వచ్చేయడంతో మళ్ళీ ఆయన్ను చూడలేకపోయాను.ఇప్పుడు మళ్ళీ ఊరికి వస్తున్నాడో లేదో తెలియదు.

*ఆలోచన తరంగాలు బ్లాగులో రాసిన టపా స్పూర్తిగా

13 thoughts on “ఏమో స్వామి

 1. ఇలాంటి వారిని అవధూతలు అంటారు. శర్మ సర్ చెప్పినట్టు, ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో వీరు ఎక్కువ ఉంటారు. ఉదాహరణకు “రెడ్ హిల్స్”. మీరు సాయి లీలామృతం చదివితే అందులో కూడా అవధూతల గురించి ప్రస్తావన ఉంటుంది.

  • అవును. కాళహస్తి గుడికి సమీపంలో భరద్వాజ ఆశ్రమం ఉంది. అక్కడ ఇద్దరు అవధూతల సమాధులు ఉన్నాయి.

 2. రాయలసీమ ప్రాంతం అనాదిగా అవధూతలకు ప్రసిద్ధి. పశ్చిమగోదావరి జిల్లా చివటం గ్రామంలో ఒక మహిళ అవధూత ఉండేవారు. చూడటానికి పిచ్చివారులాగా ఉంటారు. కాని మహిమాన్వితులు. అదృష్టవంతులకు మాత్రమే వారి దర్శన, ఆశీర్వచన భాగ్యం కలుగుతుంది. అందులో మీరొకరు.

 3. […] This post was mentioned on Twitter by srinivas karasu. srinivas karasu said: Telugu blogs@ ఏమో స్వామి: నేను ముచ్చివోలు లో ఉండగా అప్పుడప్పుడూ మా ఊరికి ఓ విచిత్రమైన సాధువు వచ్చేవాడు. ఆయన ఎప్పుడ… http://bit.ly/c2xW1V […]

 4. ఎలా ఐనా మా రవిచంద్ర అదృష్టవంతుడు…గొప్ప గొప్ప అనుభవాలున్నయ్..

  • ఇంకా ఇలాంటి అనుభవాలున్నాయి. సమయం వచ్చినపుడు రాస్తాను.

 5. వారిని గూర్చి తెలిసాక కూడా ఆలస్యం చేయవద్దు.వెళ్ళి వారి ఆశీర్వాదం కోరండి.

  • కానీ ఇప్పుడు ఆయన జాడ తెలియరావడం లేదండీ… తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆయన దగ్గరకు వెళ్ళాలి

 6. మనిషి లో అధ్భుత శక్తులు వున్నాయి..ఒక బిల్ గేట్స్ కాగలడు….ఒక కలాం కాగలడు..ఒక స్పీల్ బుర్గ్…ఒక హిట్లర్…ఒక స్టాలిన్…ఒక మహాత్మా …ఒక ఏమో స్వామి…చెప్పలేము ఏ శక్తి ఏ రూపం లో వుంటుందో…

వ్యాఖ్యలను మూసివేసారు.